బిజెపి ఆంధ్రకు అన్యాయం చేసిందని టిడిపి అధినాయకుడు తప్ప తక్కిన నాయకులు స్టేటుమెంట్లు గుప్పిస్తున్నారు. ఆంధ్ర ప్రజలకోసం మిత్రధర్మాన్ని కూడా పక్కనపెట్టి పోరాడతామని అంటున్నారు. ఇప్పటిదాకా ఆచరణలోకి దిగని బాబు తన అనుచరులకు నేపథ్యసంగీతం సమకూరుస్తున్నారు. ఈ సంగతి నాలుగేళ్ల తర్వాత యిప్పుడు తెలిసివచ్చిందా? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అని ప్రజలు అడుగుతూంటే 'మేం వాళ్లను నమ్మి మోసపోయాం.
హోదాను మించిన ప్యాకేజీ యిస్తామంటే బాగుంది కదాని ఒప్పుకున్నాం. ఇప్పుడు ఆ ప్యాకేజీకి కూడా గుండు కొట్టించారు. అందుకే బయటపడి మాట్లాడుతున్నాం' అంటున్నారు. ఈ మోసాన్ని యితరులు ఎప్పుడో గుర్తించినా టిడిపి యిప్పటిదాకా గుర్తించకపోవడం అనుమానం రగిలిస్తోంది. బిజెపిని నమ్మి మోసపోయిందా? నమ్మకపోయినా నమ్మినట్లు మనని మోసగించిందా?
ప్రత్యేక హోదా గురించి ఎన్నోసార్లు రాయడం జరిగింది. అది ముఖ్యం అనుకునే వెంకయ్యనాయుడు, జైట్లే రాజ్యసభలో అడిగారు. మన్మోహన్ ఐదేళ్లంటే 'పరిశ్రమ పెట్టడానికే మూడేళ్లు పడుతుంది, ఐదేళ్లు ఏం చాలతాయి, ఎలాగూ మేం అధికారంలోకి వస్తున్నాం, పదేళ్లు యిస్తాం' అని రాజ్యసభలోనే అన్నారు. పదేళ్లేం చాలతాయి, పదిహేనేళ్లు సాధిస్తాం అని బాబు ఎన్నికలలో వాగ్దానం చేశారు. ఆంధ్రకు హోదా వస్తోందని పక్క రాష్ట్రాలన్నీ కుళ్లుకు ఛస్తున్నాయని ప్రచారం కూడా చేశారు.
నెగ్గాక బిజెపి మిన్నకుంది. ఆంధ్ర అసెంబ్లీ హోదా కావాలని రెండు సార్లు తీర్మానం చేసింది. కంభంపాటి రామ్మోహనరావుగారు మొన్నమొన్నటిదాకా హోదా వచ్చేస్తోంది, వచ్చేస్తోంది, నాకు గట్టి నమ్మకంగా ఉంది అంటూనే ఉన్నారు. అంతలోనే బాబు స్వరం మార్చారు. హోదా వేస్టు, అది ఉన్న రాష్ట్రాలు ఏం బావుకున్నాయి? అనే పల్లవి అందుకున్నారు. బావుకున్నాయి స్వామీ అని తక్కినవాళ్లందరూ గణాంకాలు వల్లించినా బాబు కనలేదు, వినలేదు, మూర్కొనలేదు.
హోదా వృథా కాబట్టి వాళ్లు యిచ్చినా ఎడంకాలితో తన్ని పారేస్తా అని అనటం లేదు మళ్లీ. వైసిపి ప్రత్యేక హోదానే పట్టుకుని వేళ్లాడుతూండడంతో, కాంగ్రెసు దానిని ప్రత్యేక అంశంగా చేసుకుని పార్లమెంటులో పోరాడుతూండడంతో అదీ అడుగుతున్నాం అంటున్నారు. అంటే హోదా విలువ గురించి బాబుకు తెలియదనుకోవాలా? మనందరికీ అర్థమైన సంగతి ఆయనకు అర్థం కాలేదంటే ఆయనను దూరదర్శి, దీర్ఘదర్శి, ద్రష్ట, స్రష్ట అని ఎలా అనుకోగలం? బాబు అమాయకుడు, అజ్ఞాని అని బద్ధశత్రువు కూడా అనుకోలేడు. కాబట్టి ఆయన నిద్రపోవటం లేదు, నిద్ర నటిస్తున్నాడంతే అనుకోవాలి.
