ఈ మధ్యకాలంలో బాబు, పవన్ యిద్దరూ ఎక్కువగా పలవరిస్తున్న(పలుకుతున్న) పేరు కెసియార్. వైసిపిని డైరక్టుగా తిట్టడానికి తిట్లయిపోయాయో ఏమో, కెసియార్ మీద పెట్టి తిడుతున్నారు. మోదీతో జగన్ బంధం గురించి చాలాకాలంగానే తిడుతున్నారు కానీ ఎందుకో సందేహం వచ్చినట్లుంది, మోదీ ఫ్యాక్టర్ ఆంధ్రుల్లో తగినంత ఆగ్రహాన్ని రగిలిస్తుందా లేదా అని. పైగా మోదీని తిట్టినప్పుడల్లా 'మీరు వాళ్లతో మూడున్నరేళ్లు అంటకాగారుగా' అనే నింద మోయవలసి వస్తోంది. ఎలాగా అనుకుంటూ ఉంటే కెసియార్ అందివచ్చాడు. మొన్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బాబు మనసులో కొత్త ఆశలు మోసులు వేశాయి. ఆ ఎన్నికలలో తనను బూచిగా చూపించి కెసియార్ లబ్ధి పొందినట్లే, ఆంధ్ర ఎన్నికలలో కెసియార్‌ను బూచిగా చూపించి తనూ లబ్ధి పొందవచ్చు కదాని! అందుకే యీ జోరు. ఇది ఏ మేరకు ఫలితాల నిస్తుంది అనేది అంచనా వేయడానికే యీ రచన.
ఆంధ్రుల్ని కొడుతున్నారా? – సబ్జక్టులోకి వెళ్లే ముందు అతి పోకడలను ఏరి, పక్కకు పెట్టాలి. పవన్ కళ్యాణ్ తెర మీద పెద్ద హీరోయే కానీ రాజకీయాల్లో యింకా కొసరు తారడే. ఎలాగైనా ప్రేక్షకుల కళ్లల్లో పడాలన్న తాపత్రయంతో కొసరు తారలు తెరపై ఊహు నటించేస్తారని ముళ్లపూడి రమణగారి చమత్కారం. బాబు కెసియార్‌ను తిడుతూంటే, పవన్ మరీ ముందుకు వెళ్లి తెలంగాణలో ఎపి ప్రజలను ఆంధ్రులుగా కొడుతున్నారు అనేసి, చిక్కుల్లో పడ్డారు. ఎవరు, ఎక్కడ కొట్టారని అడిగితే కాబోలు 'తెలంగాణలో నన్ను కొట్టడానికి 100 మంది వచ్చారు.' అని ఓ స్టేటుమెంటు యిచ్చారు. ఎప్పుడు? తమరు కెసియార్‌ను పొగడడానికి ముందా? వెనకా? అప్పుడు తమరేం చేశారు? పోలీసులకు ఫిర్యాదు నిచ్చారా? జనసైనికులకు పిలుపు నిచ్చారా? ఇలా అనేక సందేహాలు.
పవన్ మాటలకు ప్రతికూల స్పందన సినిమావాళ్ల నుంచి వచ్చింది. ఒక సినీమానిసిగా పవన్‌కు తెలిసే ఉంటుంది, ఇటీవల కాలంలో కెసియార్‌ను, కెటియార్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న వారిలో ఆంధ్రమూలాలున్న సినిమా వాళ్లు ముందువరసలో ఉన్నారు. ఇలాటి ఛాన్సు దొరికితే ఊరుకుంటారా? 'ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం, ఇలాటి స్టేటుమెంట్లు యిచ్చి మా మధ్య చిచ్చు పెట్టవద్దు' అంటూ పవన్‌కు ప్రయివేటు చెపుతున్నారు. వారికి దొరికిన తక్షణాయుధం – ''అజ్ఞాతవాసి'' సినిమా బెనిఫిట్ షోలకై పవన్ కెసియార్‌ను కలిసినప్పుడు ఆయన పాలనను బహిరంగంగా పొగడడం. 'అది వ్యక్తిగతం' అని టీవీలో జనసేన ప్రతినిథి చెప్పినా, 'ఒక ఉద్యమనాయకుడిగా కెసియార్‌పై నాకు గౌరవం ఉంది' అని పవన్ సమర్థించుకోచూసినా, కెసియార్ పాలనను మెచ్చుకోవడం దేనికి అనే ప్రశ్నకు పవన్ వద్ద సమాధానం లేదు. ఆంధ్రుల ఆస్తులు లాక్కుంటూ ఉంటే, వారిని కొట్టిస్తూ ఉంటే పాలన బాగున్నట్లా?
