ఓ కార్టూన్ ఉంది. ఓ చిన్నపిల్లాడు తండ్రిని అడుగుతూంటాడు – 'పక్కింటావిణ్ని పిన్నీ అని పిలవమని నువ్వంటావు, అమ్మేమో అత్తయ్యా అని పిలవమంటుంది. ఏమని పిలవాలో యిద్దరూ కలిసి ఒక్క మాట అనుకుని నాకు చెప్పండి' అని. ఇప్పుడు బిజెపి బాబుగారిని అదే అడుగుతోంది. మేం సాయం చేశామా? లేదా? కరక్టుగా ఒక్క మాట మీద నిలబడు అని. ఇక్కడ బాబే ఆ పిల్లాడి తల్లీ, తండ్రీ పాత్రలు పోషించేస్తూ రెండు నాలుకలతో మాట్లాడుతున్నారు. ఆయన బిజెపిని నంది అన్నప్పుడల్లా ప్రజలు నంది అనాలని, పంది అన్నప్పుడల్లా పంది అనాలని చెప్తూ వచ్చారు. ఆ చిన్న పిల్లాడిలా ఆంధ్ర ప్రజలు అయోమయంలో పడ్డారు.
ఇప్పుడు బిజెపి యీ రెండు నాలుకల ధోరణికి స్వస్తి చెప్పమంటోంది. మేం రాష్ట్రానికి దోహదపడ్డామా? ద్రోహం చేశామా ఒక్క నాలుకతో చెప్పండి చాలు అంటోంది. 'చెయ్యలేదని యిప్పుడంటున్నారు. మరి ఏడాది క్రితం మీరే అన్నారు కదా 'ఏ రాష్ట్రానికి యివ్వనంతగా మనకు యిచ్చింది' అని. 'ఇంతకంటె ఎవరూ ఏమీ చేయలేరు' అని మీ కేంద్రమంత్రే అన్నారుగా. అదంతా పత్రికల్లో వచ్చింది కదా. అప్పటి మాట నిజమా? యిప్పటి మాట నిజమా? ఏదో ఒకటి నిజమైతే మరొకటి అబద్ధమేగా' అని లాజిక్ లాగుతోంది. ఇది నిజంగా యిరకాట పరిస్థితి.
ఆంధ్రరాష్ట్ర పరిస్థితి ఏమిటో తెలుసుకుందామని బాబు స్టేటుమెంట్ల మీద మాత్రమే ఆధారపడితే పిచ్చెక్కడం ఖాయం. అడ్డగోలుగా విభజించారు, కట్టుబట్టలతో రోడ్డు మీద పడేశారు, నానా అవస్తలూ పడుతున్నాం అని కాంగ్రెసుని తిడతారు. హోదా ఇవ్వలేదు, ప్యాకేజీ యిస్తామంటే సరిపెట్టుకున్నాం, తీరా చూస్తే అదీ యివ్వలేదు, రాజధాని కట్టుకోవడానికి డబ్బివ్వలేదు, పోలవరానికి డబ్బివ్వటం లేదు, వెనుకబడిన ప్రాంతాలకు యిస్తామన్నది యివ్వలేదు, మొదటి ఏడాది బజెట్ లోటు తీర్చలేదు, ఎన్నిసార్లు దిల్లీ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోతోంది, నిధులు విదల్చటం లేదు అని బిజెపిని తప్పు పడుతున్నారు.
నాకెంతో చేద్దామని ఉంది, కానీ చేయనివ్వటం లేదు అని జనం దగ్గర వాపోతున్నారు. అదే నోటితో నా హయాంలో ఆంధ్రలో పాలన వెలిగిపోతోంది. మన జిడిపి దేశపు సగటు జిడిపి కంటె ఎక్కువ. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. పదేళ్లలో టాప్ రాష్ట్రంగా చేస్తాను అంటున్నారు. ప్రత్యేక హోదా అనవసరం, అజాగళస్తనం, ముగిసిన అధ్యాయం అని కాస్సేపు అంటారు. అది మన హక్కు దానికోసం పోరాడతా అని యివాళే అన్నారు. ప్యాకేజీ యిచ్చారని కాస్సేపు అంటారు, ఇస్తానన్నారు కానీ యివ్వలేదని యింకోసారి అంటారు. బిజెపి మన కెంతో చేస్తోంది.
