నందమూరి అభిమానులు ఆశగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ అనుకోని అవాంతరాలు రావడంతో వాయిదా పడింది. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బాబీ- సితార సినిమా పని మీద వున్నారు. ఎన్నికలు, విజయోత్సవాలు అన్నీ ముగిసాయి. ఇక సినిమా పనులే మిగిలాయి.
తాజా సమాచారం ప్రకారం అఖండ 2 సినిమా ఆగస్ట్ తరువాత వుంటుంది. ఆగస్టు లో మంచి ముహుర్తాలు వుండడంతో సినిమాను అప్పుడు ప్రారంభిస్తారు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ ను, డైలాగ్ వెర్షన్ ను పూర్తిగా, పెర్ ఫెక్ట్ గా లాక్ చేసే పనిలో వున్నారు దర్శకుడు బోయపాటి. అఖండలో చిన్న పాప ను బాలయ్య కాపాడడం అన్నది కీలక అంశం. మళ్లీ ఏ కష్టం వచ్చినా వస్తానని మాట ఇచ్చి వెళ్తారు.
అందువల్ల సినిమా ఆ పాయింట్ దగ్గరే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. చిన్న పాప పెరిగి పెద్దది కావడం, ఆమె కోసం మళ్లీ అఖండ పునరాగమనం అన్నది లీడ్ కావచ్చు. అయితే ఎందుకు రావాల్సి వచ్చింది, ఏం జరిగింది అన్నది ఆసక్తికరంగా వుంటుంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ కు ఇంకా ఎవర్నీ డిసైడ్ కాలేదు.
14రీల్స్ సంస్థ ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమా నిర్మిస్తోంది. బెల్లంకొండ హీరో. సాగర్ దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం 60 శాతానికి పైగా పూర్తయింది. కానీ ప్రస్తుతం బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిజిటల్ స్లాట్ లు లేవు. అందువల్ల డిజిటల్ స్లాట్ ఫిక్స్ అయితే మిగిలిన షూట్ ను చురుగ్గా పూర్తి చేసే అవకాశం వుంది.