పాలకుడిగా కెసియార్‌ను మెచ్చుకోవడం సరే, ఉద్యమనాయకుడిగా కెసియార్‌ను మెచ్చుకోవాలన్నా ఆయన ఆంధ్రుల గురించి అన్నది పవన్‌కు ఎలా మింగుడు పడింది? ఆంధ్రులు ద్రోహులు, దోపిడీదార్లు, పనికిమాలినవాళ్లు, దగాకోరులు అన్నారని ఆయనే చెప్తున్నాడు. జగన్ మాట సరే, అలాటి వాళ్లని మీరు మాత్రం ఎలా ప్రశంసించారు స్వామీ? మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ కోపాన్నంతా ఎక్కడ దాచుకున్నారు మహాశయా? ఒక్క సీటుకైనా పోటీ చేసి, ఆ నియోజకవర్గపు ఆంధ్రులకైనా రక్షణ యిచ్చి ఉండాల్సింది కదా! పోనీ అభ్యర్థులు దొరక్కపోయి వుంటే, ఆంధ్రులకు భద్రత కల్పించలేని కెసియార్‌ను ఓడించండి అని ఒక్క పిలుపు యిచ్చి వుంటే, మీ జనసైనికులైనా తెరాసకు వేసి ఉండేవారు కాదు కదా! తెరాసకు అన్ని ఓట్లు, సీట్లు వచ్చి వుండేవి కావు కదా! వైసిపి తెలంగాణలో పోటీ చేయలేదేం అని అడుగుతున్నారు? పార్లమెంటు ఎన్నికలలో టిడిపి కూడా తెలంగాణలో పోటీ చేయటం లేదే, అడగరేం? 'మీరు పోటీ చేయకుండా కాంగ్రెసుకు మద్దతిస్తే ఏం లాభం? నెగ్గాక వాళ్లు తెరాసలోకి దూకేస్తారు కదా' అని టిడిపిని నిలదీయవచ్చు కదా!
బెదిరిస్తే జారుకుంటారు కానీ పార్టీ మారతారా? – ఇప్పుడు పెద్దనాయకులు తన పార్టీలో చేరకుండా అడ్డుపడుతున్నారనే కెసియార్‌పై కోపం వచ్చిందా? 'జనసేనలో చేరతామన్నవారు వైసిపిలో చేరారు, ఎందుకని అడిగితే హైదరాబాదులో ఆస్తులున్నాయనీ వాటితో సమస్యలున్నాయని చెప్పారు, హైదరాబాదులో కెసియార్ మనవాళ్ల భూములు తీసేసుకుంటారా? తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్ అనుకుంటున్నారా? పౌరుషం లేదా?' అని పవన్ ఊగిపోయారు. ఇది ఏ మేరకు నమ్మవచ్చో నాకు తెలియటం లేదు. ఎవరైనా జనసేనలో చేరతానని ముందుకు రాగానే కెసియార్ బెదిరించారో అనుకోండి, అతనేం చేస్తాడు? భయపడి, ఎన్నికలలోంచి తప్పుకుంటాడు తప్ప వేరే పార్టీలో మాత్రం ఎందుకు చేరతాడు? చేరాడంటే దాని అర్థం ఆ నియోజకవర్గంలో అవతలి పార్టీకి బలంముందని అంచనా వేశాడని! ఈ పార్టీలోకి వద్దామని మొదట్లో ఊగిసలాడినా ఆ నియోజకవర్గంలో ట్రెండ్ బట్టి నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే 30, 40 కోట్లు ఖర్చు పెట్టి రంగంలోకి దిగేటప్పుడు మొహమాటాలకు పోయేటంత తెలివితక్కువ వాళ్లు కారు, నాయకులు. మరి పవన్ అబద్ధం చెప్పినట్లా? కాకపోవచ్చు. 'అదేమిటయ్యా, మా పార్టీలో చేరతానన్నావ్' అని అడిగితే పిల్ల లేదా పిల్లవాడు నచ్చకపోతే జాతకాలు కుదరలేదని చెప్పినట్లు, పవన్ దగ్గర కెసియార్ పేరు వాడుకుని ఉంటారు వాళ్లు.
ఆంధ్రులను మాత్రమే బెదిరిస్తున్నారా? – 'ఆస్తులున్నవాళ్లని బెదిరిస్తున్నారు' అంటున్నారు. ఆస్తులున్న వాళ్లందరినీ బెదిరించడం వీలు కాదు. దానిలో ఏదో ఒక అక్రమం, ఇర్రెగ్యులారిటీ ఉంటేనే బెదిరించగలుగుతారు. నాగార్జున విషయంలో చెరువు కబ్జా అంశం ఉంది కాబట్టే ఆయన తగ్గవలసి వచ్చింది. ఆంధ్ర మూలాల వారి ఆస్తుల కూల్చివేతకు ఉదాహరణగా అయ్యప్ప సొసైటీ సంఘటనను చూపిస్తున్నారు. 30 ఏళ్లగా దాని కథ వింటున్నాను. అది అక్రమాల పుట్ట. కబ్జాలు, సూపర్ కబ్జాలు జరిగిన చోటు. ఏ డాక్యుమెంటూ క్లియర్‌గా లేదు. కొన్నవాళ్లు రిస్కు తీసుకునే కొన్నారు. అందుకే యిబ్బందులు పడుతున్నారు. అక్కడ కవితకు కూడా ఆస్తులున్నాయని ప్రతీతి. అక్కడ ఆంధ్రమూలాల వారికి మాత్రమే యిళ్లున్నాయని గాని, ఆంధ్రమూలాల వారికి అక్కడ మాత్రమే ఉన్నాయని కానీ చెప్పడానికి వీలుపడదు. నిజాంపేట రోడ్డు దగ్గర్నుంచి, అనేక చోట్ల అక్రమ నిర్మాణాలున్నాయి. తెరాస ప్రభుత్వం వచ్చాక కూడా అవి కొనసాగుతున్నాయి. కోర్టులు కళ్లెర్ర చేసినపుడు నాలుగు రోజుల పాటు పగలకొడతారు. తర్వాత వదిలేస్తారు.
