శ్రుతీ హాసన్ దక్షిణాది అగ్రహీరోయిన్. స్వభావంలో తండ్రిలా ముక్కుసూటి మనస్తత్వం. తండ్రి కమల్‌హాసన్ నుంచి నటనను వారసత్వంగా స్వీకరించినా…ప్రతిభతో రాణించాలని, అందుకు తగ్గట్టు కృషి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. తన లవ్ బ్రేకప్, ఇతర వృత్తిగత విషయాలను ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడారు. ఆ ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం.
లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ బాగా మిస్ అవుతున్నట్టు శ్రుతీ చెప్పారు. అలాగే తన సహచర నటీనటులను, దర్శకులను, లోకేషన్స్ అన్నీ మిస్ అవుతున్నట్టు బాధతో చెప్పారు. కానీ ప్రపంచం కరోనాతో ఎదుర్కొంటున్న సమస్య ముందు తనది పెద్ద సమస్య కాదన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో వ్యక్తిగత సమస్యలంటూ ఏకరువు పెట్టడం కూడా సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంటి పని, వంట పని, మ్యూజిక్ వింటూ, కవితలు రాస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.
కరోనా అనేక విషయాలు నేర్పించిందన్నారు. అనవసరమైన విషయాలు మాట్లాడ్డం మానేయాలనే మంచి విషయాన్ని కరోనా నుంచి నేర్చుకున్నానన్నారు. అంతేకాదు, జీవితంలో అతి ముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు తనకే కాదు అందరికీ అర్థమవుతోం దన్నారు. లాక్‌డౌన్ తర్వాత చాలా మందిలో చాలా మార్పు వస్తుందని తాను నమ్ముతున్నట్టు శ్రుతీ వెల్లడించారు.
నెగటివ్‌గా మాట్లాడేవాళ్లు, నెగటివ్ ఎనర్జీ పంచేవాళ్లు తనకు అవసరం లేదని బలంగా నిర్ణయించుకున్నట్టు ఆమె తెలిపారు. అలాంటి వాళ్లను దూరం పెట్టాలని చాలా బలంగా ఫిక్సయ్యానన్నారు. తనకు కేవలం పాజిటివిటీయే కావాలన్నారు.
తనకూ ఆర్థిక సమస్యలు ఉన్నాయని, లోన్లు కట్టాల్సినవి ఉన్నాయన్నారు. అయితే డబ్బు కావాలని తన తండ్రి కమల్‌హా సన్‌ను ఎప్పుడూ అడగనని కూడా స్పష్టం చేశారు. మనల్ని ఓ పవర్ నడిపిస్తుందని నమ్ముతానన్నారు. ఒక విషయాన్ని బలంగా మనసులో అనుకుంటే, అది కచ్చితంగా కొంత సమయం తీసుకున్నా నెరవేరేలా ఆ పవర్ పని చేస్తుందని శ్రుతీహాసన్ తెలిపారు.
మైఖేల్ కోర్సలేతో బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఆ రిలేషన్‌షిప్ ఓ మంచి అనుభవాన్ని ఇచ్చినట్టు అభిప్రాయపడ్డారు. ‘లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్’ అంటారు కదా. అలా అన్నమాట అని సరదాగా చెప్పారు. అయితే ఆ రిలేషన్ బ్రేకప్ అయినందుకు పశ్చాత్తాప పడటంలేదన్నారు.
చివరగా మళ్లీ ప్రేమలో పడతారా అనే ప్రశ్నకు శ్రుతీ భలే సరదాగా జవాబిచ్చారు. ‘ఎందుకు పడకూడదు? నేను ప్రేమలో పడే వయసులోనే ఉన్నాను కదా. ఈ వయసులో ప్రేమకబుర్లు చెప్పకపోతే ఏ వయసులో చెబుతాం. అయితే నేను అనుకుంటున్న ఆ ‘గొప్ప ప్రేమ’ దొరికినప్పుడు ఇలాంటి ప్రేమకోసమే ఎదురు చూశానని తప్పకుండా చెబుతాను’ అని తన అభిప్రాయాలను గట్టిగా, నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారామె. శ్రుతీ మాటలను బట్టి ప్రేమ కోసం ఆమె తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది.