రష్యన్లు పదేళ్ల పాటు ఆక్రమించి, వెళ్లిపోయాక వాళ్లు నిలబెట్టిన ప్రభుత్వం పడుతూ లేస్తూ మూడేళ్లు నడిచింది. కానీ అమెరికన్లు 20 ఏళ్లు పాలించినా, వాళ్లు నిలబెట్టిన ప్రభుత్వం వారాల్లో పడిపోతోంది. ఎందుకంటే యీసారి తాలిబాన్లు మొదటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తూ తమ ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయగలిగారు. అమెరికన్లు వెళ్లిపోతారనగానే అష్రఫ్ ఘని ప్రభుత్వం వెంటనే రాజీనామా చేసి, పరిపాలనను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అమెరికా నిష్క్రమణ మొదలుపెట్టడానికి మూడు రోజుల ముందే కాబూల్‌లోని ఒక గెస్ట్ హౌస్‌పై దాడి చేసి 27 మందిని చంపేశారు. దానికి ముందే కొందరు జర్నలిస్టులను, మేధావులను, విద్యావంతులను, అధికార్లను వెతికి వెతికి చంపారు. వారిలో మన దేశానికి చెందిన ఫోటో జర్నలిస్టు, పులిట్జర్ బహుమతి గ్రహీత దానిష్ సిద్దిఖీ కూడా ఉన్నాడు. రిపోర్టింగు చేసేముందు మా అనుమతి తీసుకోలేదు కాబట్టి చంపేశాం అన్నారు తాలిబాన్లు.
తాలిబాన్లు గతంలో అయితే పట్టుబడిన సైనికులను చంపేసేవారు. ఇప్పుడు స్ట్రాటజీ మార్చారు. ఏదైనా ఊరిని వశపరుచుకోగానే అక్కడున్న సైన్యాన్ని పిలిచి ‘మాతో చేరిపోండి. లేదా యిదిగో యీ డబ్బు పుచ్చుకుని ఎక్కడికైనా పారిపోండి.’ అంటున్నారు. చాలామంది బతుకు జీవుడాని పారిపోతున్నారు, ప్రజలకు రక్షణ కల్పించే పని దేవుడే చూసుకుంటా డనుకుంటూ! లొంగిపోయిన సైనికులను కూడా తాలిబాన్లు కాల్చి చంపుతున్నారని వీడియోలు వస్తున్నాయి కానీ తాలిబాన్ ప్రతినిథి అవన్నీ అబద్ధపు ప్రచారాలంటున్నాడు. సైన్యం అధైర్యపడడంతో, అమెరికన్లు యింకా పూర్తిగా దేశాన్ని విడవకుండానే, నగరాలకు నగరాలు తాలిబాన్ల చేతికి చిక్కుతున్నాయి. వారి యుద్ధనీతి కారణంగా యిప్పటికే దేశంలో 70% భూభాగం వారి అధీనానికి వచ్చేసింది.
తాలిబాన్లు మరో యుద్ధతంత్రం కూడా అవలంబిస్తున్నారు. అఫ్గన్‌లో మొదటి నుంచి కొన్ని తెగలకు చెందిన పాలెగాళ్ల లాటి వాళ్లు ఆ యా ప్రాంతాల్లో వార్‌లార్డ్‌స్‌గా వుంటూ ఆ ప్రాంతం వరకూ ప్రభుత్వాన్ని, తాలిబన్లను ఎదిరిస్తూ వుండేవారు. గతంలో తాలిబాన్ ప్రభుత్వం నడిచినప్పుడు వీళ్లు నాదరన్ ఎలయన్స్ పేర సంఘటితమై, అమెరికా, ఇరాన్, ఇండియా అందించిన సహాయసహకారాలతో 15% భూభాగంలో తాలిబన్లను రానివ్వకుండా చూశారు. నాదరన్ ఎలయన్స్ బలంగా వున్న ఉత్తర, ఈశాన్య, పశ్చిమ ప్రాంతాలలోని జిల్లాలపై తాలిబాన్లు దృష్టి పెట్టి వాటిని వశపరుచుకున్నారు. గతానుభవాలతో తాలిబన్లు యీసారి పలు జాతుల వారిని తమలో కలుపుకోవడంతో ఈ సారి వాళ్లు కూడా అఫ్గన్ ప్రభుత్వానికి ఎదురు తిరిగారు.
