టాలీవుడ్ మొత్తం బిజీగా వుంది. ప్రతి నిర్మాణ సంస్థ ఒకటి మించిన సినిమాలు నిర్మిస్తోంది. ప్రతి హీరో చేతిలో సినిమాల మీద సినిమాలు వున్నాయి. టాప్ హీరో నుంచి అతి చిన్న హీరో వరకు బిజీనే.
ఇంత హడావుడిలో కూడా టాలీవుడ్ కు దూరంగా అమెరికాలో వుండిపోయిన ఒకే ఒక హీరో. అలా అని క్రేజ్ లేదా అంటే బోలెడు క్రేజ్. అలా అని డిమాండ్ లేదా అంటే చాలా డిమాండ్. అలా అని నిర్మాతలు అడ్వాన్స్ లు లేవా అంటూ అవీ వుండనే వున్నాయి. మరెందుకు అమెరికాలో టాలీవుడ్ కు దూరంగా అలా వుండిపోయారు అంటే నో ఆన్సర్.. గమ్మత్తేమిటంటే ఆ హీరో ఒకరు వున్నారు కదా అని మీడియా జనాలు కూడా పెద్దగా గుర్తు చేసుకోవడం లేదు.
ఆ హీరో నే నవీన్ పోలిశెట్టి. స్పాంటేనియస్ ఫన్ కు పెట్టింది పేరు. 2021 మార్చిలో జాతిరత్నాలు వంటి బ్లాక్ బస్టర్ చేసారు. మళ్లీ రెండేళ్లకు 2023 చివర్లో మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అందించారు. ఒకటి బ్లాక్ బస్టర్.. రెండోది మంచి హిట్. అయినా అప్పటి నుంచి అంటే దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పటి వరకు సెట్ మీదకు ఏ సినిమా తీసుకెళ్లలేదు. ఏ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. అలా అని అదే పని మీద వున్నారు నవీన్ పోలిశెట్టి అని అనుకోవడానికి కూడా లేదు.
ఎందుకంటే నవీన్ మిస్ శెట్టి విడుదల టైమ్ లో అమెరికా వెళ్లారు.. ఇప్పటికీ అక్కడే వున్నారని తెలుస్తోంది. చిన్న యాక్సిడెంట్ అయింది, ఆ కారణంగా అక్కడే వున్నారు. వస్తారు అని 2023 చివర్లో వినిపించింది. ఆ తరువాత అదీ లేదు. కానీ అప్పట్లో అది ఏం లేదు, రావడం లేటు అవుతోందని నవీన్ ఏదో చెబుతున్నారని కొందరు నిర్మాతలు భావించారు.
బేసిక్ గా టాలీవుడ్ నిర్మాతల నుంచి తెలుస్తున్నది ఏమిటంటే, నవీన్ కు ఫెయిల్యూర్ ఫోబియా లేదా భయం వుందట. సినిమా చేస్తే కచ్చితంగా హిట్ కొట్టాలి. లేదూ అంటే తన కెరీర్ పోతుందనే భయం వుందట. అందుకే సబ్జెక్ట్ లు ఎంచు కోవడంలో సవాలక్ష భయాలు, అనుమానాలు నవీన్ ను వెంటాడుతూ వుంటాయట. అందుకే ఏ స్క్రిప్ట్ కూ ఇప్పటి వరకు ఓకె చెప్పేలేకపోతున్నాడు అని తెలుస్తోంది. ఇంకా మంచి స్క్రిప్ట్, ఇంకా మంచి సబ్జెక్ట్ అని వెదుకుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు చేయాల్సింది సితార సంస్థ సినిమా. అనుదీప్ తో కథ చెప్పించారు, కుదరలేదు. మరో ఒకరిద్దరు దర్శకులతో కథలు చెప్పించారు. కుదరలేదు. ఇంక అలా వదిలేసారు. నవీన్ కాస్త జాగ్రత్త పడడం వరకు ఓకె. అలా అని వుండిపోతే ఎలా. ధైర్యంగా టాలీవుడ్ లోనే వుండాలి. కథలు వినాలి. దర్శకుడి ట్రీట్ మెంట్, తన టాలెంట్ ఈ రెండింటినీ నమ్మి సినిమా చేయాలి.
సినిమా సక్సెస్ వెనుక చాలా కారణాలు వుంటాయి. అదృష్టంతో సహా. అందువల్ల నవీన్ ఇండియా రావాలి. సినిమా చేయాలి. ఇలా వుండిపోతే, నవీన్ అందించే ఫన్ ను జనం మిస్ అయిపోతున్నారు కదా.