ఇక్కడ అన్నీ సవ్యంగా జరుగుతున్నాయన్న భ్రమలేవీ పెట్టుకోనక్కరలేదు. అస్మదీయులు ఏం చేసినా చెల్లిపోతుంది, తస్మదీయులకు పనులు జరగవు. కానీ దానికి ఆంధ్ర-తెలంగాణ రంగు పులమడం అనవసరం. ఆ మాట కొస్తే హైదరాబాదులో ఆంధ్రుల కేనా ఆస్తులున్నది? గుజరాతీ, మార్వాడీలు, యుపి వారు.. సమస్త రాష్ట్రాల వారు ఉన్నారు. వారి వారి సొంత రాష్ట్రాలలో కాంగ్రెసుకో, బిజెపికో మద్దతిచ్చేవారుంటారు. మద్దతిస్తే మీ పని ఫినిష్ అని ఆ యా కంపెనీల యజమానులనూ బెదిరించవచ్చు కదా! వాళ్లేమీ ఫిర్యాదు చేయలేదే! ఆ మాట కొస్తే బాబుగారి సంస్థ హెరిటేజి కానీ, సుజనా కానీ, సిఎం రమేశ్ కానీ, భవ్యప్రసాద్ కానీ వీళ్లెవరూ ఫిర్యాదు చేయలేదే! ఆంధ్రుల ప్రయివేటు బస్సులు నిరంతరం తిరుగుతూనే ఉన్నాయే! నిజానికి ఉద్యమసమయంలో తిప్పలు పడినది సిని పరిశ్రమ! ఔట్‌డోర్ షూటింగుల్లో వాళ్లపై దాడులు కూడా సాగాయి. కానీ రాష్ట్రావిర్భావం తర్వాత అలాటివి జరిగి వుంటే, వాళ్లు యిక్కడ ఉండేవారా? సినీపరిశ్రమకు, టిడిపికి ఎంతో లింకుంది. అయినా వాళ్లు తరలి వెళ్లలేదంటే అర్థమేమిటి? ఏ ఫిర్యాదూ లేదనేగా! ఇప్పుడు రాజకీయాల గురించి ఆరోపణలు చేసి, అనవసర వైషమ్యాలు పెంచడం దేనికి?
ఆంధ్రలో పోటీ చేసి తీరాలా? – పవన్, బాబు యిద్దరూ లేవనెత్తే పాయింటు ఒకటుంది – కెసియార్ మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టనేల? పెట్టదలచుకుంటే వచ్చి పోటీ చేయాలి కానీ వైసిపికి మద్దతు యివ్వనేల? తలసాని వచ్చి టిడిపికి వ్యతిరేకంగా మాట్లాడనేల? అని. ఒకటి – ఎవరైనా ఎక్కడికైనా వచ్చి మద్దతివ్వవచ్చు, అవతలివాళ్లను తిట్టవచ్చు. మమతా బెనర్జీ, అఖిలేశ్ వగైరాలు ఆంధ్రకు వచ్చి బాబుకి మద్దతుగా రాబోతున్నారుట. ఫరూఖ్ అబ్దుల్లా వచ్చి బాబు తరఫున మాట్లాడితే మీ కశ్మీరు గొడవ చూసుకో అనలేదు కదా! వస్తే పోటీ చేయాలి తప్ప ఉట్టినే రాకూడదు అనగలరా? ఎన్టీయార్ హరియాణాకు, అసాంకు కూడా వెళ్లి ప్రచారం చేశారు. అక్కడ పోటీ చేయలేదు. పోటీ చేస్తున్న పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి వచ్చారు. ధనసహాయం కూడా చేశారని అంటారు. మన తెలుగు నాయకులు తమిళనాడుకి వెళ్లి తమకు నచ్చిన పార్టీలకు ప్రచారం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. మొన్నటికి మొన్న బాబు కర్ణాటకకు వెళ్లి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వచ్చారు. ఆయన అక్కడేమీ పోటీ చేయలేదు కదా!
వైసిపి, తెరాస దోస్తీ కొత్త విషయమా? -ఇక వైసిపికి, తెరాసకు ఉన్న దోస్తీ గురించి పదేపదే మాట్లాడుతున్నారు. అదేమన్నా కొత్త విషయమా? 2014 ఎన్నికలలోనే పవన్ జగన్‌కు ఛాలెంజ్ విసిరారు – దమ్ముంటే కెసియార్‌కు వ్యతిరేకంగా మాట్లాడు చూదాం అని. 2014 ఎన్నికలు కాగానే కెసియార్ 'ఇక్కడ మేము, అక్కడ జగన్ గెలుస్తాం. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటుంది.' అని స్టేటుమెంటు యిచ్చారు. తెలంగాణలో వైయస్ అభిమానులు ఎంతోమంది ఉన్నా, జగన్ వైసిపిని మూసేశారు. తెలంగాణ యూనిట్‌ను షర్మిల ద్వారా నడుపుదామని చూసి కూడా, సాగక, చివరకు ఆంధ్రపై ఫోకస్ పెట్టారు. తెలంగాణకై లేఖ యిచ్చి, అక్కడ ఎన్నో ఏళ్లు అధికారం చలాయించిన పార్టీ కాబట్టి టిడిపి అంత సులభంగా వదిలిపెట్టలేక పోయింది. చివరకు కెసియార్ ఎత్తులకు చిత్తయి, ఆంధ్రకు పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. బాబుపై వ్యక్తిగతంగా పగబట్టిన కెసియార్ జగన్‌ను తెగ మెచ్చేసు కుంటున్నారు. ఇద్దరినీ కలిపినది బిజెపియా కాదా అనేది యితమిత్థంగా చెప్పలేకపోయినా, యిద్దరు స్నేహితులనేది వాస్తవం. దానివలన రెండు రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రానికి మేలు లుగుతుందా లేదా అన్నది భవిష్యత్తే చెప్పాలి.
ఇప్పుడు బాబు దగ్గరకు వద్దాం – ఆయన కెసియార్‌ను యిప్పుడు తెగ తిడుతున్నాడు. కెసియార్ ఆంధ్రుల గురించి మొట్టమొదటి నుంచీ నీచంగానే మాట్లాడుతూ వచ్చాడు. అయినా 2009 ఎన్నికల్లో బాబు ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు. కెసియార్ ఆంధ్రులను రాక్షసజాతి అన్నపుడు, ఆంధ్రావాలే భాగో అన్నపుడు యీ రోషం ఎక్కడికి పోయిందో మరి! ఉద్యమసమయంలో ఏదో అన్నాను, మాట వెనక్కి తీసుకుంటున్నాను అని కెసియార్ అనకపోయినా ఆంధ్ర రాజధాని అమరావతి ఆవిష్కరణకు పిలిచి, శిలాఫలకంపై పేరు వేయించినప్పుడు ఏమైందో యీ పౌరుషం? అంత చేసినా కెసియార్ హైదరాబాదులో తెలుగు మహాసభలకు సాటి తెలుగు ముఖ్యమంత్రి ఐనా పిలవలేదు. అయినా అవన్నీ తుడిచేసుకుని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం వెంపర్లాడాడీయన. ఇప్పుడు పౌరుషం లేదా? అంటూ ఆంధ్రుల్ని రెచ్చగొడుతున్నాడు. హౌ ఫన్నీ!
లక్ష కోట్లు వసూలు చేయకుండా ఏం చేస్తున్నట్లు? – బాబు ఇప్పుడు చెపుతున్నారు – తెలంగాణ నుంచి లక్ష కోట్లు రావాలట. ఇన్నాళ్లు యీ లక్ష కోట్లు జగన్ గురించి విన్నాం, యిప్పుడు కెసియార్‌కు కూడా అంటగట్టారు. లక్ష కోట్లు రావాల్సి వుంటే అయిదేళ్లగా వసూలు చేయకుండా ఏం చేస్తున్నట్లు? హెరిటేజి డీలర్సు లక్ష రూపాయలు బాకీ పడితే వదిలేస్తారా? తన సొమ్ము కాదు కాబట్టి, రాష్ట్రానికి లక్ష కోట్లు బాకీ పడితే నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుంటారా? ఇన్నాళ్లూ మోదీ నిధులివ్వలేదు, బయట నుంచి అప్పు తీసుకోనివ్వటం లేదు అంటూ యాగీ చేస్తూ వచ్చారే! అసలీ లక్ష కోట్లు వసూలు చేసుకుంటే వాటి గురించి దేబిరించాల్సిన అవసరం, అప్పులు చేయవలసిన అగత్యం ఎందుకు పడుతుంది? ఆర్థికనిపుణుడు కుటుంబరావుగారు కేంద్రం బకాయిల గురించే చెప్తూ వచ్చారు కానీ పొరుగు రాష్ట్రం బకాయిల గురించి మాట్లాడరేం?
ఆంధ్రకు రావలసిన వాటాలను తెలంగాణ తొక్కి పెట్టిందని తెలుసు, హైదరాబాదులోని స్థిరాస్తుల విషయంలో ఆంధ్ర ఏడాది లోగా క్లెయిమ్ చేయాల్సి వుండగా, చేయకుండా తాత్సారం చేయడంతో అవి తెలంగాణకు వెళ్లిపోయాయని తెలుసు. విద్యుత్ బకాయిల రగడ ఉందని తెలుసు, ఎన్ని ఉన్నా ఏకంగా లక్ష కోట్ల రూ.ల బకాయిలా? మై గుడ్‌నెస్! ఈ 40 యియర్స్ ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు? అది కనుక వస్తే మోహన్‌బాబు కాలేజీతో సహా అన్ని కాలేజీలకు ఫీజు రీఎంబర్స్‌మెంటు బాకీలు తీర్చేయవచ్చు కదా, మహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు కాకుండా, ఇవాళ్టి తారీకులతోనే చెక్కులివ్వచ్చు కదా! రావలసిన బాకీలు వసూలు చేసుకోకుండా పేద రాష్ట్రం, కట్టుబట్టలతో వచ్చేశాం, తాహతు లేకపోయినా ఉద్యోగులకు జీతాలు పెంచాం .. వంటి దీనాలాపనలు ఎందుకు?
