Advertisement

Advertisement


Home > Movies - Interviews

మా సినిమా మొబైల్ లో చూడడానికి కాదు-ఇంద్రగంటి

మా సినిమా మొబైల్ లో చూడడానికి కాదు-ఇంద్రగంటి

ఇది లాక్ డౌన్ టైమ్...కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే...

ఒక్కో సినిమా ఒక్కో అనుభూతిని అందిస్తుంది. దర్శకుడు ఇంద్రగంటిదీ ఇదే పద్దతి. ఆయన ఒక్కో సినిమా ఒక్కోలా వుంటుంది. ఒకటేమో పిల్ల తిమ్మెర పలకరించినట్లు హాయిగా వుంటుంది. మరోటి భళ్లున తెలుగువాడు పడి పడి నవ్వే పద్దతిలో వుంటుంది. ఇంకోటి గిలిగింతలు పెడుతూ సాగిపోతుంది. అలాంటి డైరక్టర్ 'వి' అంటూ ఓ థ్రిల్లర్ తీసి, విడుదలకు రెడీ చేసిన టైమ్ లో కరోనా వచ్చింది. మరి ఇప్పుడు ఆయనేం చేస్తున్నారు. తరువాత సినిమాకు రెడీ అయిపోతున్నారా? అదే కనుక్కుందాం.

-హాయ్ సర్...ఏం వింటున్నారు..ఏం చదువుతున్నారు..ఎందుకంటే మీరు పుస్తకాలు ఎక్కువ చదువుతారు..సంగీత ప్రియులు..అందుకే ఇలా అడుగుతున్నా.

నిజంగానే కొన్ని పుస్తకాలు చదివా. ఈ ఖాళీ టైమ్ లో. మా అమ్మగారు ఓ బుక్ కొని వుంచారు. ఇది చదువు అని చెబితే అది చదువుతున్నా. అలాగే ముళ్లపూడి కోతి కొమ్మచ్చి మొదటి భాగం మరోసారి చదివాను. అలాగే కొన్ని సినిమాలు చూసాను. 

-ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నారు

పక్కాగా చెప్పాలంటే, మా అబ్బాయి వేసుకున్న టెంట్ లో పడుకుని ఏదో పుస్తకం చదువుతున్నా. కాస్తేపు వాడితో కిందా మీదా పడుతున్నా. 

-మరి కొద్ది రోజులు ఆగితే సినిమా తెరపైకి వచ్చేస్తుంది..ఇంతలో అనుకోని అవాంతరం..నిరాశకు గురయ్యారా?

నిరాశ అని కాదు. జస్ట్ వన్ వీక్ పోస్ట్ ప్రొడక్షన్ వుంది. ఆ పైన విడుదల. ఈ టైమ్ లో ఇలా.  మన ఒక్కరికే జరిగితే నిరాశ. ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న సమస్య కదా.

-లాక్ డౌన్ ఎలా అనిపిస్తోంది.

నిజానికి నేను పెద్దగా బయటకు వెళ్లను.  ఎప్పుడన్నా బయటకు వెళ్లి ఏ కెఫటేరియాలోనో కూర్చుని, మిత్రులతో కాస్సేపు మాట్లాడి వచ్చేయడమే. రోజుల తరబడి ఇంట్లో వుండిపోవడం అలవాటే. కానీ బయటకు వెళ్లకూడదు..వెళ్లలేము అన్నది తలుచుకుంటే ఏదో ఇబ్బందిగా వుంటుంది అంతే. 

-క్రియేటర్లకు ఇది మంచి అవకాశం అనుకుంటా. కొత్త ఐడియాలు కథలుగా మార్చడానికి.

కానీ అలా అని కూడా అనుకోవడానికి లేదు. టీవీ పెడితే చావు భయం. చావు వార్తలు. ఈ నేపథ్యంలో రొమాంటిక్ కథ అల్లే మూడ్ ఎలా వస్తుంది. కామెడీ ఎలా కదులుతుంది?

-వి సినిమాను ఆన్ లైన్ లో విడుదల చేసేస్తారని ఒకటే వినిపిస్తోంది.

నేనూ విన్నాను మీలాగే. 

-అంటే మీ యూనిట్ లో ఆ డిస్కషన్ ఏమీ లేదా?

లేదు. నా వరకు అయితే అలాంటిదేమీ రాలేదు.

-మీ వరకు వస్తే, మీకు ఓకేనా?

ఎలా ఒకె అంటాను. సినిమా అన్నది థియేటర్ ఎక్స్ పీరియన్స్. థియేటర్లో చూస్తే ఆ మజానే వేరు. పైగా మా సినిమా వరకు వస్తే, అవార్డ్ విన్నర్ చేత సౌండ్ మిక్సింగ్ చేయించాం.  అమిత్ త్రివేదీ సంగీతం. టాప్ నాచ్ టెక్నీషియన్లు వర్క్ చేసారు. ఈ వర్క్ అంతా ఓ సినిమాను మొబైల్ లో చూడడానికా?  నా వరకు నేను మాత్రం సినిమాను థియేటర్ లోనే చూడాలంటాను. దానినే ఇష్టపడతాను.

-మరి ఓటిటి ప్లాట్ ఫారమ్ ల సంగతేమిటి?

అది కూడా ఓ మాధ్యమం. అంతే. టీవీ, సినిమా ల మాదిరిగానే అది కూడా. దేనిని ఇష్టపడే వారు దానికి వుంటారు. నా వరకు వస్తే సినిమా అనేది థియేటర్ లో పది మంది మధ్య కూర్చుని, పెద్ద తెరపై చూడాల్సిన అనుభవం. 

-వి ఎప్పుడు మీరు ఇష్టపడే పెద్ద తెర మీదకు వస్తుందని అంచనా.

అది ఇప్పుడే చెప్పగలిగేది కాదు. పరిస్థితులు ఎలా వుంటాయో? ఎలా టర్న్ అవుతాయో? చూడాలి.

-జనాలు థియేటర్ కు భయం లేకుండా వస్తారంటారా?

కచ్చితంగా. నాకు అయితే ఆ నమ్మకం వుంది. వన్స్ థియేటర్లు ఓపెన్ అయితే మన జనాలు కచ్చితంగావస్తారు. మనకు సినిమా అంటే వుండే అభిమానం అలాంటిది. అయితే ఆరంభంలో కాస్త తటపటాయింపు వుంటే వుంటుందేమో? అది మరీ ఎక్కువ అని నేను అనుకోను.

-తరువాత సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మీరు వల వేసి చేపలు పట్టినట్లు, అన్నీ భలే పట్టేస్తారుగా. నాకు చాలా కమిట్ మెంట్ లు వున్నాయి. అవన్నీ చూసుకోవాలి. అందరితో మాట్లాడాలి. ఇంకా చాలా దూరం వుంది.

-మళ్లీ పెద్ద సినిమానే వుంటుందా? వి మాదిరిగా.

నేను పెద్ద, చిన్న రెండూ చేయాలనే అనుకుంటాను. మళ్లీ సమ్మోహనం మాదిరిగా ఓ మీడియం కథను కూడా రెడీ చేస్తున్నాను. అదే సమయంలో ఓ పెద్ద ప్రాజెక్టుకు స్క్రిప్ట్ కూడా రెడీ గా వుంది. 

-థాంక్యూ మీ లాక్ డౌన్ టైమ్ లో కొంత సేపు మాతో ముచ్చటించినందుకు.

నేను కూడా థాంక్యూ..కాస్సేపు  లాక్ డౌన్ ను మరిచిపోయేలా చేసినందుకు.

-విఎస్ఎన్ మూర్తి

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా