ఎమ్బీయస్‌: పలు నాగరికతలలో పాము ప్రాముఖ్యత

పాము అనగానే సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా మన నాగరికతలోనే భాగం అనుకుంటాం. కానీ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలూ పామును మంచిగానో, చెడుగానో గుర్తించాయి. భూమి లోపల బొరియల్లో ఉంటుంది కాబట్టి, దాన్ని సాధారణంగా అధోలోకానికి గుర్తుగా…

పాము అనగానే సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా మన నాగరికతలోనే భాగం అనుకుంటాం. కానీ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలూ పామును మంచిగానో, చెడుగానో గుర్తించాయి. భూమి లోపల బొరియల్లో ఉంటుంది కాబట్టి, దాన్ని సాధారణంగా అధోలోకానికి గుర్తుగా చూశారు. భారతీయులం కూడా నాగలోకం పాతాళంలో ఉన్నట్లుగానే భావిస్తాం. అక్కడ సూర్యకాంతి చొరదు కాబట్టి పాము నెత్తిన ఉన్న మణుల కాంతి వలననే వెలుగు వస్తుందట. నిధులను భూమి అడుగునే దాస్తారు. వాటిని అక్కడే వున్న పాములు సంరక్షిస్తుంటాయని, నాగదేవతలను ప్రసన్నం చేసుకుంటేనే నిధులు సిద్ధిస్తాయని మన నమ్మకం.

పాములు మన పురాణాల్లో ప్రధాన పాత్ర వహించాయి. పాముశరీరం, మనిషి తలకాయ, పైన కిరీటంతో ఉన్న నాగదేవతలను మన గుడి గోడలపై చెక్కుతారు. విష్ణువు శయనించేది ఆదిశేషుని పైననే. క్షీరసాగర మథనంలో మేరు పర్వతానికి కవ్వపుతాడుగా పనికి వచ్చినది వాసుకి అనే పామే. వాసుకి చెల్లెలు మానసాదేవి నాగదేవతగా అందరి పూజలూ అందుకుంటుంది. వాసుకికి జరత్కారుడనే ఋషి వలన కలిగినవాడు అస్తీకుడనే ఋషి. తన తండ్రి పరీక్షిత్తును చంపిన తక్షకుడనే పామును నిర్మూలించడానికి జనమేజయుడు సర్పయాగం చేశాడన్న కథ అందరికీ తెలుసు.

సరిగ్గా తక్షకుడు వచ్చి అగ్నిగుండంలో పడే సమయానికి అస్తీకుడు వచ్చి జనమేజయుణ్ని ఒప్పించి యాగం మాన్పించాడు. ఆ రోజునే నాగపంచమిగా పండగ చేస్తారు. సర్పాలన్నీ పాతాళానికి వెళ్లిపోయే షరతుపై జనమేజయుడు విరమించాడని, ఆ విధంగా పాతాళానికి చేరిన పాములు, తమ ప్రాణాలను కాపాడిన అస్తీకుడి పేరే తమ ప్రాంతానికి పెట్టుకున్నాయని అంటారు. భూగోళంలో  గుండుసూది గుచ్చి చూస్తే మన దేశానికి సరిగ్గా అడుగున కనబడేది మెక్సికో. అదే మనం చెప్పే పాతాళమని అక్కడున్న అజ్‌టెక్‌ నాగరికత అనేది అస్తీక పదానికి వికృతి అనే వాదన ఉంది.

ఈ కథలన్నీ నమ్మడం కష్టం అనుకుంటే పామును ఆరాధించేవారిని నాగజాతి వారని అనుకుంటే సరిపోతుంది. తమ వద్దనున్న పామువిషంతో తన తండ్రిని చంపిన నాగజాతి వారిని జనమేజయుడు బహిష్కరించాడని, వాళ్లు సముద్రాలు దాటి మెక్సికోకు  వెళ్లి స్థిరపడ్డారని అనుకోవచ్చు. అలాగే బలి చక్రవర్తి కథలో పాతాళానికి తొక్కేశాడంటే, మెక్సికోకు పంపేశాడనుకుంటే నప్పుతుంది. ఖైదీలకు పెరోల్‌ యిచ్చినట్లు ఏడాదికి ఓ సారి ఓణం నాడు వచ్చి తన కేరళ ప్రజలను చూసుకోవడానికి విష్ణుమూర్తి పర్మిషన్‌ యిచ్చాడని మలయాళీల నమ్మకం.