మీరు అనవసరంగా గోల చేసి వచ్చేది చెడగొట్టకండి, నా దారికి అడ్డు రాకండి అని ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను, ఉద్యమకారులను తిట్టారు. ఈ మధ్య కాలంలో తన ఎంపీల అర్ధనగ్న ప్రదర్శనలు చేయించి, మరో ఎంపీ చేత మమ్మల్ని మోసగించలేరు అని ప్రధానిని హెచ్చరించేట్లా చేశారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా యివ్వలేదేమని కాంగ్రెస్ ఎంపీ ఖర్గే నిలదీస్తూ ఉంటే టిడిపి ఎంపీలు వెక్కిరించారు, మోదీ సమయసందర్భాలు లేని ప్రసంగం చేసి, ఆంధ్రకు సాయం చేయడం గురించి ఒక్క ముక్క మాట్లాడకుండా ఊరుకున్నా కిక్కురుమనలేదు.
ఈ ద్వంద్వ వైఖరిని ఎండగట్టడానికి సోము వీర్రాజు రంగంలోకి దిగారు. గంటల తరబడి టీవీలో కనబడి, తన పార్టీ ఏం యిచ్చిందో చెప్తానంటూనే బాబు ఆస్తిపాస్తులతో సహా చాలా వాటిపై బోల్డు ప్రశ్నలు సంధించారు. ఇదేదో ఆయన సొంత ప్రజ్ఞ అనుకోవడానికి లేదు. బిజెపి అధిష్టానం కనుసన్నలలోనే మొత్తమంతా జరిగిందనుకోవాలి. వీర్రాజు మొదటి నుంచీ టిడిపిని వ్యతిరేకించే వ్యక్తి కాబట్టి ఎఫెక్ట్ చాలలేదనుకున్నారేమో, టిడిపికి అత్యనుకూలుడైన కంభంపాటి హరిబాబు చేత కూడా తాము ఏమేం యిప్పించారో చెప్పించారు. అవన్నీ అబద్ధాలంటూ టిడిపి నాయకులు ఎదురుదాడి చేశారు.
వారిపై బిజెపి ప్రతి దాడి చేశారు. మధ్యలో ప్రజలు గందరగోళంలో పడ్డారు. ఎవరు నిజం చెప్తున్నారో తెలుసుకోవాలని కుతూహల పడ్డారు. ఆ కుతూహలాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ నిజనిర్ధారణ కమిటీ వేసి, మేధావులను సంగతి తేల్చమన్నారు. వేరే ఏ రాష్ట్రం విషయంలోనూ యిలాటి కమిటీ ఉండి ఉండదు. అంకెలనేవి అంకెలే కదా, పార్లమెంటులో అడగవచ్చు, అసెంబ్లీలో అడగవచ్చు, సమాచార హక్కు కింద అడగవచ్చు. ఎంత యిస్తామన్నారు? ఎంత యిచ్చారు? ఏ పద్దు కింద ఎంత యిచ్చారు? అన్నీ స్పష్టంగా ఉంటాయిగా.
మరి యింత గలభా దేనికి? రెండు అభిప్రాయాలుండడానికి తావెక్కడ? అంటే ఎవరో ఒకరు అబద్ధమాడుతున్నారని అనుకోవాలా? రాజకీయ భాగస్వాములై ఉండి, టిడిపి ఎంపీలు కేంద్ర కాబినెట్‌లో ఉంటూ, బిజెపి ఎమ్మెల్యేలు రాష్ట్రకాబినెట్‌లో ఉంటూ నిజానిజాలు కనిపెట్టలేరా? కనిపెట్టినా యిద్దరు మిత్రులూ కలిసి ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారా? రెండేళ్ల క్రితమే మన కొచ్చే సాయంపై అమిత్ షా చెప్పే అంకెలకు, అరుణ్ జేట్లే చెప్పే అంకెలకు పొంతన లేకుండా ఉందండి అని బాబుకి ఎత్తి చూపినా లాభం లేకపోయింది. తామేం చేస్తున్నామో ఆ యా పార్టీలకు స్పష్టత ఎప్పుడో ఉంది. కమిటీ అంటూ వేశారు కాబట్టి వాళ్లు తేల్చి చెపితే ప్రజలకూ స్పష్టత వస్తుంది. వచ్చాక అప్పుడు చర్చించుకోవచ్చు.
