రీమేక్ పై అనుమానాలు.. డైలమాలో దిల్ రాజు

ఆల్రెడీ తమిళనాట పెద్ద హిట్. అలాంటి కథకు మార్పులు చేయాలంటే అది కత్తిమీద సాములాంటి వ్యవహారమే. ఎలాంటి మార్పులు చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనే భయం వెంటాడుతుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల మధ్య…

ఆల్రెడీ తమిళనాట పెద్ద హిట్. అలాంటి కథకు మార్పులు చేయాలంటే అది కత్తిమీద సాములాంటి వ్యవహారమే. ఎలాంటి మార్పులు చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనే భయం వెంటాడుతుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతోంది 96 రీమేక్. అవును.. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ఎంతకూ కొలిక్కిరావడం లేదు.

96 సినిమాలో క్లైమాక్స్ అత్యంత సహజంగా ఉంటుంది. గెట్ టు గెదర్ పేరిట కలిసిన ఇద్దరు ప్రేమికులు, ఒక రాత్రంతా ఎమోషనల్ గా గడుపుతారు. తర్వాత హీరోయిన్ విమానం ఎక్కి భర్త దగ్గరకు వెళ్లిపోతుంది. ఆమె జ్ఞాపకాలతో ఉన్న హీరో సూట్ కేస్ సర్దుకుంటాడు. అక్కడే శుభంకార్డు పడుతుంది.

ఈ క్లైమాక్స్ తెలుగు ఆడియన్స్ కు ఎక్కదనేది దిల్ రాజు వాదన. దీంతోపాటు సెకండాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య ట్రావెల్ ను మరీ అంత స్లోగా కాకుండా, కాస్త ఫాస్ట్ పేజ్ లో చూపించాలనేది నిర్మాత తాపత్రయం. కానీ ఆ మేరకు సన్నివేశాలు కుదరడంలేదు, కథ ముందుకు కదలడంలేదు. ఈ సినిమా రీమేక్ వర్క్ స్టార్ట్ చేసి దాదాపు నెలరోజులు కావొస్తోంది కానీ కంటెంట్ కొలిక్కిరాలేదు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలలోనే 96 రీమేక్ ను స్టార్ట్ చేయాలనేది దిల్ రాజు ఆలోచన. ఎందుకంటే ఈయన చేస్తున్న మహర్షి పనులు ఓ కొలిక్కి వచ్చాయి. అటు సమంత కూడా మజిలీ పని పూర్తిచేసింది. శర్వానంద్ కూడా సిద్ధంగానే ఉన్నాడు. కానీ కథ మాత్రం సెట్ అవ్వడంలేదు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్ కొరకరాని కొయ్యలా మారిందట. మరి ఎప్పటికి ఈ సినిమా పట్టాలపైకి వస్తుందో చూడాలి.

పవన్ ను ఎమ్మెల్యేగా అయినా గెలవనిస్తారా?