తన దేశంలో ఎదురు లేకుండా వెలుగుతున్న పుటిన్ను భయపెట్టగలిగిన గండరగండడు ఒకడు రష్యాలోనే ఉన్నాడు అని 2023 జూన్ 23న నిరూపించుకున్న ప్రిగోజిన్ సరిగ్గా రెండు నెలల తర్వాత అంటే ఆగస్టు 23న మరో 9మందితో పాటు విమానప్రమాదంలో చనిపోయి శవమై తేలాడన్న వార్త రాగానే ఆశ్చర్యంతో పాటు అపనమ్మకమూ కలిగింది. 2019లో యిలాగే ప్రమాదంలో పోయాడనుకున్న ప్రిగోజిన్ మూడు రోజుల్లో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఈ సారీ అంతేనేమో అనుకుంటే అతని మరణవార్తను రష్యా ధృవీకరించింది. చివరకు మొన్న 29న అతని అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. ప్రిగోజిన్ జూన్‌లో మాస్కోపై దండెత్తినపుడు పుటిన్ వెనక్కి తగ్గి అతనితో రాజీ పడడం, వ్యూహంలో భాగమే అని యిప్పుడనిపిస్తోంది. ఎందుకంటే యీ ప్రమాదంలో పుటిన్ హస్తం ఉందని, తనకు ఎదురు తిరిగినవాళ్ల గతి యింతే అని పుటిన్ మరొక్కసారి హెచ్చరించాడని అందరికీ అనుమానం. ఇంతకీ ప్రిగోజిన్ తయారుచేసిన కిరాయి సేన వాగ్నర్ గతేమౌతుంది?
ప్రిగోజిన్‌ను ‘పుటిన్ వంటవాడు’గా మీడియాగా అభివర్ణిస్తూ వచ్చింది. డైనింగు టేబుల్ వద్ద పుటిన్ వెనక్కాల అతను నిలబడి విశిష్ట అతిథులకు ఐటమ్స్ వడ్డించిన ఫోటోలు గుప్పించింది. అతను తిరుగుబాటు చేయగానే ‘గరిట తిప్పిన చేత్తోనే…’ అంటూ తెలుగుమీడియా కవిత్వం అల్లింది కూడా. అది చదివితే యితను పుటిన్ యింట్లో పనివాడనుకునే ప్రమాదం ఉంది. అబ్బే, అతను రెస్టారెంట్ చెయిన్‌కు అధిపతి. వంటింట్లోకి ఎప్పుడైనా వెళ్లాడా లేదో! వృత్తిరీత్యా అతను వంటాడు కాదు, దొంగాడు. 1961లో సెయింట్ పీటర్స్బర్గ్ (కొంతకాలం లెనిన్గ్రాడ్ అని పిలిచేవారు)లో పుట్టాడు. తల్లి ఆసుపత్రిలో నర్సుగా పని చేసేది. అతని తండ్రి చిన్నప్పుడే పోతే తల్లి ఝార్కో అనే అతన్ని పెళ్లాడింది. సవతి తండ్రి స్కీయింగ్ కోచ్. అందువలన స్కూల్లో ఉండేటప్పుడే ప్రిగోజిన్‌కు స్కీయింగ్ నేర్పించాడు. విద్య అబ్బలేదు కానీ పెడబుద్ధులు అబ్బాయి. 18వ ఏట దొంగతనం నేరానికై ఒక శిక్షపడి, ఒక కాలనీలో నిర్బంధంగా పని చేయవలసి వచ్చింది.
ఒక ఏడాది తర్వాత విడుదలై, సొంతూరికి వచ్చి తనలాటి వాళ్లతో కలిసి మళ్లీ దొంగతనాలు, దోపిడీలు మొదలుపెట్టాడు. రెండేళ్ల తర్వాత 13 ఏళ్ల శిక్షపడి జైల్లో గడిపాడు. తొమ్మిదేళ్ల విడుదలయ్యాడు. తన జైలు జీవితం గురించి ఎప్పుడూ చెప్పుకునేవాడు కాదు. ఆ విషయం రాసిన మీడియాపై కేసులు పెట్టాడు కూడా. అతనికి పెళ్లయి, యిద్దరు పిల్లలు. 1990లో తన ఊళ్లోనే ఒక పాత బస్తీలో హాట్ డాగ్స్ అమ్మే చిన్న రెస్టారెంటు తెరిచాడు. నెలకో వెయ్యి డాలర్లు సంపాదించేవాడు. బాగానే ఉందే అనుకుంటూండగా ఒక సూపర్ మార్కెట్ చెయిన్‌కు మేనేజరు ఉద్యోగం వచ్చింది. అది బాగా చేయడంతో దానిలో వాటా యిచ్చారు. 1992 నాటికి అతనికి ఆ ఊరి మేయరు గారి అనుచరులతో పరిచయాలు ఏర్పడ్డాయి. నెమ్మదినెమ్మదిగా రెస్టారెంట్లు, దుకాణాలు తెరుస్తూ పోయి, వాటన్నిటినీ తన తల్లిని ప్రొప్రయిటర్‌గా పెట్టి స్థాపించిన కాన్కార్డ్ కేటరింగు అనే కంపెనీ పేరు మీదుగా నిర్వహించసాగాడు.
