మానసికంగా దృఢంగా ఉండటం అనేది జీవితంలో చాలా కీలకమైన అంశం. మన ఆనందంగా ఉన్నామా, బాధగా ఉన్నామా అనేది పూర్తిగా మన మెదడే నియంత్రణలో ఉంటుందనేది చాలా ఫిలాసఫీలు చెప్పే అంశమే! ఏం జరిగింది, ఏం జరుగుతోందనేది, ఏ సాధించారు, ఏం చేస్తున్నారు.. ఇవన్నీ అతీతమైనవి అని, మెదడే మీరు ఆనందంగా ఉన్నారా లేదా బాధగా ఉన్నారనేది డిసైడ్ చేస్తుందని, అలాంటి మెదడును నియంత్రణలో ఉంచుకుంటే అంటే మానసికంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటే మీకు మించినోడు లేదనేది ఫిలాసఫర్లు చెప్పే అంశం!
అలాగే మానసిక శాస్త్రం కూడా ఇదే చెబుతూ ఉంటుంది. మరి మీరు మానసికంగా ధృడంగా ఉన్నట్టా లేదా అనే అంశం గురించి చెప్పే అలవాట్లు కూడా కొన్ని ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. ఈ అలవాట్లను కలిగి ఉన్న వారు కచ్చితంగా మానసికంగా స్ట్రాంగ్ ఉన్నట్టే అని చెబుతున్నారు. అవేమిటంటే..
బలాలు బలహీనతలేవో తెలిసి ఉండటం!
మీ బలాలు ఏమిటి, మీ బలహీనతలు ఏమిటనేది అవగాహన ఉండటం చాలా కీలకం. ఇది తెలిసి ఉంటే ఆ బలాలు, బలహీనతలను ఆధారంగా చేసుకుని వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై స్పష్టతను కలిగి ఉండవచ్చు. కాబట్టి మీ బలాలుబలహీనతలు ఏవో తెలుసుకుని వాటిని ఉపయోగించుకోవడం అంటే మానసికంగా అంతకన్నా ఎంత స్ట్రాంగ్ నెస్ ఏముంటుంది!
పరిధులను నిర్దేశించుకోవడం!
మీరేమిటో మీకు తెలిసాకా.. మీ పరిధులు, సరిహద్దులు ఏమిటో అర్థం అవుతాయి. మీ పట్ల మీకున్న అవగాహన వల్ల మీ సరిహద్దులను మీరు నిర్దేశించుకోవచ్చు. దీని వల్ల ఎక్కడ యస్ చెప్పాలి, ఎక్కడ నో చెప్పాలనే అంశం గురించి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలా పరిధులను నిర్దేశించుకుని ఆ మేరకు పని చేయడం మానసికంగా కొత్త డిప్రెషన్ లను తెచ్చే అవకాశాలను తగ్గించి వేస్తుంది.
పర్సనల్ గ్రోత్ మీద దృష్టి పెట్టడం!
మీ ప్రయారిటీస్ లో మీ ప్రస్తుత స్థితి నుంచి మెరుగుపరుచుకోవడం అనేది ఉందంటే మీరు మానసికంగా సవ్యమైన దిశలో ఉన్నట్టు. అయితే కేవలం ఎంతసేపూ గ్రోత్ మాత్రమే కాదు, కోట్లు సంపాదించడం అనే లక్ష్యాన్ని కలిగినవారు కూడా తమ వద్ద ఉన్న లక్షలను ఆస్వాధించే మనస్తత్వాన్ని కలిగి ఉండటం కూడా కీలకం!
సెల్ఫ్ లవ్!
మీరు ఎవరిని ప్రేమించినా, ప్రేమించకపోయినా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా కీలకం. అలాగని అతిగా ప్రేమించేసుకుని నార్సిస్టిక్ గామారిపోవడం కాదు. మిమ్మల్ని మీరు క్షమించుకోవడం, మిమ్మల్ని మీరు సరి చేసుకునేలా సెల్ఫ్ లవ్ ను కలిగి ఉండాలి. ఇది మానసికంగా ధృడంగా ఉన్న వారి అలవాట్లలో ఒకటి!
ఓటమి నుంచి పాఠాలను నేర్చుకోవడం!
చేసిన పొరపాట్లు, ఎదురైన ఓటముల నుంచి పాఠాలను నేర్చుకునే తత్వం ఉన్న వారు కచ్చితంగా విజయం సాధిస్తారు. అలాంటి సమీక్షను నిర్వహించుకుని తప్పొప్పులను తెలుసుకుని నేర్చుకునే తత్వం ఉండటం మానసికంగా ధృడంగా ఉండటమే! చేసిన తప్పుల పట్ల అసలు స్పందన లేకుండా ఉండటం, లేదా అంతా తాము రైటే చేశామని అనుకోవడం పొరపాట్లే!
ఎమోషన్స్ ను నియంత్రించడం!
మనిషి జీవితం అంతా అనేక ఎమోషన్ల కలయికే అయినా భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కీలకం. ఇది మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండే వారికి ఉండే అలవాటు! ఎమోషన్స్ ను నియంత్రించుకోలేకపోతే చిన్న చిన్న విషయాల వద్దే తేడా కొట్టేస్తుంది!
కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం!
మానసికంగా ధృడంగా ఉండటంలో కృతజ్ఞతా భావం కీలకమైనది. ప్రస్తుతం ఉన్న స్థితి మీద కానీ, సాధించిన దాని పట్ల కానీ, చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కాని పాజిటివిటీస్ పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండి, ఆ ప్రివిలైజెస్ ను గుర్తెరగడం స్ట్రాంగ్ నెస్ కు నిదర్శనం!