ఈ లోపున నాకు స్థూలంగా అర్థమైన దేమిటంటే బిజెపి లక్షల కోట్లంటూ ఉంటే టిడిపి వేల కోట్లని ఎందుకంటోందంటే అది యిస్తానన్న అంకె, యిది యిచ్చిన అంకె అయి ఉండవచ్చు. మొదటి సంవత్సరం బజెట్ లోటు గురించి కాగ్ యింత అని తేల్చినా, ఆ అంకె బిజెపి యివ్వకపోయినా టిడిపి ఊరుకుంది. ఎందుకని అని అడిగితే నికరమైన లోటు విషయంలో మేమూమేమూ అంటే కంభంపాటి హరిబాబుగారు, యనమల రామకృష్ణుడు గారు కూర్చుని పెద్దమనుషుల ఒప్పందానికి వచ్చి ఓ అంకెకు సరే అనుకున్నాం అంటున్నారు.
అలా రావడానికి ఇది మీ సొంత విషయం కాదు, రాష్ట్రప్రజలకు రావలసిన డబ్బు. దాని విషయంలో బేరసారాలేమిటి? ఇంతకీ ఆ ఒప్పుకున్న సొమ్ము కూడా రాలలేదట. వెనుకబడిన ఏడు జిల్లాలకు కలిపి ఒక్క జిల్లాకు యివ్వాల్సిన మొత్తం యిచ్చారు. అదే మహద్భాగ్యం అనుకోమంటోంది బిజెపి. అదేమన్నా గొప్పా, దేశంలో మరో 150 జిల్లాలకూ యిలాగే యిచ్చారు, మాకు ప్రత్యేకంగా ఒరగబెట్టినదేముంది అంటున్నారు టిడిపి వారు. ఆ జిల్లాలలో యిచ్చిన పన్ను రాయితీలను ఉపయోగించుకుని పరిశ్రమలు తెచ్చుకోలేక పోయారు. మీకు హోదా యిచ్చినా ఏం సాధించి ఉండేవారు? అని బిజెపి ప్రశ్న.
ఇక రాజధాని గురించైతే చెప్పనే అక్కరలేదు. అనేకసార్లు అనుకున్నాం. ఆంధ్రులు రాష్ట్ర విభజన కోరలేదు, కేంద్రం వాళ్ల నెత్తిన రుద్దింది. అందువలన రాజధాని కట్టాల్సిన బాధ్యత వాళ్లదే. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో తిష్ట వేసి, వాళ్ల చేత కట్టించుకున్నాకే కదిలి వుంటే సరిపోయేది. పదేళ్లలో వాళ్లు చచ్చినట్లు పూర్తి చేసి ఉండేవారు. లేకపోతే ఉమ్మడి రాజధాని హక్కులు మరో ఐదేళ్లు పెంచేవారు. రాజధాని తయారయితే పక్క హంగులు ప్రయివేటు పెట్టుబడులతో సమకూరేవి.
ముఖ్యమంత్రి యితర అభివృద్ధి పనుల మీద దృష్టి పెడితే పోయేది. కానీ బాబుకి ఎంతసేపూ కట్టడాల మీదే యావ. సైబరాబాదు కడితేనే అంత పేరు వచ్చింది, ఏకంగా హైదరాబాదు లాటిది కడితే యింకెంత పేరు వస్తుందోనన్న లెక్క. రాష్ట్ర విభజన ప్రకటన రాగానే మనమంతా అయ్యో, విడిపోతున్నామా అనుకున్నాం కానీ ఆయన మాత్రం 'కొత్త రాజధానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలి' అని ఉబలాటపడ్డారు. అప్పుడు తలకెక్కిన భూతం యిప్పటికీ దిగలేదు.
శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు పక్కన పెట్టారు, ప్రభుత్వ భూములున్న చోట కాకుండా పచ్చటి వ్యవసాయభూములు తీసుకుని రాజధాని కడతానని మొదలుపెట్టారు. వాజపేయి హయాంలో విడిపోయిన రాష్ట్రాల రాజధానులే నిధుల కొరతతో యింకా పూర్తి కాలేదు కానీ యీయన మాత్రం యీ హయాంలోనే కళ్లు చెదిరే రాజధాని కట్టేస్తానని బయలుదేరాడు.
