Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: జై లవ కుశ

సినిమా రివ్యూ: జై లవ కుశ

రివ్యూ: జై లవ కుశ
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌
తారాగణం: ఎన్టీఆర్‌ (త్రిపాత్రాభినయం), రాశి ఖన్నా, నివేదా థామస్‌, సాయికుమార్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, బ్రహ్మాజీ, హంసానందిని, తమన్నా తదితరులు
కథనం: కోన వెంకట్‌, చక్రవర్తి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
ఛాయాగ్రహణం: చోటా కె నాయుడు
నిర్మాత: కళ్యాణ్‌రామ్‌ నందమూరి
కథ, దర్శకత్వం: కె.ఎస్‌. రవీంద్ర (బాబీ)
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 21, 2017

ఎలాంటి పాత్ర అయినా అలవోకగా లీనమైపోయి, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించడం చాలా కొద్ది మంది నటుల వల్లే సాధ్యం. ఈ జనరేషన్‌ నటుల్లో అత్యుత్తమ శ్రేణికి చెందిన ఎన్టీఆర్‌ మరోసారి తను ఎంత గొప్ప నటుడనేది 'జై లవ కుశ'లో చూపించాడు. త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి రియల్‌ ఛాలెంజ్‌ విసిరింది మాత్రం 'జై' క్యారెక్టర్‌. సొంత వాళ్లే తనని చులకనగా చూడడంతో సమాజంపై కసితో పెరిగిన జై పాత్రని 'రావణాసురుడి' పాత్ర స్ఫూర్తిగా తీర్చిదిద్దారు. ఆ పాత్రని ఎన్టీఆర్‌ అర్థం చేసుకున్న తీరు, ఆ పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకున్న వైనం, 'రావణ్‌ మహరాజ్‌'ని తెరపై ఆవిష్కరించిన విధానం 'జై జై' నాదాలు అందుకుంటుంది.

'ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా నేను రెడీ' అంటూ తనకిచ్చిన ఛాలెంజ్‌కి ఎన్టీఆర్‌ ఇచ్చిన ఆన్సర్‌ని తెరపై చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 'జై' ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే కాకుండా, ఈ దశాబ్ధంలో వచ్చిన అత్యంత రసవత్తరమైన అభినయంగా చిరకాలం గుర్తుండిపోతుంది. ఎన్టీఆర్‌ జై పాత్రని ఎంత గొప్పగా పోషించాడంటే, మిగతా రెండు పాత్రలతో తనే దానిని మ్యాచ్‌ చేయలేకపోయాడు.

ఎన్టీఆర్‌ తన వంతుగా ఈ చిత్రానికి చేయగలిగిన దానికంటే ఎక్కువే చేసినప్పటికీ, సినిమాగా 'జై లవకుశ' సగటు స్థాయిని దాటి వెళ్లలేకపోయిందంటే కారణం మాత్రం కథనమే. ఇంత బలమైన కథ వున్నప్పటికీ దానికి ఆకట్టుకునే కథనం సమకూరలేదు. ఒకటి, రెండు సన్నివేశాలు మినహా ఇంపాక్ట్‌ వేసేంత స్టఫ్‌ వున్న సీన్లు లేవు. ఎన్టీఆర్‌ అభినయం వల్ల కొన్ని సందర్భాల్లో కాంటెంట్‌ వీక్‌గా వున్నా కానీ కవర్‌ అయిపోయింది కానీ, లేదంటే ఈ పాత్రకి తగిన సన్నివేశాలని రాయడంలో అయితే రచయితలు విఫలమయ్యారు.

జై పాత్రకి ఇచ్చిన బిల్డప్‌కి తగ్గ స్ట్రయికింగ్‌ సీన్‌ ఒక్కటీ లేకపోవడం బాధాకరం. పైగా ఇంటర్వెల్‌కి కానీ ఎంటర్‌ అవని జై క్యారెక్టర్‌ వచ్చేవరకు వున్న సీన్లు విసిగిస్తాయి. కుశ, లవ ఇద్దరి బ్యాక్‌స్టోరీ ఆకట్టుకునేలా లేదు. ముఖ్యంగా లవ లవ్‌స్టోరీ కానీ, అతనికి బ్యాంక్‌లో ఎదురయ్యే సమస్యలు కానీ చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఒకానొక పాయింట్‌ చేరేసరికి జై క్యారెక్టర్‌ ఎంట్రీ కోసం రెస్ట్‌లెస్‌గా ఎదురు చూసే పరిస్థితి వస్తుంది.

ఇంటర్వెల్‌కి ముందు జై ఎంటర్‌ అయిన దగ్గర్నుంచి, ఇంటర్వెల్‌ తర్వాత ఒక రెండు ఎపిసోడ్స్‌ వరకు గ్రాఫ్‌ బాగా రైజ్‌ అవుతుంది. అయితే అదే టెంపో మెయింటైన్‌ చేయడంలో దర్శకుడు బాబీ సక్సెస్‌ కాలేదు. జై లవ కుశల మధ్య డ్రామాకి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి కూడా స్కోప్‌ ఇవ్వలేదు. కామెడీ అనుకున్న సీన్లు తేలిపోవడం, పొలిటికల్‌ నేపథ్యంలో వచ్చే సీన్లలో విషయం లోపించడంతో పూర్తిగా జై అభినయంపై ఆధారపడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.

జై చావు కోరుకునే ఊరి ప్రజలు, రైతుల కష్టాలు గురించి అతను రెండు మాటలు చెప్పేసరికి కరిగిపోయి, అతడిని ఆర్తిగా చూసేయడం, ఒక్కసారిగా అతనిపై ఆదరాభిమానాలు పెరిగిపోవడం సినిమాటిక్‌గా వుంటుంది. అదే విధంగా జైని చంపేయాలని చూస్తోన్న నివేద కూడా అతని సోదరుడు చెప్పిన లొల్లాయి కథ విని 'ఐ టూ లవ్యూ' అనేయడం చూస్తే... ఇంత సులువైన పనుల కోసం తమ్ముళ్లని అంత కష్టపడి జై తీసుకురావడమెందుకనే భావన కలిగిస్తాయి. సన్నివేశాల పరంగా డెప్త్‌ లేదు. కథనంలో ఒక ఫ్లో లేదు. అడపాదడపా జై మెరిపించే మెరుపులు మినహా, పతాక సన్నివేశాలకి ముందు వచ్చే 'నాటకం' సీన్‌ తప్ప 'జై లవకుశ' చాలా సాధారణంగా ముందుకి సాగుతుంది. 'ఫాన్‌ మూమెంట్స్‌' క్రియేట్‌ చేయడంలో కూడా దర్శక, రచయితలు విఫలం కావడం ఆశ్చర్య పరుస్తుంది.

మామూలుగా కథ, బలమైన పాత్రలు లేనపుడు ఏమి చేయాలో పాలుపోని అయోమయం నెలకొంటుంది. కానీ ఇందులో చక్కని కథ, పాత్రలు సెట్‌ అయినా కానీ వాటిని ఎలివేట్‌ చేసే సన్నివేశాలు, డ్రామా లేకుండా పోయాయి. ఎన్టీఆర్‌ కాకుండా మిగతా పాత్రల్లో ఎవరికీ గుర్తుండే క్యారెక్టర్‌ దక్కలేదు... హీరోయిన్లతో సహా. హోల్‌ అండ్‌ సోల్‌గా ఎన్టీఆర్‌ భుజాలపై మోపేసిన ఈ చిత్రాన్ని అతడే పడిపోకుండా నిలబెట్టాడు.

కనీసం ఎన్టీఆర్‌కి తెర వెనుక నుంచి కూడా సాయం దక్కలేదు. దేవిశ్రీప్రసాద్‌ పాటలు సోసోగానే వున్నాయి తప్ప అతని స్థాయికి తగ్గట్టు అనిపించలేదు. నేపథ్య సంగీత పరంగా కూడా మెరుపులేం లేవు. ఛాయాగ్రహణం బాగానే వుంది కానీ స్టాండ్‌ అవుట్‌ అయ్యేట్టు లేదు. సంభాషణలు, ప్రొడక్షన్‌ డిజైన్‌ ఇలా ఏది చూసినా కానీ 'టాప్‌ క్లాస్‌' అనిపించే అవుట్‌పుట్‌ ఎక్కడా లేదు. కథా రచయితగా మంచి 'సంఘర్షణ' వున్న కథ రాసుకున్న బాబీ దర్శకుడిగా దానిని ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్‌ చేయలేకపోయాడు. ఎన్టీఆర్‌ కోసం ఒక అద్భుతమైన మాస్‌ క్యారెక్టర్‌ని రాసుకుని మరీ దానిని ఎలివేట్‌ చేసే సన్నివేశాలు వేసుకోకోపోవడం ఆశ్చర్యకరం.

ఎన్టీఆర్‌ అభినయంతో ఒకసారి చూడదగ్గ చిత్రం అనిపించిన 'జై లవకుశ'కి కాస్త ఎఫెక్టివ్‌ డ్రామా జోడించినా, కాసిని ఎలివేషన్‌ సీన్లు పడి వున్నా, లవ కుశ పాత్రల నేపథ్యంపై ఇంకాస్త కేర్‌ తీసుకుని వున్నా ఎండ్‌ ప్రాడక్ట్‌ మరోలా వుండేది. తెరపై జైగా ఈ చిత్రాన్ని యావరేజ్‌గా నిలబెట్టిన ఎన్టీఆర్‌... బాక్సాఫీస్‌ వద్ద తన స్టార్‌ పవర్‌తో సక్సెస్‌ వైపు పుల్‌ చేయాల్సిందే. అదెంతవరకు చేస్తాడనేది ఈ చిత్రానికి వచ్చే ఆరంభంపైనా, తర్వాత రాబోతున్న దసరా సినిమాల ఫలితాలపైనా ఆధారపడుతుంది.

బాటమ్‌ లైన్‌: రావణ్‌ మహరాజ్‌కీ జై!

- గణేష్‌ రావూరి

జై లవ కుశ పబ్లిక్ టాక్ కోసం క్లిక్ చేయండి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?