ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కరోనా నివారణకు మందు కనుగునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్ నియంత్రణకు వైద్య పరిశోధకులు తమ ప్రయత్నాలను చిత్తశుద్ధితోనే చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనాతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, అక్కడ ట్రయల్స్ వేగవంతంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు, కొన్ని వైద్య పరిశోధక సంస్థలు తాము కరోనా నివారణకు మందు కనుగొన్నట్టుగా ప్రకటించాయి.
అయితే ఎటొచ్చీ ఆ మందును వాడటానికి ముందు బోలెడన్ని రకాల పరీక్షలు చేయాలి. మనుషుల ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆ వ్యాక్సిన్లు వేయొచ్చా లేదా అనే అంశాలను నిర్ధారించాలి. అనేక రకాల పరీక్షల అనంతరమే వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తారు. దీంతో దీనికి సహజంగానే టైమ్ పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండున్నర నెలలుగా వివిధ దేశాలు కరోనాతో తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నాయి. రెండు నెలలుగా కరోనా నివారణకు మందులపై ప్రయోగాలు కొనసాగుతూ ఉన్నాయి.
ఈ క్రమంలో ఇప్పటి వరకూ ఎనిమిది రకాల వ్యాక్సిన్లను రెడీ అవుతున్నట్టుగా డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. అమెరికా, చైనా, జర్మనీ వంటి దేశాలు మందు విషయంలో ప్రగతిని సాధిస్తున్నాయని, మరో వందకు పైగా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని, అవి కూడా వివిధ దశల్లో ఉన్నాయని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. అయితే ఇవేవీ ఇప్పటికిప్పుడు అయితే అందుబాటులోకి వచ్చేలా లేవు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో ఈ ఏడాది చివరకు కరోనాకు చెక్ పెట్టే నిఖార్సైన టీకా వస్తుందని అంటున్నారు. అయితే ట్రంప్ మాటలు అంత విశ్వసనీయంగా లేవు. చైనా పరిశోధకులు ఏమో వచ్చే ఏడాది మార్చి నుంచి జూన్ మధ్యకు కరోనాకు సరైన టీకా వచ్చేస్తుందని చెబుతున్నారు. అయితే చైనీయులనూ నమ్మే వాళ్లు లేరు. ఆల్రెడీ చైనా మందును కొనుగొందని, దాని ద్వారానే నివారించగలుగుతోందని, దాని వల్లనే వుహాన్ లో కార్యకలాపాలు యథారీతిన సాగుతున్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. కరోనా విషయంలో చైనాను ఏ రకంగానే నమ్మే పరిస్థితి లేదు.
ఇక ఇజ్రాయెల్ వాళ్లు తమ పరిశోధన కీలక విజయాలను సాధిస్తోందని ఇప్పటికే ప్రకటించారు. యూధుల తరఫు నుంచి ప్రపంచానికి కరోనా టీకా కానుకగా అందుతుందన్నట్టుగా ఇజ్రాయెల్ మంత్రి ఒకరు ప్రకటించారు. ఇంతకీ ఆ శుభవార్త ఎప్పుడో!