Advertisement

Advertisement


Home > Movies - Interviews

'అల' క్రెడిట్ మొత్తం ఆయనదే....థమన్ ఎస్ఎస్

'అల' క్రెడిట్ మొత్తం ఆయనదే....థమన్ ఎస్ఎస్

2019-2020 ఇయర్ ఎవరికి ఎలా గుర్తు వున్నా, సంగీత దర్శకుడు థమన్ కు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరంగా గుర్తుండిపోతుంది. అల వైకుంఠపురములో లాంటి అద్భుతమైన హిట్, ప్రతి రోజూ పండగే, వెంకీమామ, డిస్కోరాజా ఇలా చేసిన ప్రతి సినిమా అడియో పరంగా మాంచి హిట్ లే. అంతే పవర్ స్టార్ తో వకీల్ సాబ్, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా, రవితేజ, సాయి ధరమ్ తేజ్ సినిమాలు. ఇలా అన్ని విధాలా సూపర్ ఇయర్. కానీ కరోనా వచ్చి, ప్లాన్ లు అన్నీ కాస్త డిస్ట్రబ్ చేసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో థమన్ తో చిట్ చాట్.

-హాయ్ థమన్..ఎన్ని ట్యూన్ లు చేసారు?

అదేంటీ..ఎలా వున్నారు అని కాకుండా ఇలా?

-మీరు బాగానే వుంటారు ఎప్పుడూ, ఈ కరోనా ఖాళీ టైమ్ ను వాడుకుని, మీ ట్యూన్ బ్యాంక్ ను ఎంత ఫిల్ చేసారా? అని అలా అడిగా.

నిజంగానే ఫుల్ గా వర్క్ చేస్తున్నాం నేను నా టీమ్. జూమ్, ఆఫీస్ ఇలా రకరకాల సాఫ్ట్ వేర్ లు వాడుకుంటే, టెక్నికల్ అప్ డేట్స్ చేసుకుంటూ, మరోపక్క ట్యూన్ లు చేసుకుంటూ గడిపేస్తున్నాం. కరోనా లాక్ డౌన్ అయిపోతే మళ్లీ  వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ గైడ్ లైన్స్ ఎలా పాటించాలి. ఇవన్నీ చాక్ అవుట్ చేస్తున్నాం.

-మరి అల వైకుంఠపురములో వన్ బిలియన్ వ్యూస్ సక్సెస్ మాటేంటీ?

ఒక్క వన్ బిలియన్ మాటేంటీ? అది ఆల్ రౌండ్ సక్సెస్. ఇటు థియేటర్ లో, అటు ఓటిటి లో, ఆన్ లైన్ లో ఇలా ఎక్కడ చూసినా విజయమే.

-ఈ విజయంలో మీ పాత్ర ఏమేరకు అని ఆలోచించుకుంటే..

నా పాత్ర అన్నదే తప్పు. ఇదంతా టీమ్ వర్క్. నేను, నా టీమ్, గాయకులు, గేయరచయిత సీతారామశాస్త్రిగారు, అందరినీ మించి దర్శకులు త్రివిక్రమ్. ఆయనదే అసలు క్రెడిట్ అంతా. మాలాంటి 24 క్రాఫ్ట్ ను మేనేజ్ చేసకుంటూ కావాల్సింది రాబట్టుకోవడం అంటే అంత సలువు కాదు. 

-ఆయన మీ దగ్గర నుంచి వర్క్ రాబట్టుకోవడం ఎలా వుంటుంది?

అసలు ముందు వర్క్ గురించి ఆలోచించం. ఆయనతొ కొన్ని రోజుల కలిసి వుంటాను. షూటింగ్ కు, ఆఫీస్ కు వెళ్తాను. అలా మాట్లాడుతూ గడిపేస్తాం. గతంలో కూడా చెప్పాను మీకు. ఆయన రోజూ కొత్తగా కనిపిస్తారు. ఆ కొత్తదనంలోంచే మనకు ఒక ఎనర్జీ వస్తుంది. అందులోంచే క్వాలిటీ వర్క్ వస్తుంది.

-కాంట్రావర్సీ అని కాదు కానీ, మరి మీరు గతంలోనూ అనేక మంది దగ్గర పని చేసారు. అనేక హిట్ లు ఇచ్చారు. వాళ్లంతా మీ పూర్తి స్టామినా వాడుకోలేదనుకోవాలా?

అలా అని కాదు, ఎవరి వర్క్ స్టయిల్ వారిదే. త్రివిక్రమ్ స్టయిల్ వేరు. ఆయనతో పని చేయాలన్నది నా ఏళ్లతరబడి కల.

-మరి ఇలాంటి కల మిగిలిన మ్యూజిక్ డైరక్టర్లకు కూడా వుంటుందేమో కదా?

వుంటుంది. నా కల నెరవేరడం నా అదృష్టం. 

-మళ్లీ త్రివిక్రమ్-థమన్ కాంబినేషన్ త్వరలో హ్యాట్రిక్ కొట్టాల్సి వుంది కదా.

తప్పని సరిగా. అరవింద సమేత ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ ఎలాంటి ఆదరణ పొందాయో అందరికీ తెలుసు. అందువల్ల మళ్లీ ఎన్టీఆర్ తో అదే కాంబినేషన్ అంటే ఆ మాత్రం అంచనాలు వుంటాయి. 

-ఆ అంచనాలు అందుకునే ప్రయత్నం మొదలు పెట్టారా?

ఆ స్టార్ట్ చేసాం.

-అంటే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా సాంగ్ సిట్యువేషన్లు, ట్యూన్ లు ఈ పని మొదలయిందని అనుకోవాలా?

అలా అని కాదు. బేసిక్ గా ఏం చేస్తే బాగుంటుంది, థీమ్ ఎలా వుండాలి ఇలాంటివి అన్నీ ఆలోచించి వుంచుకుంటాం. ఒక్కసారి డైరక్టర్ గారు ఇన్ పుట్స్ ఇవ్వడం మొదలయితే అసలు వర్క్ స్టార్ట్ అవుతుంది. అందుకోసం వెయిటింగ్.

-వకీల్ సాబ్, సోలో బతుకే, క్రాక్ ఎంత వరకు వచ్చాయి?

వకీల్ సాబ్, సోలో బతుకే ఎడిటింగ్ స్టార్ట్ అయ్యాయి. ఆ వర్క్ అయితే ఆర్ఆర్ స్టార్ట్ అవుతుంది. క్రాక్ ఒక పాట త్వరలో వదలాలి అనుకుంటున్నాం.

-కరోనా నేపథ్యంలో ఈసారి వర్కింగ్ స్టయిల్ అంతా మారిపోతుందేమో?

కచ్చితంగా  ఈ మేరకు నా హైదరాబాద్ రికార్డింగ్ స్పేస్ లో మార్పులు చేర్పులు చేయిస్తున్నా. అలాగే ఫిలిం నగర్ లో ఓ చిన్న వర్క్ స్పేస్ తయారు చేసుకుంటున్నా. అక్కడ కూడా కరోనా వ్యవహారాలు దృష్టిలో వుంచుకునే ఏర్పాట్లు చేయిస్తున్నా.

-మీకు ఇష్టమైన క్రికెట్ కు దూరమైపోయారేమో?

నేను ఒక్కడినే దూరమైపోతే బాధ. అందరూ ఆడుతూ, నన్ను ఆఢనివ్వకపోతే బాధపడేవాడిని. మా టీమ్ ఎవ్వరూ ఆడడం లేదుగా. 

-రెండు నెలలుగా ఇంట్లోనే వుండడం.

 మా మిసెస్, అమ్మ ఇద్దరూ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే చాలా ఏళ్లుగా ఇన్నాళ్లు ఇంట్లో వుండడం అన్నది లేదు. అందుకే వాళ్లు చాలా హ్యాపీ.

-ఇప్పుడు థమన్ రెమ్యూనిరేషన్ బాగా పెరిగింది అనుకోవాలా?

అక్కరలేదు. నేను ఎప్పుడూ అలా లేను. నిక్కర్లు వేసుకున్నపటి నుంచి నా సంగతి నిర్మాతలు అందరికీ తెలుసు.

-కానీ ఇప్పుడు ఫ్యాంట్లు వేసుకుంటున్నారు కదా? జేబులు పెద్దవి అయ్యాయేమో?

అంత లేదు. అయినా నిర్మాతలకు తెలియదా? థమన్ వర్క్ ఏమిటి? ఎంత ఇవ్వాలి అన్నది. వాళ్లే ఇస్తారు. మనం అడగక్కరలేదు.

-చెన్నయ్ లో వుంటూ, మీ ఫీలింగ్స్, మీ ఇన్ ఫో మాతో షేర్ చేసుకున్నందుకు థాంక్యూ

మీకు కూడా కరోనా టైమ్ లో అందరినీ పలకరించి మరీ విశేషాలు అందిస్తున్నందుకు. 

మత్తులో మత్తు డాక్టర్/నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అసలు రూపం

మ‌డ అడ‌వుల అస‌లు చ‌రిత్ర‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?