గతవారం రికార్డు స్థాయి థియేటర్లలో భారీఎత్తున విడుదలైన సాహో సినిమాకు ఇవాళ్టి నుంచి థియేటర్లు తగ్గబోతున్నాయి. ఇప్పటికే వసూళ్లు తగ్గి ఇబ్బంది పడుతున్న ఈ సినిమాకు ఈరోజు నుంచి ఇదొక ఎదురుదెబ్బగా మారబోతోంది. అవును.. ఈరోజు ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటికి థియేటర్లు కేటాయించే క్రమంలో చాలా సెంటర్ల నుంచి సాహో మూవీని తప్పించారు.
ఈరోజు రిలీజ్ అవుతున్న వాటిలో బడా సినిమాలేం లేవు. అన్నీ చిన్న సినిమాలే. అయినప్పటికీ థియేటర్లు మాత్రం కేటాయించాల్సిందే కదా. ఇప్పుడదే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సాహో నడుస్తున్న థియేటర్ల నుంచి దాదాపు 30 శాతం థియేటర్లలోకి ఇప్పుడీ 7 సినిమాలు వచ్చాయి. వీటిలో ఎన్ని సినిమాలు క్లిక్ అవుతాయనే విషయాన్ని పక్కనపెడితే.. ఆ మేరకు సాహో వసూళ్లు మాత్రం తగ్గబోతున్నాయనేది పచ్చి నిజం.
ఇక ఈరోజు థియేటర్లలోకి వస్తున్న సినిమా విషయానికొస్తే.. 7 సినిమాల్లో “జోడీ” మాత్రమే కాస్త అందరికీ పరిచయం ఉన్న సినిమా. ఎందుకంటే ఇందులో ఆది సాయికుమార్ హీరోగా నటించాడు. జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటించింది. మిగతా సినిమాల్లో చెప్పుకోదగ్గ స్టార్ కాస్ట్ ఎవరూ లేరు. వీటిలో ఉండిపోరాదే, దర్పణం, 2 అవర్స్ లవ్, నీకోసం లాంటి సినిమాలున్నాయి.
ఇక ఈ వారం రెండు డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో జీవా, నయనతార నటించిన వీడే సరైనోడు అనే సినిమా ఒకటుంది. దీంతో పాటు ఆండ్రియా, అంజలి నటించిన తారామణి అనే సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది.