టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికి ఐటీ నోటీసులు ఒకటి కాదు నాలుగు వచ్చాయని వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ అంటున్నారు. అవి 2022 అక్టోబర్ నుంచి 2023 జూన్ దాకా నాలుగు సార్లు బాబుకు వచ్చాయని. అయితే ఐటీ నోటీసులు తీసుకోకుండా బాబు మాత్రం ఏవో సాకులు చెబుతూ లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు.
విశాఖలో ఈ రోజు ఐటీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా దొరికిపోయిన చంద్రబాబు ఐటీ వారు ఇచ్చిన 46 పేజీల నోటీసుని ఎందుకు అందుకోరని అన్నారు. ఆ నోటీసులో అవినీతి సొమ్ముని తన పీయే శ్రీనివాస్ మధ్యవర్తి ఎంపీవీ ద్వారా తీసుకున్నట్లుగా ఉందని అన్నారు.
చంద్రబాబు చెప్పేవి నీతి మాటలని అలాంటి పెద్ద మనిషి ఇపుడు ఇలా ఐటీ నోటీసులు వస్తే మౌనం వహించడమేంటని అన్నారు. తాను అన్నా హజారే శిష్యుడిని అని గాంధీ అనుచరుడిని అని చెప్పుకునే చంద్రబాబు తన అవినీతి నారావారి పల్లె నుంచి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ దాకా పాకించారని గుడివాడ విమర్శించారు.
ఐటే శాఖ నోటీసులకు బాబు జవాబు చెప్పాలని ఆయన ప్రజా కోర్టులో కూడా జవాబు చెప్పు కోవాలని గుడివాడ పేర్కొన్నారు. అమరావతి రాజధాని నుంచి అనేక ప్రాజెక్టుల వరకూ అంతా అవినీతి టీడీపీ హయాంలో జరిగిందని, అయితే ఇందులో జస్ట్ 118 కోట్లను మాత్రమే ఐటీ వెలికి తీసిందని, ఇది తీగ మాత్రమే అని డొంక కదలి వస్తుందని అపుడు చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ సైతం బయటకు వస్తారని గుడివాడ జోస్యం చెప్పారు.