ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన అత్యంత జుగుప్సాకరమైన ఓ చెత్త పని వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఓ తండ్రి తన చిన్నారి కూతుర్ని ఆడించే ఓ వీడియోపై పరమ చెత్తగా రియాక్ట్ అయ్యాడు ఇతడు, ఇతని మిత్రబృందం. దీనిపై సాయిధరమ్ తేజ్ స్పందించగా.. తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఇప్పుడీ వ్యవహారంపై కాస్త లేట్ అయినా ఘాటుగా స్పందించాడు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు. అసోసియేషన్ కు 2 రోజులుగా కాల్స్, మెయిల్స్ వస్తున్నాయని.. బ్రహ్మానందం లాంటి లెజెండ్స్ ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపిన విష్ణు.. 48 గంటల్లో యూట్యూబ్ లో ఉన్న చెత్త మొత్తం డిలీట్ చేయాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.
“ఒక హీరోయిన్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓ నటుడి భార్యపై ఇష్టమొచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు. దానికి డార్క్ హ్యూమర్, ట్రోలింగ్ వీడియోస్ పేరిట దాని కింద దాక్కోవడం కరెక్ట్ కాదు. యూట్యూబ్ లో ఇలాంటి ట్రోల్స్ వీడియోస్ చేసే వాళ్లకు, నటీనటులపై అసభ్యకరంగా మాట్లాడేవారికి ఒకటే చెబుతున్నాను. దయచేసి 48 గంటల్లో అలాంటివన్నీ డిలీట్ చేయండి. మీరు తీయకపోతే, 48 గంటల తర్వాత మేం రివ్యూ చేస్తాం. సైబర్ సెల్ కు కంప్లయింట్ చేస్తాం, లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుతాం. యూట్యూబ్ తో కూడా మాట్లాడి ఛానెల్ బ్యాన్ చేస్తాం.”
హనుమంతు లాంటి వ్యక్తులు అలాంటి చెత్త వీడియోలు చేస్తే అందులో ఏం ఆనందం ఉందని ప్రశ్నిస్తున్నాడు విష్ణు. ఆ వీడియో చూసిన తర్వాత తన ఒళ్లు జలదరించిందన్నాడు.