ఈ ప్రాంతాల తర్వాత తాలిబాన్లు సరిహద్దులపై దృష్టి మళ్లించి, వాటిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే తాము అధికారంలోకి వచ్చాక, అగ్రరాజ్యాలన్నీ తమపై దండెత్తడానికి యీ సరిహద్దులు వాడుకుంటాయని వారికి తెలుసు. రేపు తాము ఆఫ్గన్ పాలకులుగా వెలసినప్పుడు మళ్లీ యీ నాటో సైన్యాలు లేదా రష్యా, పాక్, చైనా సైన్యాలు చుట్టూ వున్న సరిహద్దు దేశాల మీదుగా భూమార్గం ద్వారా దాడి చేసే అవకాశం వుంది కాబట్టి, అన్ని వైపులా వున్న సరిహద్దు గ్రామాలను ముందుగా చేజిక్కించు కుంటున్నారు. తాలిబాన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమిస్తున్న కొద్దీ సరిహద్దుల్లోని దేశాల వారు జాగ్రత్త పడుతున్నారు. ఈ జిహాదీ వైరస్ తమ దేశంలోని ముస్లిములకు అంటుతుందేమోనని వారి భయం. ఏప్రిల్‌లోనే తజికిస్తాన్ తన సరిహద్దులను దృఢంగా చేసుకుంది. తజికి, రష్యన్ సైనికులు 50 వేల మంది సంయుక్తంగా కవాతు నిర్వహించారు.
తాము వెళ్లిపోయిన ఆర్నెల్లకు తాలిబాన్లు దేశాన్ని ఆక్రమిస్తారని అమెరికా యింటెలిజెన్సు వర్గాలు అంచనా వేశాయి. ఇప్పుడు వాళ్లే మూడు నెలలు అంటున్నారు. ఆగస్టు నెలాఖరు కల్లా తాలిబాన్లు అధికారంలోకి వచ్చేసినా ఆశ్చర్యం లేదు. ఇది రాసేనాటికి మొత్తం 421 జిల్లాలలో 242 తాలిబాన్ల వశంలో వుండగా, 65 జిల్లాలలో మాత్రమే ప్రభుత్వవశంలో వున్నాయి. తక్కిన 100 ప్లస్ జిల్లాల్లో పోరాటం సాగుతోంది. ఇప్పటికే చాలా భాగం చిన్న నగరాలను ఆక్రమించారు. ఇప్పుడు పెద్ద నగరాలపై పడింది. ఇప్పటికే 34టిలో 17 ప్రాంతీయ రాజధానులను కైవసం చేసుకుంది. ఇప్పుడు కాందహార్, మజారే షెరీఫ్, ఘజనీ వంటి పెద్ద నగరాలను ఆక్రమించింది. ఆగస్టు 12న తాలిబాన్లు ఘజనీకి రాగానే దాని గవర్నరు ఏ మాత్రం ప్రతిఘటన లేకుండా ఓ పుష్పగుచ్ఛం యిచ్చి వారికి అధికారం అప్పగించేశాడు. ఆ సాయంత్రానికి హెరాట్ కూడా తాలిబాన్ల వశమైంది. రాజధాని కాబూల్‌లో అడుగు పెట్టేశారు. పూర్తిగా ఆక్రమించడానికి ఒక వారం చాలు అంటున్నారు తాలిబాన్లు. కాబూల్‌లో పోలీసు స్టేషన్లను ఖాళీ చేసి పోలీసులు పారిపోతున్నారు.
ఆ మాట నిజమౌతుందేమోనన్న భయం వేస్తోంది, అమెరికా, యుకె, యితర పాశ్చాత్య దేశాలకు! అందుకే తమ దేశపు రాయబారులను వెనక్కి వచ్చేయమని అడుగుతున్నారు. కాబూల్‌లో ఉన్న తమ దళాలకు కాపాడడానికి అమెరికా, బ్రిటన్ వేల సంఖ్యలో సాయుధులను పంపాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా తమకు అనుకూలురైన 400 మంది ఆఫ్గన్లకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తోంది. ఇండియా కూడా ‘విమానాల రాకపోకలు ఆపేస్తారేమో, యీ లోపునే వచ్చేయండి’ అని అక్కడున్న మన దేశస్తులకు చెప్పింది. అమెరికా చెప్పినట్లే ఆడుతున్న మన ప్రభుత్వం ఆఫ్గనిస్తాన్‌లో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. ఆ దేశానికి ఎంతో ఆర్థికసాయం చేసింది. రకరకాల వృత్తులకు చెందిన మన భారతీయులెందరో ఆ దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఆ డబ్బూ పోయింది. ఆ గుడ్‌విల్లూ పోయింది. అమెరికా స్థానాన్ని చైనా, పాక్‌లు ఆక్రమించే అవకాశాలు బాగా వున్నాయి కాబట్టి, వాళ్లు ఇండియన్లను తరిమివేయాలనే సలహా యిస్తారు. ఈ విషయం మన ప్రభుత్వానికి బాగా తెలుసు. అందుకని సాధ్యమైనంత త్వరగా అఫ్గన్ వదిలి వచ్చేయండని మన వాళ్లకు సలహా యిస్తోంది. అన్నీ వదులుకుని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్లు వచ్చేస్తున్నారు.
2020 ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందంలో తాలిబన్ల మీద అంతర్జాతీయ సమాజం విధించిన ఆర్థికపరమైన ఆంక్షలు ఎత్తివేయిస్తామని అమెరికా హామీ యిచ్చింది. తాలిబాన్ హయాంలో దేశం చేపట్టబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని కూడా చెప్పింది. ఇలాటివి జరగాలంటే తమను దేశంలోని అత్యధిక ప్రజలు సమర్థిస్తున్నారని తాలిబాన్లు నిరూపించుకోవాలి. కానీ వాళ్లకు ఎన్నికలంటే నమ్మకం లేదు. అవి ఇస్లామ్‌కు వ్యతిరేకమని, తాము ఇస్లామిక్ ఎమిరేట్ రాజ్యాన్ని స్థాపిస్తామని వాళ్లు చెపుతున్నారు. ఆడవాళ్లకు ఓటు హక్కు కాదు కదా, మగతోడు లేకుండా బయటకు తిరగడానికి వీల్లేదని యిప్పటికీ అంటున్నారు. ఇప్పుడు కూడా తాము ఆక్రమించిన నగరాల్లో ఆడవాళ్లు సూపర్ మార్కెట్లకు వెళ్లడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. ‘‘మా ప్రభుత్వాన్ని రద్దు చేసి పాశ్చాత్యులు ఆక్రమించాక చేసిందేమిటంటే మహిళా హక్కుల పేర నీతిరాహిత్యాన్ని, ఇస్లాం విరుద్ధ సంస్కృతిని పోషించడమే’ అని తాలిబాన్ లీడరు అన్నాడు.
