తెరాస ముందస్తు ఎన్నికలకు వెళుతుందా లేదా అన్న విషయంపై సస్పెన్సు తొలగింది. ముహూర్తప్రకారమే సెప్టెంబరు 6న అసెంబ్లీ రద్దు ప్రకటన వెలువడింది. మధ్యలో ప్రజానివేదన సభకు గంట ముందు కాబినెట్ సమావేశం అనడంతో అసలు సభ కంటె ఊహాగానసభలు జోరుగా సాగాయి. అసెంబ్లీ రద్దు ప్రకటన వెలువరించే సభకు వస్తారన్నారు. కానీ అలా కాలేదు. పైగా ఆనాటి కెసియార్ ప్రసంగం అంచనాలను అందుకోలేదు. గంటన్నర మాట్లాడతారని ముందుగా చెప్పారట కానీ 40 ని.లకు మించి సాగలేదు. ఆయనా ఉత్సాహంగా లేడు, ప్రజలూ కేరింతలు కొట్టలేదు. ఒక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి చెప్పేయగలిగిన దాని కోసం యిన్ని కోట్ల ఖఱ్చు, యింత శ్రమా అవసరమా? అని తెరాస పార్టీ నాయకులే వాపోయారట. అసెంబ్లీ రద్దు కోసం ఆయన చేసిన ప్రతిపాదనకు మోదీ ఆమోదం లభించలేదని తెలిసిందని, అందువలనే ఆయనలో హుషారు కనబడలేదనీ విశ్లేషణలు వచ్చాయి. ఇక అసెంబ్లీ రద్దు ఉండదేమో అని కూడా అనసాగారు.
నిరాశ పడ్డారా? – అంతలో సెప్టెంబరు 5న మర్నాడు రద్దు కచ్చితంగా జరుగుతుందని తెలిసిపోయింది. 2వ తారీకు 5వ తారీకు మధ్య కెసియార్‌కు కొత్తగా సంకేతాలేమైనా అందాయా? రద్దు ప్రకటన వెలువడగానే 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించడం చూస్తే కసరత్తు ఎప్పుడో ప్రారంభమై పూర్తి కూడా అయిందని అర్థమవుతోంది. గురు-పుష్య యోగం వగైరా సమాచారం వింటే సెప్టెంబరు 6 ముహూర్తం కూడా ఎప్పుడో ఫిక్సయిందని, మధ్యలో సెప్టెంబరు 2 ముహూర్తం మీడియా పెట్టినదే అనీ అనిపిస్తోంది. కెసియార్‌కు రావలసిన సంకేతమేదో ముందే వచ్చేసి ఉంటుందని, సెప్టెంబరు 2న ఆయనను నిరాశపరచిన వార్త ఏమీ దిల్లీ నుంచి వచ్చి ఉండదని అనుకోవాలి.
మరి అలా అయితే అవేళ్టి ఆయన డల్‌నెస్‌కు కారణం ఏమనుకోవాలి? అనుకున్నంత మంది సభకు రాలేదనేనా? 25 లక్షల మంది వస్తారని ప్రచారం చేశారు. ఎంతమంది వచ్చారనేది ఎప్పటికీ లెక్క తేలదు. ఇప్పుడే కాదు, పాతికేళ్లగా చూస్తున్నాను. సభానిర్వాహకులు యిన్ని లక్షల మంది వచ్చారంటే, వారికి వ్యతిరేకులు అబ్బే అందులో పదో వంతుమంది వచ్చారంటారు. పత్రికల వాళ్లు యిద్దరి స్టేటుమెంట్లూ వేసి కూర్చుంటారు తప్ప తమ అంచనా ఎప్పటికీ చెప్పరు. జనాలు పోగుపడిన స్థలం ఎంతో కొలిస్తే, ఒక మనిషికి పట్టే స్థలం చేత దాన్ని భాగిస్తే, ఎంతమంది వచ్చారో యించుమించుగా చెప్పేయవచ్చు. కానీ ఆ పని ఎవరూ చేయరు. ఇప్పుడు ప్రజానివేదిక సభకు కూడా 5 లక్షలకు మించి రాలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. పోనీ ఏ 10 లక్షలో వచ్చారనుకోండి, అదైనా 25 కంటె తక్కువేగా! అనేక నియోజకవర్గాల నాయకులు తీసుకు వస్తామని చెప్పిన జనాల్లో సగం మందినే తెచ్చారని అంటున్నారు.
