గంజాయి వనంలో తులసి మొక్కలుంటాయా? ఉంటాయి. కాని గంజాయి కనిపించినంతగా తులసి మొక్కలు కనబడవు. ఎప్పుడో అప్పుడు పవిత్రతను చాటుకుంటూ బయటపడతాయి. అప్పుడు చూసి ఆశ్చర్యపోవడం మన వంతు. 'లోకంలో కొందరైనా మంచివారుండబట్టే ప్రపంచం ఈ మాత్రమైనా ఉంది' అని కొందరు పెద్దలు అంటుంటారు. ప్రస్తుతం దేశంలో గంజాయి వనం చిక్కగా అల్లుకుపోయింది.
దాన్ని పీకి కాల్చి బూడిద చేయాల్సిన పాలకులు కూడా గంజాయి (అవినీతి, అక్రమాలు) మనుషులతో కుమ్మక్కు అవుతున్నారు. వారేం చేసినా పట్టించుకోవడంలేదు. 'అరే…స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు ఊడ్చుకుంటూ ఉండటమే అనుకున్నా. బ్యాంకులను కూడా ఊడ్చిపెట్టడమని ఇప్పుడు తెలుస్తోంది'..అని వాట్సప్‌లో ఒకాయన జోక్ పంపాడు. కొన్ని రోజులుగా బయటపడుతున్న వేల కోట్ల బ్యాంకు కుంభకోణాలకు ఇది అద్దం పడుతోంది.
బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకోవడం, ఎగ్గొట్టి రాత్రికి రాత్రి దేశం వదిలి పారిపోవడం ఆనవాయితీగా మారిపోయింది. నిజానికి రాత్రికి రాత్రి వెళ్లిపోవడంలేదు. అన్నీ సెట్ చేసుకొని, పాలకుల సహకారంతోనే దేశం విడిచిపోతున్నారు. పారిపోయినవారిని దేశానికి రప్పించి శిక్షించే దమ్ము, సామర్థ్యం మన పాలకులకు లేవు.
విజయ్‌మాల్యా, నీరబ్ మోదీ, విక్రమ్ కొఠారీ బ్యాంకులను ఊడ్చేసిన ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు పెదవి విప్పలేదు. అత్యంత పురాతనమైన పంజాబ్ నేషనల్ బ్యాంకు (1894లో స్థాపితం)లో నగల వ్యాపారి నీరబ్ మోదీ చేసిన 11,400 కోట్ల కుంభకోణం ఆ బ్యాంకు చరిత్రలోనే అతి పెద్దది. ఈ డబ్బు రికవరీ అవుతుందా? నీరబ్ మోదీని దేశానికి రప్పించి శిక్షిస్తారా? ఎవ్వరూ చెప్పలేరు. ఈ కుంభకోణం నేపథ్యంలో ఓ తులసి మొక్క కథ బయటకు వచ్చింది. ఆ కథ ఈ బ్యాంకుకు సంబంధించిందే.
ఆ తులసి మొక్క దేశ రెండో ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి. ఈయన నీతి నిజాయితీ ఎలాంటివో ఈ తరంవారికి తెలియకపోవచ్చు. శాస్త్రి ప్రధానిగా అత్యంత క్రమశిక్షణతో నడుచుకున్నారు. నైతిక విలువలు కచ్చితంగా పాటించారు. ప్రధానిగా ఆయనకు ప్రభుత్వ వాహనం ఉన్నప్పటికీ దాన్ని సొంత అవసరాలకు వాడుకోవడం ఇష్టం లేదు. పిల్లలు పాఠశాలకు టాంగాలో వెళ్లేవారు.
ఎప్పుడైనా అత్యవసరమైతే ఆఫీసు కారు వాడేవారు. శాస్త్రికి అది తప్పనిపించింది. దీంతో కారు కొనుక్కోవాలనుకున్నారు. అప్పట్లో కొత్త ఫియట్ కారు ధర 12 వేలు. శాస్త్రీజీ దగ్గర ఏడు వేలున్నాయి. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ఐదు వేలు అప్పుగా తీసుకోవాలనుకొని దరఖాస్తు చేశారు. ప్రధాని కాబట్టి బ్యాంకు అధికారులు వెంటనే రుణం మంజూరు చేశారు.
అప్పుడు ప్రధాని 'సామాన్య ప్రజలకూ ఇలాగే వెంటనే రుణం ఇవ్వండి' అని సలహా ఇచ్చారు. ఆయన 1966లో తాష్కంట్‌లో మరణించిన తరువాత బ్యాంకు అధికారులు రుణం గురించి లాల్‌బహదూర్ భార్య లలితా శాస్త్రికి తెలియచేశారు. ఆమె తనకొచ్చే పెన్షన్ నుంచి వాయిదాల పద్ధతిలో బ్యాంకు రుణం తీర్చారు. 1964 మోడల్ ఫియట్ కారు ఇప్పటికీ ఢిల్లీలోని లాల్‌బహదూర్ మెమోరియల్‌లో ఉంది. బ్రిటిష్ పాలనలో పంజాబ్ నేషనల్ బ్యాంకును స్థాపించింది స్వాతంత్య్ర సమర యోధులే. ఈ బ్యాంకు డైరెక్టర్లలో లాలా లజపతి రాయ్ ఒకరు.