రాజధాని విషయంలో ఆది నుంచీ వివాదాలే. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె చందంగా అలా కడతా, యిలా కడతా అంటూ గొప్ప కబుర్లు. బిజెపి వాళ్లు చూసిచూసి ఆలస్యంగానైనా అడిగేశారు – ఇల్లు కడతామంటే డబ్బిస్తారు కానీ మయసభ కడతామంటే యిస్తారా? అని. దేశంలో ఏ రాష్ట్రానికైనా చంద్రబాబు ప్లాను వేస్తున్న స్థాయిలో రాజధాని ఉందా? తిప్పితిప్పి కొడితే 25 మంది ఎంపీలున్న రాష్ట్రానికి యింత రాజధాని అవసరమా? అని కేంద్ర సెక్రటేరియట్‌లో అధికారులు ముక్కున వేలేసుకోరా? ప్లాను గీయడానికి, కట్టడానికి దేశంలో ఏ కంపెనీ పనికి రాదా? సింగపూరు వాళ్లు, జపాన్ వాళ్లు, లండన్ వాళ్లు…! మైగాడ్.
చివరకు ఆర్కిటెక్టులు, ఇంజనియర్లు కూడా పనికి రాక సినిమా డైరక్టర్లతో సంప్రదింపులా? ఈ లోగా సింగపూరుకు రైతులను పంపడమా? కట్టింది, పెట్టిందీ ఏదీ లేదు కానీ మూడుసార్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రజలందరి చేత పూజాపునస్కారాలూ. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రయినా యింత హంగామా చేశారా? విభజనతో రోడ్డు మీద పడిన రాష్ట్రానికి యిది తగునా? శాశ్వత భవనాలు కట్టడానికి టైము పడుతుంది కాబట్టి తాత్కాలిక భవనాలంటూ కట్టడమా? పైగా వాటిలోనే లోపాలా? ఈ నైపుణ్యంతోనే అంత పెద్ద రాజధానికి పథకాలు వేస్తున్నారా స్వామీ?
తన కలలు సాకారం కాకుండా బిజెపి అడ్డుపడుతోందని టిడిపి గగ్గోలు పెడుతోంది. రాజధాని గురించి డిపిఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) యివ్వలేదని బిజెపి అంటోంది. ఇచ్చారా? అని అడిగితే టీవీ చర్చల్లో టిడిపి ప్రతినిథిని అడిగితే 'డిజైన్‌పై ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నాం, అలా సేకరించడం తప్పంటారా?' అని వాదించారు. రాజధాని విషయంతో ఆపుతారా, నదులపై వంతెనలు, డ్యామ్‌లు కూడా ఎలా కట్టాలో కూడా ప్రజల్ని అడిగే నిర్ణయిస్తారా? ఈ నిజనిర్ధారణ కమిటీ డిపిఆర్ గురించి కూడా చెప్తే బాగుండును.
ఎందుకంటే మంత్రి నారాయణ గారు ఫిబ్రవరి మొదటివారంలో 'డిపిఆర్ పంపాం' అన్నారు కానీ ఎప్పుడు పంపారో చెప్పినట్టు లేదు. పైగా ఆయన 11,600 కోట్లకు పంపాం అంటున్నారు. లక్షల కోట్లతో రాజధాని అని ఓ పక్క ప్రజలకు బాబు చెప్తూ ఉంటే మరి లక్షలో తొమ్మిదో వంతు బజెట్‌తో డిపిఆర్ ఏమిటి? అబ్బే, అది ప్రభుత్వ భవనాలకోసం అన్నారు నారాయణ. మరి షాపింగ్ మాల్స్‌కు, డాన్సింగ్ హాల్స్‌కు ఎప్పుడు పంపిస్తారో ఏమో! ఇక ఖర్చు చేసిన నిధుల గురించి కేంద్రం 1500 కోట్లు అమరావతికై, మరో 1000 కోట్లు విజయవాడ, గుంటూరు డ్రైనేజీలకై యిచ్చింది.
వాటి తాలూకు యుసి (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు)లు పంపేశాం అన్నారు. కేంద్ర ఫైనాన్సు శాఖ అధికారి 1583 కోట్ల ఖర్చుకి మాత్రమే యుసిలు వచ్చాయంటున్నారు. బిజెపి నాయకులనేది ఏమిటంటే 'రాజధానికై మేం యివ్వాల్సింది 3500 కోట్లు మాత్రమే. దానిలో 2500 ఆల్‌రెడీ యిచ్చేశాం' అని కేంద్ర ఫైనాన్సు శాఖ వారు మాకు చెప్పారు అని.
