ఎమ్మెల్యేలకు ఇన్ స్టాంట్ గా చేతిలోకి వచ్చిన అవకాశం ఏమిటంటే తిరుమల దేవుడి బ్రేక్ దర్శనం కల్పించడం. రోజుకు నలుగురి వంతున బ్రేక్ దర్శనానికి పంపొచ్చు. ఆ మేరకు సిఫార్సు లేఖలు ఇవ్వచ్చు. తిరుమలలో పరిస్థితిని బట్టి అధికారులు వాటిని హానర్ చేస్తారు. కొత్త ఎమ్మెల్యేలు ఎన్నిక కావడంతోనే ఎన్నికల్లో వారి తరుపున ప్రచారం చేసిన, కష్టపడిన కార్యకర్తలు అంతా ముందుగా ఎగబడింది ఈ బ్రేక్ దర్శనం లేఖల కోసమే.
దీంతో దాదాపు డిసెంబర్ వరకు లేఖలు ఇచ్చేయడం పూర్తయిందట చాలా అంటే చాలా మంది ఎమ్మెల్యేలకు. అంటే ఎమ్మెల్యే పరిచయం వున్నా, ఇప్పుడు వెళ్లి లేఖ అడిగితే జనవరి నెలకు కానీ ఇవ్వలేని పరిస్థితి అన్నమాట. చాలా మంది ఎమ్మెల్యేల దగ్గర డిసెంబర్ వరకు లేఖలు పూర్తయిపోయాయి. ‘మా ఎమ్మెల్యే దగ్గర అయితే జనవరి వరకు లేఖ ఇచ్చే అవకాశమే లేదు’ అని చెప్పారు ఉత్తరాంధ్ర లోని ఓ కీలక నియోజక వర్గానికి చెందిన వ్యక్తి.
ప్రస్తుతానికి టీటీడీ కి కార్యవర్గాన్ని ఇంకా నియమించలేదు. అందువల్ల ఎమ్మెల్యే లేఖలకు పెద్దగా సమస్య వుండదు. లేదూ అంటే, టీటీడీ సిబ్బంది కార్యవర్గ సభ్యుల లేఖలకు ముందు ప్రయారిటీ ఇస్తారు. ఆ తరువాత మంత్రులు, సిఎమ్ పేషీ లేఖలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ తరువాత ఎమ్మెల్యేల లేఖలు.
మొత్తం మీద తిరుమల వెంకన్న దర్శనం అన్నది చాలా పెద్ద టాస్క్ గా మారిపోతోంది రాను రాను.