వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పచ్చమీడియా, పచ్చ పార్టీల వాదన ప్రముఖంగా ఒకేలా ఉంది. ఆ హత్యను కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి చేయించారని. అందుకు కారణం ఏమిటంటే.. రాజకీయంగా వివేకానందరెడ్డి తమకు పోటీ అవుతాడనే లెక్కలతో వారు వివేకానందరెడ్డిని హతమొందించారంటూ పచ్చమీడియా ప్రచారం చేసుకుంటూ ఉంది. తన వాదనకు సీబీఐ లీకులు అంటూ నొక్కి వక్కాణిస్తూ ఉంది. ఇదేమీ కొత్త విషయం కాదు. దాదాపు మూడేళ్ల నుంచి ఇదే వాదనను హైలెట్ చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందేందుకు పచ్చవర్గాలు పరితపిస్తూ ఉన్నాయి.
మరి వివేకను ఎవరు హతమార్చారు, ఎందుకు హతమార్చారో విచారణ సంస్థలే ఇప్పటికీ సూటిగా చెప్పలేకపోతున్నాయి. వివేకను హత్య చేసింది ఎవరైనప్పటికీ.. తేల్చడానికి ఇప్పటికే చాలా సమయం తీసుకున్నట్టే. చంద్రబాబు హయాంలో ఈ హత్యపై ఒక సిట్ ఏర్పడింది. అప్పటికి ఎన్నికలు ఇంకా నెల సమయంలో ఉన్నాయి! అంతా చంద్రబాబు అనుకూలురు అప్పుడు అధికారంలో ఉన్నా.. ఈ కేసులో ఏం తేల్చలేకపోయారు! సిట్ ఏర్పాటు, విచారణలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక పాత్ర పోషించినట్టుగా వార్తలు వచ్చాయి. మరి నెల సమయం కూడా ఆ సిట్ కు, నాటి ప్రభుత్వానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఏం తేల్చడం సాధ్యం కాలేదు. ఏ కేసు అయినా విచారణ అనేది మొదట్లోనే సవ్యంగా సాగే అవకాశం ఉంటుంది. వివేకానందరెడ్డి హత్య జరిగిన కొన్ని గంటల్లోనే విచారణ సవ్యంగా సాగి ఉంటే ఈ వ్యవహారం ఇక్కడి వరకూ వచ్చేది కాదేమో!
వారం రోజులకో, పది రోజులకో, నెల రోజులకో అయినా విచారణ సవ్యంగా సాగి ఉంటే.. ఈ కేసు అప్పుడే ఒక కొలిక్కి వచ్చేదనడంలో వింత ఏమీ లేదు. అయితే నాటి ప్రభుత్వం ఏదో ఉద్ధేశంతోనే నాన్చి ఉండాలనే సందేహాలు సహజంగానే వస్తాయి. ఇక ఆదిలోనే ఈ కేసు విచారణ అసలు కథను బయటకు తీసే ఉద్దేశం లేనట్టుగా సాగిందో ఏమో.. కానీ మూడేళ్లు అయినా ఒక కొలిక్కి రావడం లేదు.
ఇక ఇన్నాళ్లూ తమవైపు పడిన మరకల విషయంలో పెద్దగా స్పందించలేదు అవినాష్ రెడ్డి కూడా. పచ్చమీడియా, పచ్చ పార్టీ గోబెల్స్ తరహాలో ప్రచారాన్ని తీవ్రంగా సాగించినా పెద్దగా స్పందించలేదు. అయితే ఇప్పుడు ఆయన కూడా కోర్టును ఆశ్రయించాడు. తనపై కావాలని దుష్ఫ్రచారం చేస్తున్నారని, తనపై ఈ హత్యానేరాన్ని మోపుతున్నారంటూ ఆయన కోర్టునే ఆశ్రయించారు. ఆయన ఆశ్రయించింది మీడియాను కాదు. కోర్టును కాబట్టి.. ఆయన వాదననూ న్యాయస్థానం వినే అవకాశం ఉంది. ఇక పచ్చమీడియా ఒంటి కాలి రాతలపై కూడా ఒక చర్చ జరుగుతుంది.
అయితే ఈ కేసును సామాన్య జనం కోణం నుంచి, సగటు కడప వాసి కోణం నుంచి చూస్తే.. పచ్చమీడియా వాదనలు డొల్లగానే అనిపిస్తాయి. వివేకానందరెడ్డి తమకు రాజకీయంగా అడ్డుగా మారుతున్నాడని అవినాష్ రెడ్డి ఆయన అడ్డు తొలగించుకున్నాడు అని పచ్చమీడియా, పచ్చ పార్టీ చెబుతోంది. అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే.. 2014 నాటికే వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ! 2014లోనే అవినాష్ రెడ్డి కడప ఎంపీగా నెగ్గారు. 2019లో ఆయనకు టికెట్ ఇవ్వమంటూ జగన్ నిరాకరించినట్టుగా కానీ, తనకు కడప ఎంపీ టికెట్ కావాలని వైఎస్ వివేకానందరెడ్డి కోరుతున్నట్టుగా కానీ ఎక్కడా వార్తలూ రాలేదు. అలాంటి మార్పు జరుగుతుందనే ప్రచారమూ లేదు. అప్పటికి ఎన్నికలు మరెంతో దూరం లేవు. నెల రోజుల్లో పోలింగ్ ఉంది. ఒకవైపు కడప పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీగా, ఇన్ చార్జిగా అవినాష్ రెడ్డి ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి జమ్మలమడుగులో పార్టీ కోసం పని చేస్తూ వచ్చారు. అక్కడ ఉన్న పరిచయాలతో పార్టీలోకి చేరికలు చేయించడంలో తన వరకూ పని చేస్తూ వచ్చారు.
ఇక రాజకీయంగా వైఎస్ వివేకానందరెడ్డి బలం ఏమిటో కూడా అప్పటికే అందరికీ క్లారిటీ ఉంది కూడా! 2009 లో వైఎస్ మరణానంతర పరిణామాల్లో తన వేరే మార్గంలో వెళ్లారు వివేకానందరెడ్డి. జగన్, ఆయన తల్లి విజయమ్మలు కాంగ్రెస్ ను వీడి బయటకు వెళ్లినా.. ఆయన కాంగ్రెస్ లోనే నిలిచారు. విజయమ్మపై పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలో బరిలోకి దిగారు. కనీసం డిపాజిట్ సంపాదించుకోలేకపోయారు. అప్పుడు వివేకానందరెడ్డి రాజకీయంలో ఆయన కూతురు, అల్లుడు క్రియాశీల పాత్ర పోషించారు. వివేకానందరెడ్డి తరఫున అల్లుడు బాగా కష్టపడ్డాడు. అయినప్పటికీ డిపాజిట్ దక్కలేదు.
ఇక కాంగ్రెస్ తరఫున సాధించేదేమీ లేదని తెలిశాకా.. వివేక కుటుంబం మళ్లీ జగన్ వద్దకు చేరింది. అలాంటి సమయంలో జగన్ మరో అవకాశమూ ఇచ్చారు. కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీగా బరిలోకి దించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీనే ఉన్నా.. అడ్డదారిలో స్థానిక సంస్థల సభ్యులను బెదిరించి, కొని ఆయన ఓడించింది ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి!
స్థానిక సంస్థల కోటాలో వివేకానందరెడ్డిని ఓడిస్తే అది జగన్ పై తాను సాధించే విజయంగా ఆదినారాయణ రెడ్డి భావించాడు. బీటెక్ రవి అప్పుడు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి అడ్డదారిలో ఎమ్మెల్సీగా నెగ్గారు. నైతికంగా బలం ఉన్నా.. ఆయనపై అడ్డదారిలో తెలుగుదేశం పార్టీ నెగ్గింది. పులివెందుల్లో గెలుస్తామంటూ అప్పట్లో గంటా శ్రీనివాసరావు వంటి వారు తరచూ స్టేట్ మెంట్లు ఇచ్చారు! కడప స్థానిక సంస్థల కోటాలో విజయం కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కింది టీడీపీ. వీరి ముందు వివేకానందరెడ్డి నెట్టుకురాలేకపోయారు!
వయసు, ఇత్యాధికారాణాలను బట్టి చూసినా వివేకది అప్పటికే రిటైర్మెంట్ స్టేజీ. పార్టీ పరంగా జగన్ ఆయనకు గౌరవాన్ని ఇచ్చారు. విచ్చలవిడిగా డబ్బు లేదు, కండ బలం లేదు.. అయినా వివేకానందరెడ్డికి జగన్ పార్టీ పరంగా తగిన గౌరవం ఇచ్చారు. వివేకానందరెడ్డి దాన్ని కోరుకున్నట్టుగా కనిపించారు తప్ప, మళ్లీ ఎంపీ పదవినో ఆశించే తత్వం కూడా అప్పటికి ఆయనది కాకపోవచ్చు! ఎందుకంటే ఆయన ఎప్పుడూ రాజకీయంగా స్వయం ప్రకాశకుడు కాదు.
వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడిగానే ఆయనకు రాజకీయ అవకాశం లభించింది. తను ఎంపీ పదవికి పోటీ చేయాలనుకున్నప్పుడు పులివెందులపై పట్టు జారకుండా, తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కడప మొత్తంపై పట్టు నిలుపుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వివేకానందరెడ్డిని పోటీ చేయించుకుంటూ వచ్చారు. జగన్ రాజకీయ ఆరంగేట్రం కోసం వివేకానందరెడ్డి రాజీనామా అనే వార్త కూడా కొట్టేసేదేమీ కాదు. అలాంటి వార్తలూ అప్పుడు వచ్చాయి. చివరకు సోనియా వారింపుతో వివేకానందరెడ్డి రాజీనామా విషయంలో వైఎస్ కూడా వెనక్కు తగ్గారనే విశ్లేషణలు వినిపించాయి. ఇలాంటి విషయాలను పచ్చమీడియా, జగన్ అంటే పడని వారు తమకు తోచిన ప్రచారాలను చేయడానికి ఉపయోగించుకోవడమూ కొత్త కాదు. ఇలాంటివన్నీ ఎదుర్కొంటూనే జగన్ రాజకీయ మనుగడ ఇక్కడి వరకూ వచ్చింది.
రాజకీయంగా స్వయం ప్రకాశకుడు కాని వివేకానందరెడ్డి గురించి ఎక్కువగా ఊహించుకుని ఆయన అల్లుడు ఆయనను కాంగ్రెస్ లోనే నిలిపి పరువు తీశారు. ఆయన రాజకీయంగా స్వయం ప్రకాశకుడు కాదు అని నిరూపించింది కూడా అలాంటి తీరే! మరి అప్పటికే ఆ మాత్రం ప్రాభవం కోల్పోయిన, వయసు మీద పడిన వివేకానందరెడ్డి ఏ రకంగా అవినాష్ రెడ్డికి పోటీ అవుతాడనేది తర్కానికి అందనంత పెద్ద అంశం కాదు. ఏదో ప్రచారం చేసి మరేదో ప్రయోజనం పొందాలనే తాపత్రయంతో పచ్చమీడియా వర్గాలు ఇలాంటి ప్రచారాన్ని మూడేళ్లుగా చేస్తూ వస్తున్నాయి. మరి ఈ ప్రచారంపై అవినాష్ రెడ్డి వైపు నుంచి కూడా ఇప్పుడు కౌంటర్ మొదలైంది. ఇది ఎక్కడి వరకూ వెళ్తుందో!