1996 వచ్చేసరికి ‘ఓల్డ్ కస్టమ్ హౌస్’ అనే పేర ఒక విలాసమైన హోటల్ తెరిచాడు. అది ధనికులను, అధికారులను కూడా ఆకర్షించింది. మేయరు గారు అప్పుడప్పుడు వస్తూండేవాడు. అతనితో పాటు డిప్యూటీ మేయరు కూడా! అతనే పుటిన్. అప్పణ్నుంచి వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 2000 నాటికి పుటిన్ దేశాధ్యక్షుడు అయ్యాడు. ప్రిగోజిన్ వ్యాపారం విస్తరిస్తూ పోయింది. సెయింట్ పీటర్స్బర్గ్లోను, మాస్కో లోను యింకాయింకా రెస్టారెంట్లు తెరుస్తూ పోయాడు. 2002 నాటికి నాలుగున్నర లక్షల డాలర్లతో ‘‘న్యూ ఐలండ్’’ పేర ఒక ఫ్లోటింగ్ రెస్టారెంటు తెరిచాడు. ఎంత ఎదిగినా అతను వినయంగా తమ వెనక నిలబడి వడ్డించడం పుటిన్ను మెప్పించింది. జపాన్ ప్రధానమంత్రిని, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ను కూడా ఆ రెస్టారెంటుకి పిల్చుకుని పోయాడు. 2003లో తన పుట్టినరోజుని అక్కడే జరుపుకున్నాడు. ప్రిగోజిన్‌కు కాంట్రాక్టులు యిప్పించసాగాడు.
2002 తర్వాత ప్రిగోజిన్ తన భాగస్వాములతో విడిపోయి వ్యాపారాన్ని విస్తరిస్తూ పోయాడు. మాస్కోలోని స్కూళ్లకు, కాలేజీలకు కేటరింగు చేసే కాంట్రాక్టు తెచ్చుకున్నాడు. 2005 నాటికి తనది రష్యాలో కల్లా పెద్ద కేటరింగు చెయిన్ అయ్యిందని ప్రిగోజిన్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత రష్యన్ ఎమర్జన్సీ సర్వీసెస్‌కు సప్లయి చేయసాగాడు. పై అధికారుల అండదండలుండడంతో బాటు దీనిలో ఓ ట్రిక్కు కూడా ఉందని తర్వాత బయటకు వచ్చింది. రెస్టారెంట్లో తాగుతూ, తింటూ పిచ్చాపాటీ మాట్లాడుతూ అనేక విషయాలు నోటివెంట దొర్లడం కద్దు. వాటిని జాగ్రత్తగా విని తనకు చెప్పమని ప్రిగోజిన్ తన ఉద్యోగులను ఆదేశించేవాడు. ఆ విధంగా అతని వద్ద చాలా సమాచారం పోగుపడేది. దాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటూ 2013 నాటికి మొత్తం మిలటరీ వాళ్ల ఆహారపదార్థాల కాంట్రాక్టుల్లో 90శాతం తెచ్చుకునే స్థాయికి అతను ఎదిగాడు. ఆహారపదార్థాలే కాకుండా మిలటరీ బారక్స్, స్కూల్స్, ఆఫీసుల్లో క్లీనింగ్ అండ్ లాండ్రీ సర్వీసుల కాంట్రాక్టులు కూడా సంపాదించాడు. తిరుగుబాటు తర్వాత యివన్నీ రద్దయ్యాయనుకోండి.
ఈ కాంట్రాక్టులతో పాటు ప్రిగోజిన్ రియల్ ఎస్టేటు, మీడియా రంగాలకు కూడా వ్యాపించాడు. ‘ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజన్సీ’ పేర 2013లో నెలకొల్పిన సంస్థ సోషల్ మీడియాను మేనేజ్ చేయడానికి ఉద్దేశించినది. తమకు అనుకూలమైన, ప్రత్యర్థులకు ప్రతికూలమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసి ట్రోల్ చేయడానికి ఉద్యోగులను నియమించి, ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ప్రయత్నం చేసే సంస్థ అది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో హిల్లరీ క్లింటన్‌ను ఓడించడానికి యీ సంస్థ తన సేవలు వినియోగించిందని ఎఫ్బిఐ ఆరోపణ. ఆమె ఓడిపోవాలని పుటిన్ గాఢంగా వాంఛించి, యీ సంస్థ ద్వారా హిల్లరీకి వ్యతిరేకంగా డిస్ఇన్ఫర్మేషన్ కాంపెయిన్ నడిపాడని ఎఫ్‌బిఐకి గట్టి నమ్మకం. ప్రిగోజిన్‌ను వాంటెడ్ వ్యక్తిగా ప్రకటించి అతన్ని పట్టించే సమాచారం యిచ్చినవారి 2.50 లక్షల డాలర్లు యిస్తానని ప్రకటించింది.
ఆ ట్రోల్ ఫ్యాక్టరీకి తనకు సంబంధం ఉందని ప్రిగోజిన్ యీ ఏడాది ఫిబ్రవరిలోనే ఒప్పుకున్నాడు. ‘‘నేను ఆ సంస్థకు ఆర్థికసాయం మాత్రమే చేశానని అనుకోకండి. నేనే దాన్ని సృష్టించాను, చాలాకాలం నడిపాను. పాశ్చాత్య దేశాలు రష్యా గురించి చేసే దుర్మార్గపు దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికే అలా చేయాల్సి వచ్చింది.’’ అని చెప్పుకున్నాడు. అతను చాలాకాలం పాటు మీడియాతో నాకెలాటి సంబంధాలు లేవు అని చెప్పుకునేవాడు. కానీ 2019లో పేట్రియాట్ మీడియా పేరుతో సంస్థ పెట్టి దాని అధిపతిగా ముందుకు వచ్చినపుడు అంతా తేటతెల్లమైంది. దానికి వెబ్‌సైట్స్‌తో సహా అనేక మీడియా ఔట్లెట్స్ ఉన్నాయి. తిరుగుబాటు జరిగాక యీ వెబ్సైట్లను ప్రభుత్వం బ్లాక్ చేసింది. ప్రిగోజిన్ ప్రస్తుతం వార్తల్లోకి ఎక్కింది, కేటరింగు, మీడియా, రియల్ ఎస్టేటు రంగాల్లో పాత్ర గురించి కాదు. ఒక పిఎంసి అధినేతగా! దాని గురించి కాస్త చెప్పాలి.
పిఎంసి (ప్రయివేటు మిలటరీ కంపెనీ)లనేవి యితనితో ప్రారంభం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా యీ కిరాయి సేనలున్నాయి. దేశప్రముఖులకు సెక్యూరిటీ యివ్వడానికి, సైన్యానికి తర్ఫీదు యివ్వడానికి, స్పెషల్ ఆపరేషన్స్ ఎలా నిర్వహించాలో, ఏ విధమైన ఆయుధాలు కొనాలో సలహాలు యివ్వడానికి అనేక దేశాలు వీటి సేవలను వినియోగించు కుంటాయి. ఇతర దేశాల వ్యవహారాల్లో ప్రభుత్వాలు నేరుగా జోక్యం చేసుకోలేని సందర్భాల్లో యీ కిరాయి సేనలను వాడుతూ వచ్చారు. ఆ పని చేసే క్రమంలో వాళ్లు చేసే అక్రమాలకు యీ దేశం బాధ్యత వహించదు. ఒకవేళ అప్రతిష్ఠపాలైనా తమకేమీ తెలియదని చేతులు దులిపేసుకోవచ్చు. గెలిస్తే తమకు కావలసినది జరిగిందని సంతోషించవచ్చు. ఓడిపోతే దేశప్రజల ముందు సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరం పడదు. ప్రభుత్వ బజెట్‌లో వీళ్ల కోసం చేసే వ్యయాన్ని వేరే పేరుతో చూపిస్తూ ప్రజల కళ్లు గప్పుతూంటారు.
రష్యాలో మాత్రం యివి చట్టప్రకారం నిషిద్ధం. కానీ రష్యన్లను తమ సేనల్లో నియమించుకోవాలని యితర దేశాల వారు ప్రయత్నించారు. దక్షిణాఫ్రికా తెల్లవాళ్ల పాలనలో ఉండగా అధికారం చలాయించిన ఈబెన్ బార్లో అనే అతను ఆఫ్రికాలో పిఎంసి కాంట్రాక్టరుగా ఉన్నాడు. అతను 2010లో ‘మిలటరీ రంగంలో సహకారానికి కొత్త మార్గాలు’ అనే అంశంపై మాట్లాడ్డానికి సెయింట్ పీటర్స్బర్గ్కు వచ్చాడు. దానితో పాటు పిఎంసిలపై రష్యన్ మిలటరీ అధికారులకు వివరించాడు. అంతకు ముందే రష్యాలో యివి ఉన్నాయో లేదో తెలియదు కానీ అప్పణ్నుంచి వాటి కార్యకలాపాలు పెరిగాయంటారు. ఆర్ఎస్బి గ్రూప్, ఎంఏఆర్, ఎటికె గ్రూప్, స్లావోనిక్ కార్ప్స్ ప్రముఖమైనవి.
స్లావోనిక్కి మాతృసంస్థ 2008లో వెలసిన మోరాన్ సెక్యూరిటీ గ్రూపు. సముద్రపు దొంగల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేదది. 2013లో దానిలో నుంచి కొందరు విడిగా వచ్చి సిరియాలోని బషీర్ అల్ అసాద్ ప్రభుత్వం కట్టే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు రక్షణ కల్పించసాగారు. కానీ సిరియాలో స్లావోనిక్ అంత బాగా పనిచేయలేదు. దానిలో నుంచి కొందర్ని తీసుకుని, మిలటరీలోంచి రిటైరయిన వాళ్లను కొందర్ని కలిపి ప్రిగోజిన్ వాగ్నర్‌ను తయారు చేశాడు. 2014లో యితర పిఎంసిలతో పాటు ఉక్రెయిన్‌లోని క్రిమియా రష్యా వశం అయ్యేట్లు చేశాడు. సిరియా, వెనిజువెలాతో పాటు సుడాన్, మాలి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికన్, మొజాయింబిక్, లిబ్యా వంటి ఆఫ్రికా దేశాలలో కూడా అధినేతలకు సెక్యూరిటీ, మిలటరీకి సహాయం వంటివి చేపట్టాడు.
వాగ్నర్ మొత్తం 11 మిలటరీ ఆపరేషన్స్‌లలో పాలు పంచుకుంది. దీనివలన వాగ్నర్‌కు డబ్బులు వచ్చాయి. అమెరికాను వ్యతిరేకించే దేశాల్లో రష్యా పలుకుబడి పెరిగింది. 2014లో 250 మందితో ప్రారంభమైన వాగ్నర్ 2016 నాటికి వెయ్యికి పెరిగి, 2017 నాటికి 6 వేలయి, 2022 ఉక్రెయిన్ యుద్ధం నాటికి 50 వేలకు చేరింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యేవరకు 500 మంది మరణించారు. వెయ్యి మందిదాకా క్షతగాత్రులయ్యారు. ఉక్రెయిన్ యుద్దంలో 21వేల మంది చచ్చిపోయారు. అనేక వేల మంది గాయపడ్డారు. వీరి జీతాలు నెలకు రూ.2 లక్షల దాకా ఉంటాయి. చనిపోతే 65 లక్షల దాకా నష్టపరిహారం యిస్తారు.
అయితే వాగ్నర్ ఉనికిని ప్రిగోజిన్ బహిరంగంగా ఎప్పుడూ ఒప్పుకోలేదు. 2022లో యూరోపియన్ యూనియన్ దానిపై అంక్షలు విధించినప్పుడు వాగ్నర్ అనేదే లేదు పొమ్మన్నాడు. కానీ అదే ఏడాది ఉక్రెయిన్ ఆపరేషన్స్కై ప్రిగోజిన్ జైలు ఖైదీలను రిక్రూట్ చేస్తున్న వీడియో బయటకు వచ్చాక ఒప్పుకోక తప్పలేదు. వాగ్నర్ కాన్కార్డ్ సంస్థకు చెందిందని, 2014లో నెలకొల్పానని అతను ప్రకటించాడు. 2014లో మైదాన్ విప్లవం ద్వారా ఉక్రెయిన్‌లో అధికారం చేతులు మారాక, ఉక్రెయిన్‌లో ఖనిజాలకు, పరిశ్రమలకు ఆటపట్టయిన డాన్బాస్ ప్రాంతంలో అంతర్యుద్దం చెలరేగింది. అప్పుడు యీ పిఎంసిలకు పని పడింది. సాధారణ పౌరులమని చెప్పుకుంటూ యీ కిరాయి సైనికులు వీధియుద్దాలు చేశారు.
2015 వరకు వాగ్నర్ సంస్థ రష్యా ఫారిన్ మిలటరీ ఇంటెలిజెన్స్ సర్వీసుకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ దిమిత్రీ ఉట్కిన్ (ఇతనూ ప్రిగోజిన్‌తో పాటు ఆగస్టు 23 ప్రమాదంలో చనిపోయాడు) పర్యవేక్షణలో జరిగిందంటారు. ఇప్పటికి కూడా వాగ్నర్ మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వాడుతుంది, దాని సైనికులకు మిలటరీ ఆసుపత్రులలో చికిత్స జరుగుతుంది, దానికి ఆయుధాలు మిలటరీ నుంచే వస్తాయి, వాగ్నర్ సభ్యుల పాస్‌పోర్టులను డిఫెన్స్ శాఖే జారీ చేస్తుంది. వాగ్నర్-రష్యా ప్రభుత్వం లింకుల గురించి యింకా ఏమైనా సందేహాలుంటే తీర్చేయడానికి పుటిన్ తిరుగుబాటు తర్వాత జూన్ 24న మాట్లాడుతూ ‘‘2022 మే నుంచి 2023 మే మధ్య వాగ్నర్‌కు ప్రభుత్వం నుంచి బిలియన్ డాలర్స్ ముట్టాయి.’’ అని చెప్పేశాడు.
ఇంత పెద్దమొత్తంలో డబ్బు ముట్టచెప్పడానికి కారణం ఏమిటంటే ఉక్రెయిన్ యుద్ధం. యుద్ధం ప్రారంభించినపుడు యింతకాలం కొనసాగుతుందని పుటినూ అనుకోలేదు, రష్యన్లూ అనుకోలేదు. ఉక్రెయిన్‌కు యూరోప్, అమెరికా అండగా నిలబడి యుద్ధాన్ని సాగదీస్తున్న కొద్దీ రష్యా ప్రజలు విసిగిపోతున్నారు. మన సైనికులు అనవసరంగా అక్కడ చచ్చిపోతున్నారని బాధపడుతున్నారు. అందువలన డిఫెన్సు శాఖ సైనికులు కాని సైనికులైన వాగ్నర్ వంటి కిరాయి సేనను ప్రమాదకరమైన యుద్ధక్షేత్రాలకు పంపించ సాగింది. ఉక్రెయిన్ యుద్ధ సందర్భంగా ఖైదీలను వాగ్నర్‌లో చేర్చుకోవడం ఒక ఆసక్తికరమైన అంశం. ప్రిగోజిన్ జైళ్లలోకి వెళ్లి బలం, ధైర్యం ఉన్న ఖైదీలను ఎంపిక చేసేవాడు. వాళ్లకు పుటిన్ క్షమాభిక్ష పెట్టేవాడు. జైల్లోంచి బయటకు రాగానే వాళ్లు వాగ్నర్ గ్రూపులో చేరేవారు. క్రితం ఏడాది ప్రిగోజిన్ తన సైనికుల్లో 50 వేల మంది మాజీ ఖైదీలే అని ప్రకటించాడు. (ఇది అతిశయోక్తి కావచ్చు)
ఉక్రెయిన్ యుద్ధంలో విజయాలు ప్రిగోజిన్ స్థాయిని, ప్రజల్లో ఆదరాన్ని పెంచాయి. ఆ సాకు చూపించి, తమకు యింకాయింకా నిధులు, ఆయుధాలు సమకూర్చాలని డిమాండు చేయసాగాడు. ఒక స్థాయిని మించి యుద్ధబీభత్సాన్ని సృష్టిస్తే అంతర్జాతీయంగా చెడ్డపేరు రావడమే కాదు, రష్యా ప్రజలు తనను ఏవగించుకుంటారని పుటిన్ భయం. రాజకీయ నాయకులు ఒక పరిమితి దాటి రిస్కు తీసుకోలేరు. కానీ ప్రిగోజిన్ వంటి దుస్సాహసికి యిదంతా పట్టదు. తన కిరాయి సైనికులను మిలటరీలోకి చేర్చుకోవాలని పట్టుబట్ట సాగాడు. అలా చేస్తే సైన్యంలో ఒక వర్గం అతనికి అనుకూలంగా మారి భవిష్యత్తులో సైనిక కుట్ర చేయడానికి దోహదపడుతుంది. పుటిన్ చుట్టూ ఉన్న కొందరు నాయకులు అతన్ని లిమిటు దాటవద్దంటున్నారని ప్రిగోజిన్ కోపం పెంచుకున్నాడు. నిజానికి వాళ్లంతా మొన్నటిదాకా తనకు అండగా నిలిచినవారే. కానీ యిప్పుడు అడ్డుపడుతున్నారని కోపం.
ఆ అంతరంగికులలో ముఖ్యులు 2012 నుంచి రక్షణ మంత్రిగా ఉన్న షోయిగూ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు 2008 నుంచి సెక్రటరీగా ఉన్న పాత్రుషేవ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్. ‘ఉక్రెయిన్ యుద్ధంలో దక్కిన విజయాలన్నీ మా వాగ్నర్ కారణంగానే, వీళ్లు ఆయుధాలు యివ్వకపోవడం చేతనే బాఖ్ముత్‌లో మా వాళ్లు చాలా మంది చచ్చిపోయారు. పూర్తి విజయాన్ని సాధించలేక పోతున్నాం. వాగ్నర్ సేన ప్రాణాలర్పించి దక్కించుకున్న విజయాలను షోయిగు తన ఖాతాలో వేసుకుంటున్నాడు.’ అని చెప్పుకోసాగాడు. రష్యా ముఖ్యనగరాలన్నిటిలో తన పేర హోర్డింగులు పెట్టించాడు. టీవీల్లో యాడ్స్ యిప్పించాడు. పోర్నో వెబ్సైట్లతో సహా అనేక వెబ్సైట్లలో ప్రకటనలు పెట్టించాడు. వాటిలో చనిపోయిన వాగ్నర్ వీరుల శవాలు చూపించి ‘‘షోయిగూ, వీళ్ల చావుకి కారణం నువ్వే!’ అని ఆరోపించాడు. జూన్ 23న తిరుగుబాటు ప్రారంభించినప్పుడు ‘మిలటరీ అధికారుల్లో అవినీతి పెరిగిపోయింది, ప్రొఫెషనలిజం నశించింది.’ అని అరోపించాడు.
రష్యా మిలటరీలో కొందరికి, తీవ్ర జాతీయవాదుల్లో కొందరికి పుటిన్ యింకా నిర్దాక్షిణ్యంగా యుద్ధం చేసి ఉక్రెయిన్ను తుడిచి పెట్టాలనే భావన ఉంది. ఆ భావాలు రెచ్చగొట్టి, పాప్యులారిటీ తెచ్చుకుని పుటిన్ చేత రక్షణమంత్రిగా నియమించ బడాలనే లక్ష్యంతో ప్రిగోజిన్ యిదంతా చేశాడు. తనను తాను పెద్ద జాతీయ హీరోగా చూపించుకోవడానికి, అమెరికన్ అధ్యక్ష ఎన్నికలలో తన ప్రమేయం గురించి కూడా చెప్పుకోసాగాడు. ఇదంతా పుటిన్‌కు కంపరం కలిగించింది. ఉక్రెయిన్ యుద్ధం మాట ఎలాగున్నా, రష్యన్ జాతీయవాదుల్లో అతను హీరో అయిపోయి, తనకు యిబ్బందిగా మారతాడని తోచింది. అతని ఆంతరంగికులకు కూడా ప్రిగోజిన్ భరించలేని న్యూసెన్సుగా మారాడు.
షోయిగు తన శాఖలో డిప్యూటీగా ఉన్న ప్రిగోజిన్ ఆప్తుడికి ఉద్వాసన పలికి ప్రిగోజిన్‌కు సైన్యం నుంచి సప్లయిలు అందకుండా చేశాడు. ఉక్రెయిన్ ఆపరేషన్స్ చూస్తూండే ప్రిగోజిన్ స్నేహితుణ్ని పుటిన్ మార్చేశాడు. జైళ్లలోంచి ఖైదీలను వాగ్నర్లోకి రిక్రూట్ చేసుకునే విధానానికి స్వస్తి పలికాడు. ఇప్పుడు రక్షణ శాఖ తనే నేరుగా రిక్రూట్ చేసుకోసాగింది. వాగ్నర్‌లో పని చేసేవాళ్లందరికీ ‘ఇకపై మీ బాస్ ప్రిగోజిన్ కాదు, ప్రభుత్వమే, మీరంతా డైరక్టుగా ప్రభుత్వంతో నియామక ఒప్పందాలు చేసుకోవాలి’ అని చెప్పింది. తన ప్రాముఖ్యత తగ్గిపోతోందని గ్రహించిన ప్రిగోజిన్ పుటిన్‌కు మొరపెట్టుకున్నాడు. కానీ పుటిన్ మాత్రం షోయిగు తదితరుల పక్షాన్నే నిలిచాడు.