నటించడం, మానడం ఆయనిష్టం కానీ నటించని అవతలివాళ్లను తిట్టడం మాత్రం అన్యాయం. హోదా గురించి ఎవరైనా అడిగితే తనను పనిగట్టుకుని ఎద్దేవా చేసినట్లు, అవమానపర్చినట్లు ప్రతిస్పందించారు. హోదా యివ్వాలని సోనియా చేత ఉత్తరం రాయించిన కాంగ్రెసు కోటి సంతకాలు సేకరించి, తక్కిన పార్టీలను కూడా పిల్చుకుని వచ్చి విజయవాడలో మీటింగు పెడితే వాళ్లు రాష్ట్రద్రోహులన్నంత బిల్డప్ యిచ్చారు. జగన్ మాట్లాడితే మూతీమొహం తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు.
తనకు తప్ప తక్కినెవరికీ హోదాపై అవగాహన లేదని, అనవసరంగా యాగీ చేసి చికాకులు తెస్తున్నారని, యీ గొడవల వలన రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు రాకుండా పోతున్నాయని వాపోయారు. ప్రత్యేక హోదా రద్దు చేయమని 14వ ఫైనాన్సు కమిషన్ అందన్నారు. అలా అనలేదని దాని చైర్మన్ చెప్పినా వినలేదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలేవీ దాన్ని వదులుకోలేదని, యిప్పటికీ అనేక ప్రయోజనాలు పొందుతున్నాయని బాబు దృష్టికి తెచ్చినా ఆయన కళ్లు మూసేసుకున్నారు. ఇక ఆయన పార్టీ కేంద్రమంత్రులు అదిగో, యిదిగో అంటూ కబుర్లు చెప్పినంత కాలం చెప్తూనేవచ్చారు.
ఇంతకీ హోదాపై హక్కు బాబు ఎందుకు వదులుకున్నట్లు? ప్యాకేజీ యిస్తానన్నారు కాబట్టి.. అని చెప్పుకుని వచ్చారు. హోదాకు సమానమైన, ఆట్టే మాట్లాడితే అంతకంటె మెరుగైన ప్రత్యేక ప్యాకేజీ యిస్తున్నారు అని డప్పేసి చెప్పారు. అదేదో సొంత జేబులోంచి మోదీ యిచ్చినట్లు అసెంబ్లీ తీర్మానం ద్వారా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య నాయుడికి సన్మానాల మీద సన్మానాలు చేశారు. ప్యాకేజీ డిటైల్స్ ఏమిటో చూడకుండా నోటిమాట మీద ఒప్పేసుకున్నారా? నిజంగా!? దానికి చట్టబద్ధత కల్పించండి అని అడగాలని కూడా తోచలేదా? హోదా కంటె ప్యాకేజి మెరుగని వాళ్లు చెప్పారు, మేం నమ్మాం అని యిప్పుడు చెప్తున్నారు.
ఈ ప్యాకేజీ ఏదో హోదా రాష్ట్రాలకూ దయచేయించి, హోదాలు సాంతం ఎత్తేయవచ్చుగా అని అడగలేదేం? నీతీశ్ కుమార్ ప్యాకేజీలు అక్కరలేదు, హోదా కావాలి అని అడిగినప్పుడైనా అనుమానం రాలేదేం? హోదా యిస్తామని చెప్పి, ఏడాదిన్నర తర్వాత యీ ప్యాకేజీ ఏమిటి? అని అడగలేదేం? పైగా హోదా యిస్తే ప్యాకేజీ యివ్వకూడదని లేదు కదా. రెండూ యివ్వండి అని అడగవచ్చు కదా. ఏమీ అడక్కుండా మూసుకుని కూర్చుని యిప్పుడు నమ్మి మోసపోయాం అంటే ఎలా? మీరు మీ కంపెనీలో ఒక మేనేజరును నియమించి మీ ఆర్థిక వ్యవహారాలు చూడమన్నాం.