20 ఏళ్ల స్వేచ్ఛ తర్వాత మళ్లీ నిర్బంధంలోకి వెళ్లడమనే ఊహే ఆఫ్గన్ మహిళలకు దుర్భరంగా వుంది. గ్రామాల్లోని పాఠశాలల్లో చదువుకునే వాళ్లలో విద్యార్థినులు 40% మంది వున్నారిప్పుడు. తాలిబాన్లు వశపరుచుకున్నాక ‘స్కూలు నడవాలంటే ఇంగ్లీషు సబ్జక్టు తీసేయాలి, దానికి బదులు ఇస్లాం మతగ్రంథాలు నేర్పాలి.’ అని షరతులు పెడుతున్నారు. తాము ఆక్రమించిన ప్రాంతాలలో 15 ఏళ్లు పైబడిన కన్యలను, 40 ఏళ్లకు లోపు వయసున్న వితంతువులను తాలిబాన్లకు యిచ్చి పెళ్లి చేసి, వారిని అదుపులో పెట్టుకుంటామని తాలిబాన్ ముల్లా ఒకడు ప్రకటించాడు. ఆఫ్గన్ జనాభాలో 75% మంది 30 ఏళ్ల లోపు యువతీయువకులే. 60% మందికి ఇంటర్నెట్ సౌకర్యం వుంది. సమాజంలో ఛాందసం వున్నమాట నిజమే కానీ, స్వేచ్ఛ కూడా వుంది. డజనుకి పైగా ఎన్నికలు జరిగాయి. ఏదో ఒక మేరకు ప్రజాస్వామ్యం వుంది. తాలిబాన్లు వచ్చి అవన్నీ హరించేస్తారనే భయం యువతీయువకు లందరికీ వుంది. తాలిబాన్లు యిప్పటికే వెయ్యి మంది ఆఫ్గన్ పౌరులను చంపారు. 4 వేల మంది గాయపడ్డారు.
తాలిబన్ల పాలన మొదలయ్యాక అమెరికా నీడ అస్సలు పడకుండా వుండాలని తమకే ప్రాధాన్యం వుండాలని చైనా, పాకిస్తాన్‌లు ప్లాన్ చేస్తున్నాయి. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్, అఫ్గనిస్తాన్ సరిహద్దుల్లోంచి వెళుతుంది. ఆసియా, యూరోప్ ఖండాలను కలిపే వాణిజ్య మార్గం ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ పథకాన్ని ఎంతో ఖర్చుతో రూపొందించి, అమలు చేస్తోంది చైనా. మధ్యదారిలో ఉన్న అఫ్గనిస్తాన్‌లో అశాంతి చెలరేగి, ఉగ్రవాదానికి కంచుకోటగా మారితే, దాని వ్యాపార ప్రయోజనాలు దెబ్బ తింటాయి. అంతేకాకుండా అఫ్గన్‌తో 90 కి.మీ.ల సరిహద్దు పంచుకునే జిన్జియాంగ్ ప్రాంతంలో చైనా యిప్పటికే వీగర్ జిహాదిస్టులతో అవస్థ పడుతోంది. అక్కడ వాళ్లు ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ (ఇటిఐపి) పేర పార్టీ ఏర్పాటు చేసుకుని టెర్రరిస్టు కార్యకలాపాలతో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడానికి పని చేస్తున్నారు. దాన్ని అమెరికా కూడా టెర్రరిస్టు సంస్థగా గుర్తించింది. అయితే తాము అఫ్గనిస్తాన్ నుంచి తప్పుకున్నాక, చైనా లాభపడుతుందనే బాధతో, దాన్ని యిరుకున పెట్టడానికి ట్రంప్ తను దిగిపోవడానికి ఒక నెల ముందు ఇటిఐపిపై టెర్రరిస్టు ముద్ర తీసేశాడు. వాళ్లు ఉగ్రవాద కార్యకలాపాలు విరమించుకున్నారని సర్టిఫికెట్టు యిచ్చాడు.
చైనాకు అదో బాధ వుంది. తాలిబాన్లు గతంలోలా అల్ ఖైదాకు ఆవాసం కల్పిస్తే ఆ జిహాజీ ఉగ్రవాదం తమ దేశంలో కూడా వ్యాపిస్తుందనే భయం కూడా వుంది. అందువలన అఫ్గనిస్తాన్ ఆర్థిక సుస్థిరత కోసం, తన స్వార్థం కోసం ఎనర్జీ, మినరల్స్, రా మెటీరియల్ సెక్టార్లలో హెచ్చు స్థాయిలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు వాటికి ముప్పు రాకూడదు, తన ఓబిఓఆర్‌కి అడ్డు రాకూడదు అంటే అఫ్గన్‌లో అధికారంలోకి రాబోతున్న తాలిబాన్లను మంచి చేసుకోవాలి. అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేట్లా వాళ్లకు మార్గం సుగమం చేయాలి. వీగర్ ముస్లిములకు సాయం చేయననే హామీ తీసుకోవాలి.
చైనాతో తన ఆర్థిక ప్రయోజనాలను ముడి వేసుకున్న పాకిస్తాన్ కూడా యిదే కోరుకుంటోంది. ఇన్నేళ్లగా తాలిబాన్లకు ఆశ్రయం యిచ్చి ఆదుకున్నందుకు వాళ్లు కృతజ్ఞతాపూర్వకంగా వుంటారని దాని ఆశ. గతంలో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడినపుడు దాన్ని గుర్తించిన మూడు దేశాలలో పాక్ ఒకటి. తక్కిన రెండూ సౌదీ అరేబియా, యుఎఇ. పాకిస్తాన్‌కు అఫ్గనిస్తాన్‌తో వున్న 2640 కి.మీ.ల సరిహద్దు మరీ అంత దృఢంగా వుండదు. సులభంగా అటూయిటూ వెళ్లి రావచ్చు. తాలిబాన్లు సరిహద్దులు దాటివచ్చి, పాకిస్తాన్‌లో కూడా జిహాద్ మొదలుపెడితే తమ ప్రభుత్వం కూలిపోతుంది. అందువలన చైనాకు సహకరిస్తోంది. పైగా చైనా-పాకిస్తాన్ కారిడార్ ప్రమాదంలో పడితే పాక్ ఆర్థిక స్థితి కూడా అల్లకల్లోలమౌతుంది.
బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా యిప్పుడు తప్పుకోవడం వలన ఆ మొత్తం ప్రాంతంలో చైనా ఆర్థికంగా, రాజకీయంగా బలపడుతుందని ట్రంప్ విమర్శించాడు. తాలిబాన్ల హయాంలో చక్రం తిప్పుదామనుకుంటున్న చైనా, పాకిస్తాన్‌లు అమెరికాను, దానికి తోకగా మారిన భారత్‌ను దగ్గరకు రానీయటం లేదు. ‘అఫ్గనిస్తాన్‌లో పరిస్థితి చెడిపోతే అమెరికా మమ్మల్ని జోక్యం చేసుకోమంటుంది. నిర్మాణాత్మకమైన పనులుంటే మాత్రం భారత్‌కు అప్పగిస్తుంది.’ అని ఇమ్రాన్ వాపోయారు. అందుకే ఖతార్‌లో జరిగే అఫ్గన్ శాంతి చర్చల్లో ఇండియాను పాలు పంచుకోనీయటం లేదు. అయితే ఖతార్ పట్టుబట్టడంతో ఆగస్టు 12న తొలిసారి భారత్ పాల్గొంది. కానీ చైనా, పాకిస్తాన్‌ల ప్రమేయం పెరిగినకొద్దీ భారత్‌కు వచ్చే లాభం ఏమీ కనబడటం లేదు.
