కమెడియన్లు హీరోలుగా నటించడమనేది రాజబాబు కాలం నుంచి వున్నదే. ప్రతి స్టార్ కమెడియన్ ఒకటి రెండు సినిమాల్లో అయినా హీరోగా నటించారు. అయితే కామెడీ వేషాలకీ, హీరో వేషాలకీ మధ్య గీత గీసుకుని తమకి ఏవి కరక్ట్ అనేది డిసైడ్ చేసుకోవడం అలీ లాంటి వల్ల మాత్రమే అయింది.
కామెడీ వేషాల నుంచి కమర్షియల్ హీరోగా ఎదిగిపోవాలని చూసిన సునీల్‌కి చుక్కెదురైంది. వరుస వైఫల్యాల తర్వాత సునీల్ ఇప్పుడు కామెడీ క్యారెక్టర్స్ చేయడానికి రెడీ అంటున్నాడు. వేణుమాధవ్ అయితే హీరోగా ట్రై చేయడమే కాకుండా సొంత నిర్మాణంలోకి దిగి పూర్తిగా కనుమరుగయ్యాడు. ఈ అనుభవాలని చూసి అయినా నేర్చుకోకుండా సప్తగిరి అదే బాటన వెళుతున్నాడు.
ఏదో సరదాగా కామెడీ కోసం కొడుతున్నట్టు కాకుండా నిజంగా హీరోలానే ఫీలవుతోన్న అతని వేషాలకి థియేటర్లోనే కామెంట్లు పడుతున్నాయి. 'ఏమనుకుంటున్నాడు ఇతను?' అంటూ అంతటా డిస్కషన్ జరుగుతోంది. అయితే 'కమెడియన్లు హీరోలు అవకూడదా? మాకు ఆ హక్కు లేదా?' అంటూ సప్తగిరి ఎదురు ప్రశ్నిస్తున్నాడు. సప్తగిరి ఎల్‌ఎల్‌బికి వచ్చిన రెస్పాన్స్‌తో అయినా ఆలోచన మార్చుకుంటాడో లేక మరింత కాలం ప్రయత్నిస్తే హీరో అయితానని భావిస్తాడో చూడాలిక.