Advertisement

Advertisement


Home > Movies - Interviews

త్రివిక్రమ్ ఇంట్లో పవన్ ను కలిసా-శ్రీరామ్ వేణు

త్రివిక్రమ్  ఇంట్లో పవన్ ను కలిసా-శ్రీరామ్ వేణు

ఇది లాక్ డౌన్ టైమ్...కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే...

ఓ మై ప్రెండ్..ఎంసిఎ సినిమాలు గుర్తుకు వస్తే వేణు శ్రీరామ్ గుర్తుకు వస్తారు. కానీ వేణు శ్రీరామ్ కాదు ఆయన..శ్రీరామ్ వేణు. ఇదేంటీ ఏమిటి తేడా అంటే తేడా వుంది. శ్రీరాముడి పేరు ఎవరైనా పెట్టుకుంటారు. కానీ శ్రీరామ్ అన్న ఇంటి పేరు ఎక్కడయినా వుంటుందా? వుంది. వేణు ఇంటి పేరు శ్రీరామ్ నే. తాతల నుంచి అదే ఇంటి పేరు.  చిత్రంగా వుంది కదా? అందుకే ఆయన పేరు శ్రీరామ్ వేణు. గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి సినిమాలు చేసినా, చెప్పుకోదగ్గ సినిమాలే. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా. ఈ నేపథ్యంలో ఆయనతో కరోనా టైమ ముచ్చట్లు ఇవి.

-హాయ్ సర్. హడావుడిగా సినిమా చేస్తూ, సడెన్ గా రిలీప్..ఎలా వుంది? ఏం చేస్తున్నారు?

ఏం చేస్తున్నా అంటే, కరోనా టైమ్, పని వాళ్లు కూడా లేరుగా..మా ఆవిడకు పనిలో సాయం.

-అంటే కూరలు తరగడం, పాత్రలు తోమడం. ఎక్స్ ట్రా..ఎక్స్ ట్రానా?

మొహమాటం ఏముంది..అన్నీ..అయితే మా ఆవిడ ఎక్కువ పనులు చేయించడం లా? పనికి రెండు పనులు అవుతాయని. మా  పాపను చూసుకోవడమే పెద్ద పని. అది నాకు వదిలేసింది. అలాగే మొక్కలకు నీళ్లు పోయడం ఇలా.

-కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాలు

కొత్త ఆలోచనలు అని కాదు. నిజానికి వకీల్ సాబ్ స్క్రిప్ట్ ఫైన్ ట్యూనింగ్ వర్క్ కొంత వుంది. ఈ ప్రాజెక్టును అనుకోకుండా, అర్జెంట్ గా టేకప్ చేయడం వల్ల కొంత వర్క్ పెండింగ్ వుంది. అదంతా ఇప్పుడు ఫినిష్ చేసేస్తున్నాను.

-అదేంటీ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకుండానే మొదలుపెట్టారా?

అలా అని కాదు. కొంత బ్యాలన్స్ వుంది. రన్నింగ్ లో చేసుకోవాల్సింది, ఇప్పుడు టైమ్ దొరికింది కనుక చేసేస్తున్నా.

-పవర్ స్టార్ తో సినిమా..ఆ చాన్స్ రాగానే ఎగిరి గంతేసారా?

ఎగిరి గంతేయడం అన్నది చిన్న మాట అవుతుందేమో? అంతకన్నా ఎక్కువే. నిజానికి పింక్ రీమేక్ అన్నది ముందే తెలుసు. ఓసారి బన్నీగారితో మాట్లాడడానికి నేను దిల్ రాజుగారు అలవైకుంఠపురం లోకేషన్ కు వెళ్లాం. అక్కడ వాళ్లిద్దరి మధ్య ఈ డిస్కషన్ నడిచింది. నేను అనుకున్నా. ఎవరో ఆ అదృష్టవంతుడు అని. కానీ నాకే వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.

-అంతకు ముందు ఎప్పుడయినా పవన్ ను కలిసారా?

నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో యాడ్ ఫిలింస్ చేసాను. వాటిల్లో పవన్ తో చేసిన థంప్స్ అప్ యాడ్ ఒకటి. 

-అది ఆయనకు గుర్తు వుందా?

పవన్ తో తొలి మీటింగ్ తివిక్రమ్ గారి ఇంట్లో జరిగింది. ఆయన అన్నీ అడిగారు..ఏం చదివారు..ఇలా అన్నీ. ఓ అభిమానిగా ఆయన ముందు నిల్చునేసరికి ఏం మాట్లాడాలో తెలియదు. ఏదో అలౌకిక స్థితిలో వున్నట్లు వుంది. ఆయన్నే చూస్తున్నాను. అప్పుడు అడిగారు మనం ఇంతకు ముందు కలిసామా? అని. లేదు అని అనేసాను. మరి కాస్సేపటికి నార్మల్ అయ్యాక, గుర్తుకు వచ్చి, సారీ చెప్పి, యాడ్ సంగతి చెప్పాను. ఆయనకు ఆ యాడ్ గుర్తు వుంది. ఎందుకంటే ఆ యాడ్ కు పని చేసిన సినిమాటోగ్రాఫర్, పవన్ జానీ సినిమాకు కూడా పని చేసారు.