ఇప్పటికైనా మన ప్రభుత్వం తాలిబాన్లతో సఖ్యంగా వుండే ప్రయత్నం చేయాలి. లేకపోతే అది జిహాదిస్టులను తయారుచేసి మనమీదకు తోలగలదు. గతంలో తాలిబాన్ల పాలన వుండగా కశ్మీర్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. రెండేళ్లగా కశ్మీర్‌ను కేంద్రమే డైరక్టుగా పాలిస్తున్నా అక్కడ శాంతిభద్రతలు మెరుగు పడలేదు. తాలిబాన్లతో సఖ్యంగా వుంటే మనం పెట్టిన పెట్టుబడులు వృథా కాకుండా వుంటాయి. కానీ మన ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తున్నట్లు కనబడటం లేదు. ‘తాలిబాన్లు ఎన్నికల ద్వారా కాకుండా హింస ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు కాబట్టి వారి ప్రభుత్వాన్ని గుర్తించబోము’ అని అమెరికా అంది. వెంటనే అమెరికాకు భజనమేళంగా తయారైన భారత్ ‘మేమూ గుర్తించం’ అంది. ప్రభుత్వం ఏర్పడకుండానే ముందే శాపనార్థాలు పెడితే మనకు కలిగే ప్రయోజనమేముంది?
తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక దేశం విడిచి వెళ్లిపోయే ఆఫ్గన్ల కారణంగా యిరుగుపొరుగు దేశాలపై శరణార్థుల భారం పడుతుంది. ఇప్పటికే వారానికి 30 వేల మంది దేశం విడిచి వెళుతున్నారట. రాబోయే రోజుల్లో యింకా ఎంతమంది వెళతారో, వారిలో ఎందరు ఇండియాకు వస్తారో తెలియదు. అమెరికా నిష్క్రమణ కారణంగా మన దేశానికి మేలు కంటె కీడే ఎక్కువగా జరిగేట్లుంది. వేచి చూస్తే కానీ ఎటూ చెప్పలేము.
‘సమస్యాత్మకమైన ఆఫ్గనిస్తాన్ వ్యవహారాల్లోకి అమెరికా అనవసరంగా చొరబడి, సమస్యను మరింత జటిలం చేసి వెళ్లిపోతోంది’ అని అఫ్గన్లు తిట్టుకుంటున్నారు. ‘చేసిందేదో చేశాం, యికపై అఫ్గన్లు వాళ్ల దేశాన్ని వాళ్లే కాపాడుకోవాలి, నడుపుకోవాలి’ అంటున్నారు బైడెన్. ఈ సిద్ధాంతం మహబాగుగా వుంది. ప్రపంచంలోని అన్ని దేశాల పట్ల కూడా యిదే పద్ధతి అవలంబించి తలదూర్చడం మానేసి, వాళ్ల బాగేదో వాళ్లు చూసుకుంటే చాలా బాగుంటుంది. మధ్య ప్రాచ్యం, దక్షిణ అమెరికాల్లోని దేశాల నుంచి అమెరికా తప్పుకుంటే ఆ దేశంలో ఎవరికి బలముంటే వాళ్లే అధికారంలోకి వస్తారు, అమెరికా పెద్దన్న పాత్ర వహించడం మానేసిన రోజే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. అఫ్గనిస్తాన్ విషయంలో కూడా అమెరికా హజారాలనే మైనారిటీలకు ఆయుధాలు సరఫరా చేసి, తాలిబాన్లపై పోరుకి ప్రోత్సహిస్తుందని, యుఎఇ, కథార్‌లలోని మిలటరీ బేస్‌ల ద్వారా అఫ్గన్‌పై కన్నేసి వుంచుతుందని, అరేబియా సముద్రంలో శాశ్వతంగా నిలిపి వుంచిన ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ల నుంచి అఫ్గన్‌పై బాంబులు కురిపిస్తుందని… యిలాటి ఊహాగానాలు నడుస్తున్నాయి. అవి జరగకుండా వుంటేనే బాగుంటుంది. (ఫోటో – అఫ్గనిస్తాన్ మ్యాప్, చైనా ఒబిఒఆర్, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్) (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)