కెసియార్ బారి నుంచి ఆంధ్ర మూలాల వారిని కాపాడారా? – ఉద్యమసమయంలో కెసియార్ ఉధృతి చూసి తెలంగాణలో ఆంధ్రమూలాల వారు దడుసుకున్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని కదా, ఏదైనా వస్తే బాబు దగ్గరకు వెళ్లి చెప్పుకోవచ్చు, తమకు టిడిపి వాళ్లు రక్షగా ఉంటారని అనుకుని, వాళ్లకు, వాళ్లతో పొత్తు పెట్టుకున్న బిజెపికి ఓట్లేసి గెలిపించారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకానికి బాబు విలువ ఏమైనా యిచ్చారా? కెసియార్ దుర్మార్గుడని తెలిసినపుడు యిక్కడి వాళ్లకు అండగా ఉండాలి కదా! పదేళ్ల దాకా ఆగకుండా రెండేళ్ల లోపునే చెక్కేశారే! ఇప్పుడు అక్కడికి వెళ్లి ఆంధ్ర ప్రజలను కెసియార్‌పైకి ఉసి గొల్పుతున్నారే! ఆ కోపాన్ని కెసియార్ యిక్కడ ఆంధ్రమూలాల వారిపై చూపిస్తే నష్టపోయేది ఎవరు? మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలోనే బాబు క్రెడిబిలిటీ పూర్తిగా ధ్వంసమైంది. ఆంధ్రమూలాల వారు టిడిపికి గుడ్‌బై చెప్పేశారు. బాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కూడా టిడిపి చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు అక్కడి ఓటర్లలో యాంటీ-కెసియార్ ఫీలింగు రగిలిస్తున్నారు. ఆంధ్రుల్లో కెసియార్‌పై అంత ద్వేషం ఉండి వుంటే, ఆయన పేరున్న శిలాఫలకాన్ని కూల్చి ఉండాల్సింది. ఆంధ్రకు వచ్చినపుడు నల్లజండాలతో ప్రదర్శన చేసి ఉండాల్సింది.
బాబు యీ మధ్య యింకో పాట మొదలెట్టారు – నా దగ్గర పని చేసిన కెసియార్‌కే అంత యిది ఉంటే, నాకెంత లెక్క ఉండాలి? అంటూ. ఈ మాట సినీహీరో రాజశేఖరూ అనవచ్చు, 'రవితేజ నా వెనక్కాల నలుగురిలో ఒకడిగా చేశాడు' అని, తరుణూ అనవచ్చు 'సునీల్ నా పక్కన కమెడియన్‌గా చేశాడు' అని. బళ్లు ఓడలవుతాయి. దేవెగౌడ కింద పని చేసిన సిద్ధరామయ్య ఐదేళ్లు ముఖ్యమంత్రై ఆయన్ను అల్లాడించాడు. ఎన్టీయార్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడిన బాబు, ఆయన దగ్గర్నుంచి అధికారం, పార్టీ లాక్కుని అనాథగా మిగిల్చాడు. గతం చెప్పుకోవడం అనవసరం. ఈ రోజు కెసియార్ ఆంధ్ర కంటె ధనిక రాష్ట్రం, కల్పతరువు వంటి హైదరాబాదు కలిగిన తెలంగాణను ఏలుతున్నాడు. రెండోసారి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆంధ్రకు బాబు యింకా రెండోసారి కావాల్సి వుంది. తెరాస టిక్కెట్టు యిస్తే వద్దని ఎవరూ పారిపోలేదు. కానీ టిడిపి టిక్కెట్టిస్తే వద్దు లెండి అన్నారు కొందరు. అక్కడే పడిపోయింది లెవెలు.
హైదరాబాదుతో అమరావతి పోటీయా!? – హైదరాబాదులో ఆంధ్రుల్ని కెసియార్ బెదిరిస్తున్నారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పూర్తిగా నమ్మేసినట్లున్నారు. తెలంగాణేతరులను బెదిరిస్తున్నారనే పేరుబడితే హైదరాబాదు యిమేజికి డామేజి అయిపోతుందని వాపోయారు. మరి తెలంగాణ ఉద్యమసమయంలో మాటిమాటికి రాస్తారోకోలు, బందులు జరిగి హైదరాబాదు నుంచి కంపెనీలు తరలి వెళ్లిపోతూ ఉన్నపుడు హైదరాబాదు ఇమేజి గురించి ఆలోచించకుండా ఆంధ్రజ్యోతి ఉద్యమాన్ని సమర్థించిందే! కెసియార్ పరమపాపిగా కనబడుతున్నాడీ వేళ. మరి ఆయనా, బాబు కలిసి పోటీ చేయాలని విజ్ఞప్తి చేసి, రాయబారం చేయబోయినప్పుడు తెలియలేదా? బాబు నేతృత్వంలో అమరావతి రూపు దిద్దుకుని, హైదరాబాదుకి పోటీగా ఎదుగుతోంది కాబట్టి, జగన్‌ను రప్పించి దాని ప్రగతిని ఆపేద్దామనే ఉద్దేశంతోనే కెసియార్ జగన్‌కు మద్దతిస్తున్నారని కూడా రాధాకృష్ణ చెప్పారు.
అమరావతి గురించి ఆయనకు గుర్తుందేమో కానీ బాబుకే గుర్తు లేదు. టిడిపి యాడ్స్ అన్నీ పసుపు-కుంకుమ, పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల చుట్టూనే తయారయ్యాయి తప్ప, ఐదేళ్లలో అమరావతిలో ఎటువంటి కట్టడాలు కట్టామో చూడండి అని లేవు. చూరు కారుతూంటే గ్రాఫిక్స్‌లో కవర్ చేసైనా ఆ బిల్డింగులు చూపాల్సింది. సింగపూరు డిజైన్, బ్రిటన్ డిజైన్, రాజమౌళి డిజైన్, రైతులు సింగపూరు పర్యటన అంటూ యిన్నాళ్లూ నానా హంగూ చేసి, యిప్పుడు ఎన్నికల వేళ వాటిని అటకెక్కించడమేమిటో! ఘనంగా పుష్కరాలు నిర్వహించాం అని బోయపాటి డాక్యుమెంటరీ చూపిద్దామంటే, గోదావరి పుష్కరాల చావులు గుర్తుకొస్తాయన్న భయంతో కాబోలు వాటినీ చూపించటం లేదు. పట్టిసీమ ఒక్కటే దొరికింది. అదైనా ఆ నీళ్లను రాయలసీమకు పంపిస్తామని చెప్పారు. కృష్ణాకు పట్టుకుని వచ్చాక, ఆపేశారు. ఎందుకంటే గతంలో కాలువలు అక్కడిదాకానే తవ్వారు. ఈయన ఖాళీలు పూరించి, మొత్తం నాదే అనేశాడు. అంత సత్తాయే ఉండి దుర్గగుడి వద్ద దిష్టిబొమ్మలా మిగిలిన ఫ్లయిఓవరు పూర్తి చేసి వుండవచ్చు కదా అనుకోరూ?
బందరు పోర్టు బందరు లడ్డూనా? – ఇప్పుడు కెసియార్‌కు ఆంధ్రపై యింట్రస్టు ఎందుకంటే అంటూ వాన్‌పిక్‌ను తీసుకుని వస్తున్నారు. ఇది నాకు కాస్త గందరగోళంగానే ఉంది. ఆంధ్రజ్యోతిలో రాసిన దాని ప్రకారం జగన్ అధికారంలోకి వస్తే మచిలీపట్నం పోర్టును కెసియార్‌కు ఆప్తుడైన ఓ వ్యాపారస్తుడికి కట్టబెడతారట. అందువలన అది తెలంగాణకు చెందుతుందట. చదవడంలో తప్పో, నా అవగాహనాలోపమో, మరోటోకానీ యిదెలా సాధ్యమో నాకు అర్థం కాలేదు. బెంగుళూరు ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు తెలుగువాళ్లయిన జివికెకు దక్కింది. అంతమాత్రాన ఆ ఎయిర్‌పోర్టు మనదై పోతుందా? ప్రతీ వ్యాపారవేత్తా అధికారంలో ఉన్నవారికి మిత్రుడిగానే ఉంటాడు. గతంలో లేకపోతే యిప్పుడు స్నేహం చేసుకుంటాడు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల లాటి కాంట్రాక్టులు బిడ్డింగులకు పిలుస్తారనుకుంటాను.
అవేమీ లేకుండా బాబు తరహాలో నామినేషన్ పద్ధతిలో యిచ్చేశాడే అనుకోండి. అంతమాత్రం చేత తెలంగాణ సరుకులు తప్ప తక్కినవారి సరుకులు ఆ రేవు నుంచి రవాణా చేయరా? తెలంగాణ వాళ్ల వద్ద సుంకాలు తీసుకోకుండా ఫ్రీగా చేస్తారా? అసలు వాన్‌పిక్ పూర్తయిందా? ఆ రేవు ఆపరేటివ్ దశలో ఉందా? బాబు కూడా చేసిన ఈ ఆరోపణను అర్థం చేసుకోవడం నా వల్ల కావటం లేదు. దయచేసి ఎవరైనా నాకు విపులీకరించి చెప్పండి. నాతో బాటు లోకేశ్‌కు కూడా చెప్పండి. ఆయనకూ సరిగ్గా అర్థమైనట్లు లేదు. జగన్ మచిలీపట్నం రేవును తెలంగాణకు యిచ్చేస్తాడు అన్నాడు. 'అదేమైనా పకోడీ పొట్లమా, పట్టుకెళ్లి వాళ్ల చేతిలో పెట్టడానికి? ఆ పాల్ ఒకడు, నువ్వొకడివి రాష్ట్రానికి చెరో పక్కా తగులుకున్నారు,' అని కన్నా లక్ష్మీనారాయణ విసుక్కున్నారు.