దాంతో ప్రిగోజిన్ తిరుగుబాటు చేయడానికి నిశ్చయించుకున్నాడు. మీ రక్షణ మంత్రి కంటె నాకే ఎక్కువ పలుకుబడి ఎక్కువుంది చూసుకో అని పుటిన్కి చూపించడానికే యిది చేశాడని, పుటిన్ను గద్దె దింపడానికి కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రష్యా మిలటరీకి ఆయువుపట్టయిన రొస్తోవ్ వైపు ప్రిగోజిన్ సేన దండయాత్రకు బయలు దేరినప్పుడు యీ సమాచారం ముందుగానే సైన్యానికి ఉప్పందింది. వాళ్లు సర్వసన్నద్ధంగా ఉన్నారు. వాగ్నర్ టాంకులు ముందుకు సాగకుండా రోడ్లను తవ్వేశారు. కొన్ని వంతెనలు కూల్చేశారు. జూన్ 24న ప్రిగోజిన్ రొస్తోవ్‌ను కొన్ని గంటల్లోనే తమ నియంత్రణలోకి తీసుకున్నామని, కానీ రష్యన్ రక్తాన్ని వీధుల్లో చిందించమని ప్రకటిస్తూ వీడియో రిలీజు చేయడంతో పౌరులందరూ హమ్మయ్య అనుకున్నారు. రొస్తోవ్లో ఉన్న మిలటరీ అధికారులు రక్షణ మంత్రికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టే ఆ నగరం సులభంగా పట్టుబడిందని అంటున్నారు.
ఇక ప్రిగోజిన్ రెట్టించిన ఉత్సాహంతో మాస్కో వైపు కదిలాడు. తమ వద్ద 25 వేల మంది సైనికులున్నారని అతను ప్రకటించినా వాస్తవానికి 8 వేల మంది కంటె ఎక్కువ లేరని కొందరంటున్నారు. మాస్కోలో ఉన్న రష్యన్ సైన్యం వాగ్నర్ దండయాత్రను ఎదుర్కోవడానికి తయారైంది. పౌరులందర్నీ యిళ్లలోనే ఉండమన్నారు. సాధారణ పోలీసులకు కూడా మెషిన్ గన్స్ యిచ్చారు. రొస్తోవ్లో లాగానే రోడ్లు తవ్వేశారు. పుటిన్ సింహాసనం కదిలిపోతుందా అని ప్రపంచమంతా ఉగ్గబట్టుకుని చూసింది. వాగ్నర్ సేన మాస్కోకు 200 కిమీ ల దూరంలో ఉండగానే, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో రంగప్రవేశం చేసి పుటిన్, ప్రిగోజిన్ల మధ్య రాజీ కుదిర్చాడు. ప్రిగోజిన్ దండయాత్ర విరమించి, తన సైన్యాన్ని వెనక్కి పంపాడు. మిన్స్క్ ఎయిర్‌పోర్టు నుంచి తన సొంత విమానంలో ప్రిగోజిన్ సురక్షితంగా దేశం విడిచి వెళ్లడానికి పుటిన్ అంగీకరించాడు.
తనను వ్యతిరేకించిన వారిని మట్టుపెట్టే పుటిన్ యింత ఔదార్యంతో ఎలా వెళ్లనిచ్చాడాని అందరూ ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు, వాగ్నర్ ఆఫీసు నుంచి సైన్యం స్వాధీనం చేసుకున్న క్యాష్, బంగారాన్ని (మొత్తం విలువ 10 బిలియన్ రూబుల్స్ ఉంటుందట) జులై 4న మిలటరీ అతని తరఫున వచ్చిన డ్రైవరుకి అప్పగించేసిందట. వాగ్నర్ సేనపై పెట్టిన దేశద్రోహం కేసులన్నీ రష్యా ప్రభుత్వం ఎత్తివేసింది. దేశం విడిచి బయటకు వెళ్లాక ప్రిగోజిన్ జులై 3న ‘నా తిరుగుబాటు దేశద్రోహుల మీదనే! దేశప్రజల్లో చైతన్యం తెచ్చాను. దీని ఫలితాలు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు’ అని ప్రకటించాడు. తన మరణానికి కాస్త ముందు ఆఫ్రికాలో ప్రజల పక్షాన యుద్ధం చేస్తానని ప్రిగోజిన్ ప్రకటించాడు. పుటిన్ అప్పటికి కాస్త వెనక్కి తగ్గి, ఆగస్టులో ప్రిగోజిన్‌పై కక్ష సాధించాడని యిప్పుడు అనుకోవలసి వస్తోంది.
ప్రిగోజిన్ కారణంగా పుటిన్ యిమేజి దెబ్బ తిందని పాశ్చాత్య మీడియా అప్పుడు రాసినప్పుటికి కొందరు విశ్లేషకుల ప్రకారం ప్రిగోజిన్ ఉదంతం కారణంగా పుటిన్ మరింత బలపడ్డాడు. రష్యాలో ఉదారవాదులు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పుటిన్ను తప్పు పడుతూ వచ్చారు. మరో పక్క ‘ఏంగ్రీ పేట్రియాట్స్’ పేర ప్రిగోజిన్ వంటి కొందరు పుటిన్ యుద్ధాన్ని మరింత తీవ్రం చేసి, అణ్వాయుధాలను ఉపయోగించైనా ఉక్రెయిన్ను తుడిచి పెట్టేయాలని, పాత సోవియట్ బ్లాక్‌లోని దేశాలను కూడా స్వాధీనం చేసుకోవాలని వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రిగోజిన్ ఏంగ్రీ పేట్రియాట్లు ఎలా ఉంటారో రుచి చూపించాడు. పుటిన్‌కు ప్రత్యామ్నాయంగా విపరీత జాతీయవాదానికి, తీవ్రహింసకు ప్రతీకగా ముందుకు వచ్చిన వాగ్నర్‌ను చూస్తే అంతకంటె పుటిన్ నయం కదా అనిపించిందట వాళ్లకి. 2024 అధ్యక్ష ఎన్నికలలో పుటిన్ గెలుపుకి యిది దోహదపడుతుందో లేదో చూడాలి.
ఎందుకు వెనక్కి తగ్గి ఉంటాడు? వాగ్నర్ పట్ల రష్యన్లకు అభిమానం ఉండడం సహజం. ఎందుకంటే సోవియట్ బ్లాక్‌కు వెలుపల రష్యాకున్న ఏకైక నేవల్ బేస్ సిరియాలో ఉంది. దాన్ని రక్షించినది, క్రిమియాను రష్యాకు దక్కేట్లు చేసినది, రష్యన్ సైన్యానికి కూడా కొరుకుడు పడని బఖ్మూత్ నగరంలో విజయాన్ని సాధించినదీ వాగ్నరే! ఆఫ్రికాలో రష్యా పలుకుబడిని నిలిపి ఉంచినదీ వాగ్నరే! ప్రిగోజిన్ తిరుగుబాటు తర్వాత పుటిన్ వారందర్నీ దేశద్రోహులుగా ప్రకటించి వేలాది వాగ్నర్ సైనికులను చంపేస్తే, రష్యన్లు హర్షించరు. అందుకని అప్పటికి మెత్తబడి, తర్వాత వాగ్నర్ తలకాయ యైన ప్రిగోజిన్‌ను తీసేశాడు. విమాన ప్రమాదం తర్వాత ప్రిగోజిన్‌కు నివాళి అర్పిస్తూ ‘గొప్ప వ్యాపారవేత్త, కానీ కొన్ని తప్పులు చేశాడు’ అన్నాడు.
అతనితో పాటు మరణించిన వాగ్నర్ వీరులను దేశద్రోహులని అనలేదు. మరో పక్క మిలటరీలో ప్రిగోజిన్‌కు సన్నిహితుడు, తిరుగుబాటులో భాగస్వామ్యం గురించి అనుమానితుడు, వైమానిక దళంలో జనరల్ సెర్జీ సురోవికిన్ ఆనుపానులు జూన్ 24 తర్వాత తెలియకుండా చేశాడు. జైల్లో పడేశాడో, పరలోకానికి పంపాడో యింకా తెలియదు. ఇప్పుడు వాగ్నర్‌ను తన అధీనంలోకి తెచ్చేసుకున్నాడు. అది యిప్పటికే ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెంది ఉంది కాబట్టి రష్యన్ మిలటరీ పర్యవేక్షణలో అక్కడ ఆపరేట్ చేయిస్తాడన్నది ఖచ్చితం. ఎందుకంటే అది అక్కడి పాలకులతో, వ్యాపారసంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నుంచి యిప్పటికే విత్‌డ్రా చేశారు. భవిష్యత్తులో కూడా వాడకపోవచ్చని ప్రస్తుత అంచనా. (ఫోటో – ప్రిగోజిన్, పుటిన్, షోయిగూ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2023)