పోలవరం గురించి – అది కేంద్ర ప్రాజెక్టు. అంతర్రాష్ట వివాదాల కారణంగా ఆలస్యమై ఖర్చు పెరిగితే వాళ్లే భరించేవాళ్లు. దాన్ని రాష్ట్రప్రభుత్వం తన నెత్తిమీద ఎందుకు వేసుకున్నట్లు? చెప్పానుగా బాబుకి నిర్మాణాలపై ఆసక్తి. తామైతే త్వరగా కట్టేయవచ్చని బాధ్యత తీసుకున్నారట. సహాయపునరావాస పనులకై నిధులివ్వమంటారు. ఐదులక్షల యిళ్లు మేం కట్టిస్తామన్నాం కదా అంటోంది బిజెపి. ఎన్నికలకు ముందు కాఫర్ డ్యామ్ కట్టేసి కాస్తయినా పేరు తెచ్చుకోవాలని బాబు తాపత్రయమైతే, అది అనవసర ఖర్చు అంటుంది కేంద్రం. ఏతావతా పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఇది చాలనట్లు పట్టిసీమ ఒకటి తెచ్చిపెట్టుకున్నారు బాబు.
అమరావతికి నీళ్లివ్వాలనే పథకంతో, రాయలసీమ పేరు చెప్పి, ముందస్తు అనుమతులు లేకుండా పట్టిసీమ పనులు చేపట్టారు. అదీ నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టులు కట్టబెట్టారు. పోలవరంలో అంతర్భాగం అన్నారు. కాదంటుంది కేంద్రం. వైజాగ్, విజయవాడలో మెట్రో యివ్వలేదంటారు. హైదరాబాదు మెట్రోకే గిరాకీ లేదు, ఆ ఊళ్లల్లో ఎవరెక్కుతారు? ఇక గొప్పగా చెప్పుకుంటూ వస్తున్న అమరావతి-అనంతపురం హైవే ఫిబ్రవరి 1న అటకెక్కింది. దానికి 100% నిధులిస్తామని చెప్పిన కేంద్రం భూసేకరణకు అయ్యే మూడూ మూడున్నర వేల కోట్ల ఖర్చు మీరు పెట్టుకుంటేనే.. అంది. మా వల్ల కాదంది రాష్ట్రం. అయితే అది తూచ్ అంది కేంద్రం.
నా కర్థమైనంత వరకు సింపుల్‌గా చెప్పాలంటే – బాబుకి కావలసినది డబ్బు. తను అడిగినంతా వాళ్లు నోరెత్తకుండా యిస్తూ పోవాలి. బిజెపి దానికి సిద్ధంగా లేదు. పద్ధతి ప్రకారం యిస్తానంటూ యిన్‌స్టిట్యూషన్‌లను మధ్యలో పెట్టింది. వాళ్లు ఇచ్చినదానికి లెక్కలడుగుతున్నారు. అనుమతులు ఉన్నాయా అంటున్నారు. ఇదిగో మీకు యింత శాంక్షన్ చేశాం. (ఆ అంకెలే బిజెపి నాయకులు వల్లిస్తున్నారు) పాత బిల్లులు చూపించి పట్టుకెళ్లండి అంటున్నారు. అక్కడే టిడిపి తడబడుతోంది. అందుకే శ్వేతపత్రం విడుదల చేయకుండా నాయకుల ప్రకటనలతో కాలక్షేపం చేస్తోంది.
ఆంధ్రపై మేం పెట్టిన ఖర్చు అంటూ బిజెపి వాళ్లు చూపిస్తున్న అంకెలు రోడ్లు గట్రా మౌలికవసతుల నిర్మాణానికి ఖర్చు పెట్టినది. బిజెపి ప్రభుత్వం వచ్చాక దేశవ్యాప్తంగా దానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. యుపిఏ హయాంలో రోజుకి 11 కి.మీ. నేషనల్ హైవే వేస్తే మా హయాంలో రోజుకి 22 కి.మీ.లు వేస్తున్నాం అని మోదీ మొన్ననే చెప్పుకున్నారు. అలాగే యుపిఏ 1100 కి.మీ.ల కొత్త రైల్వే లైన్లు వేయగా, మేం మూడేళ్లలో 2100 కి.మీ.లు వేశాం అని కూడా చెప్పుకున్నారు. అది అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నదే కదా, మాకై ప్రత్యేకంగా చేసినదేముంది అని టిడిపి పెదవి విరుస్తోంది.
