ముహూర్త బలం అంటే ఇదేనేమో.. కొన్ని సినిమాల్ని ఏ ముహూర్తాన ప్రారంభిస్తారో కానీ అవి ఓ పట్టాన పూర్తికావు, అనుకున్న సమయానికి విడుదలకావు. మరికొన్ని సినిమాలు ఊహించని చిక్కుల్లో పడతాయి. తిరగబడరాసామీ సినిమా కూడా ఆ కోవకు చెందిందే.
ఈ సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ, సినిమా ప్రారంభంలో ఓసారి, చివర్లో మరోసారి 2 భారీ వివాదాలు చుట్టుముట్టాయి.
రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా తిరగబడరాసామీ. ఈ సినిమాకు సంబంధించి నిర్వహించిన ఓ కార్యక్రమంలో దర్శకుడు ఏఎస్ రవికుమార్, హీరోయిన్ మన్నారా చోప్రా పాల్గొన్నారు. ఆ టైమ్ లో మీడియా ఎదురుగానే మన్నారా బుగ్గపై చటుక్కున ముద్దుపెట్టాడు దర్శకుడు.
అప్పట్లో అది పెద్ద వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఇటు దర్శకుడు, అటు హీరోయిన్ ఇద్దరూ క్లారిటీ ఇవ్వడంతో సద్దుమణిగింది.
ఇక అంతా సెట్ అనుకున్న టైమ్ లో సరిగ్గా విడుదలకు ముందు మరో వివాదం రాజుకుంది. ఈసారి తిరగబడరాసామీ సినిమాలో నటించిన మరో హీరోయిన్ వివాదానికి కేంద్రబిందువైంది. పేరు మాల్వీ మల్హోత్రా.
హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మధ్య ఎఫైర్ ఉందని ఆరోపిస్తోంది లావణ్య. కేవలం మాల్వి వల్ల తన ప్రియుడు రాజ్ తరుణ్, తనను వదిలేశాడని అంటోంది. ప్రస్తుతం ఈ వివాదం తారాస్థాయిలో నడుస్తోంది. కోర్టు వరకు వెళ్లింది. ఇలా 2 పెద్ద వివాదాలకు కేంద్రబిందువుగా మారింది తిరగబడరాసామీ సినిమా.