-తొలి సమావేశంలో పింక్ రీమేక్ మీద మాట్లాడారా?

మాట్లాడాను. నా ఐడియాలు చెప్పాను. ఓకె అన్నారు.

-మీరు పవన్ అభిమాని. ఓ అభిమాని తన అభిమాన హీరోను ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించడానికి ఈ సినిమాలో చాన్స్ వుందా?

లేదు. ఇది అలాంటి సబ్జెక్ట్ కాదు కదా? ఇంట్రడక్షన్ సాంగ్,  ఐటమ్ సాంగ్ ఇలాంటివి వుండే వ్యవహారం కాదు కదా?

-మరి ఎలా డీల్ చేస్తున్నారు.

స్టోరీ లైన్ మామూలే. అది అలాగే వుంటుంది. కానీ స్టోరీ టెల్లింగ్ స్టయిల్ మారుతుంది. నా పద్దతిలో వుంటుంది. 

-తొలి రోజు పవన్ ను షూటింగ్ లో చూసి మీ స్పందన? కాస్త కంగారు లాంటిదేమైనా?

అదేం లేదు. అసలు అంత ఆలోచనలేదు. ఎందుకంటే సమయం చాలా తక్కవ వుంది. అందుకని చకచకా రెడీ అయిపోయి, షాట్ ల మీద షాట్ లు తీస్తూ వెళ్లాం.

-సెట్ లో పవన్ ఎలా వుంటారు? బుక్స్ చదువుతుంటారా? ఎక్కువగా?

పవన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన ఒక్కరే. ఇద్దరు కాదు. లోపలా, బయట రెండు విదాలుగా వుండరు. మీకు తెలుసా, ఆయన కేరవాన్ లోకి వెళ్లిందే తక్కువ. షర్ట్ మార్చుకోవాలి అంటే అలా పక్కకు వెళ్లి మార్చేసుకున్న సందర్భాలు  వున్నాయి. ఆయన ఏం మాట్లాడతారొ, ఏం చెబుతారో, అదే విధంగా వుంటారు. చెప్పడం ఒకటి, చేయడం మరోటి వుండదు. పుస్తకాలు టైమ్ దొరికితే చదివేస్తారు. కానీ మేం అంత టైమ్ ఇవ్వలేదు. షాట్ మీద షాట్ లాగించేసాం.

-అంత హడావుడి ఎందుకు వచ్చింది?

అంటే తొలి రోజు ఆయన నాలుగు గంటలే టైమ్ ఇచ్చారు. అసలు ఆయన సినిమా చేస్తున్నట్లే లేదు. ఆయనకు వున్న కమిట్ మెంట్ లు అలాంటివి.

-ఇప్పటికి సినిమా ఏ మేరకు పూర్తయింది.

చాలా వరకు అయిపోయింది. పర్సంటేజ్ లు వదిలేయండి...రెండున్నర గంటలొ, రెండు గంటల ఇరవై నిమషాలో  సినిమా అంటే దాదాపు రెండు గంటలు అయిపోయింది.

-అంటే దీన్ని బట్టి హీరోయిన్ పార్ట్ మినహా మిగిలినదంతా అయిపోయింది అనుకోవాలి.

దాదాపుగా అంతే.

-హీరోయిన్ శృతి హాసన్ నే కదా.

ఇప్పటికి అయితే ఆమె నే. కానీ కరోనా వల్ల టైమ్ చూసుకోవాలి. డేట్ ల సమస్య రాకూడదు. చాలా వున్నాయి. అవన్నీ రాజుగారు చూసుకుంటారు.

-అంటే మారే అవకాశం వుందా?

అలా అని కాదు. కానీ ఇక్కడ టైమ్ కు సినిమా ఫినిష్ కావడం ముఖ్యం కదా? అయినా హీరోయిన్ పాత్ర మరీ ఎక్కువ ప్రాధాన్యత వున్నది కాదు.

-రాజుగారి బ్యానర్ లోనే వరుసగా సినిమాలు..ఆస్థాన దర్శకుడు అయిపోయారు కదా?

నేనే కాదు. చాలా మంది వున్నారు. నేను అక్కడే కెరీర్ స్టార్ట్ చేసారు. అలా చేయని వారు కూడా ఆయన దగ్గరకు వస్తే సినిమాల మీద సినిమాలు చేస్తారు. ఆయన తో సహవాసం అలా వుంటుంది.

-థాంక్యూ...

మీకే థాంక్స్ చెప్పాలి. కరోనా టైమ్ లో పలకరించి కాస్త నాలుగు మాటలు మాట్లాడినందుకు, మాట్లాడించినందుకు

-విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?