అన్యాయానికి గురైన ఒక తండ్రిగా రేమాండ్స్ చైర్మన్ ఎమిరిటస్ విజయపత్ సింఘానియా యిటీవల వార్తల్లోకి ఎక్కాడు. ''నాలా సంతానాన్ని గుడ్డిగా ప్రేమించి ఆస్తంతా వాళ్ల చేతిలో పెట్టకండి, మీకంటూ ఏమీ లేకుండా చేసుకుని నాలా అవకండి'' అంటూ తలితండ్రులకు సందేశాన్నిచ్చాడు. 60 వ పడిలోకి రాబోతూ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఒంటరిగా ఇంగ్లండు నుంచి ఇండియాకు విమానం నడుపుకుంటూ వచ్చి, 67 ఏళ్ల వయసులో హాట్ ఎయిర్ బెలూన్‌లో ఎగిరిన సాహసి విజయపత్‌కు 78 ఏళ్ల వయసులో యింత కష్టమా? అని అనేకమంది నొచ్చుకున్నారు. 1980 నుంచి రేమాండ్స్‌ను విజయపథంలో నడిపిన విజయపత్, తన రెండవ కొడుకు గౌతమ్‌ను కంపెనీలోకి తీసుకుని 1999లో ఎండీని చేశాడు. అతను కంపెనీని సమర్థవంతంగా నడిపించడంతో ముచ్చటపడి, 2015 ఫిబ్రవరిలో అతనికి పూర్తి పగ్గాలు అప్పగించాలనే ఉద్దేశంతో తన పేర వున్న 37.17% వాటాను అతనికి అప్పగించాడు.
దాని విలువ రూ.1041 కోట్లు. తనతో పేచీ పెట్టుకున్న పెద్ద కొడుక్కి ఏమీ యివ్వలేదు. తనకు ఆస్తితో సంబంధం లేదని చాలాకాలం క్రితమే పత్రాలు రాయించుకున్నాడు కూడా. ఈ ఇద్దరూ కాక ఆయనకు ఒక కూతురు కూడా వుంది. తండ్రి దగ్గర నుంచి యింతగా లాభపడిన 52 ఏళ్ల గౌతమ్ యిప్పుడు తండ్రికి అన్యాయం చేయడమేమిటని చాలామంది బాధపడ్డారు. గౌతమ్ చేసిన అన్యాయం వలన తను రోడ్డు మీద పడ్డట్టు, పూటకు గడవడమే కష్టంగా వున్నట్లు విజయపత్ మొదట్లో బిల్డప్ యిచ్చాడు కానీ మీడియా గట్టిగా అడిగేసరికి, తనకు లోటేమీ లేదని ఒప్పుకోవలసి వచ్చింది. ప్రస్తుతం ఆయన అద్దె కుంటున్న ఫ్లాటు అద్దె నెలకు రూ.7 లక్షలంటేనే తెలుస్తోంది, ఆయన జీవనసరళి ఎలా వుందో! అందువలన మెలోడ్రామా పక్కకు పెట్టి, తండ్రీకొడుకుల వివాదాన్ని పరిశీలించబోతే కార్పోరేట్ గవర్నన్స్‌కు సంబంధించిన ఒక అంశం చర్చకు వస్తుంది.
మిగతా దేశాల మాట తెలియదు కానీ మన దేశంలో కార్పోరేట్లన్నిటిదీ దాదాపు ఒకటే పద్ధతి. కంపెనీని ప్రమోట్ చేసినవారు కంపెనీ ఖర్చు మీద సకలభోగాలు అనుభవిస్తారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే అదో ముచ్చట. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో వాటాదారులుగా వున్న మీలాటి, నాలాటి అనేకమంది కష్టార్జితం వుంటుంది. కంపెనీ డైరక్టర్ల వ్యక్తిగత ఖర్చులన్నీ కంపెనీకి ఖర్చు రాసేసి, నష్టాలు చూపించి, డివిడెండ్లు తగ్గిస్తే నష్టపోయేది యీ సామాన్య జనమే. అయితే వీళ్లకు వాయిస్ వుండదు. ఇవన్నీ షేర్‌హోల్డర్ల మీటింగులో చర్చకు రాకుండానే కార్పోరేట్ ఆఫీసులోనే గుట్టుగా నడిచిపోతాయి. తన తండ్రికి, కంపెనీకి వున్న ఒక లావాదేవీ గుట్టు రట్టు చేసి షేర్‌హోల్డర్ల నిర్ణయానికి వదిలేయడమే గౌతమ్ చేసిన అపరాధం. ఆ లావాదేవీ యిళ్లకు సంబంధించినది.
రేమాండ్స్ సంస్థ జెకె గ్రూపులోంచి పుట్టుకు వచ్చింది. జగ్గీలాల్ సింఘానియా, కమలాపత్ సింఘానియా అనే యిద్దరు 1918లో ఆ గ్రూపును నెలకొల్పారు. 1970ల నాటికి టాటా, బిర్లాల తర్వాత వాళ్లదే పెద్ద గ్రూపు. 1980 నాటికి అది మూడు ముక్కలైంది. జెకె సిమెంట్స్, జెకె టెక్నోసాఫ్ట్ ఒక గ్రూపు, జెకె టైర్, జెకె పేపర్, జెకె లక్ష్మి సిమెంట్ మరో గ్రూపు, మూడోదైన రేమాండ్‌ను విజయపత్ తన వాటాగా తీసుకుని వృద్ధి చేశాడు. ఆ వాటాల్లో ముంబయిలో అతి ఖరీదైన బ్రీచ్ కాండీ ప్రాంతంలో వున్న 14 అంతస్తుల జెకె హౌస్ రేమాండ్ కంపెనీ వాటాగా వచ్చింది. కంపెనీ దానిలోని 14వ అంతస్తులో 5 డూప్లెక్స్ ఫ్లాట్లు కట్టి విజయపత్, గౌతమ్, విజయపత్ అన్న అజయపత్, అజయ్ కొడుకులు అనంత్, అక్షయపత్ లకు కంపెనీ రూ.7500 నెల అద్దె మీద లీజుకి యిచ్చింది. డైరక్టుగా యిస్తే బాగుండదని పశ్మీనా హోల్డింగ్స్ అనే సబ్సిడియరీని సృష్టించి, దానికి తను లీజు యిచ్చి, దాని ద్వారా వీళ్లకు లీజు కిచ్చింది.
డ్డించేవాడు మనవాడు… కాదు, మనమే అయినప్పుడు యిలాటి భోగాలు చాలా వుంటాయి. అయితే దానితో వీళ్లు తృప్తి పడలేదు. లీజు ఎందుకు, కొనేస్తే మంచిది కదా అనుకున్నారు. కొంటూకొంటూ పాతదెందుకు? శుబ్భరంగా కంపెనీ డబ్బుతో కొత్తగా కట్టించి, చవకగా పుచ్చేసుకుంటే పోతుంది కదా అనుకున్నారు. పాతది పడగొట్టి 37 అంతస్తుల భవనం కట్టేటట్లు దానిలో వున్న యీ అయిదుగురు టెనెంట్స్‌కి (ఆ పాటికి అజయపత్ మరణించి ఆయన స్థానంలో భార్య వీణాదేవి వచ్చారు) ఒక్కోరికి 5,185 చ.అ.ల డూప్లెక్సు ఫ్లాట్లు చ.అ. రూ.9200కు యిచ్చేట్లు ఒప్పందం ఒకటి తయారుచేశారు. దీనిపై సంతకాలు చేసినదెవరంటే బిల్డింగు యజమాని అయిన రేమాండ్ కంపెనీ, పశ్మీనా హోల్డింగ్స్, అద్దెకున్నవారు. ఒప్పందం జరిగిన 2006 నాటికే ఈ 9200 రూ.ల రేటు మార్కెట్ రేటుతో పోలిస్తే తక్కువాతి తక్కువ. అంతా తమదే కదా అనుకుని సంతకాలు చేసేసుకున్నారు.
పదేళ్లకు బిల్డింగు పూర్తయేసరికి విజయపత్ దిగిపోయి, గౌతమ్ అధినేత అయ్యాడు. సడన్‌గా అతనిలో అంతరాత్మ మేలుకొంది. తనతో సహా తన కుటుంబసభ్యులకు మార్కెట్ రేటులో పదోవంతుకే ఫ్లాట్లు అమ్మేయడం వలన కంపెనీ నష్టపోతోంది కదా అనుకున్నాడు. కంపెనీకి వచ్చే నష్టం రూ.650 కోట్లు (ఈ అంకె ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు) వుంటుందని అంచనా. ఆ ఒప్పందాన్ని అమలు చేయాలా లేదా అని కంపెనీ బోర్డు మీటింగులో అడిగాడు. వాళ్లు జూన్‌లో జరిగే షేర్‌హోల్డర్లు మీటింగులో పెడదామన్నారు. అక్కడ ఓటింగుకి పెడితే 97% మంది ఒప్పందాన్ని తిరస్కరించారు. అలా చర్చకు పెట్టి వుండకూడదని, బోర్డు మీటింగులోనే తమకు అనుకూలంగా తీర్మానించాల్సిందనీ విజయపత్ కొడుకుని తప్పుపడుతున్నాడు.