బూచి కథకి గిరాకీ ఉందా? – తెలంగాణ ఎన్నికలలో బాబు డబ్బు మూటలు తెచ్చి కాంగ్రెసు కిచ్చారని తెరాస వాళ్లన్నారు. ఆంధ్ర ఎన్నికలలో కెసియార్ జగన్‌కు వెయ్యి కోట్లు యిచ్చారని బాబు ఆరోపించారు. చెల్లుకు చెల్లు. వీటి సంగతి అలా వుంచితే కెసియార్ గురించి ఆంధ్ర ఎన్నికలలో యింత చర్చ దేనికి అనే సందేహం వస్తుంది. బాబు బూచి చూపించి, తెలంగాణ ఎన్నికలలో కెసియార్ లబ్ధి పొందారు కాబట్టి, అదే ట్రిక్కు తనూ ప్లే చేద్దామని బాబు ఐడియా. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ బూచి కారణం చేత తెరాసకు ఏ మేరకు లాభం కలిగింది? కాంగ్రెసు, బాబు పొత్తు లేకుండా ఉంటే తెరాసకు 70 వచ్చేవని, బాబు పొత్తు ఏర్పడింది కాబట్టి ఆ పై 18 సీట్లు వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఈ అంచనాకు ఏ శాస్త్రీయతా లేదు. ఒట్టి గట్ ఫీలింగు మాత్రమే. దీనితో మీరు ఏకీభవిస్తే 70 (60%) సీట్లు గెలిచే సత్తా తెరాసకు ఉందని ఒప్పుకోవాలి. దానికి కారణాలేమిటి?
సంక్షేమ పథకాలని అందరూ చెప్పేమాట. కానీ వాటితో బాటు మరో రెండు ముఖ్యకారణాలున్నాయి – తెలంగాణలో ప్రతిపక్షం బలంగా, చురుగ్గా లేకపోవడం, వారికి మీడియా సపోర్టు లేకపోవడం. రెండోది రాష్ట్రంలో ఉన్న ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్. పెట్టుబడులు వస్తూండడం, భూమి ధరలు పెరుగుతూండడం, ఏదో జరిగిపోతోందన్న భావం కలిగించడం. కెసియార్ వలననే యిదంతా జరుగుతోందన్న ప్రచారం చేయడానికి ఆయన కుటుంబంలోనే ముగ్గురు మంచి వక్తలు, సమర్థులు ఉండడం. మరి ఆంధ్రలో పరిస్థితి ఏమిటి? బాబు గురించి చెప్పడానికి బాబే ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో చాలా ఆశలు కలిగాయి – బాబు-మోదీ దోస్తీ కారణంగా రాష్ట్రం ఎక్కడికో వెళ్లిపోతుందని, దేశం మొత్తం ఆంధ్రను చూసి అసూయ పడే స్థాయిలో ఉంటుందని. అందుకే భూమి ధరలు విపరీతంగా పెరిగాయి. రెండేళ్లకే ప్రచారం తప్ప మరేమీ జరగటం లేదనే వాస్తవం బోధపడి, ప్రజలు దిగాలు పడ్డారు. ఇక ప్రతిపక్షానికి వస్తే ఆంధ్రలో వైసిపికి తన మీడియా వుంది. నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంది. అందువలన కెసియార్‌తో బాబును పోల్చడానికి లేదు.
సెంటిమెంటు బలమెంత? – ఇక సెంటిమెంటు ఏ మేరకు పని చేస్తుంది అన్నదానిపై మాట్లాడుకుంటే – తెలంగాణ వాళ్లకు బాబు గురించి, రాజకీయ చాణక్యుడిగా ఆయనకున్న యిమేజి గురించి క్షుణ్ణంగా తెలుసు. మేధావి అనే పేరుబడితే ఉండే చిక్కేమిటంటే అవతలివాడు ఎలర్ట్ అయిపోతాడు. తెలంగాణ ప్రకటన రాగానే ఆంధ్రకు చెందిన అన్ని పార్టీల వారూ టపటపా రాజీనామాలు చేయసాగారు. పార్టీ ఏదైనా, ఆ పథకం వెనుక బాబు ఉన్నాడని సాధారణ తెలంగాణ పౌరుడి అనుమానం. అందుకే తెలంగాణ కావాలని లేఖ పదేపదే యిచ్చినా, పార్టీ తెలంగాణ యూనిట్ ఉద్యమంలో పాల్గొన్నా, ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్న వారెవరూ టిడిపిని ఎన్నికలలో ఆదరించలేదు. తెలంగాణలో యిప్పటికీ బాబు అనుయాయులు చాలామంది ఉన్నారు. వారి ద్వారా తెలంగాణను దెబ్బ తీయగలరన్న సందేహం ఉండబట్టే కెసియార్ బాబును బూచిగా చూపించినా చెల్లింది. మరి ఆంధ్రలో…?
కెసియార్ అంటే ఆంధ్రుల పట్ల అతని దుర్భాషల కారణంగా సగటు ఆంధ్రుడికి అసహ్యమే తప్ప భయం లేదు. అధికారంలోకి రాగానే శివసేన తరహాలో తెలంగాణ నుంచి ఆంధ్రులను తరిమేసి ఉంటే ద్వేషించి ఉండేవారు. ఆంధ్రలో ఆస్తులుండి, విభజన కారణంగా వాటి విలువ పెరిగిన సందర్భాల్లో వాళ్లు కెసియార్‌కు మనసులో ధన్యవాదాలు చెప్పివున్నా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఆంధ్ర వ్యవహారాలను కెసియార్ ప్రభావితం చేయగలడంటే ఆంధ్రుడు నమ్మలేడు. కాంగ్రెసు పార్టీలో అంతర్గత రాజకీయాల వలననే ప్రత్యేక తెలంగాణ వచ్చింది తప్ప కెసియార్ కున్న యిద్దరు ఎంపీల వలన కాదని వాళ్లకు బాగా తెలుసు. అందుకే కాంగ్రెసును ఎన్నికలలో చితక్కొట్టేశారు.
