పద్మనాభుని వైభవం ఎంత?

తిరువనంతపురంలోని పద్మనాభస్వామి గుడిలో నేలమాళిగలు తెరిచిన వైనం మనందరికీ తెలుసు. అప్పుడు మన టీవీల్లో గ్రాఫిక్స్ ఎక్కువ, సమాచారం తక్కువ అయిపోయింది. ఆ మాళిగలు తెరవడానికి కోర్టు నియమించిన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన సివి…

తిరువనంతపురంలోని పద్మనాభస్వామి గుడిలో నేలమాళిగలు తెరిచిన వైనం మనందరికీ తెలుసు. అప్పుడు మన టీవీల్లో గ్రాఫిక్స్ ఎక్కువ, సమాచారం తక్కువ అయిపోయింది. ఆ మాళిగలు తెరవడానికి కోర్టు నియమించిన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన సివి ఆనంద బోస్ అప్పుడేం జరిగిందో ఇప్పుడో పత్రికకు చెప్పారు. కమిటీ వేయడానికి నేపథ్యం ఏమిటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే – ఆ గుడి చాలా శతాబ్దాలుగా వుంది. కానీ 1730లో తిరువాన్కూర్ రాజు మార్తాండవర్మ గుడిని కొత్తగా కట్టించాడు. ఇంకో 20 ఏళ్లకు తన ర్యాసర్వస్వాన్ని పద్మనాభునికి అంకితం చేసి, ఆయన దాసులగానే తను, తన వారసులు రాజ్యం చేస్తామని ప్రకటించాడు. తన వద్దనున్న బంగారాన్ని, మణిమాణిక్యాలను గుడికి సమర్పించి, వాటిని నేలమాళిగలలో భద్రపరిచాడు. అతని వారసులు కూడా అదే పరంపర కొనసాగించారు. ప్రజలు విరాళాలుగా ఇచ్చినవి వీటితో కలపలేదు. స్వాతంత్య్రం వచ్చాక, రాచరికాలు పోయాయి. గుడి నిర్వహణ రాష్ట్రప్రభుత్వం తీసుకుందామనుకుంది. కానీ రాచకుటుంబం ఒక ట్రస్టు ఏర్పరచి, దాని ద్వారా గుడిని నిర్వహిస్తోంది. పద్మనాభునికి పరమభక్తుడైన టిపి సుందరరాజన్ అనే మాజీ పోలీసు అధికారి ఈ ట్రస్టు వ్యవహారం బాగా లేదని, నేలమాళిగలలో దాచిన సొమ్ము ఏమైందోనని భయంగా వుందని, అక్కడున్న వస్తువుల జాబితా రాయించి బహిర్గతం చేయాలని కోరుతూ 2007లో హైకోర్టుకి, ఆ పై సుప్రీం కోర్టుకి వెళ్లాడు. 

2011 జనవరిలో కేరళ ప్రభుత్వం గుడి మేనేజ్‌మెంట్ తమకు అప్పగించాలని ట్రస్టును ఆదేశించింది. కానీ దీన్ని ధిక్కరిస్తూ రాచకుటుంబం సుప్రీం కోర్టుకి వెళ్లింది. సుప్రీం కోర్టు ఒక కమిటీని ఏర్పరచి గుడిలోని ఆరు మాళిగలను తెరిచి, వస్తువుల జాబితా తయారుచేసే బాధ్యత అప్పగించింది. అప్పట్లో నేషనల్ మ్యూజియంకు డైరక్టరుగా పనిచేస్తున్న ఆనంద బోస్‌ను కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఆ విధంగా జరిగిన విషయాలన్నీ ఆయనకు తెలుసు. ఆరు మాళిగలలో నాల్గిటిని  గుడి కార్యకలాపాల్లో భాగంగా తరచుగా తెరుస్తూనే వుంటారు. అవి గ్రానైట్‌తో నిర్మించబడి, బ్యాంకు స్ట్రాంగ్ రూముల్లా  దృఢంగా వున్నాయట. అన్నీ ఒకే సైజులో లేవు. వాటిల్లో కొన్నిటిలో తరచుగా వుపయోగించే విలువైన వస్తువులు వున్నాయి. ఎప్పుడో కానీ వాడని ఆభరణాలున్న మాళిగలు తక్కినవాటి కంటె పటిష్టంగా కట్టారు.  విలువైన వస్తువులను చెక్క పెట్టెల్లో పెట్టి వాటిని మాళిగలలో భద్రపరిచారు. ఆ పెట్టెలన్నీ ఒకే సైజులో లేవు. ఆభరణం సైజు బట్టి పెద్దగా, చిన్నగా వున్నాయి. ఈ పెట్టెలు పెట్టాక నేలమాళిగలో అటు ఇటు మసలడానికి చాలా తక్కువ చోటు వుంది. ఇవన్నీ గుడి పూజారి కస్టడీలో వున్నాయి.

