అనుష్కని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని ‘అరుంధతి’ సినిమా ప్రూవ్ చేసింది. మళ్ళీ అలాంటి హిట్ అనుష్కకి దక్కకపోవడంతో, అనుష్కని కొందరు లైట్ తీసుకున్నా, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌పై ఓ ఐడియా ఏర్పరచుకున్నవారికి మాత్రం, అనుష్క ‘హీరోకన్నా ఎక్కువ’ అనే అభిప్రాయం వుంది.
అందుకే, ‘రుద్రమదేవి’, ‘వర్ణ’ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాల్లోనూ అనుష్కే మెయిన్ లీడ్. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలివి. సహజంగానే ఈ సినిమాలకి అనుష్కే హైలైట్. ఆమె ఇమేజ్ మీదనే ఈ రెండు సినిమాల విజయం ఆధారపడి వుంటుంది.
కానీ, ‘బాహుబలి’ విషయంలో అలా కాదు కదా. ఈ సినిమాకి కావాల్సినంత స్టార్ వాల్యూ వుంది, అనుష్కతో కలిపి. రాజమౌళి, ప్రభాస్, అనుష్క, రాణా.. ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకి వున్నా, సినిమాపై పెరిగిపోతున్న అంచనాలకి అనుష్క కారణం.. అనే చర్చ జరుగుతోంది టాలీవుడ్‌లో. తొలి టీజర్‌లో ప్రభాస్ ఓకే అన్పిస్తే, రెండో టీజర్‌లో అనుష్క అద్భుతం అన్పించేసింది.
సినిమాలో అనుష్క పాత్ర కేవలం హీరోయిన్ పాత్రకు పరిమితమవుతుందా.? లేదంటే, హీరో ప్రభాస్‌కి ధీటుగా వుంటుందా.? అన్నది పక్కన పెడితే, సినిమాపై పెరుగుతున్న అంచనాల్లో ఎక్కువ శాతం అనుష్క ఖాతాలోకి వెళ్తున్నాయట. రాజమౌళిని కూడా అనుష్క ఇమేజ్ డామినేట్ చేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనేవారూ లేకపోలేదు.
ఏమో.. అనుష్క ‘బాహుబలి’లో ఏం చేయనుందోగానీ.. అనుష్క ఇమేజ్ ఇంత స్థాయికి చేరుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.