ఒప్పందం అమలు చేయాల్సిందే అని అతను, వదిన, అన్నగారి కొడుకులిద్దరూ కోర్టుకి వెళ్లారు. కోర్టు వాళ్లందరినీ తమలో తాము తేల్చుకోమని సలహా చెప్పింది. ఒప్పందం అమలైతే గౌతమ్‌కి కూడా లాభమే, చవకగా ఫ్లాట్ వస్తుంది. కానీ యిలా బహిరంగపరచి అతని షేర్‌హోల్డర్ల మన్ననలు పొందాడు. నేను ఓటేయాల్సిన సందర్భం వచ్చి వుంటే, నా ఓటు కూడా ఆ 97% మందితోనే అంటున్నాడు. అయితే అతను వెళ్లి తన ఫ్లాట్‌లో ఎంచక్కా వుంటున్నాడు. అదేమిటంటే నాకు రావలసిన హౌసింగ్ అలవెన్సు వదులుకుంటున్నాను. కంపెనీ నాకు యిల్లు యివ్వాలి కదా, వేరే ఏదో ఎందుని దీనిలోనే వుంటున్నాను అంటున్నాడు.
గౌతమ్ తనకు రావలసినదాని కంటె పెద్ద ఫ్లాట్ తీసుకున్నాడు అని ఆరోపిస్తున్న విజయపత్‌కి మాత్రం ఆ బిల్డింగులో ప్రవేశం లేకుండా పోయింది. జెకె బిల్డింగును డెవలప్‌మెంట్‌కు యిచ్చిన దగ్గర్నుంచి అతను జుహు ప్రాంతంలో వున్న తమ కమలా కాటేజీలో వుంటున్నాడు. అయితే ఆ భవనం మీద పెద్ద కొడుకు మధుపతి 2015లో కేసు వేశాడు. ఆ పెద్ద కొడుకు 'నీ ఆస్తితో నాకు కానీ, నా పిల్లలకు ఏ సంబంధం లేదు' అని 1998లోనే రాసి యిచ్చేసి సింగపూరులో హాయిగా బతుకుతున్నాడు. అతనికి 45 వేల డాలర్ల విహారనౌక వుంది కూడా.
అతనికి ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు. ఇప్పుడు వాళ్లు మా తాతకు వారసత్వంగా వచ్చిన ఆస్తిలో మాకు వాటా రావల్సిందే, అది అఖ్కర్లేదనే హక్కు మా నాన్నకి లేదు అంటూ కోర్టుకి వెళ్లారు. మీకు 18 ఏళ్లు వచ్చిన ఏడాదిలోగానే వచ్చి అడగాలి కదా, రాలేదేం? అని అడిగింది హైకోర్టు. మాలో ఆఖరివారికి 18 ఏళ్లు వచ్చేవరకు మా కీ సంగతే తెలియదు అని చెప్తున్నారు వాళ్లు. కమలా కాటేజి విషయంలో 2008లో తమ మధ్య జరిగిన ఒప్పందాన్ని తండ్రి అమలు చేయలేదు కాబట్టి ఆ కాటేజీ ఖాళీ చేయాలని మధుపతి కోర్టు ఆర్డరు తెచ్చుకున్నాడు. అప్పణ్నుంచి విజయపత్ కమలా కాటేజీ ఖాళీ చేసి బ్రీచ్ కాండీలో ఒక డూప్లెక్స్ యింట్లో నెలకు రూ.7 లక్షలు అద్దె యిచ్చి వుంటున్నాడు. ఒప్పందం రద్దుపై తను కంపెనీపై కేసు వేశాను కాబట్టి అది తేలేవరకూ ఆ అద్దె కంపెనీయే కట్టాలి అని మరో కేసు వేశాడు.
'కొడుకుగా తండ్రి పట్ల నా బాధ్యత వేరు. కానీ ఒక సిఎండిగా కంపెనీ ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత కూడా నాకుంది. రెండేళ్లగా నష్టాల్లో వున్న కంపెనీకి 2016-17లో అయిదున్నర కోట్ల అమ్మకాలు, 26 కోట్ల రూ.ల లాభం వచ్చేట్లు శ్రమించాం. నా రక్తబంధువులకు మేలు, కంపెనీకి హాని కలిగించే యీ డీల్ ద్వారా షేర్‌హోల్డర్లకు అన్యాయం చేయనా?' అని గౌతమ్ ప్రశ్న. 'నా కొడుకు నా అలనాపాలనా చూడటం లేదు, పట్టించుకోవటం లేదు' అని ఆక్రోశించడం వేరు. తను సిఎండిగా వుంటూ కూడా కంపెనీని దోచి నాకు పెట్టడం లేదు అని ఆవేదన చెందడం వేరు. గౌతమ్‌ను అడిగితే 'గత రెండేళ్లగా దాదాపు 15 సందర్భాల్లో మా మధ్య విభేదాలు వచ్చాయి. పరిష్కరించుకున్నాం.' అని చెప్తున్నాడు. ఏ కారణం చేతనైనా యీ విషయంలోనూ తండ్రీకొడుకులు రాజీ పడిపోయి, పదోవంతు రేటుకే ఫ్లాట్లు కట్టబెట్టేస్తే అప్పుడు ఆవేదన చెందేది షేర్‌హోల్డర్లు!
(ఫోటో – విజయపత్, గౌతమ్, రేమాండ్ హౌస్)
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]