యుపిలో మతమార్పిడులు

ఆగ్రాలో మతమార్పిడులు జరిగాయని పార్లమెంటులో యీ వారం చర్చకు వచ్చింది. సాధారణంగా యీ అంశాన్ని లేవనెత్తేది బిజెపి. దీని కారణంగా మైనారిటీల సంఖ్య పెరిగిపోతోందని, వీటిని నిషేధించాలని కోరుతూంటుంది. కానీ యీసారి ఎస్‌పి, కాంగ్రెసు,…

ఆగ్రాలో మతమార్పిడులు జరిగాయని పార్లమెంటులో యీ వారం చర్చకు వచ్చింది. సాధారణంగా యీ అంశాన్ని లేవనెత్తేది బిజెపి. దీని కారణంగా మైనారిటీల సంఖ్య పెరిగిపోతోందని, వీటిని నిషేధించాలని కోరుతూంటుంది. కానీ యీసారి ఎస్‌పి, కాంగ్రెసు, ఆర్జెడి, టిఎంసీ లేవనెత్తాయి – ఎందుకంటే ముస్లిములను హిందువులుగా మారుస్తున్నారు కాబట్టి! మతం మార్చుకునే స్వేచ్ఛ వుండాలని గతంలో వాదించేవారు యిప్పుడేం చేస్తారో చూడాలి. ఇతర మతస్తులు హిందువులుగా మారడం ఎప్పుడూ జరుగుతూనే వచ్చింది. జైనం, బౌద్ధం హిందూమతం నుండే విడివడ్డాయి. కొన్ని శతాబ్దాలపాటు అవి ప్రాచుర్యంలో వున్నాయి. తర్వాత వాటి ప్రాబల్యం క్షీణించి ఆ మతానుయాయులు హిందువులుగా మారారు. విదేశాల నుంచి దండెత్తి వచ్చిన హూణులు, శకులు, కుషానులు, యవనులు వంటి అనేక తెగల వారు తాము అప్పటివరకు అవలంబిస్తున్న మతాన్ని వదులుకుని హిందూమతాన్ని స్వీకరించారు. ఇటీవలి కాలంలో కూడా అనేకమంది విదేశీయులు హిందువులుగా మారి హిందూ పేర్లను పెట్టుకోవడం చూస్తూనే వున్నాం. అయితే యీ నాటి సంఘటనకు యింత ప్రాముఖ్యత ఎందుకు కలిగిందంటే – యివి నిర్వహించిన హిందూ సంస్థ వెనక బిజెపి వుందన్న సందేహం. ఆధార్‌ కార్డులు యిస్తామని, రేషన్‌ కార్డులు యిప్పిస్తామని ప్రలోభపెట్టి మతమార్పిళ్లు చేయిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. డిసెంబరు 25 క్రిస్‌మస్‌ నాడు ఆలీగఢ్‌లో 25 వేల మందిని హిందూమతంలోకి మారుస్తామని ఆ సంస్థ ప్రకటించడం, దానికి స్థానిక బిజెపి ఎమ్మెల్యే మద్దతు ప్రకటించడం యీ ఆందోళనకు కారణం.

ఏ కారణం లేకుండా ఏ వ్యక్తీ ఒక చర్య చేపట్టడు, ఉన్న స్థితి మార్చుకోడు. మధ్యయుగాల్లో యిస్లాం పాలకులు వుండే రోజుల్లో రాజకీయ ప్రాబల్యం కోసం ముస్లిములుగా మారిన హైందవులను చూశాం. గత మూడు, నాలుగు శతాబ్దాలుగా క్రైస్తవ మిషనరీలు కొండ ప్రాంతాలలో, వెనుకబడిన ప్రాంతాలలో,  విద్య, వైద్యసౌకర్యాలు కల్పించి వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవడం చూస్తున్నాం. కులపోరాటాలతో విసిగి 33 ఏళ్ల క్రితం తమిళనాడులో మీనాక్షిపురం గ్రామస్తులందరూ ముస్లిములుగా మారిన వైనమూ చూశాం. కారణం లేకుండా వుంటేనే మతం మారాలి, లేకపోతే మారకూడదు అనే నిబంధన పెట్టలేరు కదా. మతం అనేది వ్యక్తిగతం. ఒక మతంలో వుండి వేరొక మతానికి చెందిన దేవుణ్ని ఆరాధించినా కాదనగలిగేవారు లేరు, దేవుడున్నాడని నమ్మను అన్నా చేసేదేమీ లేదు. అవసరం కోసం మతం మారినా మళ్లీ పాత దేవుళ్లనే కొలిచేవారిని మతగురువులు ఏమీ చేయలేరు కూడా. పైకి ఒక దేవుడి పేరు చెప్పి, లోపల మరొకరిని ప్రార్థిస్తే ఎవరికి తెలుస్తుంది? బంగ్లాదేశ్‌ నుండి పశ్చిమ బెంగాల్‌కు వలసవస్తున్న ముస్లిముల గురించి మోదీ బహిరంగంగా విమర్శలు చేసి, వారిలో ఆందోళన కలిగించారు.

ఇప్పుడు బిజెపి నాయకులు వచ్చి 'మీరంతా హిందువులుగా మారి బిజెపిని సమర్థించండి. మీ అందరికీ భారతపౌరులుగా గుర్తింపుకార్డులిస్తాం.' అని ఆఫర్‌ యిస్తే వాళ్లంతా పొలోమని హిందువులుగా మారిపోవడానికి సిద్ధపడవచ్చు. ఎవరికైనా మనుగడ ముఖ్యం, మతం అవతలి సంగతి. దళితులపై అత్యాచారాలు సాగుతున్నంతకాలం వారు యితర మతాల వైపు చూపు సారిస్తూనే వున్నట్టే, న్యాయంగా అందవలసిన పౌరసౌకర్యాలు అందకపోతే హైందవేతరులు కూడా యితర మతాలవైపు దృష్టి మరలిస్తారు. బలవంతంగా మతం మార్చినపుడే చిక్కు వస్తుంది. మతమార్పిడుల నిరోధక చట్టం కొన్ని రాష్ట్రాలలోనే వుంది. దేశమంతా వర్తింపచేయాలని యిన్నాళ్లూ బిజెపి మాత్రమే అడిగింది. ఇతర పక్షాలు అడ్డుకుంటున్నాయి. అయితే యిప్పుడు వైద్యుడే చేదుమాత్ర మింగరావలసి రావడంతో అవి ఆందోళన చేపట్టాయి. ఇదే అదనుగా ఆ చట్టం తెద్దామంటోంది బిజెపి. ఎటు చెప్పడానికీ పాలుపోని పరిస్థితి ప్రతిపక్షాలది. హిందూమతంలోకి బయటకు వెళ్లడాన్నే సమర్థిస్తాం, యితరులు లోపలకి రావడాన్ని సమర్థించం అని బాహాటంగా చెప్పలేరు కదా!

– ఎమ్బీయస్‌ ప్రసాద్