నారా లోకేష్ కు పవన్ కల్యాణ్ చెక్ పెడుతున్నారా? వందల కోట్లు ఖర్చు పెట్టినా సరే.. గెలవలేకపోయిన మంగళగిరి నియోజకవర్గాన్ని ఆయనకు దూరం చేసే ఆలోచనలో ఉన్నారా? ఓడిపోయినప్పటినుంచి.. మంగళగిరి మీద స్పెషల్ ఫోకస్ పెడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఢంకా బజాయించి గెలుస్తానని గప్పాలు కొట్టుకుంటున్న లోకేష్ కు అసలు ఆ సీటు లేకుండా జనసేనాని చెక్ పెట్టే యోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
మంగళగిరి నియోజకవర్గంలో కీలక నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జనసేన పార్టీలో చేరబోతుండడమే ఇలాంటి అనుమానాలు పుట్టడానికి కారణం.
కాండ్రు కమల మంగళగిరి స్థానిక నాయకురాలు. ఆ నియోజకవర్గంలో గెలుపు ఓటుముల్ని నిర్ణయించగల పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. మంగళగిరి నియోజకవర్గం అంటేనే.. పద్మసాలి నియోజకవర్గంగా ఒకప్పట్లో గుర్తింపు ఉంది. ఆ సామాజికవర్గం వారే ఇక్కడ గెలుస్తూ వచ్చారు. కాండ్రుకమల కూడా 2009 లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలిచారు.
2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. 2019లో నారాలోకేష్ పై మళ్లీ గెలిచారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పద్మసాలిలకు టికెట్ ఇచ్చి ఉంటే ఆ సీటు ఖచ్చితంగా గెలిచేవాళ్లనేది ఒక అంచనా. అయితే చంద్రబాబు, తన కొడుకును ఎమ్మెల్యే చేయడానికి గ్యారంటీ సీటు అనే భ్రమలో కక్కుర్తి పడడంతో ఎదురుదెబ్బ తప్పలేదు.
ఇటీవల కూడా నారాలోకేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి పెద్దగా బలంలేని మంగళగిరిలో తాను పోటీచేసి ఓడానని, మళ్లీ అక్కడి నుంచే గెలిచి ప్రజలకు సేవ చేస్తానని బహిరంగ సవాలు విసిరారు. జగన్ కు దమ్ముంటే పులివెందుల వంటి కంచుకోటలో కాకుండా, పార్టీకి బలంలేని నియోజకవర్గాలకు వచ్చి గెలవాలని అన్నారు.
ఆయన సవాళ్ల సంగతి సరే.. లోకేష్ కు అసలు ఆ సీటే లేకుండా పోయేట్టు ఉంది. కాండ్రు కమల జనసేన ఆవిర్భావ సభకు హాజరయ్యారు. ఆమె జనసేనలో చేరబోతున్నారు. అదే జరిగితే.. ఖచ్చితంగా మంగళగిరి టికెట్ ఆశిస్తారు. అంటే తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుంటే గనుక.. లోకేష్ సీటును జనసేనాని గద్దలా తన్నుకుపోయే అవకాశం ఉంది.
పాపం లోకేష్.. రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారానికి పరిమితం అవుతారో.. తన సీటు తనకు కావాలని పట్టుపడతారో.. ఓడించిన మంగళగిరి కంటె సేఫ్ గా ఇతర నియోజకవర్గాల్లో ఒకటి ఎంచుకుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.