తీవ్రవాదానికి ప్రాంతం లేదు.. తీవ్రవాదానికి మతం లేదు.. తీవ్రవాదానికి మానవత్వం అసలే లేదు. తీవ్రవాద పీడిత దేశాల్లో ఒకటైన భారతదేశం, నిత్యం ప్రపంచ వేదికలపై ఇదే మాట చెబుతోంది. పొరుగునున్న పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషించి, భారతదేశంపై ఎప్పటికప్పుడు వారిని ఉసిగొల్పుతూనే వుంది. ఈ క్రమంలో భారత్ అనేక తీవ్రవాద దాడుల్ని చవిచూడాల్సి వచ్చింది.
అలాగని పాకిస్తాన్ క్షేమంగా వుందా? అంటే అదీ లేదు. తాము పెంచి పోషించిన తీవ్రవాదమే తమ కంట్లో నలుసులా తయారైందన్న విషయం అడపా దడపా పాకిస్తాన్‌కి అనుభవంలోకి వస్తూనే వుంది. తాజాగా తీవ్రవాదులు పాకిస్తాన్‌లో జరిపిన దాడిని యావత్ మానవ సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోంది. అలాంటి ఇలాంటి దుశ్చర్య కాదిది. ఘోర కలి అని అనాలేమో.
పాకిస్తాన్‌లోని పెషావర్‌లోగల సైనిక్ స్కూల్‌లో తాలిబన్లు దాడికి తెగబడ్డారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 104 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. పాకిస్తాన్‌లో ఇంత పెద్ద సంఖ్యలో చిన్నారులు మృతి చెందడం ఇదే తొలిసారి. ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే బహుశా ఇంతమంది చిన్నపిల్లలు ఒకే తీవ్రవాద ఘటనలో మృతి చెందడం ఇదే ప్రథమమేమో.!
వజీరిస్తాన్‌లో సైన్యం తమపై దాడులకు దిగుతోందనీ, దానికి ప్రతిచర్యగానే తాము ఈ చర్య చేపట్టామని తాలిబన్ నిస్సిగ్గుగా ప్రకటించింది. ఆప్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబన్లు వికటాట్టహాసం చేస్తున్నారు దశాబ్దాలుగా. కొన్నేళ్ళ క్రితం భారత్‌కి చెందిన ఓ పౌరవిమానాన్ని ఆప్ఘనిస్తాన్‌వైపుకు తరలించిన పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు, తాలిబన్ల అండతో, భారతదేశం చెరలో వున్న తీవ్రవాదిని విడిపించుకున్న విషయం విదితమే.
ఏదిఏమైనా.. ఈ ఘటనతో అయినా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషించడం మానేయాలన్న విషయాన్ని గుర్తెరిగి, ప్రపంచ దేశాలతో కలిసి తీవ్రవాదాన్ని రూపు మాపే దిశగా ముందడుగు వేయాలని ఆశిద్దాం.