ఇదే నిజమైతే బిజెపిది యిందులో తప్పు కనబడదు. ఉదాహరణకి రవీంద్రభారతి వంటిది జిల్లాకు ఒకటి కడతానని బాబు ప్రకటించారనుకోండి. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లా కలక్టరు అన్ని రకాల నిధులను మళ్లించి ఓ అద్భుతమైన ఆడిటోరియాన్ని ముందస్తు అనుమతులు లేకుండా మొదలుపెట్టి సగంలో ఆపి, నిధులు యింకా కావాలని అడిగానుకోండి. ఇప్పుడు కేంద్రం అడిగిన ప్రశ్నలే బాబు ఆయన్ను అడగరా? కేంద్రాన్ని ఎదిరించడానికి బాబు యింకా సంశయిస్తున్నారు కాబట్టి, యీ బిల్లుల విషయంలో టిడిపి లోపం ఏదో ఉందేమో ననిపిస్తుంది. పాత లెక్కలు అడగడం పాతకమా? మేం కట్టే పన్నులతోనే కేంద్రం నడుస్తోంది. మాది మాకివ్వడానికి ఏం తీపు? అన్నట్లు టిడిపివాళ్లు అడుగుతున్నారు.
మరి బాబు కూడా ఓటర్లను అడగలేదా? నేనేసిన రోడ్లపై నడుస్తూ, నేనిచ్చిన పింఛన్ తింటూ.. అని! వాళ్లూ అడగవచ్చుగా – 'మీ జేబులోంచి యిస్తున్నారా? మేం కట్టిన పన్నుల్లోంచేగా' అని. నిధుల వినియోగంపై నిర్ణయించేది ఆ యా ప్రభుత్వాలే. కేంద్రం నుంచి వచ్చిన నిధులను చంద్రన్న కానుకలగా ఖర్చు పెట్టేరంటే బాబుకి ఆ అధికారం యిచ్చింది ప్రజలే. ప్రారంభోత్సవాలకు, పుష్కరాలకు, పబ్లిసిటీకి వందల, వేల కోట్లు ఖర్చు పెట్టేసి, యింకా యింకా కావాలంటే కేంద్రం యిస్తుందా? వాళ్ల అధికారం వాళ్లు వినియోగిస్తున్నారు. దానిలో తప్పుంటే కోర్టుకి వెళ్లవచ్చు.
నిధుల వినియోగం సవ్యంగా సాగకపోయినా యిన్నాళ్లూ చూస్తూ ఊరుకుని యిప్పుడు రాగం అందుకుంది బిజెపి. మిత్రధర్మం కోసం ఆగాం అంటారా? మరి ప్రజల పట్ల ధర్మమంటూ ఉండదా? 'న ఖానే దూంగా..' అన్న మోదీ యిమేజి ఏమవుతుందోనన్న బెంగ లేదా? టిడిపి నిజంగా తప్పు చేస్తూ ఉంటే చర్యలకు ఉపక్రమించి ఉండాల్సింది. నిలదీయాల్సింది. మీరేం యివ్వలేదు అన్న విమర్శ వచ్చాక స్పందించడం కాదు. మీ అంతట మీరే, టిడిపి సవ్యంగా వ్యవహరించటం లేదు అని ఉద్యమించి ఉండాల్సింది. అప్పుడు మీకు క్రెడిబిలిటీ ఉండేది. ఇదొక్కటే కాదు, ఉమ్మడి ఆస్తుల విభజన విషయంలో కూడా ఆంధ్రకు అన్యాయం జరిగింది.