బాబు వలన కాలేదు – రాష్ట్రం ఏర్పడ్డాక కెసియార్ నీటి తగాదాలు, ఉమ్మడి ఆస్తుల్లో పేచీలు సృష్టించి, ఆంధ్రుల ఆగ్రహాన్ని సంపాదించుకున్నాడు. అతన్ని అడ్డుకోవడం బాబు వలన కాలేదని కూడా ఆంధ్రులు గ్రహించారు. ఉమ్మడి ఆస్తులను పోగొట్టుకోవడం, పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదులుకుని వచ్చేయడం యివన్నీ బాబు స్వీయతప్పిదాల పర్యవసానమే అని కూడా వారికి తెలుసు. తనను కాపాడుకోవడానికి, రాష్ట్రప్రయోజనాలను బలి పెట్టిన బాబు, యిప్పుడు కెసియార్‌ను బూచిగా చూపిస్తే లాభం ఉంటుందా? ఎంత కాదన్నా తెలంగాణ ఎగువ రాష్ట్రం. పోరాడి యిప్పటిదాకా సాధించినది లేదు, సఖ్యంగా ఉంటే ఏమైనా ఒరుగుతుందని అనుకుంటే అతని స్నేహితుడైన జగన్‌వైపు మొగ్గినా మొగ్గవచ్చు.
ఏది ఏమైనా వెనుకబడిన వర్గాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో సెంటిమెంటు పండినంతగా, తక్కిన చోట్ల పండదు. తెలంగాణలో సెంటిమెంటుకి బలం ఎక్కువ. అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు కొన్ని జిల్లాలలో ఐనా జోరుగా సాగాయి. ఆంధ్రలో ప్రత్యేక ఉద్యమం కొన్ని వర్గాల బాసటతో ఉధృతంగా నడిచి, తర్వాత చప్పగా చల్లారిపోయింది. మళ్లీ ఎన్నడూ తలెత్తలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ప్రత్యేక ఉద్యమానికి స్పందనగా, అర్ధమనస్కంగా సాగింది తప్ప, సమైక్య సెంటిమెంటు బలంగా ఉందని అనలేం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులన్నీ హైదరాబాదుకే పోతున్నాయి కాబట్టి రాష్ట్రం విడిపోతే కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో కూడా పెట్టుబడులు వస్తాయనే ఆశ, హైదరాబాదును యుటి చేస్తారన్న ఆశలతో వాళ్లు కొట్టుమిట్టులాడారు. ఐటీ దాడులను కూడా ఆంధ్రుల ఆత్మగౌరవంపై దాడిగా చిత్రీకరించడానికి బాబు ఎంత తంటాలు పడినా, ఎవరూ పెద్దగా స్పందించలేదు. నిజంగా సెంటిమెంటే పని చేస్తే బాబుకి విజయం కేక్‌వాక్ అయి వుండాలి. టిడిపి వీరాభిమాని కూడా ఆ పరిస్థితి వుందని వాదించలేడు, కొద్దిపాటి తేడాతో బాబు మళ్లీ వచ్చేస్తారనే అంటాడు తప్ప!
కెసియార్, మోదీ, జగన్ కలిసి నాపై కత్తికట్టారు అని బాబు పదేపదే చెపుతూ సానుభూతి సంపాదించడానికి చూస్తున్నారు. 2014 ఎన్నికలలో టిడిపి, జనసేన, బిజెపి కలిసి జగన్‌పై కత్తి కట్టాయి. అయినా జగన్‌ను చూసి జనాలు జాలి పడలేదు, గెలిపించలేదు. ఇప్పుడు మూడు పార్టీలు బాబుపై కత్తి కట్టాయి కదాని బాబుపై జాలి చూపిస్తారా? అందువలన ఆ థీమ్ వదిలిపెడితే మేలు. ఇక ఆంధ్ర సెంటిమెంటు రగిల్చే ప్రయత్నాలూ వ్యర్థమేనని నా ఉద్దేశం. సంక్షేమ పథకాలు కాకుండా, తను చేసిన వాటిల్లో ఘనంగా ఉన్నదేదైనా ఉంటే చెప్పుకుంటే చాలు, ఓటర్లు ఆలోచిస్తారు – యీ పాలనను కొనసాగించాలా లేదా అనేది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఎంత గింజుకున్నా, తక్కువ మెజారిటీతోనైనా బిజెపి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనేది గోడ మీద రాతలా కనబడుతోంది. వైసిపి, తెరాసలను బిజెపికి తోక పార్టీలుగా బాబు ఓటర్ల బుర్రలో ఎక్కించడం వలన కేంద్రంతో సఖ్యంగా ఉన్న పార్టీనే ఎన్నుకుందాం, గతంలో అలాగే చేశాం కదా అని ఆంధ్ర ఓటరు అనుకుంటే బాబుకే నష్టం. గమనించాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2019)
[email protected]