ఎమ్బీయస్‍: శివరాజ్ చౌహాన్ నమ్ముకున్న ఫిరాయింపు సూత్రం

మూడేళ్ల క్రితం 2018 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మధ్యప్రదేశ్‌ ఓటర్లు శివరాజ్ చౌహాన్‌ను దింపి వేసి 114 సీట్లతో కాంగ్రెసును గద్దె కెక్కించారు. అయితే బిజెపి అధిష్టానం దాన్ని ఆమోదించ లేకపోయింది. ఏ…

మూడేళ్ల క్రితం 2018 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మధ్యప్రదేశ్‌ ఓటర్లు శివరాజ్ చౌహాన్‌ను దింపి వేసి 114 సీట్లతో కాంగ్రెసును గద్దె కెక్కించారు. అయితే బిజెపి అధిష్టానం దాన్ని ఆమోదించ లేకపోయింది. ఏ ముఖ్యమైన పదవీ దక్కలేదని అసంతృప్తిగా వున్న జ్యోతిరాదిత్య సింధియాను దువ్వారు. అతను 2020 మార్చిలో 22 మంది అనుచర ఎమ్మెల్యేలతో సహా బిజెపిలోకి గెంతడంతో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత మరో ముగ్గురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు వచ్చి బిజెపిలో చేరారు. ఈ 25మంది చేత రాజీనామాలు చేయించి నవంబరులో ఉపయెన్నికలు జరిపించింది బిజెపి. 18టిలో నెగ్గింది. కాంగ్రెసు 7టిలో నెగ్గింది. శివరాజ్ ప్రభుత్వానికి ఢోకా లేకుండా నడుస్తోంది. ఇహ ఇక్కడితో యీ ఫిరాయింపులు ఆగుతాయేమో ననుకుంటే శివరాజ్ ఆపటం లేదు.

2021లో మరో కాంగ్రెసు ఎమ్మెల్యే దామో నియాజకవర్గం కాంగ్రెసు ఎమ్మెల్యే రాహుల్ లోధీ రాజీనామా చేసి, బిజెపిలో చేరాడు. ఏప్రిల్‌లో ఉపయెన్నిక జరిగింది. దానిలో అతను కాంగ్రెసు అభ్యర్థి అజయ్ టాండన్ చేతిలో ఓడిపోయాడు. ఫిరాయింపులను ఓటర్లు హర్షించటం లేదనే సంకేతం వెళ్లింది కాబట్టి యికనైనా ఫిరాయింపులు ఆగుతాయని అనుకున్నారు. కానీ మూడు నియోజకవర్గాల్లో, ఖాండ్వా లోకసభ స్థానంలో ప్రజాప్రతినిథులు కరోనా కారణంగా మృతి చెందడంతో అక్టోబరులో ఉపయెన్నికలు వచ్చాయి. శివరాజ్ తన పాత మంత్రాన్నే మళ్లీ జపించాడు.

ఖాండ్వా వాళ్ల సిటింగ్ సీటు అయినా, ఎందుకైనా మంచిదని, దాని పరిధిలోకి వచ్చే బద్వా అసెంబ్లీ నియోజకవర్గపు ఎమ్మెల్యే సచిన్ బిర్లాను అక్టోబరు 25న పార్టీలోకి లాక్కుని వచ్చాడు. చివరకు బిజెపి అభ్యర్థి జ్ఞానేశ్వర్ పాటిల్ కాంగ్రెసు అభ్యర్థి రాజ్‌నారాయణ్‌ పూర్ణీపై 82 వేల మెజారిటీతో గెలిచాడు. అక్టోబరులో మూడు లోకసభ స్థానాలకు జరిగిన ఉపయెన్నికలలో బిజెపి గెలిచిన స్థానం యిదొకటే! 2019లో 2.60 లక్షల మెజారిటీ వస్తే యిప్పుడు 82వేలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.

ఉపయెన్నికలు వచ్చిన 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెసు సిటింగ్ స్థానాలు రెండు – ఎస్టీకి రిజర్వ్ ఐన జోబట్, పృథ్వీపూర్. బిజెపి సిటింగ్ స్థానమైన రాయ్‌గావ్ ఎస్సీకి రిజర్వయినది. కాంగ్రెసు స్థానాలను గెలుచుకోవడానికి మళ్లీ ఫిరాయింపుల పైనే ఆధారపడ్డాడు శివరాజ్. జోబట్ గిరిజన నియోజకవర్గంలో గత 70 ఏళ్లలో బిజెపి రెండు సార్లు మాత్రమే గెలిచింది. కానీ యీసారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెసు నుంచి సులోచనా రావత్‌ను తన పార్టీలోకి లాక్కుని వచ్చాడు శివరాజ్. ఆ వ్యూహం ఫలించి ఆమె కాంగ్రెసు అభ్యర్థి మహేశ్ రావత్‌పై 6 వేల ఓట్ల తేడాతో గెలిచింది. ఇక పృథ్వీపూర్‌కు వచ్చేసరికి సమాజ్‌వాదీ పార్టీ నుంచి శిశుపాల్ యాదవ్‌ను లాక్కుని వచ్చాడు. అతను కాంగ్రెసు అభ్యర్థి జితేంద్ర సింగ్‌పై 16 వేల తేడాతో నెగ్గాడు.

ఎలాగోలా కాంగ్రెసు సిటింగ్ సీట్లు రెండు గెలిచామన్న ఆనందం అంతగా లేకుండా బిజెపి తన సిటింగ్ స్థానమైన రాయ్‌గావ్‌ను కాంగ్రెసుకు పోగొట్టుకుంది. అక్కడ కాంగ్రెసు అభ్యర్థి కల్పనా వర్మ బిజెపికి చెందిన ప్రతిమపై 12 వేల తేడాతో గెలిచారు. దీనితో 230 స్థానాల అసెంబ్లీలో బిజెపి బలం 127కి పెరగగా, కాంగ్రెసు బలం 96కి తగ్గింది. ఈ ఎన్నికలలో గమనించవలసిన దేమిటంటే బిజెపికి 48శాతం ఓట్లు వస్తే కాంగ్రెసుకు 46శాతం వచ్చాయి. ప్రజలు తమనింతగా ఆదరిస్తున్నా కాంగ్రెసు నుంచి నాయకులు ఎందుకు గోడ దూకేస్తున్నారు అంటే అది ఆ పార్టీలో వున్న లోపమే! ఉపయెన్నికలలో గెలవడానికి శివరాజ్ 24 పబ్లిక్ మీటింగులు నిర్వహించాడు. మొత్తం మీద ఐదు రాత్రులు ఆ నియోజకవర్గాల్లో గడిపాడు. అతనితో బాటు అనేకమంది మంత్రులు కూడా ప్రచారంలో తిరిగారు. ప్రతిపక్షంలో ఉంటూ ఏ పనీ లేకపోయినా, కాంగ్రెసు నాయకుడు కమల్ నాథ్ శివరాజంత తీవ్రంగా తిరగలేదు. దిగ్విజయ్, కమల్ నాథ్ యిద్దరూ వయసు మీరినవారు.

మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్ల పంపిణీ కమల్ నాథ్ చేయించిన సర్వేల ప్రకారం రాజకీయాలలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు, యువకులకు యిచ్చారు. దానితో వాళ్లు కాంగ్రెసులోని ఏ నాయకుడి పట్ల విధేయంగా వుండటం లేదు. కాంగ్రెసు అధిష్టానం ఏమీ పట్టించుకోవటం లేదు. స్థానికంగా వున్న వృద్ధనాయకత్వంతో వాళ్లకి కనెక్ట్ లేదు. ఏ గ్రూపుతోనూ సంబంధమూ లేదు. వాళ్లకి పార్టీ ఏ ప్రాముఖ్యతా యివ్వటం లేదు. అందువలన ఏ మొహమాటమూ లేకుండా పార్టీ మారేస్తున్నారు. 

ఫిరాయింపుల వలన బిజెపికి తలనొప్పులు వస్తున్నాయి. గోడ దూకి వచ్చిన వారికి మంత్రి పదవులు, కార్పోరేషన్ చైర్మన్ పదవులు, పార్టీలో పదవులు కట్టబెట్టడం ఒరిజినల్ బిజెపి నాయకులకు నచ్చటం లేదు. అంతఃకలహాల వలన పార్టీకి వచ్చే యిబ్బందిని అధిగమించడానికి బిజెపి కొత్త ఓటు బ్యాంకులను తయారు చేసుకుంటోంది. దాని దృష్టి గిరిజనులపై పడింది. రాష్ట్రంలో 2 కోట్ల మంది, అంటే జనాభాలో 21శాతం మంది గిరిజనులున్నారు. 230 స్థానాల్లో 47 స్థానాలు 29 లోకసభ స్థానాల్లో 6 ఎస్టీలకు రిజర్వ్ చేసినవే. 2013లో 47టిలో బిజెపి 30 గెలిచింది. 2018లో కాంగ్రెసు 30 గెలిచింది. కాబట్టి గిరిజనులను ఎలాగైనా గెలవాలని బిజెపి పంతం పట్టింది. 

మార్చిలో దామోలో జనజాతీయ సమ్మేళన్ పేర గిరిజన సభ ఏర్పరచి రాష్ట్రపతిని పిలిచింది. 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిషు వారిని ఎదిరించిన గిరిజన నాయకుడు శంకర్ షా 164వ వర్ధంతి సభ జబల్‌పూర్‌లో సెప్టెంబరులో జరిగితే దానికి అమిత్ షా వచ్చి గిరిజన నాయకుల ఘనతను వివరించే 9 మ్యూజియంలు దేశవ్యాప్తంగా నెలకొల్పడానికి కేంద్రం రూ.200 కోట్లు ఖర్చు పెడుతుందని ప్రకటించారు. ఈ నెలలలోనే హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ పేరు మార్చి గోండ్ రాణి కమలాపతి పేరు పెట్టారు. వచ్చే రెండేళ్లలో యిలాటివి యింకా ఎన్ని చూడాలో!

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)

[email protected]