“టికెట్టుకు సరిపడ చిల్లర ఇవ్వగలరు. కండక్టర్ తో సహకరించగలరు”.. ఆర్టీసీ బస్సుల్లో పెద్దపెద్ద అక్షరాలతో ముద్రించే ఈ స్లోగన్ చిన్నప్పట్నుంచి చూస్తూనే ఉన్నాం. అప్పట్నుంచి ఇప్పటివరకు చిల్లర కోసం ఆర్టీసీ బస్సుల్లో తంటాలు పడుతూనే ఉన్నాం.
ఎట్టకేలకు ఈ బాధల నుంచి విముక్తి లభించబోతోంది. తెలంగాణ ఆర్టీసీలో యూపీఐ పేమెంట్స్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు 10వేల ఐ-టిమ్స్ మెషీన్లు కొనుగోలు చేయబోతోంది టీజీఎస్ఆర్టీసీ.
ఇవి అందుబాటులోకి వస్తే చిల్లర సమస్య దాదాపు తీరిపోతుంది. ప్రజలంతా యూపీఐ పేమెంట్స్ కు అలవాటుపడిన వేళ.. బస్సుల్లో కూడా టికెట్ కోసం గూగుల్ పే, ఫోన్ పే లేదా పేటీఎం చేస్తే సరిపోతుంది. చిల్లర కోసం వెదుక్కోవాల్సిన పని లేదు. టికెట్ వెనక చిల్లర ఎంతివ్వాలనేది కండక్టర్ రాసే పని ఉండదు.
ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్ లోని 2 రూట్స్ లో పరీక్షిస్తున్నారు. వచ్చే నెల నుంచి సిటీ బస్సుల్లో, సెప్టెంబర్ నుంచి పల్లె వెలుగు బస్సుల్లో పూర్తిస్థాయిలో అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల చిరిగిన నోట్లు, దొంగ నోట్ల సమస్య కూడా తీరబోతోంది.
దూరప్రాంత ప్రయాణాలకు సంబంధించి ఆల్రెడీ ఈ విధానాన్ని అనుసరిస్తోంది టీజీఎస్ఆర్టీసీ. ఇప్పుడు మిగతా బస్సుల్లో కూడా పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని చూస్తోంది. మరోవైపు డేటా సైన్స్ సహాయంతో ప్రజా రవాణాను మరింత పటిష్టం చేయాలని కూడా ఆలోచిస్తోంది.