సంక్రాంతికి పోటీ సహజమే. 2-3 పెద్ద సినిమాలు ఒకేసారి వచ్చిన సందర్భాలున్నాయి. కాకపోతే కనీసం 24 గంటల తేడాలో వచ్చేవి. కానీ ఈసారి ఈమాత్రం గ్యాప్ కూడా లేదు. అవును.. సంక్రాంతి బరిలో పోటీపడుతున్న పెద్ద సినిమాలన్నీ ఒకే తేదీకి వస్తున్నాయి. అంటే ఒకేరోజు ఒకే టైమ్ కు అన్ని సినిమాలు ఒకేసారి ప్రారంభమౌతాయన్నమాట. ఇది ఇప్పటివరకు ప్రేక్షకులు చవిచూడని అనుభవం. మొదటిరోజు ఏ సినిమా చూడాలో తేల్చుకోలేని అయోమయం.
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. మొన్నటివరకు ఈ సినిమా విడుదల తేదీపై చిన్నపాటి సస్పెన్స్ కొనసాగింది. జనవరి 10 శుక్రవారం పడింది. ఆరోజున విడుదల చేస్తే ఆ తర్వాత వచ్చే సినిమాల వల్ల దీనిపై బజ్ తగ్గిపోతుంది. పోనీ సరిగ్గా సంక్రాంతి టైమ్ లో రిలీజ్ చేద్దామంటే ముహూర్తం సెట్ అవ్వలేదు. దీంతో 12వ తేదీ ఆదివారం థియేటర్లలోకి రావాలని నిర్ణయించారు.
సరిగ్గా బన్నీది కూడా ఇదే సమస్య. మహేష్ బాబు మూవీ కంటే ముందొస్తే క్రేజ్ తగ్గిపోతుందని భయం. పైగా ఈ విషయంలో సంక్రాంతి నెగెటివ్ సెంటిమెంట్ ఒకటి ఉండనే ఉంది. అందుకే బన్నీ కూడా తన సినిమాను 12నే విడుదల చేయాలని నిర్ణయించాడు. సో.. మహేష్-బన్నీ సినిమాలు ఒకేరోజు ఒకేసారి థియేటర్లలో మొదలుకాబోతున్నాయన్నమాట. అయితే ఈ రెండు సినిమాలతో పోటీ ఆగిపోలేదు. ఇదే రోజుకు కల్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా వస్తోంది.
బన్నీ, మహేష్ తమ సినిమాల విడుదల తేదీల్ని తాజాగా ప్రకటించారు. కల్యాణ్ రామ్ ఆ తేదీని చాన్నాళ్ల కిందటే లాక్ చేశాడు. ఇతడు కూడా జనవరి 12కే రాబోతున్నాడు. సంక్రాంతి బరిలో ఇలా 3 పెద్ద సినిమాలు ఒకే తేదీకి రావడం ఇదే తొలిసారి. సంక్రాంతి మార్కెట్ పెద్దదని, 3 సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయని టాలీవుడ్ మేకర్స్ పైకి చాలా కబుర్లు చెబుతుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఒకేసారి 3 సినిమాలకు థియేటర్లు కేటాయించడం కష్టమనే విషయం వాళ్లకు తెలియదా?
పైగా ఈ 3 సినిమాల కంటే ముందు రజనీకాంత్ దర్బార్ సినిమా ఒకటి ఉంది. దానికి కూడా థియేటర్లు ఇవ్వాల్సిందే కదా. సంక్రాంతికి రావడంలో తప్పులేదు, కానీ ఇలా కట్టకట్టుకొని ఒకే తేదీకి రావడం కచ్చితంగా తప్పు. ఇదే పెద్ద తలనొప్పి అనుకుంటే.. ఇప్పుడు ఇదే సీజన్ కు వెంకీ మామ కూడా వస్తుందనేది మరో టాక్. అది కూడా సంక్రాంతికే వస్తే భారీ పోటీ మధ్య ఏ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రావు.