ఫిబ్రవరి రెండవ వారంలో ఎన్నికల కమిషన్ ఒరిజినల్ శివసేన చేత శవాసనం వేయించి, శిందే వర్గానిదే అసలైన శివసేన అని ప్రకటించేసింది. పార్టీ గుర్తు, ఎన్నికల గుర్తు, దాని పేర ఉన్న ఆస్తులు అప్పగించేసింది. అదేమంటే పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోకసభ ఎంపీలలో 60% మంది మద్దతుంది అతనికి అంది కమిషన్. పార్టీ సభ్యులలో ఎంతమంది ఏ వర్గం వైపు ఉన్నారో తేల్చే ప్రయత్నం చేయలేదు. అది చేయాలంటే చీలిక తర్వాత సంస్థాగత ఎన్నికలు పెట్టాలి. అది ఏ ఎన్నికల కమిషనూ చేయడం లేదు. కేవలం ప్రజా ప్రతినిథుల సంఖ్య బట్టే నిర్ణయం తీసుకుంటున్నారు. పార్టీ దాదాపుగా మధ్యకు చీలిపోయినప్పుడు గుర్తు, ఎన్నికల గుర్తు ఎవరికీ యివ్వకుండా ఉండడం న్యాయం. ఆస్తులను కూడా ఆ నిష్పత్తిలో పంచడం ధర్మం. 60% ప్రజా ప్రతినిథులు ఒక పక్క ఉన్నారు కదాని వారికి నూరు శాతం ఆస్తులిచ్చేస్తే ఎలా? రేపు పదవుల పందేరంలో పేచీలొచ్చి యీ 60% మందిలో 20% మంది వేరే పార్టీగా ఏర్పడితే, అప్పుడేం చేస్తారు?
ఇలాటి ప్రశ్నలు అడిగే ఛాన్సే లేదు, ఓ సినిమాలో భరణి చెప్పినట్లు ‘గట్ల డిసైడందంతే’. చేసినది బిజెపి. ఫడణవీస్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడిన ఉద్ధవ్ తాట తీయాలని వాళ్లనుకున్నారు. తీసి చూపించారు. శిందేను తమ వైపు లాక్కుని, ఉద్ధవ్‌ను సీటు దింపడమే కాదు, యిప్పుడు పార్టీ మొత్తాన్ని శిందేకు దఖలు పరిచేట్లు ఎన్నికల కమిషన్ ద్వారా ఏర్పాటు చేశారు. శిందే పార్టీని చీల్చిన విధానంపై యిప్పటికే సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయి. విషయం కోర్టులో ఉండగానే (సబ్ జ్యుడిస్) ఎన్నికల కమిషన్ యీ నిర్ణయం ఎలా తీసుకుంది? అని ఉద్ధవ్ వర్గం అడుగుతోంది. ఇప్పుడీ గుర్తింపుపై సుప్రీం కోర్టులో యింకో కేసు పడేసింది. ఈ ఎన్నికల కమిషన్‌కి అధినేతగా ఉన్న అరుణ్ గోయల్ నియామకమే వ్యవహారం కోర్టులో పెండింగులో ఉండగా ఆదరాబాదరాగా జరిగింది. ఎన్నికల కమిషనర్‌ను నియమించడానికి ఒక స్వతంత్ర వ్యవస్థ ఉండాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు 2022 నవంబరు 17న హియరింగ్ మొదలుపెట్టింది. అంతే, కేంద్రప్రభుత్వం గబగబా, కొంపలంటుకు పోయినట్లు, ప్రభుత్వంలో సెక్రటరీగా పని చేస్తున్న అరుణ్ గోయల్ చేత అప్పటికప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ చేయించి, ఆమోదించి మర్నాడే అంటే నవంబరు 18నే యీ అరుణ్ గారిని కొత్త కమిషనర్‌గా వేసేసింది. ఎంపిక ప్రక్రియ మొత్తం ఒక్క రోజులో పూర్తయిపోయింది. శుక్రవారం దాకా ఆయన సెక్రటరీ, శనివారం నాడు ఎన్నికల కమిషనర్!
ఈ మెరుపు వేగంపై సుప్రీం కోర్టు నవంబరు 24న ఆక్షేపణ తెలిపింది. ‘మే నుంచి ఆ పోస్టు ఖాళీగా పెట్టారు. ఇప్పటికిప్పుడు ఏ ఆలోచనా, ఏ తయారీ లేకుండా, ఎవరినీ సంప్రదించకుండా అర్జంటుగా నియమించవలసిన అవసరం ఏమొచ్చింది? అదే రోజు నోటిఫికేషన్, అదే రోజు అప్లికేషన్, అదే రోజు నియామకం కూడానా..? అదీ అరుణ్‌కు 62 ఏళ్లు. అంటే మూడేళ్లలో రిటైరయ్యే ఆయన ఆరేళ్లూ పదవిలో ఉండలేడు. ఆయన తప్ప మీకు వేరెవరూ కనబడలేదా?’ అని అడిగింది. ఈ పద్ధతిలో నియమితుడైన అరుణ్ శివసేన విషయం కోర్టులో పెండింగులో ఉండగానే బిజెపితో అంటకాగుతున్న శిందేకు పార్టీ మొత్తాన్ని కట్టబెట్టడంలో ఆశ్చర్యమేముంది? శివసేన అంటే ఠాక్రేల కుటుంబ పార్టీగా వెలసి, వర్ధిల్లుతున్న పార్టీ. ఇప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే కొడుకునే తీసి అవతల పారేశారు. వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌తో కూడా పార్టీ నీది కాదని చెప్పగల ప్రజాస్వామ్యం మనది. తెలుగు దేశం వ్యవస్థాపకుడు ఎన్టీయార్ గతి ఏమైందో చూశాం కదా! ఇప్పుడు శివసేన పేరును శిందేకి యిచ్చిన కమిషన్ ఉద్ధవ్ వర్గం తన పేరు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అని పెట్టుకోవచ్చు అంది. అది కూడా ఉపఎన్నికలు అయ్యేవరకు. ఎన్నికల గుర్తుగా ధనుర్బాణం శిందే కిచ్చి వీళ్లకు కాగడా గుర్తు యిచ్చింది.
శివసేన అనే పేరు పెట్టినది ఉద్ధవ్ తాత ప్రబోధాంకర్ ఠాక్రే. ధనుర్బాణం గుర్తు పార్టీకి కేటాయించినది 1989లో. పార్టీ పేరు, అభ్యర్థి పేరు గుర్తున్నా గుర్తుండకపోయినా బ్యాలట్ పేపరు (యీ రోజుల్లో ఇవిఎం)పై తామనుకున్న ఎన్నికల గుర్తు కనబడగానే గుద్దేసే ఓటర్లున్న మన దేశంలో ధనుర్బాణం గుర్తుని ఫ్రీజ్ చేయకుండా శిందే వర్గానికి కేటాయించడం నిజంగా పక్షపాతమే. ప్రజాస్వామ్యం అంటే తనకు అసహ్యమని బాలాసాహెబ్ గొప్పగా చెప్పుకునేవాడు. 1966లో పార్టీ పెట్టాక, 1967లో లోకసభ ఎన్నికలు వచ్చాయి. ముంబయి నుంచి యిద్దరు దక్షిణాది నాయకులు కృష్ణ మేనోన్, జార్జ్ ఫెర్నాండెజ్ కాంగ్రెసుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా పార్టీ పెట్టినా, కేవలం దక్షిణాది వారిని ఓడించాలనే లక్ష్యంతో బాలాసాహెబ్ కాంగ్రెసుకు మద్దతివ్వాలని ఏకపక్షంగా నిర్ణయించాడు. అతనికి కుడిభుజంగా పార్టీలో ద్వితీయ స్థానంలో ఉన్న బల్వంత్ మంత్రి యీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, శివసేనలో సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నడవాలని ప్రతిపాదిస్తూ ఒక మీటింగు ఏర్పాటు చేశాడు. అక్కడకు శివసైనికులు వెళ్లి అతన్ని చావగొట్టి, రోడ్డుపై యీడ్చుకుంటూ వచ్చి బాలాసాహెబ్ కాళ్లపై పడేశారు. అతను క్షమాపణ చెప్పుకుని, పార్టీలో బాలాసాహెబ్ మాటే వేదం అని ఒప్పుకున్నాడు. అలాటి పార్టీ యిప్పుడు అప్రజాస్వామికంగా తమ పార్టీ చీల్చారని ఫిర్యాదు చేయడం వింతగా తోస్తుంది.
ప్రస్తుతానికి 56 మంది శివసేన ఎమ్మెల్యేలలో ఉద్ధవ్ పక్షాన 19 మంది మిగిలారు. 19 మంది లోకసభ ఎంపీలలో 6గురు మిగిలారు. ఉద్ధవ్ వైపు మిగిలినవారికి తమను రాజకీయంగా ఉద్ధరించగల సామర్థ్యం అతనికి ఉంది అనే నమ్మకం కుదరాలి. ఉద్ధవ్‌కి, తన తండ్రి బాలాసాహెబ్ వంటి మొరటువాడు కాదు. బలప్రయోగానికి దిగడు. ఇతర భాషీయుల పట్ల దురుసుగా ఉండడు. అది శివసేన కార్యకర్తలను, ఓటర్లను మెప్పించటం లేదు. కానీ దాని కారణంగానే అతను ఉత్తరాదివారిలో, ముస్లిములలో, క్రైస్తవులలో, దక్షిణాది వారిలో ఆమోదయోగ్యత సంపాదించుకున్నాడు. అతను కొందరు నాయకులను పూర్తిగా నమ్మి, వారికే అప్పగిస్తే వారు అతన్ని మోసగించి, ద్రోహం చేశారు. శిందే, అతని అనుచరగణం అలాటివారే.
శివసేనపై తిరుగుబాటు చేసిన వారిలో శిందే ప్రథముడు కాడు. 1991లో తిరగబడిన ఛగన్ భుజబల్ని ప్రముఖంగా చెప్పుకోవాలి. పార్టీ ఆవిర్భవించిన 1966లోనే అతను పార్టీలో చేరాడు. గొప్ప వాగ్ధాటి ఉన్న మంచి ఆర్గనైజర్. ముంబయి కార్పోరేషన్‌కు మేయరయ్యాడు. తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. 1990 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నిక కావాలని ఆశపడ్డాడు. కానీ బాలాసాహెబ్ మనోహర్ జోషిని ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. ఠాక్రేకు, భుజబల్‌కు మండల్ కమిషన్‌పై దృక్పథంలో తేడా వచ్చింది. 1990లో విపి సింగ్ ప్రభుత్వం బిసి రిజర్వేషన్లపై మండల్ సిఫార్సులను ఆమోదిస్తున్నానని ప్రకటించగానే, కులరీత్యా కూడా బిసి ఐన భుజబల్ దాన్ని సమర్థిస్తే పార్టీకి బిసిల మద్దతు వస్తుందని వాదించాడు. కానీ బాలాసాహెబ్ మనం హిందూ సమాజాన్ని కులరీత్యా విభజించ కూడదు, మనకు మరాఠీ అస్తిత్వమే ముఖ్యం అంటూ భుజబల్‌ను తోసిరాజన్నాడు. ఇది అతన్ని బాధించింది. ఈ అసమ్మతి గ్రహించిన అప్పటి కాంగ్రెసు ముఖ్యమంత్రి శరద్ పవార్ భుజబల్‌ను చేరదీశాడు.
1991 డిసెంబరులో భుజబల్ 19 మంది ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెసు పార్టీలోకి ఫిరాయించాడు. తనకు ద్రోహం చేసినవారిని క్షమించే అలవాటు బాలాసాహెబ్‌కు లేదు. 1989లో ఠాణే కార్పోరేషన్లో కాంగ్రెసుకు ఓటేసిన శివసేన కార్పోరేటర్‌ను శివసైనికులు చంపివేశారు. కానీ ఏకంగా 20 మంది తిరుగుబాటు చేసి ఫిరాయింపు చట్టం నుంచి రక్షణ పొందడంతో పళ్లు నూరుకున్నాడు తప్ప మరేమీ చేయలేకపోయాడు. పవార్ భుజబల్‌ను మంత్రిని చేయడంతో పాటు యింటి దగ్గర పూర్తి భద్రత కల్పించాడు. అయినా శివసైనికులు అతని యింటిని ధ్వంసం చేశారు. అదృష్టవశాత్తూ అప్పుడతను యింట్లో లేడు. అతనితో పాటు తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలలో మూడో వంతు మంది వెంటనే వెనక్కి పార్టీలోకి వచ్చేశారు. ఒక్కరు తప్ప తక్కినవారందరూ తర్వాత వచ్చిన ఎన్నికలో ఘోరపరాజయం పొందారు. అతనూ ముంబయిలో ఓడిపోయి, అప్పణ్నుంచి నాసిక్ జిల్లా నుంచే పోటీ చేస్తున్నాడు. తర్వాతి రోజుల్లో భుజబల్ శరద్ వెంటనే నడిచాడు. ఎన్‌సిపిలో చేరాడు. మొన్నటి ఎంవిఏలో ఉద్ధవ్ కాబినెట్లో ఉన్నాడు.
తిరుగుబాటు చేసిన రెండో ప్రముఖ నాయకుడు నారాయణ రాణే. అతనూ కింద నుంచి వచ్చినవాడే. ముంబయి మేయరు అవుదామనుకుంటే బాలాసాహెబ్ అతన్ని కొంకణ్ ప్రాంతానికి వెళ్లి పార్టీని బలోపేతం చేయమన్నాడు. 1990 ఎన్నికలలో శివసేన-బిజెపి కూటమి కాంగ్రెసు చేతిలో ఓడిపోయినా కొంకణ్‌లో మాత్రం విజయాలు సాధించింది. 1995 ఎన్నికలలో యీ కూటమి గెలిచి, అతను మంత్రియై మంచి పేరు తెచ్చుకున్నాడు. 1999లో ముఖ్యమంత్రి అయ్యాడు. 1999 ఎన్నికలలో కూటమి ఓడిపోయి రాణే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడయ్యాడు. ఆ సమయంలోనే ఉద్ధవ్‌కి ప్రాధాన్యత పెరిగి, 2003లో వర్కింగ్ ప్రెసిడెంటు కావడంతో, అతను తన కెరియర్‌కు అడ్డంకిగా మారాడని రాణే ఫీలయ్యాడు. ప్రెస్ మీట్ పెట్టి శివసేన టిక్కెట్లను, పదవులను అమ్ముకుంటున్నారని ఆరోపించాడు. వెంటనే అతన్ని బాలాసాహెబ్ పార్టీలోంచి బహిష్కరించాడు. రాణే కాంగ్రెసులో చేరి, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలలో శివసేనను నాశనం చేశాడు. బాలాసాహెబ్ స్వయంగా వచ్చి వ్యతిరేకంగా కాన్వాస్ చేసినా రాణే నెగ్గాడు. కాంగ్రెసు తనకు ముఖ్యమంత్రి పదవి యిస్తుందని ఆశించి భంగపడ్డాక రాణే 2014లో మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష అనే సొంత పార్టీ పెట్టుకుని, అది విఫలం కావడంతో 2019లో బిజెపిలో చేరి, రాజ్యసభ ఎంపీయై, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నాడు.
