సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేయడంతో, అతని స్థానంలో జట్టులో ఎవరు టీమిండియాకి వెన్నుదన్నుగా నిలుస్తారన్న ప్రశ్న భారత క్రికెట్ అభిమానుల్ని వేధిస్తోంది. టీమిండియాలో స్టార్స్‌కి కొదవ లేదిప్పుడు. అందరూ రాణిస్తున్నారు. బౌలర్లు తప్ప, బ్యాట్స్‌మన్ వైఫల్యం ఇటీవలి కాలంలో ఒకటీ అరా సందర్భాల్లో మాత్రమే కన్పించింది తప్ప, బ్యాట్స్‌మెన్ విషయంలో టీమిండియాకి పెద్దగా ఇబ్బందులు లేవనే చెప్పాలి.
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇలా ముగ్గురు కీలక ఆటగాళ్ళు స్థిరంగా రాణిస్తుండడం ధోనీ, రైనా, రవీంద్ర జడేజా.. చివరి ఓవర్లలో దుమ్ము రేపుతుండడం.. బౌలర్ అయినా బ్యాట్‌తో అశ్విన్ రాణిస్తుండడం.. ఇంతకన్నా ఏ జట్టుకైనా గొప్ప బ్యాటింగ్ లైనప్ ఇంకేముంటుంది.?
అయితే, సచిన్‌లా పూర్తి ఫిట్‌నెస్‌తో.. సచిన్‌లా ఎక్కువ కాలం కాకపోయినా, కొంత కాలమైనా నిలకడైనా బ్యాటింగ్‌తో టీమిండియాకి కీలక బ్యాట్స్‌మన్‌గా ఎవరు మారతారన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్న. రోహిత్ శర్మ ఇప్పుడంటే తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా కన్పిస్తున్నాడుగానీ, ఒక్కసారి ఫెయిలయితే ఆ తర్వాత అతని పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోలేం. శిఖర్ ధావన్ పరిస్థితీ అంతే. కోహ్లీ ఒక్కడే కాస్త నమ్మదగ్గ ఆటగాడిగా కన్పిస్తున్నాడు.
కొత్తగా ఎవరు జట్టులోకి వచ్చినా ఒకప్పటి మేటి ఆటగాళ్ళనైతే మరిపించలేరన్నది నిర్వివాదాంశం. ట్రెండూ మారిపోయింది. ఒక్క మ్యాచ్‌కి స్టార్ అయితే చాలనుకునే రోజులొచ్చేశాయి. వన్డే, టీ20ల వరకూ ఇబ్బంది లేదు. టెస్టుల విషయానికొస్తేనే ఇబ్బంది ఏంటనేది తెలుస్తుంది. టెస్టులూ ఇప్పుడు వన్డేల తరహాలో మారిపోయాయి కాబట్టి, అక్కడా కొంతమేర ఇబ్బంది తగ్గినట్టే.
అయినాసరే.. సచిన్ లాంటోడు లేని లోటు క్రికెట్‌లో ఎప్పటికీ స్పష్టంగా కన్పిస్తూనే వుంటుంది.