ఆరు నేలమాళిగలలో రెండిటి విషయమే మిస్టరీగా మిగిలింది. వాటిని ఎ, బిలుగా వ్యవహరించారు. అంతిమంగా ఎ ను తెరిచారు, బిను తెరవలేదు. ఎ మాళిగకు తలుపులు లేవు. భారీ గ్రానైట్ రాళ్లను పేర్చి పెట్టేశారు. ఒక్కో రాయిని దింపాలంటే పదిమంది సాయం పట్టాల్సిందే. అందువలన రహస్యంగా జరిగే అవకాశమే లేదు. లోపలకి వెళ్లాక కూడా చీకటిగా వుంది. కాగడాలు వెలిగించి పట్టుకుంటే తప్ప దారి కనబడదు. అపరిచితులెవరైనా అడుగుపెడితే తడబడేట్లా ఈ ఏర్పాటు చేశారట. నిజానికి ‘ఎ’ను గతంలో తెరిచారని అనిపించింది. ఎప్పుడో మాత్రం తెలియదు. ‘‘అన్ని నేలమాళిగలను గతంలో తెరిచారని, వస్తువుల జాబితా రాసి పెట్టారని చారిత్రక ఆధారాలున్నాయి. కానీ ఆ జాబితాను ఆలయనిర్వాహకులు కమిటీకి అందచేయలేదు.’’ అంటారు ఆనంద బోసు. కొన్ని శతాబ్దాలపాటు అలా మూసేసి వుంచితే ఒక రకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు తెరవడం వలన అది చెదిరింది. వాటిలో వున్న వస్తువులు చెడిపోకుండా వుండడానికి శాస్త్రీయపద్ధతిలో కొన్ని రకాల వాయువులు ఉపయోగించి మైక్రో-క్లయిమేట్ సృష్టించడానికి ఇస్రో, కెల్ట్రాన్ (కేరళ ప్రభుత్వపు ఎలక్ట్రానిక్ కార్పోరేషన్) ముందుకు వచ్చాయి. ఓ పక్క టన్నుల కొద్దీ బంగారం, వజ్రవైఢూర్యాలు, పురాతన విగ్రహాల కేటలాగ్ తయారవుతూండగా ఇంకో పక్క అవి ఈ పని పూర్తి చేశాయి. 

ఎ-మాళిగ పని పూర్తి అవుతూండగా బి-మాళిగను తెరుద్దామని కమిటీ నిశ్చయించింది. అప్పుడు గుడిలో అష్టమంగళ దేవప్రశ్నమ్ అనే ప్రక్రియ నిర్వహించారు. పూనకం వచ్చిన పూజారి భగవంతుడి తరఫున మాట్లాడుతూ ‘బి-మాళిగ నాలో భాగం, అది తెరవడం నా కిష్టం లేదు, తెరిస్తే తెరిచినవారి కుటుంబాన్ని నాశనం చేస్తా’ అన్నాడు. ఆ మాళిగ ద్వారంపై పాము బొమ్మ గీసి వుంది. ఈ మాళిగల గురించి కేసు వేసిన సుందరరాన్ 2011 జులైలో చనిపోయాడు. వీటి వలన తెరవరాదని భక్తులు ఆందోళన చేశారు. ఏది ఏమైనా దాన్ని కూడా తెరవాలనే కమిటీ నిశ్చయించింది. స్థితిగతులను కోర్టుకి నివేదించి వారి ఆదేశాలను కోరింది. కోర్టు ఇంకా ఏమీ చెప్పలేదు.