చంద్రబాబు సంగతి పాపం ఆనంకు తెలియదేమో?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులకు సంబంధించి ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఒకసారి ఆ పదవి నిర్వహించిన వాళ్ల రాజకీయ జీవితం అక్కడితో ఆఖరు అయిపోతుందని.. ఆ తర్వాత వారి రాజకీయ ఎదుగుదల ఉండదని!…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులకు సంబంధించి ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఒకసారి ఆ పదవి నిర్వహించిన వాళ్ల రాజకీయ జీవితం అక్కడితో ఆఖరు అయిపోతుందని.. ఆ తర్వాత వారి రాజకీయ ఎదుగుదల ఉండదని! అలాంటి సెంటిమెంట్ నేపథ్యంలో ప్రస్తుతం దేవాదాయ శాఖ నిర్వహిస్తున్న ఆనం.. చంద్రబాబు వైఖరి గురించి సరిగా తెలియకుండానే మాట్లాడుతున్నారు.

రాష్ట్రంలో అన్ని ఆలయాల పాలక మండళ్లను త్వరలోనే నియమించేస్తాం అని ప్రకటిస్తున్నారు. చంద్రబాబు సంగతి తెలిస్తే ఆనం ఇలా చెప్పేవారు కాదేమో అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

చంద్రబాబు వద్ద వేగవంతమైన నిర్ణయాలు ఉండవు. ఇప్పుడు గద్దె ఎక్కిన తర్వాత కూడా.. ఏదో జగన్ మీద బురద చల్లడానికి శ్వేతపత్రాల విషయంలో వేగంగా స్పందిస్తున్నారు గానీ.. నామినేటెడ్ పోస్టుల్లాంటివి ఇవ్వాలంటే.. వంద రకాల కాంబినేషన్లు లెక్కవేస్తారు. అవన్నీ పూర్తయ్యేసరికి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంటుంది.

మంచోచెడో.. జగన్ మోహన్ రెడ్డి.. నామినేటెడ్ పోస్టుల్లో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీకి వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మన్ చేశారు. దరిమిలా.. ఆయన రెండు పర్యాయాలు, తర్వాత భూమన ఒకసారి ఛైర్మన్ అయ్యారు.

చంద్రబాబు తీరు అలా ఉండదు. ఆయన వంద రకాల సమీకరణాలు చూసి పోస్టులు పంచేలోగా ఆరునెలలో ఏడాదో పడుతుంది. తీరా అయిదేళ్ల పదవీకాలంలో రెండు బోర్డులు పూర్తికాలం పదవిలో ఉంటే ఎక్కువ. నామినేటెడ్ పోస్టులు అనేవి.. చట్టసభల పదవులు అడగకుండా పార్టీకోసం కష్టపడి పనిచేసేవారికి ఇచ్చి తీరాల్సిన పోస్టులు. మరి.. వీలైనన్ని సార్లు వీలైనంత మంది పార్టీ వాళ్లు పదవులు పొందేలా వెంటవెంటనే పంచేద్దాం అనే ధోరణి ఆయనకు ఎప్పుడూ ఉండదు.

కానీ చంద్రబాబునాయుడు తరహా తెలియకుండా.. దేవాదాయ శాఖ తన చేతిలో ఉన్నది కదాని.. పాలక మండళ్లన్నీ త్వరలోనే వేసేస్తానని పాపం.. ఆనం ఆడంబరంగా పలుకుతున్నారు. కానీ, ఆయన మాటలు కార్యరూపం దాల్చడం అంత సులువు కాదని పలువురు అంటున్నారు.