ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇతర రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే ఆయనకు కొత్త, కొత్త చిక్కులు లేదా విమర్శలు వస్తున్నాయని అనుకోవాలి. విశాఖపట్నం సమీపంలోని ఆర్.ఆర్.వెంకటాపురం వద్ద ఉన్న ఎల్జీపాలిమర్స్ సంస్థ నుంచి వెలువడిన స్టైరైన్ గ్యాస్ కారణంగా వందల మంది తీవ్ర సమస్యలకు గురి కావడం, పన్నెండు మంది మరణించడం విషాధకరం. ఇలా జరిగినందుకు ఎవరైనా విచారిస్తారు. దుర్ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది.
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులను తరలించడానికి సిద్ధంగా ఉంచిన బస్‌లను, అలాగే సుమారు పాతిక అంబులెన్స్‌లను వెంటనే వాడుకుని పోలీసులు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ సకాలంలో స్పందించడం వల్ల ఇది మరింత పెద్ద ఘటన కాకుండా ఆగింది. అందుకు జిల్లాకలెక్టర్, పోలీస్ కమిషనర్, డీసీపీలు తదితర సిబ్బందిని అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలలో సకాలంలో స్పందించకపోతే ఎంత తీవ్రం అయ్యేది చెప్పలేం.
ఆ వెంటనే మంత్రులు అక్కడకు వెళ్లడం సహాయ చర్యలు పర్యవేక్షించడం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటివి చేపట్టారు. ఈ సమాచారం అందిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు సైతం స్పందించారు. ముఖ్యమంత్రి జగన్‌తో ఈ ఘటనపై వారు చర్చించారు. అదే సమయంలో జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించి, చేయవలసిన సహాయ చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వెంటనే విశాఖపట్నం వెళ్లి ఆస్పత్రిలో ఉన్న బాధితులను పరామర్శించారు.
తదనంతరం సంచలనాత్మక రీతిలో చనిపోయినవారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాక కొత్త తరహాలో వెంటిలేటర్ల మీద ఉన్న వారికి పదిలక్షలు, తీవ్రంగా ఇబ్బంది పడి చికిత్స పొందుతున్నవారికి లక్ష రూపాయలు, ఇతరులకు, పాతికవేలు, ఆయా గ్రామాల ప్రజలకు పదివేల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. గతంలో ఇంత భారీమొత్తం ఎవరూ ప్రకటించలేదు. అలాగే అన్ని రకాలుగా వర్గీకరించి అధిక సాయం చేసిన సందర్భాలు తక్కువే.
బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ నేతలు నారాయణ వంటివారు పాతిక లక్షలు సాయం చేయాలని డిమాండ్ చేస్తే జగన్ ఏకంగా కోటి రూపాయలు చొప్పున ప్రకటించడం ద్వారా అందరిని ఆశ్చర్యపరిచారు. నారాయణ అయితే ఆ విషయం ఒప్పుకున్నారు. తాము అడిగినదానికి నాలుగు రెట్లు ఇచ్చారని ప్రశంసించారు. ఈ మధ్యకాలంలో జగన్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న కన్నా కాని, నారాయణ కాని అభినందించక తప్పలేదు.
మరి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాతిక లక్షలసాయం కోరుతూ లేఖ సిద్ధం చేసుకున్నారని అంటారు. అంతలో జగన్ కోటి రూపాయలు ప్రకటించేసరికి ఆయన వ్యూహం మార్చుకుని ప్రాణాలకు విలువకడతారా? అంటూ కొత్త రాగం ఆలపించారు. కొందరు బాధితులు రాజకీయ ప్రేరితం వల్లకాని, ఇతరత్రా కాని పాలిమర్స్ వద్ద శవాలతో ధర్నా చేశారు. బాధితుల ఆవేదనను అర్ధం చేసుకోగలం. వారు నిరసనలు తెలపడం తప్పు కాదు. కాని రాజకీయ నేతల ట్రాప్‌లో పడి కొందరు పిచ్చి మాటలు మాట్లాడడం బాగోలేదు.
డబ్బులు ఇచ్చినా ప్రాణాలు తెస్తారా? అని అడిగారు. తప్పులేదు. ఎవరూ పోయిన ప్రాణాన్ని తెచ్చి ఇవ్వలేరు. అంతేకాక ప్రభుత్వం వల్ల వారి ప్రాణాలు పోలేదు. ఒక ప్రైవేటు కంపెనీలో జరిగిన ప్రమాదం అది. నిజంగానే వారికి పరిహారం అక్కర్లేదు అనుకుంటే వారు వెనక్కి తిరిగి ఇచ్చేయవచ్చు. లేదా చనిపోయినవారి పేరుతో సేవా కార్యక్రమాలకు ఆ డబ్బు వినియోగించవచ్చు. ఎందరు బాధితులు అందుకు సిద్ధం అయ్యారు? నిజానికి ఇక్కడే జగన్ రాజకీయ ఆలోచన చేయకుండా ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల కొత్త సమస్యలు వచ్చాయనిపిస్తుంది.
అదే ఆయా రాజకీయ పక్షాలు డిమాండ్ చేసే వరకు ఆగడం, బాధితులు పరిహారం కోసం పట్టుబట్టే వరకు వేచి చూడడం, ఆ తర్వాత తాను ఇవ్వదలిచిన కోటి రూపాయల పరిహారం ఇచ్చి ఉంటే మిగిలిన డిమాండ్లు, డబ్బు ఇస్తే మాత్రం ప్రాణాలు తిరిగి వస్తాయా అన్న వ్యాఖ్యలకు ఆస్కారం ఉండేది కాదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా కోటి రూపాయలతో ప్రాణం తిరిగి వస్తుందా అంటూ అసందర్భంగా మాట్లాడారు. డబ్బు ఎవరు అడిగారని కూడా ఆయన అంటున్నారు. ఇదంతా పనికిమాలిన రాజకీయం తప్ప మరొకటి కాదు. అంతేకాదు.. ఏకంగా దక్షిణ కొరియాలో ఎంత పరిహారం ఇస్తారో అంతా ఇవ్వాలని కొత్త డిమాండ్ చేశారు.
మరి ఇదే చంద్రబాబు నాయుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా పరిహారాలు ఇచ్చారు? ఎంతలా బాధితులను అవమానించారు? అన్న ఘటనలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన సంగతులు బయటకు వస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటివి అనేకం వైరల్ అయ్యాయి. ఉదాహరణకు చంద్రబాబు ప్రచారయావ అనండి, పిచ్చి అనండి, దాని కారణంగా గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోతే ఏమన్నారు? పుష్కరాలలో చనిపోతే తాను ఏమి చేయాలన్నట్లుగా మాట్లాడారు.
అలాంటివి కామన్‌గా జరుగుతాయి.. రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో చనిపోలేదా? పూరి జగన్నాథ రథచక్రాల కింద పడి చనిపోలేదా? అంటూ అసలు మానవ ప్రాణాలకు లెక్కలేదన్నట్లు, మరణాలు సహజం అన్నట్లు మాట్లాడిన పెద్దమనిషి ఇప్పుడు ఏపీలో ఎక్కడ ఏమి జరిగినా, ఏ ఘటనలో ఒక్కరు చనిపోయినా, అమ్మో అంటూ గుండెలు బాదుకుంటూ సినిమా సన్నివేశాల మాదిరి రక్తి కట్టించే యత్నం చేస్తున్నారు.
అంతేకాదు.. గంగవరం పోర్టులో ప్రమాదం జరిగి బాధితులకు పదిలక్షల రూపాయల చొప్పున ఇవ్వడానికి యాజమాన్యం సిద్ధమైతే చంద్రబాబు ఆపి మరీ వారితో ఐదు లక్షలే ఇప్పించారని, సీపీఎం నేత నరసింగరావు చెప్పారు. ఉమ్మడి రాష్ర్టంలో సీఎంగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఒక యువతిపై యాసిడ్ దాడి జరిగితే ప్రభుత్వం ఎందుకు పరిహారం ఇవ్వాలని అడిగారన్న సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ యువతికి పరిహారం ఇచ్చారు. అంతేకాదు.
గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో మరణించినవారి కుటుంబాలకు గాని, గోదావరి, కష్ణాలలో జరిగిన బోటు ప్రమాదాలలో మతుల కుటుంబాలకు గాని బాగా ఇస్తే పదిలక్షల రూపాయల వరేక పరిహారం ఇచ్చిన చంద్రబాబుకు విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్ద జరిగిన ఘటనలో ఎన్ని కోట్ల పరిహారం అడగాలో ఆయనేక తెలియడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన గ్యాస్ పేలుడు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు గెయిల్ నుంచి ఇరవై లక్షలు, రాష్ర్ట ప్రభుత్వం మూడు లక్షలు ఇలా ఇచ్చారు. అది కూడా వారు ఎన్నాళ్లో పోరాటం చేస్తే కాని జరగలేదు.
అలాంటి చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. మరి ముఖ్యమంత్రి జగన్ ఘటన జరిగిన నాలుగు గంటలలో పరిహారం ప్రకటించడమే కాకుండా నాలుగు రోజులలో ఆ డబ్బు బాధిత కుటుంబాలకు అందేలా చేశారు. ఇంత త్వరితగతిన చేస్తారని ఎవరూ ఊహించలేదు. దీంతో జగన్ ఇమేజీ బాగా పెరిగింది. దానిని దెబ్బకొట్టడానికి టీడీపీ తన సోషల్ మీడియా ద్వారా కాని, ఇతరత్రా కాని పలు పిచ్చి ఆరోపణలు ప్రచారం చేసింది. ఐదుకోట్లు వస్తాయని, ఇంకేదో చేస్తారని అంటూ బాధితులను రెచ్చగొట్టే యత్నం చేశారు. వాటికి ఆ గ్రామాల వారు లోబడితే వారి కన్ను వారే పొడుచుకున్నవారు అవుతారు.
అలాగే మంత్రులను, ఎంపీలను స్టైరెన్ గ్యాస్ ప్రభావిత గ్రామాలలో రాత్రి బస చేసేలా చేయడం ద్వారా గ్రామస్థులలో ఒక నమ్మకం పెంచే యత్నం చేశారు. చంద్రబాబు టైమ్‌లో అంతా ఆయనే చేస్తున్నారన్నట్లుగా పిక్చర్ ఇచ్చేవారు. కాని జగన్ తాను చేయవలసింది తాను చేసి, మిగిలింది అరడజను మంది మంత్రులపై బాధ్యత పెట్టి వారిని కూడా ఇన్వాల్వ్ చేయడం మంచి పరిణామం. చంద్రబాబు అయితే రోజూ తానే ఏదో ఒకటి మాట్లాడేవారు. కాని ఇప్పుడు మాత్రం రోజూ మంత్రులే మాట్లాడుతుండడం కూడా గమనించవలసిన అంశం.
ప్రభుత్వపరంగా చేయవలసినవన్నీ చేసిన తర్వాత ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించి, ఇంకేమైనా సాయం చేయాలని సూచిస్తే బాగుండేది. కాని టీడీపీ నేతలు ఎంతసేపు బురదచల్లుడు రాజకీయానికి అలవాటు పడిపోయారు. ఆ కంపెనీకి ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎవరు ఏమి చేశారన్న చర్చ కూడా జరిగింది. వైసీపీ వచాే్చక అనుమతులు ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. అంటే అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో ఇది మూత పడిఉందా? 199లో ఈయన ఎలా అనుమతులు ఇచ్చారు? సింహాచలం దేవాలయ భూములను చంద్రబాబు ప్రభుత్వం ఎలా కంపెనీకి ఇచ్చింది? ఇలాంటి వాటికి సమాధానం రావల్సి ఉంది.
అయితే కంపెనీకి సంబంధించినవారిని ఎవరిని అరెస్టు చేయలేదన్న విమర్శ ప్రభుత్వంపై ఉంది. దానికి కారణాలను ప్రభుత్వం చెప్పవలసి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించిన తీరు రీత్యా ఆలోచిస్తే, విదేశీ పెట్టుబడులపై ప్రభావం పడకుండా ఉండడానికి ఆయన ఏమైనా సూచనలు చేశారా అన్నది తెలియదు. ఈ కంపెనీ యాజమాన్యం దక్షిణ కొరియాలో ఉంది.
జగన్ చెప్పినట్లు ఇది పెద్ద కంపెనీ. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు అవసరమేమో.. లేకుంటే కొత్త పరిశ్రమలు రావడంలో ఇబ్బందులు ఉండవచ్చు. కంపెనీని మూసివేయాలన్న డిమాండ్ కూడా చంద్రబాబు, మరికొందరు చేశారు. కంపెనీ చుట్టపక్కల జనావాసాలు వచ్చాయి కనుక దానిని అక్కడ నుంచి తరలించాలన్న డిమాండ్లు ఉన్నాయి.
అధికారిక నివేదికలు వచ్చాక ఏమి చేస్తారో తెలియదు. విశేషం ఏమిటంటే గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది చనిపోతే అరెస్టుల సంగతి దేవుడెరుగు.. ఒక కానిస్టేబుల్‌ను కూడా సస్పెండ్ చేయలేదు. పైగా సీసీటీవీ పుటేజీని మాయం చేశారు.. గెయిల్ ఆధ్వర్యంలోని పైప్‌లైన్ మంటలకు గురై పలువురు చనిపోతే ఎవరిని అరెస్టు చేశారు. అంతదాకా ఎందుకు చంద్రబాబు టైమ్‌లో కూడా ఇదే కంపెనీలో కొన్ని ప్రమాదాలు జరిగాయి. అప్పుడు అరెస్టులు జరిగాయా? బోటు ప్రమాదాలు జరిగితే కూడా వెంటనే అరెస్టులు జరిగిన సందర్భాలు తక్కువే. నిజమే చట్టం ముందు అంతా సమానమే అనుకోవచ్చు. కాని ఎవరు బాధ్యులు అన్నది నిర్ధారించి చేయకపోతే ఇలాంటి సందర్భాలలో అంతర్జాతీయంగా కూడా కొన్ని చిక్కులు రావచ్చు. అయితే ఇక్కడ అరెస్టులు జరుగుతాయా? కంపెనీనీ తరలిస్తారా? ఇతరత్రా ఏమి చర్యలు తీసుకుంటారన్నది తేలడానికి కొంత సమయం పట్టవచ్చు. ప్రభుత్వం ఈ ఘటన జరిగిన తర్వాత స్పందించిన తీరును విశ్లేషిస్తే మాత్రం జగన్ ప్రభుత్వానికి నూటికి తొంభై మార్కులు పడతాయి.
అలాగే జగన్ పరిహారం ప్రకటించిన తీరుకు నూటికి నూరు మార్కులు వస్తాయి. అందుకే జగన్ ఇమేజీ పెరగకుండా దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీనేతలు తమ వంతు కషి చేశారు. ప్రతిపక్షం అన్నాక ఏదో ఒక విమర్శ చేయకుండా ఉండదు. కాని ఉచ్ఛనీచాలు మరవరాదన్నది మాత్రం చెప్పకతప్పదు. ఆ విషయంలో చంద్రబాబు తొందరపడుతున్నారు. తన డ్బ్బై ఏళ్ల వయసును, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఉన్న కేవలం ఫక్తు రాజకీయాలు చేస్తూ, ఆయన ప్రతిష్టను ఆయనే చెడగొట్టుకుంటున్నారు. అదే సమయంలో నలభైఐదేళ్ల వయసున్న ముఖ్యమంత్రి జగన్ ఎంతో అనుభవం ఉన్న నేతగా, మానవత్వం కలిగిన వ్యక్తిగా నిరూపించుకుంటున్నారు. పబ్లిసిటీ కోసం కాకుండా ప్రజలకు ఇబ్బంది ఉండరాదన్న ఉద్దేశంతో పనిచేసి రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. అదే వీరిద్దరికి ఉన్న తేడా!
కొమ్మినేని శ్రీనివాసరావు