''మా'' వివాదంలో ఎంత రచ్చ జరిగిందో, ఇప్పుడు అంత నిశ్శబ్దం ఆవరించింది. మధ్యలో వీళ్లు వాళ్లు తిట్టుకుంటే చూసి ఎగ్జైట్ అయిపోయిన అభిమానులు, సవాళ్లను, ప్రతి సవాళ్లను 24గంటలూ ప్రసారం చేసిన మీడియా సంస్థలు ఆటలో అరటిపండులయ్యాయి. అయితే మీడియాకు రేటింగ్స్ గిట్టుబాటయ్యాయనుకోండి, సామాన్య జనానికి మాత్రం ఇదో వినోదంలా మిగిలింది.
ఇంతకీ భవనం సంగతేంటి..?
భవనం కట్టేస్తాం, స్థలం చూసేస్తాం అంటూ ఎన్నికలకు ముందే కారులో వెళ్తూ సోషల్ మీడియాలో లైవ్ వీడియోలు వదిలారు మంచు విష్ణు. తీరా ఎన్నికలయ్యాయి, ఆయన అధ్యక్ష పీఠం అధిరోహించారు. ఇప్పుడు మాత్రం విష్ణులో ఆ స్పీడ్ కనిపించడంలేదు. కనిపించాలని కూడా ఎవరూ అనుకోరు కానీ.. కనీసం దాని గురించి ప్రస్తావన కూడా లేకపోవడం గమనార్హం.
''మా'' అధ్యక్షుడి హోదాలో.. సినిమాల ఓపెనింగ్ లు, ఫంక్షన్లు, టీజర్ లాంచ్ లకు మంచు విష్ణు స్పెషల్ గెస్ట్ గా వెళ్లడం మాత్రం ఇక్కడ విశేషం. గతంలో విష్ణుని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు, కానీ ఇప్పుడు ''మా'' అధ్యక్షుడు అనే ట్యాగ్ దొరకడంతో.. ఆయన ఇలా బిజీ అయిపోయారు.
ప్రకాష్ రాజ్ సంగతేంటి..?
“నాకీ పదవి వద్దండీ, నాకీ కార్డు వద్దండీ.. నన్ను వద్దన్న అసోసియేషన్లో నేనెలా ఉంటానండీ..” అంటూ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు గప్ చుప్ అయ్యారు. రోజుకో ప్రెస్ మీట్ పెట్టి, కోర్టు కేసుల వరకు వెళ్తామన్న వాళ్లంతా ఎక్కడివారక్కడ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. శ్రీకాంత్ సహా ఇతర నటీనటులు కూడా ఇప్పుడా వ్యవహారం జోలికే వెళ్లడం లేదు.
''మా''కి పోటీగా ఆత్మ, అంతరాత్మ అంటూ లీకులిచ్చి కూడా ఆ తర్వాత సైలెంట్ అయిన ప్రకాష్ రాజ్ వర్గం రివేంజ్ డ్రామాను పూర్తిగా పక్కనపెట్టేసినట్టే చెప్పాలి. షూటింగ్ ల జోరు పెరగడం, ఇండస్ట్రీలో యాక్టివిటీ పెరగడంతో ఇప్పుడు ''మా'' విషయాన్ని గుర్తు చేసుకునేవారే కరువయ్యారు. ఎవరి షూటింగ్ లు వారివి, ఎవరి వ్యాపారాలు వారివి.
అయితే ప్రకాష్ రాజ్ అభిమానులు మాత్రం ఆయనకు ఓకల్ కార్డ్ దెబ్బతిన్నదని, వారం రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆ తర్వాత విష్ణు ప్యానెల్ ని ప్రశ్నించేందుకు వస్తారని, ''మా'' విషయంలో ఆయన పోరాటం ఆగిపోలేదని అంటున్నారు. కానీ ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కి కానీ, ఆయన ప్యానెల్ కి కానీ పాత గాయాన్ని రేపడం ఇష్టం లేదని అర్థమవుతోంది. ''మా'' అధ్యక్ష పదవితో విష్ణుకి ఒరిగిందేమీ లేదు, తమకి తరిగిందేమీ లేదని ఎక్కడివారక్కడ గప్ చుప్ అయిపోయారు.
ఈ మొత్తం వ్యవహారానికి కీలకంగా వ్యవహరించిన నాగబాబు, నరేష్ కూడా అసోసియేషన్ వివాదంపై సైలెంట్ అయ్యారు. నాగబాబు తనకేం పట్టనట్టే వ్యవహరిస్తుంటే.. నరేష్ మరోసారి తన సినిమాలేవో తాను చేసుకుంటున్నారు. అటు ప్రెస్ మీట్ పెడతానన్న మోహన్ బాబు ఆ పని చేయలేదు.. ఇటు సంచలన మార్పులతో మీడియా ముందుకొస్తామన్న మంచు విష్ణు కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదు.