Advertisement

Advertisement


Home > Movies - Interviews

పవన్ కాకుండా మరెవరైనా ఫ్లాప్ నే-బండ్ల

పవన్ కాకుండా మరెవరైనా ఫ్లాప్ నే-బండ్ల

గబ్బర్ సింగ్. వరుసగా ఫ్లాపుల్లో వున్న పవన్ కళ్యాణ్ ఓ టర్నింగ్ పాయింట్. అప్పడే  కెరీర్ స్టార్ట్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్ కు ఓక గుర్తింపు. నిర్మాతగా బండ్ల గణేష్ కు ఇప్పటికీ ఓ విజిటింగ్ కార్డ్.  ఆ సినిమా విడుదలై ఎనిమిదేళ్లయిన సందర్భంగా పవన్ ఫ్యాన్స్ విపరీతంగా ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా నిర్మాత బండ్ల గణేష్ తొ ఇంటర్వ్యూ.

-గబ్బర్ సింగ్ సినిమా ఎలా స్టార్ట్ అయింది.

తీన్ మార్ సినిమా షూటింగ్ లో సోనూ సూద్ చెప్పాడు ఈ సినిమా గురించి. పెద్ద హిట్ అయిందని. వెంటనే కోటిన్నర పెట్టి రీమేక్ రైట్స్ కొన్నాను.

-ఎవరి కోసం కొన్నారు. ఏ హీరో ఐడియా లేకుండా కొనేసారా?

నిజానికి ఇద్దరు ముగ్గురు ఐడియాలో వున్నారు. పవన్ కళ్యాణ్, రవితేజ, ఇంకా, ఆ పేర్లు అన్నీ ఇప్పుడెందుకు లెండి. 

-పవన్ కళ్యాణ్ కాకపోతే అన్న ఆలోచన ఎందుకు వచ్చింది?

ఎందుకు వచ్చింది అంటే, తీన్ మార్ ఫ్లాప్. ఆ వెంటనే వెళ్లి సినిమా అడిగితే హీరో ఓకె అంటాడా? ఆ ధైర్యం వుండొద్దూ. అందుకే రవితేజతో అన్న ఆలోచన వచ్చింది.

-మరి కళ్యాణ్ ఎలా వచ్చారు సీన్లోకి?

అంతా డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చలవ. ఈ సినిమాకు నేను నిర్మాతను అంటే దానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. తీన్ మార్ ఫ్లాప్ కు నాకన్నా, కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ బాధపడింది ఆయనే. అంత మంచి మనిషి . ఆయనే నేను ఈ సినిమా రైట్స్ కొన్నానన్న సంగతిని కళ్యాణ్ గారికి చెప్పారు. ఆయన పిలిచి, నిజంగా కొన్నావా? కొన్న కాగితం చూపిస్తే మాంచి టైటిల్ చెబుతా అన్నారు. తెచ్చి చూపించా. అప్పుడు చెప్పారు. గబ్బర్ సింగ్ అని. వెళ్లి ఆ టైటిల్ రిజిస్టర్ చేసుకురా పో అన్నారు. ఆ తరువాత ఆ సినిమా తానే నిర్మిస్తా ఇచ్చేయ్ అన్నారు. సరే అన్నాను. కానీ మరేమయిందో రెండు రోజుల్లో మళ్లీ త్రివిక్రమ్ కబురు చేసారు. పవన్ కళ్యాణ్ ను కలిసాను. నువ్వే చేసుకో అన్నారు.

-పవన్ కళ్యాణ్ ఓకె అనకపోతే, ఈ సినిమా ఎలా వుండేది?

పెద్ద ఫ్లాప్ అయ్యేది. పవన్ కళ్యాణ్ కాకుండా మరే హీరో చేసినా ఈ సినిమా రెండు రోజులు కూడా ఆడేది కాదు. 

-మరి మీరు వేరే హీరోలతో తీద్దాం అనుకున్నారుగా?

అనుకున్నాను స్వామీ. కానీ తీరా గబ్బర్ సింగ్ లో కళ్యాణ్ విశ్వరూపం చూసాక అర్థం అయింది. ఇది ఆయన తప్ప మరెవరికి పనికి రాదు అని. 

-ఈ ప్రాజెక్టును హరీష్ శంకర్ కు ఎలా అప్పగించారు? 

హరీష్ తో అంతకు ముందు మిరపకాయ్ ప్రాజెక్టు చేద్దాం అని పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లా, అది మెటీరియలైజ్ కాలేదు. ఆయన ఆ తరువాత ఆ సినిమాను రవితేజ తో వేరే నిర్మాతతో చేసారు. అది పవన్ కు గుర్తు వుంది. మన దగ్గరకు వచ్చాడు కదా..అతన్ని పిలు అని ఆయనే హరీష్ ను పిలిపించారు.

-ఇటీవల ట్విట్టర్ లో హరీష్ ఓ నోట్ పెట్టారు. అందులో సినిమాకు వర్క్ చేసినా చాలా మందికి థాంక్స్ చెప్పారు. మరి మీ పేరు వున్నట్లు లేదు.

అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్ లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి..ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే డైరక్టర్ కు పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కల్పించింది నేను. ఆయన. సినిమాలు లేక కిందా మీదా అవుతుంటే పరిచయం కల్పించింది నేను.  ఎన్టీఆర్  సినిమా ఇస్తానన్న నల్లమలపు బుజ్జి ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసాను నేను. ఫామ్ హవుస్ లో వుంటే తీసుకెళ్లి మిరపకాయ్ కథ వినిపించాను. 

-ఇవన్నీ రాయమంటారా?

రాయండి. నాకేం భయం..

-మళ్లీ తరువాత నేను అనలేదు అని ఖండించకూడదు. హరీష్ కు మీకు గబ్బర్ సింగ్ టైమ్ లో ఏమన్నా మనస్పర్దలు వచ్చాయా?.

ఎందుకు ఖండిస్తా..బండ్ల గణేష్ ఓ మాట అంటే మాటే. మా ఇద్దరికి ఏ మనస్పర్ధలు రాలేదు. వచ్చి వుంటే సినిమా పూర్తి అయ్యేది కాదు కదా.

-శృతి హాసన్ ను ఎవరు సజెస్ట్ చేసారు.

అదీ పవన్ నే. నేను భయపడ్డాను. అప్పటికే ఆమె ఓ ఫ్లాప్ సినిమాలో నటించింది. అదే చెప్పాను. దానికి పవన్ నువ్వు, నేను ఫ్లాపులు ఇవ్వలేదా? అన్నారు. దాంతో ఆమెనే ఫిక్స్ చేసాము.

-సినిమాకు పవన్ ఇన్ పుట్స్ ఏమన్నా వున్నాయా?

అంత్యాక్షరి ఎపిుసోడ్ పవన్ ఐడియానే.

-గబ్బర్ సింగ్ అనుకున్న బడ్జెట్ లోనే తయారైందా?

అది మాత్రం హరీష్ బాగా చేసాడు. అనుకున్న బడ్జెట్ లోనే సినిమా చేసాడు.

-సినిమాకు లాభం అధికారికంగా ఎంత చూపించారు? లేదా ఇన్ కమ్ టాక్స్ లెక్కల ప్రకారం లాభం ఎంత?

ఆ ఏడాది చాలా పెద్ద మొత్తమే టాక్స్ కట్టాం. సరిగ్గా గుర్తు లేదు కానీ. కానీ ఇక్కడ లాభం సంగతి కాదు, ఇన్భాళ్ల తరువాత కూడా నాకు నిర్మాతగా గుర్తింపు వుందంటే అదేగా కారణం. అది ముఖ్యం.

-మరి అలాంటి గుర్తింపు వుండి కూడా సినిమా చేయలేకపోతున్నారు మళ్లీ.

టైమ్...టైమ్ రావాలి. శక్తి సినిమా తరువాత అశ్వనీదత్ సినిమా తీయడానికి ఎన్నాళ్లు పట్టింది? వాళ్ల కన్నా గొప్పోడినా?

-దర్శకుడు పూరికి లక్షల ఖరీదైన లైటర్ కొనిచ్చారు. పవన్ ను దేవుడున్నారు. మెగా ప్యామిలీ మీ ఫ్యామిలీ అన్నారు. ఇలా చాలా అన్నారు కదా.

ఇక్కడ ఏవీ శాశ్వతం కాదు. సినిమా సినిమాకు బంధాలు మారిపోతాయి. ఒక సినిమా వున్నంత కాలం ఓ హీరో, ఓ టీమ్ తో బంధం వుంటుంది. మరో సినిమా స్టార్ట్ కాగానే మరి కొన్ని కొత్త బంధాలు. ఇక్కడ అంతా అశాశ్వతమే.

-మళ్లీ  సినిమా ఎప్పుడు?

చూద్దాం. మా దేవుడు పవన్ కళ్యాణ్ పిలిచి ఎప్పుడో అప్పుడు డేట్ లు ఇవ్వకపోతారా?  లేదా నేను సినిమాలు తీసిన హీరోలు చాలా మంది వున్నారు. ఎవరో ఒకరు ఇస్తారనే ఆశ వుంది. 

-ఓకె. ఆల్ ది బెస్ట్

థాంక్యూ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?