ఏది ఏమైనా మెక్సికో ప్రాంతంలో, మాయా నాగరికతలో నాగారాధన విపరీతంగా ఉంది. సూర్య తదాది నక్షత్రాలు ఆకాశంలో పాములెక్కి విహరిస్తాయని వాళ్ల నమ్మకం. పాము కుబుసం విడిచి కొత్తగా తయారైనట్లే ఆత్మ కూడా దేహాన్ని విడిచి కొత్త దేహాన్ని ధరిస్తుందని అనుకుంటారు. స్పెయిన్‌ దండయాత్ర వరకు వాళ్లు ఈకలున్న పామును పూజించేవారు. పాము పొట్ట మీద పాకుతుంది కాబట్టి దాన్ని కొన్ని సందర్భాల్లో నీచప్రాణిగా అనుకున్నారు. తమని పల్లకీ  బోయీలుగా చేసి సర్ప, సర్ప (కదలండి) అని అదలించినందుకు నహుషుణ్ని సర్పంగా మారమని ఋషులు శపించారు.

‘‘పారడైజ్‌ లాస్ట్‌’’లో దేవుడికి ఎదురు తిరిగిన సైతాను సర్పరూపంలోనే వచ్చి ఆదాము, ఈవ్‌లను దైవాజ్ఞను మీరి నిషిద్ధఫలాన్ని ఆరగించమని ప్రేరేపించాడు. క్రైస్తవం వ్యాపించడానికి ముందు అనేక దేశాల్లో పామును పూజించేవారు. కానీ క్రైస్తవం ప్రబలాక వాళ్లు పామును సైతాను అవతారంగా చూడడం చేత ఆ పూజను మాన్పించారు.

క్రూరజంతువుల పాలబడి మరణించిన మనుషుల కంటె పాముకాటుతో మరణించినవారే ఎక్కువ. ఎందుకంటే పాము మన ఆవాసాల చుట్టూ కూడా ఉంటూంటుంది. విషసర్పాలు కొన్నే అయినా, పాముకాటు భయంతో కొందరు మరణిస్తూ ఉంటారు. అలాటి భయాలు పోగొట్టడానికి పాము మంత్రాలు వచ్చాయి. తెలుగునాట పాముల నరసయ్య అనే పాము మంత్రగాడు ఉండేవారని, ఆయన పేరు చెప్తేనే పాము విషం దిగిపోయేదని చెప్పుకునేవారు.

బైబిల్‌లో మోజెస్‌కు భగవంతుడు చెప్పాడు – ‘‘నాకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని శిక్షించడానికి నేను భయంకరమైన సర్పాలను పంపిస్తాను. అవి కాటేయగానే వాళ్లకు విషం ఎక్కుతుంది. నువ్వొక శిలువ లాటిది తీసుకుని దాన్ని చుట్టుకుంటున్నట్లు యిత్తడి పాము విగ్రహం చేయించు. పాముకాటు తిన్నాక క్షమించమని అడిగినవాళ్లకు దాన్ని చూపించు. అప్పుడు వాళ్లకు విషం దిగిపోతుంది.’’ అని. మోజెస్‌ చనిపోయాక కూడా ఆ పాము విగ్రహాన్ని ఆరాధిస్తూండేవారు. కర్పూరహారతులు యిచ్చేవారు. తర్వాతి రోజుల్లో విగ్రహారాధన నిరసించిన హెజెకియా అనే రాజు తన సైనికులను పంపి దాన్ని ధ్వంసం చేయించాడు. ఆ పామును ‘కేవలం యిత్తడి ముక్క’ (నెహుస్తాన్‌) అని తీసిపారేశాడు.

పాము విషం ప్రాణాన్ని హరిస్తుందన్నమాట నిజమే అయినా విషాన్ని కొద్దిపాటి మోతాదులో ఉపయోగించి ఔషధంగా వాడతారు. అందువలన పామును వైద్యానికి గుర్తుగా కూడా వాడతారు. ఎస్డెపియస్‌ అనే గ్రీకు దేవుడు వైద్యానికి ప్రాతినిథ్యం వహిస్తాడు. అతని చేతిలో ఒక కడ్డీ ఉండి దానికి పాము చుట్టుకుని వుంటుంది. ఆధునికకాలంలో కూడా వైద్యానికి అదే గుర్తు అయిపోయింది. ఇలాటిదే యింకో గుర్తు కూడా వుంది. హెర్మిస్‌ అనే గ్రీకు దేవుడి చేతిలో వుండే దండానికి రెండు పాములు చుట్టుకుని వుంటాయి. పైన అటూయిటూ రెండు రెక్కలు వుంటాయి. 

మన పురాణాల్లో ఆదిశేషుడు భూమిని మోస్తాడు. స్కాండినేవియా ప్రాంతానికి చెందిన నార్స్‌ పురాణాల ప్రకారం లోకి సంతానమైన జొర్మన్‌గండర్‌ను ఓడిన్‌ మహాసముద్రంలోకి విసిరేస్తే అది పెద్దగా విస్తరించి, భూమిని చుట్టుకుంది. చివరకు దాని తోకను అదే మింగేటంత పెద్దగా తయారైంది. దాన్ని మిడ్‌గార్డ్‌ సర్పెంట్‌ అంటారు. అది నోట్లోంచి తోకను వదిలేసినప్పుడు, అనేక ఉత్పాతాలు జరిగి, జలప్రళయం వచ్చి, పునఃస్సష్టి జరుగుతుంది. పాము తన తోకను మింగి వలయంగా ఏర్పడడమనేది సృష్టి అనంతమనే భావనను సూచిస్తుందంటారు. తోకను వదిలేస్తే మరో సారి ప్రళయం, పునరుత్పత్తి అన్నమాట. నిజానికి పాము తన తోకను ఎప్పుడూ మింగదట.

మన శివుడు నాగాభరణాన్ని ధరించాడు. రాజులలో కొందరి కిరీటాలపై నాగముద్ర వుంటుంది. ఈజిప్టు ఫారోలు కూడా తమ కిరీటాలపై నాగుపాము ముద్రను ధరించారు. ప్రాచీన ఈజిప్షియన్‌ దేవత వాడ్జెట్‌ను పాములా చిత్రీకరిస్తారు. అందువలన సార్వభౌమత్వానికి, దైవత్వానికి చిహ్నంగా రాజులు తమ కిరీటాలపై విషం చిమ్ముతున్న పామును చెక్కించుకునేవారు. రాజుగారి శత్రువులపై విషం చిమ్మి వారిని నిర్మూలిస్తుందని వారి భావం.

పాములంటే మనకు భయమూ ఉంది, భక్తీ ఉంది. కుండలినీ శక్తిని వెన్నెముక కింది భాగంలో చుట్టలుచుట్టుకుని ఉన్న పాములా ఊహిస్తారు. ధ్యానం ద్వారా దాన్ని మేల్కొలిపినపుడు అది పైపైకి వెన్నెముక ద్వారా పాకుతూ వచ్చి కపాలంలో శక్తిని జాగృతం చేస్తుందంటారు. మనం నాగుల చవితి, సుబ్బారాయ షష్ఠి చేస్తూంటాం. సుబ్రహ్మణ్యుడికి గుళ్లు కడతాం. మా ఫ్రెండు ఒకసారి చెప్పాడు – తను రష్యా వెళ్లినపుడు ఒక రష్యన్‌ అడిగాడట ` మీ ఇండియాలో పాలు దొరక్క పిల్లలు ఏడుస్తున్నా మీరు వాళ్లకు యివ్వకుండా పాముపుట్టల్లో పోసేసి, వృథా చేస్తారట కదా! అని. ఇతను తప్పు, తప్పు అది పాము కాదు, లార్డ్‌ సుబ్రహ్మణ్యేశ్వర అని చెప్పాడట. ఆ పేరు పలకడానికి ప్రయత్నించి ఆ రష్యన్‌ దాదాపు మూర్ఛపోయాడట.

పాముకి పాలుపోయడం మనకే కాదు, కొన్ని యూరోపియన్‌ దేశాల్లో కూడా ఉండేదిట. పాముకు పాలుపోసి పెంచినా.. అనే సామెత వుంది. నిజం ఏమిటంటే పాలంటే పాముకి ప్రత్యేక యిష్టం ఏమీ లేదు. దానికి నీళ్లయినా చాలు, దాహం తీర్చుకోవడానికి. తిండి అంటే ఎలకలు, కప్పల్లాటివే. మన పసిపాపల్లా పాలు మాత్రం తాగి పెరగలేవు. మనకున్న యింకో నమ్మకం పాము పగ బడితే వదలదని, ముఖ్యంగా తన తోడును చంపితే అస్సలు ఊరుకోదని, వెంటాడి వెంటాడి చంపుతుందని మనకు గట్టి నమ్మకం. ఆ థీమ్‌ మీద అనేక సినిమాలు వచ్చాయి. పగబట్టే విలన్‌కు నాగరాజు అనే పేరు పెట్టడం కద్దు. నిజానికి పాముకి ఏమీ గుర్తుండదట. పైగా ఒకరితోనే తోడు కట్టడం, వారి కోసం తపించడమనే కాన్సెప్టే లేదట.

పామును శృంగారానికి, సంతానానికి చిహ్నంగా భావిస్తారు. త్రికోణంలా వుండే పాము పడగను స్త్రీ జననాంగంగా, మెలికలు తిరిగే పాము మొండాన్ని పురుషాంగంగా భావించి అలాటి ఊహ వచ్చిందంటారు. సైకో ఎనాలిసిస్‌లో కలలో పాము వస్తే శృంగారవాంఛలున్నట్లు అర్థం చెపుతారు. ‘రగులుతోంది మొగలి పొద’ పాటలో నాయికానాయకులు పాముల్లా చుట్టుకుపోవడం గుర్తుండే వుంటుంది. పిల్లలు పుట్టాలంటే పాము పుట్టకు ప్రదక్షిణాలు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకుంటారు. ఈ మధ్య తగ్గింది కానీ గతంలో అయితే తెలుగునాట గర్భిణులందరూ కలలో పాము కనబడిందని, అందుకని పిల్లలకి పాము కలిసి వచ్చేట్లు పేరు పెట్టాని పట్టుబట్టేవారు. అందుకే మనలో సుబ్బారావు, నాగయ్య, యిటీవ ఫణి.. యిలా బోల్డుమంది కనబడతారు.

పాము నాలుక చీలి వుంటుంది కాబట్టి, మాట మార్చేవాళ్లది రెండు నాల్కల ధోరణి అని నిరసిస్తారు. చైనా రాశిచక్రంలో ఐదవది పాము. ఆ రాశిలో పుట్టినవారు పైకి ఒకలా మాట్లాడుతూ మనసులో యింకోలా అనుకుంటారనే అర్థంలో ‘పాము హృదయం గలవారు’ అని చైనీయుల నమ్మకం. కానీ వారి జానపద కథల్లో పాములకు ఉపకారం చేస్తే, అవి కృతజ్ఞతాపూర్వకంగా ముత్యాలు యిస్తూంటాయి. పాము చర్మం దగ్గరుంటే ఐశ్వర్యం కలుగుతుందని వారి నమ్మకం. జపాన్‌లోని షింటో నాగరికతలో తుపాను దేవుడు ఎనిమిది తలల పెద్ద పాముతో పోరాడాడు. చివరకు దాని తోకలో ఉన్న పవిత్రఖడ్గాన్ని చేజిక్కించుకుని, దానికి బందీగా ఉన్న యువరాణిని రక్షించాడు. ఆఫ్రికాలోని ఆగ్నేయ ప్రాంతంలోని గుహల్లో వున్న బొమ్మలు చూస్తే పాములను వర్షాలకు ప్రతీకగా చూసేవారని తెలుస్తుంది.

చివరగా ఒక జోకుతో ముగిస్తాను. సిగరెట్లు పెద్దగా రాని రోజుల్లో చుట్టలు తాగేవారు. రెడీమేడ్‌ చుట్టలు కొనుక్కోవడం కంటె పొగాకు కాడ తెచ్చుకుని యింట్లో చుట్టుకునే పెర్‌ఫెక్షనిస్టులు వుండేవారు. సాహితీవేత్త ఒకాయన పొద్దున్న లేవగానే చుట్ట గురించి వెతుక్కోనవసరం లేకుండా ముందు రోజు రాత్రే చుట్టలు చుట్టుకుని సిద్ధంగా పెట్టుకునేవాడట. వాళ్లింటికి బస చేయడానికి వచ్చిన మరో సాహితీవేత్త యిది చూసి ‘పడుక్కోబోయేముందు రామాకృష్ణా అనుకోకుండా యీ చుట్టలు చుట్టుకోవడమేమిటి బావగారూ’ అని మందలించబోయాడు. దానికీయన మందహాసంతో ‘తప్పేముంది? అదిశేషుడు సైతం పడుక్కోబోయేముందు చుట్టలు చుట్టుకోడూ?’ అన్నారట శ్లేషాలంకారం వాడుకుంటూ! (ఫోటోలు – భారతీయ శిల్పాలు, ఫారో కిరీటం, కుండలిని, నార్స్, అజ్ టెక్ నాగరికతల్లో)

 –  ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2020)
  [email protected]