మూడో తిరుగుబాటుదారు రాజ్ ఠాక్రే. బాలాసాహెబ్ సోదరుడి కొడుకు. పెదతండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకుని, అతనికి వారసుడవుతాడని అందరిచేతా అనిపించుకున్నవాడు. బాలాసాహెబ్ అతన్ని భారతీయ విద్యార్థి సేనకు అధినేతను చేశాడు. అయితే పుణెలో ఓ సినిమాహాల్లో జరిగిన ఒక హత్య కారణంగా అతను అప్రతిష్ఠ పాలయ్యారు. హతుడు ముంబయిలోని మాటుంగాలో ఓ పాత భవంతి ఫ్లాటులో ఉండేవాడు. దాన్ని డెవలప్మెంట్కు యిచ్చారు. కానీ యితను ఖాళీ చేయనన్నాడు. రియల్ ఎస్టేటు ఏజంట్లు రాజ్ అనుచరులతో డీల్ కుదుర్చుకుని, అతన్ని చంపించి వేశారు. ఈ వివాదం బయటకు రావడంతో బాలాసాహెబ్ యితన్ని పక్కకు పెట్టి, రాజకీయాల్లో ఆసక్తి కనబరచని తన సొంత కొడుకు ఉద్ధవ్‌ను ముందుకు తీసుకుని వచ్చాడు. రాజ్ రౌడీయిజానికి భిన్నంగా, తన మృదుస్వభావంతో ఉద్ధవ్ అందర్నీ ఆకట్టుకోవడంతో బాలాసాహెబ్ అతన్ని 2003లో వర్కింగ్ ప్రెసిడెంటు చేశాడు. ఆ పదవిపై ఆశ పెట్టుకున్న రాజ్ యిక తనకు పార్టీలో ప్రాధాన్యత ఉండదని గ్రహించి 2006లో బయటకు వచ్చేసి, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పేర పార్టీ పెట్టుకున్నాడు. మొదట్లో చాలా హడావుడే చేశాడు. 2009 అసెంబ్లీ ఎన్నికలలో 13 సీట్లు గెలిచాడు. కానీ మరాఠీయేతర్లపై హింసాత్మక దాడుల వలన పేరు పోగొట్టుకున్నాడు, బలమూ తగ్గిపోయింది. ఇప్పుడు హిందూత్వకు దగ్గరవుదామని చూస్తున్నాడు.
తాజా తిరుగుబాటుదారు శిందే సామాన్యజనం నుంచి వచ్చినవాడు. ఠాణే ప్రాంతంలో అతనికి తిరుగు లేదు. అందర్నీ కలుపుకుని పోగలడు. వాగ్ధాటి కలవాడు. బిజెపి సహకారంతో పార్టీ యంత్రాంగాన్ని ఉద్ధవ్ నుంచి గుంజుకోగలడు. కానీ అతనితో పార్టీలోంచి బయటకు వచ్చినవారందరూ అవకాశవాదులే. మంత్రిపదవులు ఆశించేవారే. అటు బిజెపి వారికి, యిటు వీరికి అజస్ట్ చేయడం కుదరక కాబినెట్ విస్తరణ వాయిదా పడుతోంది. శిందే, బిజెపిల మధ్య సయోధ్య గొప్పగా ఉండి ఉంటే యీ పాటికి పూర్తి స్థాయి కాబినెట్ ఏర్పడేది. జూన్ 30న శిందే, ఫడణవీస్ ప్రమాణస్వీకారాలు చేశారు. అనేక తర్జనభర్జనల తర్వాత ఆగస్టు 9న యింకో 18 మంది కాబినెట్లో చేరారు. బేరసారాలు తేలకపోవడంతో అప్పణ్నుంచి ఎవర్నీ చేర్చుకోలేదు. కేవలం 20 మంది మంత్రులతో మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాన్ని నడిపేస్తున్నారు. మార్చిలో విస్తరణ జరుగుతుందని అనుకుంటున్నారు. ఈలోగా పదవులు ఆశించి శిందేతో వచ్చినవారు అసహనంగా ఫీలవుతున్నారు. ఒకరికిస్తే మరొకరు అలుగుతారేమోనన్న భయం శిందేది. పైగా పెద్దన్న బిజెపి ప్లాన్లేమిటో తెలియవు. శివసేనను బలహీన పరచడానికి తనను వాడుకుని, వదిలేస్తుందేమోనన్న జంకు ఎలాగూ ఉంటుంది కదా!
ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఫడణవీస్ చేతిలో హోమ్, ఫైనాన్స్, ప్లానింగ్, లా అండ్ ఆర్డర్, హౌసింగ్ వంటి ముఖ్యమైన శాఖలున్నాయి. సర్వాధికారాలు చెలాయిస్తున్నాడు. శిందే చేతిలో అర్బన్ డెవలప్మెంట్ వగైరాలున్నాయి. తనతో పాటు వచ్చిన వివాదాస్పదుల్లో సంజయ్ రాఠోడ్, అబ్దుల్ సత్తార్‌లకు మంత్రి పదవులు యివ్వడం శిందేకు చెడ్డపేరు తెచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో అనుమానాస్పద రీతిలో మరణించిన పూజా చవాణ్ అనే విద్యార్థిని విషయంలో రాఠోడ్ హస్తం ఉందని బిజెపి యిప్పటికీ ఆరోపిస్తోంది. తన కూతురు టీచరు పరీక్షలో ఫెయిలయినా పాసైనట్లు డిక్లేర్ చేయించాడనే అభియోగం సత్తార్‌పై ఉంది. వారి వెనుక ఉన్న కుల, మతబలం చూసి శిందే రాజీపడాల్సి వచ్చింది. పరిపాలనా పరంగా కూడా రాజీలు తప్పటం లేదు. ఫడణవీస్ తను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఎంవిఏ ప్రభుత్వం తిరగతోడింది. ఇప్పుడు మళ్లీ ఫడణవీస్ అధికారంలోకి వచ్చాక యథాతథ పరిస్థితికి తీసుకుని వచ్చేశాడు. చిత్రమేమిటంటే శిందే యీ మూడు ప్రభుత్వాలలోనూ భాగస్వామే. అతనికి సొంత అభిప్రాయాలు లేవని, అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండడమే పరమావధి అని అనుకోవాలి.
ఎదురు తిరిగితే బిజెపి తనను దింపేస్తుందనే భయం శిందేను అనుక్షణం వెంటాడుతోంది. తన స్వార్థం కోసం పార్టీని గుజరాతీలకు అమ్మేశాడనే భావం మరాఠీలలో కలిగితే శిందే ఎటూ కాకుండా పోతాడు. శివసేన ప్రధానంగా నగరంలో మధ్య, దిగువ మధ్యతరగతి మహారాష్ట్రుల ప్రయోజనాల కోసమే ఏర్పడిన పార్టీ. ఇతర భాషీయులు వచ్చి తమ అవకాశాలను తన్నుకుపోతున్నారని, సొంత రాష్ట్రంలోనే తాము అన్యాయానికి గురవుతున్నామనే భావన కలిగిన మరాఠీలలో హింసోన్మాదం కలిగించి, బాలాసాహెబ్ పార్టీ నడుపుతూ వచ్చాడు. క్రమేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తూ వచ్చింది. నగర ప్రాంతాలలో శివసేనకు ఎదురు లేకపోవడం చేత అక్కడి నాయకులకు ఎన్‌సిపి, కాంగ్రెసు అంటే భయం లేదు, ద్వేషమూ లేదు. కానీ గ్రామీణ ప్రాంతాలలో శివసేనకు ప్రధాన ప్రత్యర్థులు ఆ రెండు పార్టీలే. బిజెపితో దశాబ్దాలుగా స్నేహపూర్వకంగా ఉన్నారు. అందువలన 2019లో తనకు ముఖ్యమంత్రి పదవి యిస్తానని చెప్పి మాట తప్పారంటూ ఉద్ధవ్ బిజెపితో తెగతెంపులు చేసుకుని, ఎన్‌సిపి కాంగ్రెసులతో కలిసి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ఏర్పరచాడో అప్పుడే గ్రామీణ ప్రాంతాల శివసేన ఎమ్మెల్యేలకు దిమ్మ తిరిగినట్లయింది. రేపటి ఎన్నికలలో అవి తమను ఎదగనిస్తాయా అనే భయం పట్టుకుంది వాళ్లకు. శిందే ఆ భయాన్ని ఎన్‌క్యాష్ చేసుకున్నాడు. అతని వెంట నడిచిన వాళ్లలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల ఎమ్మెల్యేలే.
ఇక్కడ నాయకత్వ లక్షణాలలో కూడా తేడాను గమనించాలి. బాలాసాహెబ్ పోరాటాలతో పైకి వచ్చాడు. కార్యకర్తలతో అనుక్షణం టచ్‌లో ఉన్నాడు. ఉద్ధవ్‌కు చిన్నప్పటినుంచీ పోరాడవలసిన అవసరం పడలేదు. వడ్డించిన విస్తరి అతని జీవితం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిపై అతనెప్పుడూ ద్వేషాన్ని చూపలేదు. అయోధ్యలో రామమందిరానికి విరాళాలు యిచ్చినా, బాబ్రీ మసీదు కూల్చివేతలో శివసేన పాత్ర పట్ల గర్వం ప్రకటించినా, తండ్రిలా కొడుక్కి ముస్లిముల పట్ల ద్వేషం లేదు. అందుకే ముస్లిములు ఉద్ధవ్‌ని అభిమానిస్తారు. దీనికి భిన్నంగా శిందే బాలాసాహెబ్ తరహా పోరాటాల నాయకుడు. ఉద్ధవ్ కాంగ్రెసు, ఎన్‌సిపిలతో కలిసి ఎంవిఏ ప్రభుత్వం ఏర్పరచినపుడు అతను ముఖ్యమంత్రి నవుతానని ఆశపడ్డాడు. తండ్రి లాగానే ఉద్ధవ్ పదవి చేపట్టకుండా తనను ముఖ్యమంత్రిని చేసి రిమోట్ తన చేతిలో పెట్టుకుంటాడేమో అనుకున్నాడు. కానీ శరద్ పవార్ అడ్డుపడ్డాడు. ఉద్ధవే ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఉద్ధవ్‌కు పదవిపై ఆసక్తి లేదని గ్రహించి, అతని భార్య వాళ్ల కొడుకు ఆదిత్యను ముఖ్యమంత్రిని చేయమని కోరింది. కానీ భాగస్వామ్య పక్షాలు దానికి ఒప్పుకోలేదు. అందువలన అయిష్టంగానే ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి, పార్టీని శిందే చేతిలో, ప్రభుత్వాన్ని శరద్ పవార్ చేతిలో పెట్టాడు. శిందే నమ్మకద్రోహం చేశాడు.
శరద్ పార్టీ ఐన ఎన్సిపిదే మొత్తం అధికారం అయిపోయిందని శివసేన ఎమ్మెల్యేలు అనుకోసాగారు. ఎన్‌సిపి మంత్రులు వారి సిఫార్సులను పట్టించుకునేవారు కాదు. ఉద్ధవ్ దగ్గరకు వెళ్లి కలిసినా అతనేమీ చేసేవాడు కాదు. దాంతో వాళ్లు విసిగిపోయారు. పైగా ఉద్ధవ్‌పై భార్య రశ్మి చెప్పినట్లే ఆడతాడని, అంతఃపురం వదిలి బయటకు రాడని, ఎవర్నీ కలవడనే ముద్ర గాఢంగా పడింది. రశ్మి 2019 ఎన్నికలకు ముందు ఉద్ధవ్-అమిత్ షా చర్చల్లో స్వయంగా పొల్గొందని అంటారు. ఎన్నికల అనంతరం బిజెపితో తెగతెంపులు చేసుకుని, ఎన్‌సిపి, కాంగ్రెసులతో చేరమని కూడా ఆమే ప్రోత్సహించిందని అంటారు. ఆమెకు రాజకీయ ఆకాంక్షలు ఎక్కువ. అత్తగారు పోయాక ఆమె స్థానంలో శివసేన మహిళా విభాగాన్ని తన చేతిలో తీసుకుంది. తన మేనల్లుణ్ని యువసేనకు సెక్రటరీ చేయించింది. సోదరి భర్తను బిజెపితో బేరాలాడడానికి ఉపయోగించింది. అంతెందుకు, 2019లో ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు అతను తన పేరుకు తల్లి పేరు కలిపి ‘ఆదిత్య రశ్మీ ఉద్ధవ్ ఠాక్రే’గా చెప్పుకున్నాడు. పార్టీ పత్రిక ‘‘సామ్నా’’కు ఆమె 2020లో ఎడిటరైంది.
