రంగస్థలం సినిమాతో సరైన హిట్ కొట్టారు దర్శకుడు సుకుమార్. రంగస్థలం విడుదలై నేటికి ఏడాది పూర్తయింది. అయితే ఆ తరువాత ప్రాజెక్టు మాత్రం అంత సులువుగా సుకుమార్ కు సెట్ కావడంలేదు. మైత్రీ-మహేష్ కాంబో సినిమా వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అది సుకుమార్ స్వయంకృతం తప్పవేరు కాదు. దాంతో ఎన్టీఆర్ మీదుగా బన్నీ దగ్గరకు వెళ్లి అక్కడ ఓ సినిమా ప్రకటన వేయించుకున్నారు. కానీ మళ్లీ మహేష్ బాబు దగ్గరకు వెళ్లి ప్యాచప్ ప్రయత్నాలు చేసారు.
అయితే అన్నీ ఎలావున్నా సుకుమార్ సినిమా అయితే ఈఏడాది వుండదని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు మహర్షి సినిమా తరువాత అనిల్ రావిపూడి సినిమా చేయాలి. ఎలాలేదన్నా ఆరునెలలు. ఈ సమ్మర్ లో స్టార్ట్ చేసినా, అది సంక్రాంతి విడుదలే.
అటు బన్నీ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయాలి. దాని తరువాత సైలెంట్ గా వేణు శ్రీరామ్-దిల్ రాజు కాంబోకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఆ సినిమా చేసిన తరువాతే సుకుమార్ సినిమా అని క్లియర్ గా తెలుస్తోంది. అప్పటికి మరో డైరక్టర్ ఎవరూ మధ్యలోకి రాకుండా వుండాలి.
అంటే టోటల్ గా చూసుకుంటే 2019లో మాత్రం సుకుమార్ సినిమా వుండే అవకాశాలు కనిపించడం లేదు. అంటే 2018 మార్చి నుంచి 2020 మార్చి వరకు అయినా సుకుమార్ ఖాళీగా వుండాల్సిందే. ఓ పెద్ద దర్శకుడు రెండేళ్ల పాటు సినిమా లేకుండా వుండడం అంటే చిత్రమే. సరే, మైత్రీమూవీస్ పెట్టుబడి వుంటుంది కాబట్టి సమస్యలేదు. కానీ ఇలా ఎన్నాళ్లు స్క్రిప్ట్ చెక్కుతారన్నదే సమస్య.