కల్కి లో ‘కాంప్లెక్స్’ లాగ దుబాయి, సౌదీ!

కల్కి సినిమా ఈ పాటికి చాలా మంది చూసే ఉంటారు. భవిష్యత్తులో భూమి మీద ఉన్న ధనికులంతా “కాంప్లెక్స్” అనే ఖరీదైన ప్రపంచాన్ని సృష్టించుకుని అక్కడే బతుకుతుంటారు. భవిష్యత్తు ఏమో కానీ వర్తమానంలో మాత్రం…

కల్కి సినిమా ఈ పాటికి చాలా మంది చూసే ఉంటారు. భవిష్యత్తులో భూమి మీద ఉన్న ధనికులంతా “కాంప్లెక్స్” అనే ఖరీదైన ప్రపంచాన్ని సృష్టించుకుని అక్కడే బతుకుతుంటారు. భవిష్యత్తు ఏమో కానీ వర్తమానంలో మాత్రం వివిధ దేశాల్లోని ధనికులు కొన్ని దేశాలకు కేవలం లగ్జరీ జీవితాన్ని అనుభవించడానికే వలసపోతున్నారు. 

అవును…తాజా లెక్కల ప్రకారం ఈ ఏడు దాదాపు 4300 మంది మిలియనీర్లు ఇండియా వదిలి విదేశాల్లో స్థిరపడడానికి సిద్ధంగా ఉన్నారట. ఇది గత ఏడాది 5100 మంది లెక్కతో చూస్తే తక్కువే అయినా లగ్జరీ జీవితం కోసం దేశం వదిలి పోవాలనుకునే యావ చాలామంది కుబేరుల్లో ఉంది. 

ఇంతకీ ఏవిటి మన దేశంలో లేని ఆ లగ్జరీ? ఏయే దేశాలు ఏ లగ్జరీని ప్రామిస్ చేస్తున్నాయి? వాటికి ఎంత చెల్లించాలి? ఆ లగ్జరీతో ఈ కుబేరుల మనసు శాంతిస్తుందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుందాం. 

మన దేశ కుబేరుడు ముకేష్ అంబాని యాంటిలా అనే బిల్డింగులో ఉంటాడు. ఎప్పుడూ చూడని వాళ్లు ఏదో ఊహించుకోవచ్చు కానీ, ఆ బిల్డింగ్ పక్కనుంచి వెళ్తుంటే అంబాని బ్రాండ్ కి ఉన్నంత గ్రాండ్ గా ఏమీ కనపడదు ఆ బిల్డింగ్. పైగా ఎంత అంబానీ అయినా ప్రయాణించాల్సింది అవే ముంబాయి రోడ్లు, పీల్చాల్సింది అదే గాలి. 

అయినప్పటికీ తన రాజసమైన జీవితానికి ఏమీ లోటుండదు. అన్ని వసతలు, అన్ని లగ్జరీలు అనుభవిస్తూనే ఉంటారు తన కుటుంబమంతా. మరి అంబానీకి కూడా అందనంత గొప్ప లగ్జరీ విదేశాల్లో ఏముందని మన మిలయనీర్లు అటు పరుగుతీస్తున్నట్టు? 

ప్రధానంగా ఆయా దేశాలు వేస్తున్న ఆకర్షణీయమనిన వలలే అందుకు కారణం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుతం ప్రపంచ దేశాలని ఆకర్షిస్తున్న “కాంప్లెక్స్” లాంటి దేశం. కుబేరులకి గోల్డెన్ వీసాలు ఇవ్వడం, ఎటువంటి టాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా వ్యాపారాలు చేసుకోమని లైసెన్స్ ఇవ్వడం జరుగుతోంది. 

ఇండియాలో టాక్సులు ఎలా ఉంటున్నాయో చెప్పక్కర్లేదు. కోట్లల్లో సంపాదించేవాళ్లకి ఆదాయపు పన్నుతో పాటు జీఎస్టీ పేరుతో కోట్ల రూపాయల టాక్సులు పోతున్నాయి. అదే దుబాయి, అబుధాబి, షార్జాలలో అయితే ఆ గొడవలేదు. 

కనుక ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలని, సాఫ్ట్ వేర్, ఏ.ఐ కంపెనీలని దుబాయిలొ పెట్టుకుంటున్నవారున్నారు. ఎటువంటి వ్యాపారలైతే ఇండియా బేస్ గా చేయాల్సిన అవసరం లేదో వాటిల్లో అధికశాతం ఈ దేశానికి పోతున్నాయి. 

విదేశాల్లో సంపాదించిన డబ్బుని ఇండియాకు తేవాలన్నా కూడా టాక్స్ కట్టాలి. అందుకే అక్కడ సంపాదించి అక్కడే ఎంజాయ్ చేయాలంటే ఆ దేశంలోనే ప్రాపర్టీస్ అవీ కొనుక్కుని అక్కడే ఖర్చు పెట్టేసుకోవాలి. దాంతో పేరుకి ఉండేది ఇండియా పాస్ పోర్టే అయినా మానసికంగా మాతృదేశంతో తెగతెంపులు చేసుకునే ఆలోచనతో ముందుకెళ్తున్నవారున్నారు. 

దుబాయిలో బుర్జ్ ఖలీఫా లాంటి కట్టడం, సముద్రం మీద కృత్రిమ దీవులు ఒకెత్తైతే దానికి పక్కనే ఉన్న సౌదీ అరేబియాలో కూడా “ది లైన్” అని పిలవబడే ఒకానొక ప్రాజెక్ట్ కల్కిలోని “కాంప్లెక్స్” నే తలపిస్తాయి. సౌదీ అరేబియా కూడా ప్రపంచ కుబేరుల్ని పెట్టుబడులకి ఆకర్షిస్తోంది. గోల్డెన్ వీసాలు కూడా ఇస్తోంది. 

2022లో కేవలం భారతీయులే యు.ఎ.ఈలో 35,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు రియల్ ఎస్టేట్ లో. ఆ దేశం మీద తమ ఫైనాన్షియల్ పవర్ చూపిస్తున్న దేశాల్లో ఇండియానే నెంబర్ వన్. 

ఇంతకీ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకి గోల్డెన్ వీసాలు కొనుక్కుని బయలుదేరుతున్నవారు ఒక్క ఇండియన్సే కాదు. చైనీయులు, యూకే, అమెరికా దేశస్తులు కూడా! అదేవిటి? ఇక్కడ చాలామంది అమెరికా వెళ్తుంటే అక్కడి వాళ్లు దుబాయికి వెళ్లడమేంటి అనుకోవచ్చు! కారణమడిగితే “ఒకటే దేశంలో, ఒకే తరహా వాతావరణంలో బోర్ కొడుతోంది. అందుకే వేరే దేశానికి మకాం మారుస్తున్నాం” అని అంటున్న అమెరికన్స్ ఉంటున్నారు. 

“ఇక్కడ కట్టే టాక్సులకి లభించే లగ్జరీ కంటే దుబాయిలో ఏ టాక్స్ కట్టకుండానే లభిస్తోంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో అమెరికాతో పోలిస్తే దుబాయి అన్నివిధాలా మెరుగ్గానే ఉంది. దానికి తోడు సేఫ్టీ కూడా దుబాయిలో ఎక్కువ”, అని చెబుతున్న అమెరికన్స్ ఉన్నారు. 

అయితే ఎంత లగ్జరీ అయినా అనుభవించాక బోర్ కొడుతుంది. ఎంతటి సుందర పరిసరాలైనా చూడగా చూడగా బోర్ కొడతాయి. అయినప్పటికీ యు.ఎ.ఈ కి ఈ ఆకర్షణ ఎందుకంటే గోల్డెన్ వీసాతొ దుబాయిలో ప్రాపర్టీ కొనుక్కుని నివసించడం ఒక స్టాటస్ సింబల్ గా భావిస్తున్నవాళ్లు ఉన్నారు. 

హైదరాబాదులో ఎక్కడుంటారు అని అడిగితే.. గచ్చిబౌలి అని చెప్పడం గొప్ప. అందులో మళ్లీ “మై హోం భూజా”లో ఉండడం ఇంకా గొప్ప. అలా ఉంటున్న అడ్రస్ ని బట్టి స్టాటస్ పెరుగుతుంది. దశాబ్దాల క్రితం అబిడ్స్ కి, ఆ తర్వాత జూబిలీ హిల్స్ కి అదే బ్రాండ్ ఉండేది. ఇప్పుడు గచ్చిబౌలి, ఫైన్నాన్షియల్ డిస్ట్రిక్ట్ వగైరాలు కొత్త లగ్జరీ లొకేషన్స్ అయ్యాయి. 

అదే మాదిరిగా ప్రపంచానికి యు.ఎ.ఈ. అమెరికన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారంటే తమ దేశంలో టాక్స్ బాదుడుకి తట్టుకోలేక, శాంతిభద్రతలు కారణం కావొచ్చు, కొత్త మోజు అవ్వచ్చు. కారణాలు ఏవైనా యు.ఎ.ఈ పఠిస్తున్న “ఆపరేషన్ ఆకర్ష్” మంత్రానికి చాలామంది బుట్టలో పడుతున్నారు. 

ఒక్క యు.ఎ.ఈ నే కాదు పోర్చుగల్, గ్రీస్, స్విట్సర్లాండ్, మాల్టా వంటి దేశాలు కూడా ప్రపంచ కుబేరుల్ని ఆకర్షితున్న జాబితాలో ఉన్నాయి. ఆఖరికి ఈ మధ్యన జపాన్ కూడా అదే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. 

ఆయా దేశాలకి జనాభా కావాలి..అది కూడా క్వాలిటీ జనాభా. మన వాళ్లకి క్వాలిటీ లైఫ్, స్టాటస్ కావాలి. ఇండియాలో ఉండడమే స్టాటస్ సింబల్ అనే రోజు వచ్చినప్పుడు ఈ వలసలుండవు. అప్పటి వరకు ఈ పరిస్థితి తప్పదు. 

– శ్రీనివాసమూర్తి