ఈమెకు తోడు ఉద్ధవ్‌కు మిళింద్ నార్వేకర్ అనే పిఏ ఉండేవాడు. ఉద్ధవ్ పార్టీ కార్యకర్తలను కలవకుండా అడ్డుపడేవాడు. శిందే తిరుగుబాటు తర్వాత 20 రోజుల్లో ఉద్ధవ్ నాలుగు సార్లు పార్టీ ఆఫీసుకి వెళ్లాడు. గత మూడేళ్లలో అతను పార్టీ ఆఫీసుకి వెళ్లింది మూడుసార్లే అని గుర్తు చేసుకుంటే, యితను యిప్పుడే మేలుకున్నాడని అర్థమౌతుంది. గ్రామీణ ప్రాంతాల శివసేన ఎమ్మెల్యేలు ఎన్‌సిపి, కాంగ్రెసుల గురించి తమ భయాలను చెప్పుకుందామని వస్తే అతను కలిసేవాడే కాదు. దాంతో వాళ్లు విసిగిపోయారు. పోనీ అతని కొడుకు ఆదిత్య సంగతి చూదామా అంటే అతను తండ్రి కంటె ఎక్కువ పాలిష్డ్. దశాబ్దాలుగా శివసేన అనుసరిస్తూ వచ్చిన ప్రాంతీయవాదానికి భిన్నంగా ‘ఇన్‌క్లూజివ్’ పాలిటిక్స్ నమ్ముకున్నవాడు. ఎన్‌సిపి, కాంగ్రెసులతో చెలిమి కొనసాగించాలని అనుకునేవాడు. గత మార్చిలో రాయగఢ్ జిల్లాలో ఎన్‌సిపి నాయకులు ఒక పెద్ద మీటింగు పెట్టుకుని ఆదిత్యను ఆహ్వానించారు. స్థానికంగా వారితో విభేదించే ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు వచ్చి, వేదికపై వ్యతిరేకంగా మాట్లాడబోతే యిది సమయం కాదంటూ ఆదిత్య వారించాడు. పైగా వీరిస్తానన్న విందును కాదని ఎన్‌సిపి వారి విందుకు వెళ్లాడు. దాంతో అలిగిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు శిందేతో బాటు బయటకు వెళ్లిపోయారు.
పదవీకాంక్షతోనే బయటకు వెళ్లినా, శిందే దానికి సిద్ధాంతాల రంగు పులిమాడు. ఎంవిఏ వారి కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో ‘సెక్యులర్’ పదం పెట్టడాన్ని పెద్ద నేరంగా చూపించాడు, అదీ మూడేళ్లపాటు ఆ ప్రభుత్వంలో అన్ని పదవులూ అనుభవించాక! తాము దైవసమానంగా భావించే బాలాసాహెబ్ సిద్ధాంతాలకు తిలోదకాలు యివ్వడం చేతనే ఉద్ధవ్‌ను పక్కకు నెట్టేశామని, తమ లక్ష్యం అసలైన శివసేన సిద్ధాంతాలను నెలకొల్పడమేనని చెప్పుకుంటున్నాడు. కానీ ప్రభుత్వంలో ఉన్నవారిలో అత్యధికులు బిజెపి వారే. కమిషన్ తీర్పు తర్వాత ఎటూ తేల్చుకోలేక గోడ మీద ఉన్నవాళ్లు శిందే వైపుకి మళ్లవచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. అయితే అతను బిజెపి చెప్పినట్లు ఆడుతూ, ఒరిజినల్ శివసేన స్ఫూర్తిని చంపేస్తాడు అనే భయమూ ఉండవచ్చు. ఎందుకంటే శివసేన బేస్ మరాఠీలు కాగా, బిజెపి బేస్ గుజరాతీలు, మార్వాడీలు, ఉత్తర భారతీయులు. బిజెపిపై ఆధారపడిన శిందే తమ ప్రయోజనాలను దెబ్బ తీస్తాడన్న భయం మరాఠీ మధ్యతరగతి వారికి, కార్మికులకు భయం ఉంది. తక్కిన మహారాష్ట్ర సంగతి ఎలా ఉన్నా ముంబయిలో ఉద్ధవ్ సేనను ఎదుర్కోవడం శిందేకు కష్టం కావచ్చు. ఎందుకంటే అక్కడ మరాఠీ, నాన్-మరాఠీ చీలిక ఉంది. మరాఠీయేతరులందర్నీ కలిపితే మరాఠీల కంటె ఎక్కువే ఉంటారు. మరాఠీలను అతి పెద్ద మైనారిటీ అనవచ్చు. మరాఠీ వర్కింగ్ క్లాస్‌ను శివసేన కదిలించినట్లు యితరులు కదిలించలేరు.
పార్టీ ఆర్గనైజేషన్‌లో ఎక్కువ భాగం మంది ఉద్ధవ్ వెంట నిలిచారు. 2022 జులైలో 256 మంది పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్లలో 249 మంది ఉద్ధవ్తోనే ఉన్నారు. ఆఫీస్ బేరర్స్‌లో చాలామంది అతనితోనే ఉన్నారు. క్రమేపీ మార్పు వచ్చిందేమో ప్రస్తుతానికి తెలియదు. సంస్థాగత ఎన్నికలు జరిగితేనే బయటపడుతుంది. అవి జరగకుండా బలప్రయోగం, ప్రభుత్వమద్దతుతో శిందే పార్టీ కార్యాలయాలను వశపరుచుకుంటాడేమో చూడాలి. ప్రాంతీయ పార్టీలు సాధారణంగా ఒక కుటుంబంతోనే ఐడెండిఫై అవుతాయి. శిందే బలమంతా ఠాణేలో ఉంది. అతను బలమైన నాయకుడంటే శివసైనికులు అంగీకరిస్తారు కానీ బాలాసాహెబ్ కొడుకు స్థానంలో అతన్ని ఊహించడం వారికి కష్టం. శివసేనకు ముఖ్యబలం ముంబయిలో ఉంది. ఆ నగరంలోని చాలా శాఖలు ఉద్ధవ్‌కు విశ్వాసపాత్రంగా ఉన్నాయి. ఈ శాఖలు, దాదర్‌లోని పార్టీ ముఖ్యకార్యాలయం శ్రీ శివాయి సేవా ట్రస్ట్ అనే సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటికి అధినేతగా ఠాక్రే కుటుంబానికి ఆత్మీయుడు, మాజీ మంత్రి సుభాష్ దేశాయి ఉన్నాడు. అలాగే పార్టీ అధికార పత్రికలు సామ్నా, దోపహర్ కా సామ్నా, మార్మిక్ ప్రబోధన్ ప్రకాశన్ అనే సంస్థ చేతిలో ఉన్నాయి. అదీ ఉద్ధవ్ వర్గీయలదే. శిందే వీటి జోలికి రాలేడు.
ఎన్నికలలో, ఉప యెన్నికలలో అధికార కూటమి విజయం సాధిస్తే శిందే వర్గం చేసినదానికి ప్రజామోదం ఉందని వాదించే అవకాశం ఉండేది. 2022 ఆగస్టులో 94 మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరగాల్సింది. కానీ ఒబిసి రిజర్వేషన్ల అంశంపై అవి వాయిదా పడ్డాయి. 2023 ఫిబ్రవరి నెలాఖరులో కస్బా, చించ్వాడ్లలో ఉప యెన్నికలు జరిగితే చించ్వాడ్లో బిజెపి తన స్థానాన్ని నిలుపుకోగలిగినా, 28 ఏళ్లగా గెలుస్తూ వచ్చిన కస్బా స్థానాన్ని కాంగ్రెసుకు పోగొట్టుకుంది. పై నెలలో రావలసిన ముంబయి కార్పోరేషన్ ఎన్నికలు ఒక యాసిడ్ టెస్ట్ లాటివి. కానీ ఏదో కారణం చెప్పి శిందే వాటిని వాయిదా వేయించవచ్చు. ఎందుకంటే ఉద్ధవ్‌కు ముంబయిపై యింకా పట్టు ఉంది. అతను రాజకీయాల్లోకి వచ్చిందే ముంబయి కార్పోరేషన్ ఎన్నికల ద్వారా. 1997లో బాలాసాహెబ్ అతన్ని పిలిచి ‘ఇప్పటిదాకా కాంగ్రెసు చేతిలో ఉన్న కార్పోరేషన్ మన చేతిలోకి వచ్చేట్లు చేయి చూదాం’ అని పని అప్పగించాడు. ఉద్ధవ్ అది చేసి చూపించి, తండ్రిని మెప్పించాడు. కానీ ఈ వైట్-కాలర్ నగర నాయకుడు గ్రామీణ ప్రజలను రెచ్చగొట్టడంలో తండ్రికి సాటి రాడు, యితన్ని నమ్ముకుంటే ఓట్లు రాలవు, సెక్యులర్ పార్టీలైన ఎన్‌సిపి, కాంగ్రెసులతో కలవడం వలన మనకు రావాల్సిన హిందూత్వ ఓట్లు బిజెపి, శిందే తన్నుకుపోతారు అనే జంకు మరాఠ్వాడా వంటి ప్రాంతాలలో శివసేన నాయకులలో కలిగితే యితను శిందేను ఎదుర్కోలేడు.
కాబినెట్ విస్తరణ తర్వాత శిందే అనుయాయులలో లుకలుకలు వస్తాయేమో చూడాలి. గతంలో ఎన్‌సిపి దాష్టీకం గురించి ఫిర్యాదు చేసినవారు యిప్పుడు బిజెపి దాష్టీకం గురించి చేస్తారేమో తెలియదు. మహారాష్ట్రలో హిందూత్వ ఓటు శివసేన, బిజెపిల మధ్య చీలి ఉండేది. ఒకప్పుడు శివసేనది పెద్దన్న స్థానం. తర్వాతి రోజుల్లో బిజెపిది. ఇప్పుడు బిజెపి మొత్తం హిందూత్వ ఓటును సొంతం చేసుకుని శివసేన చేత శవాసనం చేయించేస్తుందేమో చూడాలి. ఎన్నికల కమిషన్ ఏమైనా చెప్పవచ్చు, సాంప్రదాయకంగా శివసేనకు ఓటేసే ఓటర్లు శిందేను బాల ఠాక్రే స్థానంలో ఆమోదిస్తారో లేదో అన్నదే పెద్ద ప్రశ్న. ఎన్నికలు జరిగినప్పుడే సమాధానం దొరుకుతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2023)