నాలుగేళ్లు అయ్యాక 'నష్టాలు వచ్చేయండి, నేను నా మిత్రుణ్ని నమ్మి గ్యారంటీ యిచ్చాను, అతను ఎగ్గొట్టాడు' అని మేనేజరు అంటే ఊరుకుంటారా? ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకుని తమ వ్యవహారాలు చూసే బాధ్యత మీ చేతిలో పెట్టారు. మీరు వాళ్ల ఆస్తిపాస్తులకే కాదు, భవిష్యత్తుకు కూడా కస్టోడియన్. 'నేను నమ్మకద్రోహానికి బలయ్యాను, ఫలితం మీరు అనుభవించండి' అంటే ఒప్పుతుందా?
అవతలివాళ్లను నమ్మి మోసపోయే అమాయకుడా బాబు? జగన్ కైతే రాజకీయ అనుభవం లేదు కాబట్టి మోసపోయాడంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ యివ్వవచ్చు. అందుకే తనకు అత్యంత విశ్వాసపాత్రులనుకుని జగన్ నమ్మినవారు కూడా టిడిపిలోకి గోడ దూకేయగలిగారు. బాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజి యిలా నమ్మి మోసపోయిన సందర్భాలు లేవు. అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూనే ఉంది. నెట్వర్త్ పెంచుకుంటూనే ఉంది.
ఎటొచ్చీ ఆంధ్ర వర్తే నానాటికీ దిగజారుతోంది. దానికి కారణం కేంద్రమేననీ, వారిని నమ్మడం తన అమాయకత్వమే అనీ బాబు మనల్ని నమ్మమంటున్నారు. కేంద్రంలో తమరు కూడా భాగస్వామే కదా స్వామీ అంటే దానికి సమాధానం ఉండదు. మాట్లాడితే బిజెపితో మిత్రధర్మం పాటించామంటారు. ఆ మిత్రధర్మం రాజకీయపరమైంది. ఇవాళ వీళ్లతో, నిన్న మరొకళ్లతో, రేపు యింకోళ్లతో పాటిస్తూనే ఉంటారు. కానీ ఎన్నుకున్న ప్రజల పట్ల పాటించవలసిన ధర్మమనేది ఒకటి ఉంటుంది మహానుభావా! దాని సంగతేమిటి?
'అంటే విభజనతో నష్టపోయి రాజధాని, యిన్ఫ్రాస్ట్రక్చర్ లేని రాష్ట్రం కేంద్రంతో సున్నం పెట్టుకోవాలంటారా?' అని ఎదురు ప్రశ్నిస్తారు టిడిపి నాయకులు. ఏం పెట్టుకోకూడదా? ఎన్టీయార్ పెట్టుకోలేదా? పెట్టుకుని న్యాయంగా తనకు రావలసినది రాబట్టుకోలేదా? పొత్తు పెట్టుకున్న బిజెపి కాబట్టి యీ వాదన వినిపిస్తున్నారు. ఒకవేళ 2014లో కాంగ్రెసు కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేసేవారు? అప్పుడూ యిలాగే దేబిరిస్తూ కూర్చునేవారా? తప్పకుండా పోరాడే వారు. అదే యిప్పుడూ చేయండి. విభజన చట్టం ఒకటి ఉంది. దాన్ని అమలు చేయించుకోవడం కూడా రానివాళ్లు, హక్కుగా రావలసినది రాబట్టుకోవడం చేతకానివాళ్లు సమర్థపాలకులా? మాట్లాడితే కాంగ్రెసు అడ్డగోలుగా విభజించింది అనడం ఒక్కటే తెలుసు.
ఈ మధ్య బాబుగారికి కొత్తగా జ్ఞానోదయం అయింది. గతంలో 42 మంది ఎంపీలుండి బలంగా ఉండేవాళ్లంట. ఇప్పుడు చీలిపోయి, బలహీన రాష్ట్రమై పోవడం వలన కేంద్రం పట్టించుకోవటం లేదట. విభజన చేసి తీరాలని లేఖలు గుప్పించినప్పుడు లేదా యీ తెలివి? కట్టెలు కట్టగా కట్టి ఉంటే ఎవరూ విరవ లేకపోయారని, విడివిడిగా విడదీస్తే సులభంగా విరవగలిగారనే కథ చిన్నప్పుడు చదవలేదా? బాబుచే నిత్యం విమర్శించబడుతున్న ఆ 'దిక్కుమాలిన' విభజన బిల్లుకి తెలంగాణ టిడిపి ఎంపీల చేత జేజేలు కొట్టించిన దెవరు? కాంగ్రెసు చేసిన పాపంలో పాలు పంచుకుని బిల్లు పాస్ చేయించిన బిజెపితో పొత్తు పెట్టుకున్న దెవరు? ఓకే, 2014 నుంచే కేంద్రంతో పోట్లాడమని ఎవరూ చెప్పరు.
ఏడాదో, ఏడాదిన్నరో వేచి చూస్తారు. ఇక్కడ డబ్బులు విదల్చకుండా బిహార్ ఎన్నికల సమయంలో మోదీ వేలం పాడినట్లు వేల కోట్ల సాయం ప్రకటించినప్పుడే అర్థమై ఉండాలి, మోదీ తమను ఎలా చూస్తున్నాడో. అప్పుడైనా మేలుకోవాలిగా! నాలుగేళ్లు కాలయాపన చేసి యిప్పుడా శోకన్నాలు పెట్టడం?
ఇవన్నీ అడిగితే 'మరి వైసిపి ఏం చేస్తోంది?' అని అడుగుతున్నారు టిడిపి వారు. ఉద్యోగం యిచ్చింది తమకు. పని చేయాల్సింది తమరు. మీ ఉద్యోగం పీకేసి తన కిమ్మని రోడ్లంట పడి తిరుగుతున్నది వైసిపి. జీతభత్యాలు పుచ్చుకుంటూ చేయాల్సిన పనేమో తమరు చేయరు. పైగా ఆఫీసులోకి అడుగు పెట్టలేని ఆ నిరుద్యోగి ఏం చేస్తున్నాడని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా? వైసిపి బిజెపి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది అని అదేదో మహాపరాధంలా మాట్లాడతారు.
అదే అపరాధమైతే మరి నాలుగేళ్లగా బిజెపితో అంటకాగుతూ, కేంద్రంలో, రాష్ట్రంలో ఏకశయ్యాగతులుగా వున్న మీరెంత తప్పు చేస్తున్నట్లు? హోదా కోసం 2016లోనే రాజీనామా చేస్తామన్నారు కానీ చేయలేదు అంటున్నారు. తమరు యిప్పటికీ అనటం లేదుగా. అనాలని మా ఉద్దేశం కాదు. రాజీనామా చేయమనగానే వాళ్ల ఎంపీలు మీ పార్టీలోకి దూకేస్తారేమోనన్న భయం వైసిపీకి ఉండవచ్చు. లేకపోతే మరొకటి కావచ్చు, కేసులే కారణం కావచ్చు, మీరు విడాకులిస్తే మారుమనువు చేసుకోవడానికి దండట్టుకుని బిజెపి గుమ్మం దగ్గర కాపు కాస్తూ ఉండవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అంతెందుకు, మీరు బిజెపికి విడాకులివ్వండి, తక్షణం లౌకికవాద పార్టీలమని చెప్పుకునే పార్టీలన్నీ మీ గుమ్మం దగ్గరా దండట్టుకుని నిలబడతాయి.
కాషాయం నుంచి ఎఱ్ఱటి ఎరుపు దాకా మీరు ఎవరితోనైనా కాపురం వెలగబట్టగల సమర్థులు. వీటిపై ఔచిత్యవిచారణ చేయడం ప్రజల పని కాదు. వారు మిమ్మల్ని ఎన్నుకుని మా ప్రతినిథిగా మీరు మా హక్కులు రాబట్టండి బాబూ అన్నారు. రేపు ఓట్ల కోసం వెళ్లినపుడు నాలుగేళ్లలో ఏం చేశారు? అనే అడుగుతారు. దానికి మీ దగ్గర సమాధానం ఉందా? మీరు మోసపోయారా? మోసపుచ్చుతున్నారా? మోసపుచ్చామని ఎలాగూ ఒప్పుకోరు. మోసపోయాం. బిజెపి ద్రోహం చేసింది అంటారా? దానికి ప్రతిక్రియగా ఏం చేస్తున్నారో చెప్పండి. దయచేసి యీ విషయాలు లీకేజీల రూపంగా కాకుండా బాబుగారి స్పష్టమైన ప్రకటన ద్వారా తెలపండి.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]