సభను ఒక సూచికగా చూశారా? – సభకు వచ్చే ముందే అవన్నీ తెలుసుకున్న కెసియార్ హెలికాప్టర్లోంచి చూసి ఎంతమంది వచ్చారో నిర్ధారించుకుని, నిరుత్సాహపడి ఉంటే అదే ఆయన ప్రసంగంలో ప్రతిఫలించిందా? ఆయన సంగతి ఎలా ఉన్నా ప్రజలేనా ఉల్లాసంగా ఉండవచ్చుగా! అబ్బే, వచ్చామంటే వచ్చాం, వదిలేస్తే వెళ్లిపోతాం అన్నట్లున్నారు. రద్దు ప్రకటన తర్వాత 50 రోజుల్లో 100 మీటింగులు పెట్టడానికి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్న కెసియార్, ప్రకటనకు మూడు రోజుల ముందు పార్టీ నిధులు, ప్రభుత్వ నిధులు భారీగా ఖర్చు పెట్టి ఆ నివేదన సభ నిర్వహించనేల? సభ విఫలమైంది (పోనీ అనుకున్నంత విజయవంతం కాలేదు) అనిపించుకోనేల? అని ఆలోచిస్తే ఆ సభ వైఫల్యమే తొందర పడేట్లు చేసిందా అనే ఆలోచన వస్తోంది.
అంటే సెప్టెంబరు 6కి రద్దు చేద్దామనుకుని సర్వసన్నాహాలు చేసుకుని అంత రిస్కు చేయాలా వద్దా తేల్చుకోవడానికి మధ్యలో ప్రగతి నివేదన సభ పెట్టి ఉంటారు. ఎందుకంటే తెలంగాణలో ముందస్తు రాబోతోందని ఆంధ్రజ్యోతి జూన్ ఆఖరి వారంలోనే పాట మొదలుపెట్టింది. మధ్యమధ్యలో గుర్తు చేస్తూనే ఉంది. ప్రగతి నివేదిక సభ ప్రతిపాదన జూన్ తర్వాతే వచ్చింది. సభలో నిరుత్సాహం చూశాక యింకా తాత్సారం చేస్తే కొంప మునుగుతుందన్న భయం వేసి ఉండవచ్చు. కొంప మునగడం అంటే సాంతం ఓడిపోతారని కాదు, ఇప్పుడున్న వాటి కంటె తక్కువ సీట్లు రావచ్చు. సాధారణ మెజారిటీ బొటాబొటీగా సాధించవచ్చు. అందుకే ఎందుకైనా మంచిదని అనుకున్న ముహూర్తానికి రద్దు చేసేద్దామని అనుకుని ఉంటారు.
రద్దుకు సరైన కారణం చెప్పగలిగారా? – ఇలా ఎందుకు ఆలోచించాలి అంటే – ఎవరైనా సరే, చివరి నిమిషం వరకూ అధికారంలో ఉందామనే చూస్తారు. అలాటిది తెరాస 9 నెలలు ముందుగా అధికారం వదులుకోవడం చిత్రంగా లేదా? పార్లమెంటు ఎన్నికలతో కలిపి జరగాల్సిన ఎన్నికలను విడిగా జరపడం వలన అనవసరమైన ఖర్చు, శ్రమ కలుగుతుందని అందరికీ తెలుసు. ఎందుకలా చేయవలసి వచ్చిందని ప్రజలకు నచ్చచెప్పడానికి కెసియార్ వద్ద కారణం ఉందా? పార్టీలో అసమ్మతి లేదు, కొందరు ఎమ్మేల్యేలు విడిగా వెళ్లిపోయి రాజకీయ అస్థిరత తెచ్చి పెట్టలేదు. ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడలేదు. కెసియార్ ప్రెస్‌మీట్ లో 'రాష్ట్ర అభివృద్ధి జరగకుండా ప్రతిపక్ష పార్టీల రూపంలో కాకిగోలలు, పిచ్చి పసలేని ఆరోపణలు చాలా భయంకరమైన పద్ధతిలో జరుగుతున్నాయి. ప్రాజెక్టులపై కోర్టులకు వెళుతున్నారు. అధికారులు స్థయిర్యం కోల్పోయే పరిస్థితి నెలకొంది. అందుకే పదవీకాలాన్ని త్యాగం చేసి ముందుకెళుతున్నాం' అని మాత్రమే చెప్పుకోవలసి వచ్చింది.
ఇదో కారణమా!? ఈయన ఎన్నికల్లో 100 కి మించి స్థానాలు గెలిచినా ప్రతిపక్షాలు 'కాకిగోల' మానేస్తాయా? ఈయన చిత్తం వచ్చినట్లు ఫిరాయింపులు ప్రోత్సహించి, వాళ్లను తన పార్టీ టిక్కెట్టుపై మళ్లీ గెలిపించుకోకుండా మంత్రి పదవులు కట్టపెట్టేసినా, అబద్ధపు ఆరోపణలతో ఎదుటి పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను స్పీకరు ద్వారా రద్దు చేయించేసినా వాళ్లు నోరు మూసుకుని కూర్చుంటారా? కోర్టుకి వెళ్లడం మహాపరాధమా? తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడకుండానే నీటి పారుదల ప్రాజెక్టులపై కేసులు వేసిన సందర్భాలు లేవా? తెరాస గతంలో చేసిన ఆందోళనల మాటేమిటి? ప్రాజెక్టులపై మీరు వాళ్ల వాదనలు వినరు, మాట్లాడితే వాళ్లను కురచ వ్యక్తులు, అవగాహన లేని సన్నాసులు, దరిద్రానికి రిజర్వు బ్యాంకు అంటున్నారు.
వాళ్లు ఆరోపణలు చేశారు కదాని ముందస్తుకి వెళ్లాలంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి వారంలోనే మరో ముందస్తుకి వెళ్లాల్సి వుంటుంది. ప్రతిపక్షాల ఆరోపణల వలన అధికారుల స్థయిర్యం కోల్పోయి ప్రగతి చక్రాలు నిలిచిపోతున్నాయా? అంటే దాని అర్థం రాష్ట్రంలో ప్రగతి జరగలేదనా? జరిగిందని ఓ పక్క మీరు డప్పు కొట్టేస్తున్నారే! జరిగిందా? లేదా? జరిగి ఉంటే ప్రతిపక్షాల కాకిగోల మీకు అడ్డు రాలేదన్నమాట. అందువలన దాని కోసం మీరు ముందస్తుకు వెళ్లనక్కర లేదన్నమాట. ప్రగతి జరగకపోతే ముందుగా ఆ మాట చెప్పేసి, అప్పుడు ప్రతిపక్షాలు ఎలా అడ్డుకున్నాయో వివరంగా చెప్పండి.
వాగ్దానాలు నెరవేర్చకుండానే ముందస్తెందుకు? – నిజానికి ప్రతిపక్షాలు బలంగా ఉండి ఉంటే కెసియార్ ముందస్తుకి వెళ్లేవారే కారు. సాధ్యమైనంత కాలం పాలించి, అప్పుడు ప్రజల ముందుకు వచ్చేవారు. ఎందుకంటే ఆయన గొప్పగా చెప్పుకునే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ రెండింటి ఫలితాలు యీ వేసవిలోనే నికరంగా తేలేవి. వర్షాలు బాగా పడిన యీ సీజనులో నీటి ఎద్దడి తెలియదు. ఏప్రిల్, మే లే పరీక్షకు పెడతాయి. ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు యిచ్చాకనే ఓట్లు అడుగుతానన్నారు. అది యింకా పూర్తి కాలేదు. అలాగే టూ బెడ్రూమ్ ఫ్లాట్లు. అదీ కాలేదు. ఇక కెజి టు పిజి, యింటింటికీ ఉద్యోగం.. యిలా ఎన్నో ముఖ్యమైన వాగ్దానాలు నెరవేరనే లేదు.
ఇంటింటికి ఉద్యోగం అనలేదని యిప్పుడు తెరాస నాయకులు బుకాయిస్తున్నారు. పోనీ ఎన్ని ఉద్యోగాలన్నారు, ఎన్ని యిచ్చారు? అదేనా చెప్తారా? హైదరాబాదులో జీవన నాణ్యత పెంచుతానన్నారు. పెరిగిందా? లేదే! అంతర్జాతీయ నగరం అంటూ కాసిన్ని షోకులు చేస్తే చాలదు. రోడ్లు, ట్రాఫిక్, పారిశుధ్యం – అన్నీ అధ్వాన్నంగానే అఘోరిస్తున్నాయి. అనుకున్న సమయానికి మెట్రో, ఎంఎంటిఎస్ ఏదీ సిద్ధం కావటం లేదు. కేంద్రం రైల్వే శాఖ నుంచి ఏమీ తెచ్చుకోలేక పోయారు. ఐటిఐఆర్ రద్దు అయిపోయింది. పబ్లిసిటీ తప్ప ఏమీ జరగటం లేదని క్షేత్రస్థాయిలో తెలుస్తూనే ఉంది.
ప్రతిపక్షాల దుస్థితి – దౌర్భాగ్యమేమిటంటే, యీ దుస్థితిని హైలైట్ చేయడానికి ప్రతిపక్షాలు చురుగ్గా లేవు. కాంగ్రెసు పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు సాగుతూనే ఉన్నాయి. తెరాస కెసియార్‌ను తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపగలుగుతున్నపుడు అతని దీటుగా కాంగ్రెసు తన తరఫున ఎవరినైనా చూపగలదా? ఆ స్టేచర్ ఎవరికి ఉంది? కెసియార్ సిఎం కాబోడు, కెటియారే అవుతాడు అన్నా కాంగ్రెసు దాన్ని ఎన్‌క్యాష్ చేసుకోగలదా? కెటియార్ది రాహుల్, లోకేశ్ వంటి యిమేజి కాదు. మంచి వాగ్ధాటి ఉన్నవాడు. కార్యశూరుడు. కలుపుగోరు మనిషి. విషయపరిజ్ఞానం ఉన్నవాడిగా కనబడతాడు. కెసియార్ కున్న నోటి దురుసు, దొరతనం, తిక్కప్రవర్తన యితనికి ఉన్నట్లు కనబడదు. కెటియార్‌కు ఆమోదయోగ్యత ఎక్కువగా ఉంది.
రేవంత్ వంటి వాడు యితనికి పోటీ వచ్చేవాడేమో కానీ, ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా బుక్కయిపోయి, యిమేజి పోగొట్టుకున్నాడు. ఎలా చూసినా ముఖ్యమంత్రి పదవికి సరైన అభ్యర్థి కాంగ్రెసులో కానరావటం లేదు. అందువలన ఎవరికి వారే అభ్యర్థి అనుకుని, ఒకళ్ల కాళ్లు మరొకళ్లు లాగుతూనే ఉంటారు. వి హనుమంతరావు వంటి విదూషకుల వలన పార్టీ యువతకు మరింత దూరమవుతుంది.
కాంగ్రెసులో పోట్లాడుకోవడానికి నాయకులైనా మిగిలారు. టిడిపికి వాళ్లూ మిగల్లేదు. 40-45 స్థానాల్లో పోటీ చేయగలమని టిడిపి నాయకులంటున్నారు కానీ అంతమంది అభ్యర్థులు దొరుకుతారా? కెసియార్ వస్తూనే టిడిపిపై పడి కబళించేసినపుడు పెద్దతరం నాయకులందరూ వెళ్లిపోయారు. వెంటనే వారి స్థానంలో యువనాయకులను ప్రోత్సహించే అవకాశం టిడిపి నాయకత్వానికి వచ్చింది. అలా చేసి ఉంటే గత మూడు, నాలుగేళ్లలో వాళ్లు మంచి నాయకులుగా ఎదిగేవారు.