విభజన బిల్లులో భాగస్వాములైన మీకు, విభజన సవ్యంగా జరిగేట్లా చూసే బాధ్యత ఉంది. అది నెరవేర్చడానికి అధికారం లభించింది. కానీ అనేక విషయాల్లో ఆంధ్ర పట్ల ఉపేక్ష వహించారు. ఏదైనా మేలు చేస్తే, అది బాబు ఖాతాలో పడిపోతుందన్న భయం చేత అలా స్తబ్ధంగా ఉన్నారన్న మాట ఒకటి ప్రచారంలో ఉంది. అది నిజమో కాదో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతా ఉంది. బాబుకి స్థానిక మీడియా దన్ను ఉంటే, మీకు జాతీయ మీడియా దన్ను ఉంది. బాబుపై కోపం లేదా అసూయ ఉంటే శిక్ష ఆంధ్ర ప్రజలకా? ఋణమాఫీ విషయంలో ఆంధ్ర పట్ల కఠినంగా ఉన్న మీరు, మీరు పాలింటే కొన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. ఏమిటీ ద్వంద్వ వైఖరి?
ఈ ప్రశ్నలకు బిజెపి ఎలా సమాధానం చెప్తుందో చూడాలి. ఇప్పటికైతే వాళ్లు చెప్తున్నది – మేం రాష్ట్రానికి ఎంతో చేశాం. దానికి సాక్ష్యం బాబు, సుజనా చౌదరి యిత్యాదుల ప్రకటనలే. ఇన్నాళ్లూ మమ్మల్ని ప్రశంసించి, యిప్పుడు నిరసిస్తున్నారంటే దానికి కారణం – మేం అసెంబ్లీ సీట్ల పెంపుకి ఒప్పుకోక పోవడమే అని కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. బాబుకి అది మరొక వీక్ పాయింట్ అయిపోయింది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరచాలని ఎవరు అడిగారో తెలియదు కానీ విభజన చట్టంలో దాన్ని చేర్చింది కాంగ్రెసు. దాని ప్లాను ఏమిటో, దానివలన ప్రజలకు ఒనగూడే ప్రయోజనం ఏమిటో తెలియదు.
దాన్ని చూపించి బాబు, కెసియార్ మాత్రం అవతలి పార్టీల నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించారు. సీట్లు పెరిగితే సొంత పార్టీ వాళ్లను, ఫిరాయింపుదారులను యిద్దరినీ తృప్తి పరచవచ్చని లెక్కలు వేశారు. విభజన చట్టంలో ఉన్న తక్కిన అంశాల గురించి పెద్దగా పోరాడకపోయినా, దీని గురించి తెలుగు ముఖ్యమంత్రులిద్దరూ పదేపదే కేంద్రానికి గుర్తు చేశారు. వాళ్లని అలా ఊరిస్తూ, ఊరిస్తూ వచ్చిన బిజెపి తాజాగా యిప్పట్లో లేదని తేల్చేశారు. పెరక్కపోతే పార్టీలో లుకలుకలు వస్తాయేమో, టిక్కెట్లు యివ్వకపోతే వలసపక్షులు అవతలి పార్టీకి ఎగిరిపోతాయేమోనన్న బెంగ పట్టుకుంది ముఖ్యమంత్రులకు. ప్రతిపక్షం బలంగా ఉన్న ఆంధ్రలో మరీనూ. తనను యిలా యిబ్బంది పెట్టిన బిజెపిపై కోపంతోనే బాబు యిప్పుడు ధ్వజమెత్తారని బిజెపి నాయకుల ఆరోపణ.
ఈ ధ్వజమెత్తడం కూడా స్థిరంగా ఉండటం లేదు. మధ్యమధ్యలో ధ్వజాన్ని దించేస్తూన్నారు. రెండు నాల్కల ధోరణి యిప్పటికీ వదలలేదు. బిజెపిపై నింద మానలేదు. పోరాటం చేస్తున్నామంటారు. ఎలాటి పోరాటం స్వామీ అంటే చెప్పరు. మీ కేంద్ర మంత్రులను, ఎంపీలను రాజీనామాలు చేయమనండి అంటే వాటి వలన ప్రయోజనం లేదంటారు. కేంద్రప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టండి అని సలహా వస్తే దాని వలన లాభం లేదంటారు. ఆఖరి అస్త్రం అంటారు, అదెప్పుడు వేస్తారో తెలియదు. ఈ నాటకంలో ఆఖరి అంకం ఎప్పుడో యింకా తెలియదు. ఈ లోగా టిడిపి-వైసిపి-బిజెపి మూడు ముక్కలాట సాగుతోంది. మధ్యలో ఉన్న పవన్ ఎవరి తరఫు తురుఫు ముక్క? దాని గురించి వచ్చే వ్యాసంలో.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]