ఎందుకంటే టిడిపికి తెలంగాణలో చక్కటి, స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ఎన్టీయార్ కారణంగా బిసిలు ఆ పార్టీలో ఎదిగారు. బాబు కూడా అదే పాలసీని మేన్‌టేన్ చేస్తూ వచ్చారు కాబట్టి టిడిపికి తెలంగాణ ప్రజల్లో సానుభూతి ఉంది. కానీ దాన్ని ఎన్‌క్యాష్ చేసుకునే నాయకులు ఉంటేనే ప్రయోజనం వుంటుంది. ఎన్టీయార్ హయాంలో చేరిన నాయకులే గత 35 ఏళ్లగా ముఖ్యమైన పదవుల్లో కొనసాగడం వలన యువ నాయకులకు అవకాశం లేకుండా పోయింది. తెరాస టిడిపి నాయకులను లాక్కోగానే కొత్త తరం నాయకులను పార్టీలో చేర్చుకుని ఉంటే వాళ్లూ ఉత్సాహంతో పని చేసేవారు.
కానీ టిడిపి అధినాయకత్వం అలసత్వం వహించింది. ఓటుకు నోటు కేసులో బెదిరిపోయి, తెలంగాణను తెరాసకు ధారాదత్తం చేసేసింది. ఆ కేసులో మచ్చ పడింది కాబట్టి బాబు వెళ్లిపోయారు సరే, లోకేశ్ యిక్కడే ఉండి తెలంగాణలో పార్టీని వృద్ధి చేయవచ్చుగా! అలాగే చేస్తానన్నాడు కూడా. తర్వాత ఏమనుకున్నాడో ఏమో, ఆంధ్రకు వెళ్లి మంత్రి అయిపోయాడు. అక్కడ అనేక వ్యాపకాలు. తెలంగాణను గాలికి వదిలేశారు. కాంగ్రెసు, టిడిపి పొత్తు కుదుర్చుకుంటే కాంగ్రెసుకు మద్దతుగా ఉన్న రెడ్లు, టిడిపికి మద్దతుగా ఉండే కమ్మ, బిసిలు ఒక పటిష్టమైన శక్తిగా తయారై తెరాసకు గట్టి పోటీ యివ్వవచ్చనే అంచనాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెరాస అభ్యర్థుల జాబితాతో బాటు కులాల వివరాలు కూడా ప్రెస్‌కు అందచేసింది. 105 మంది అభ్యర్థులలో కెసియార్‌కు వెలమలకు 10 సీట్లివ్వగా, బిసిలకు 20, కమ్మలకు 6, రెడ్లకు 34 యిచ్చారు.
ప్రధాన పక్షాల పరిస్థితి యిలా వుండగా కోదండరాం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకోవాలో, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలో తేల్చుకోలేదింకా. ఇక కమ్యూనిస్టుల సంగతి చూడబోతే సిపిఎం జనసేనతో వెళతానంటోంది, సిపిఐ తేల్చటం లేదు. జనసేనాధిపతి ఏం చేస్తారో వేచి చూడాలి. ముందస్తు వార్తలు గత రెండు నెలలుగా గట్టిగా వస్తున్నా వీళ్లు ఏ ఏర్పాట్లూ చేసుకోలేదు. ఈయన అన్నీ సిద్ధం చేసుకున్నాడు. వీళ్లంతా లేచి, గోచీ సవరించుకొనే లోపునే దూకుడుగా ముందుకు వెళ్లిపోతున్నాడు. బిజెపితో పొత్తు లేకుండా ముందుకు వెళుతున్నాడు. మా గోత్రాలు వేరే అన్నాడు. మజ్లిస్‌తో స్నేహం ఉందన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, కొడుకుని ముఖ్యమంత్రి చేసి, పార్లమెంటు ఎన్నికల పాటికి ఎన్‌డిఏలో చేరి, పార్లమెంటు సీట్లకై బిజెపితో పొత్తు పెట్టుకుంటాడని, ఎన్నికల ప్రచార సమయంలో తనకున్న భాషాసంపదతో ఎన్‌డిఏకు అనుకూలంగా పలు ప్రాంతాల్లో ప్రచారం చేసి, బదులుగా కేంద్ర మంత్రి పదవి తీసుకుంటాడని అంచనాలు వినవస్తున్నాయి.
బిజెపి ఎందుకు సహకరించాలి? – ఇదంతా కెసియార్ వరకు చూస్తే బాగానే ఉంది. కానీ యీ ప్లాన్లకు బిజెపి ఎందుకు కలిసి రావాలి అనేదే మిస్టరీ. అంతా కెసియార్ అనుకున్నట్లే జరిగితే తెరాసకు లాభం తప్ప, బిజెపికి ఏముంది? ముఖ్యంగా రాష్ట్ర బిజెపికి! రాష్ట్ర విభజనకు అనుకూలంగా అందరి కంటె ముందు కాకినాడ సభలో తీర్మానం చేసి కూడా వాళ్లు బావుకున్నది లేదు. ఆంధ్ర బిజెపి నాయకులను నొప్పించి, తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో నిలబడి పోరాడినా, వారు విభజన వలన రాజకీయంగా బాగుపడలేదు.
తెలంగాణ ఏర్పాటు నిర్ణయం ఆలస్యంగా చేసి, కాంగ్రెసు అనేక మంది ఉసురు తీసిందని, అందువలన తెలంగాణ ఏర్పాటు ఘనత దానికి కట్టబెట్టనక్కరలేదని కెసియార్ అంటారు. తెలంగాణ యివ్వలేదని, తామే గుంజుకున్నామనీ అంటారు. కానీ బిజెపి మాటేమిటి? ప్రతిపక్షంలో ఉంది కాబట్టి నిర్ణయం ఆలస్యం కావడంలో దాని పాత్ర లేదు. అయినా తమ చిన్న రాష్ట్రాల సిద్ధాంతానికి కట్టుబడి విభజనకు సహకరించి, ప్రత్యేకరాష్ట్రం సాధనలో ప్రత్యేక భూమిక వహించింది. బిజెపి తోడ్పాటు లేకుండా విభజన జరిగేదే కాదు. ఇవన్నీ తెలిసి కూడా కెసియార్ బిజెపికి గౌరవం ఏమైనా యిచ్చాడా? వాళ్లనీ రాజకీయ శత్రువులుగానే చూస్తున్నాడే! రాష్ట్రసాధన ఘనతలో కొంచెమైనా పాలు యివ్వటం లేదే!
కేంద్ర బిజెపి వ్యూహమేమిటి? – అలాటి తెరాస మళ్లీ అధికారంలోకి రావడానికి బిజెపి ఎందుకు మద్దతివ్వాలి? ఈ ఉపయెన్నికల్లో తెరాస గెలిచి, కెటియార్ వంటి పిన్నవయస్కుడు ముఖ్యమంత్రి అయితే బిజెపి ఇంకో రెండు టర్ములు తెలంగాణపై ఆశ వదులుకోవాలి. తెలంగాణలో 'భాగ్య'నగరం ఉంది. నిరంతరం ఎదుగుతూ రాజకీయ నాయకులకు బంగారు బాతులా మారుతోంది. అలాటి నగరాలు దేశంలో పదైనా ఉన్నాయో లేదో! అలాటి దానిపై సర్వహక్కులు కేంద్ర బిజెపి వదులుకుంటుందా? కేంద్ర బిజెపి తెలంగాణను తెరాసకు ధారాదత్తం చేసిందన్న భావం కలగగానే రాష్ట్ర బిజెపి నాయకులు, టిడిపి వారిలాగానే పక్కచూపులు చూస్తారు, లేదా చప్పబడతారు.
కేంద్ర బిజెపి యిలా జరగనిస్తుందా? బిజెపి స్పెల్లింగ్ తెలియని కొత్త రాష్ట్రాలలో సైతం అమిత్ షా చొచ్చుకుపోతున్నారే, అలాటిది దశాబ్దాలుగా ఏదో ఒక స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణలో పార్టీని దిక్కుమాలినదానిగా వదిలేస్తారా? ఇది నమ్మశక్యంగా ఉందా? పార్టీకి మేలు కలగాలంటే మరి తెరాసను బలపడనీయకూడదు. బలపడనీయకూడదంటే ముందస్తు ఎన్నికలు జరగనీయకూడదు. కానీ జరిగేట్లు ఉన్నాయే! అదే మిస్టరీగా ఉంది. అవిశ్వాస తీర్మానమప్పుడు కెసియార్, మోదీల మధ్య బేరం కుదిరిందని, అందుకే ముందస్తు ఎన్నికలకు మోదీ సమ్మతించారని ఒక పుకారు ఉంది. ఆ తీర్మానమప్పుడు తెరాస ఎటు ఓటేసినా, పరిస్థితి తారుమారు అయ్యేది కాదు. కెసియార్ ప్రభావితం చేయగలిగిన ప్రాంతీయ పార్టీలూ లేవు.
మిస్టరీ- ఇక బేరం మాట అనుకోవాలంటే – కెసియార్, మోదీ యిద్దరూ నమ్మకస్తులు కారు. కెసియార్ సోనియాను బోడి మల్లయ్య ఎలా చేశారో చూశాం. అలాగే మోదీ కూడా ఎన్డిఏ భాగస్వామి అయిన బాబుని ఎలా తొక్కేశారో చూశాం. అలాటిది కెసియార్‌ను స్వహస్తాలతో పెంచి పెద్ద చేస్తాడా? బాబు అనుభవం చూసి కూడా కెసియార్ మోదీ కౌగిలిలోకి వెళతారా? ముస్లిం పక్షపాత పార్టీగా పేరు బడిన తెరాసను కౌగిలిలోకి తీసుకుని మోదీ బావుకునేది ఏముంది? మైనారిటీలను బుజ్జగించే పార్టీగా కాంగ్రెసును విమర్శిస్తూనే తెరాసను వాటేసుకుంటే బిజెపి పరువేం కావాలి? హిందూత్వ ఓటర్లకు ఏం సమాధానం చెప్తారు? 'కాంగ్రెసు ఆంధ్రలో ఎలాగూ లేదు, తెలంగాణలో తెరాస ద్వారా మట్టి కరిపిస్తే చాలనుకుంటున్నామ'ని చెప్తారా?
ముందస్తు ఎన్నికలకు ఎన్నికల కమిషనర్ ఒప్పుకుంటారా లేదా అన్నది యివాళ, రేపట్లో తెలిసిపోతుంది. మామూలుగా అయితే ఎన్నికల జాబితా సవరణలకు నవంబరు 30 వరకు టైముంది. కానీ కెసియార్ నవంబరులోనే ఎన్నికలు అంటున్నారు. జాబితా లోపభూయిష్టంగా ఉందని రాష్ట్ర బిజెపి పిటిషన్లు పెడితే సవరణలు చేసిన జాబితా అచ్చవడానికి ఆలస్యమౌతుంది కదా. అప్పుడు పార్లమెంటు ఎన్నికలతో కలిపి పెడతానని కమిషనర్ అనవచ్చు కదా. ముందస్తు ఎన్నికలు జరగకపోతే తెరాసకు రాజకీయంగా నష్టం కలుగుతుంది. పార్లమెంటు ఎన్నికలతో బాటు జరిగితే మోదీ ప్రభావం రాష్ట్ర ఎన్నికలపై కూడా పడి బిజెపికి లాభం. తను నష్టపోవడానికి కూడా సిద్ధపడి, తెరాసను బలోపేతం చేయడానికి కేంద్ర బిజెపి సిద్ధపడుతోందంటే అది కూడా ఓ మిస్టరీయే!
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2018)
[email protected]