రివ్యూ: సూర్యకాంతం
రేటింగ్: 2.25/5
బ్యానర్: నిర్వాణ సినిమాస్
తారాగణం: నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లీన్ భేసానియా, సుహాసిని మణిరత్నం, సత్య, శివాజీరాజా తదితరులు
సమర్పణ: వరుణ్‌తేజ్
కూర్పు: రవితేజ గిరిజాల
కళ: అవినాష్ కొల్ల
సంగీతం: మార్క్ కె. రాబిన్
ఛాయాగ్రహణం: హరి జాస్తి
నిర్మాతలు: సందీప్ యర్రంరెడ్డి, సృజన్ ఎరబోలు, రామ్ నరేష్
రచన, దర్శకత్వం: ప్రణీత్ బ్రమండపల్లి
విడుదల తేదీ: మార్చి 29, 2019
ఇద్దరమ్మాయిల మధ్య చిక్కుకుపోయిన అబ్బాయి. ఇద్దరిలో ఎవరితో ఫైనల్‌గా సెటిల్ అవుతాడనేది ఆయా పాత్రలు పోషించిన వారిని బట్టి, లేదా టైటిల్ రోల్ చేసిన వారిని బట్టి ఇట్టే గెస్ చేసేయవచ్చు. అయితే ప్రేక్షకుల ఊహలు, అంచనాలకి భిన్నంగా కథని ముగించాలని అనుకున్నాడు దర్శకుడు. అయితే ఈ ప్రాసెస్ స్మూత్‌గా జరగాలే కానీ బలవంతంగా అనిపించకూడదు. ఊహాతీతమైన క్లయిమాక్స్‌కి తగ్గ కథలు వేరే వుంటాయి. ప్రేక్షకులు ఊహించేయగలరు కాబట్టి వారిని సర్‌ప్రైజ్ చేద్దామనే ప్రయత్నం చేస్తే ఇలాగే బెడిసికొడుతుంది.
సూర్యకాంతం (నిహారిక) ఒక కమిట్‌మెంట్ ఫోబియా వున్న అమ్మాయి. ఆమెకి ఒక అబ్బాయి (రాహుల్ విజయ్) నచ్చుతాడు కానీ ఆ సంగతి చెప్పడానికి చాలా టైమ్ తీసుకుంటుంది. ఈలోగా అతనికి వేరే అమ్మాయితో (పెర్లీన్) పెళ్లి నిశ్చయమైపోతుంది. ఆల్రెడీ పెళ్లి నిశ్చయమైన అమ్మాయితో ప్రేమలో పడడం, ఆమెని దక్కించుకోవడం చాలా సినిమాల్లో చూసిందే. ఇక్కడ అదే ప్లాట్‌కి జెండర్ రివర్స్ చేసారంతే.
సూర్యకాంతం అందరిలాంటి అమ్మాయి కాదు. చాలా చిత్రమైన క్యారెక్టర్. తన పట్ల ఆకర్షణ వున్న అబ్బాయిని పలు విధాలుగా పరీక్షిస్తుంది. అతడి పట్ల ఆకర్షితురాలయిన తర్వాత అతడికి చెప్పకుండా దూరంగా వెళ్లిపోతుంది. అతను ఆమెని మరచిపోయి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడిన తర్వాత తిరిగి వస్తుంది. ఈ అమ్మాయిని వెళ్లగొడితే అతను తనకి దక్కుతాడని భావిస్తుంది. సూర్యకాంతం పాత్రని పరిచయం చేసిన తీరుని బట్టి ఈ 'విడగొట్టే' ప్రాసెస్‌ని ఎంజాయబుల్‌గా మలిచే వీలుంది. కానీ దర్శకుడు వినోదాన్ని వదిలేసి సూర్యకాంతంతో ఎమోషనల్ కనక్ట్ ఏర్పరచడానికి చూసాడు.
పోనీ అలా ఆ క్యారెక్టర్‌పై సింపతీ సస్టెయిన్ అయ్యేలా చూసుకున్నాడా అంటే అదీ లేదు. ఆమెని విచిత్రమైన పరిస్థితుల్లో వుంచి 'ఇప్పుడు హ్యాపీగానే వుందనుకోండి' అన్నట్టుగా కథ ముగించాడు. ఏ కథకి అయినా సరయిన ముగింపు అంటూ ఒకటి వుంటుంది. అది అలా ముగిస్తేనే బాగుంటుంది. కాకపోతే అలా ముగించడానికి వెళ్లే దారి (కథనం) సవ్యంగా (వినోదాత్మకంగా) వుండేట్టు చూసుకుంటే సరిపోతుంది. కానీ అనూహ్యంగా ముగించాలని చూస్తే ఇలాగే అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఈ సూర్యకాంతంలో ఒకటి కాదు, రెండు కాదు… మూడు క్లయిమాక్స్‌లున్నాయి. ఎక్కడికక్కడ ముగించేయవచ్చు అన్నట్టుగా సన్నివేశాలు రాసుకుని మళ్లీ దానిని ఎక్స్‌టెండ్ చేస్తూ పోయారనిపిస్తుంది.
షార్ట్ ఫిలిం లెంగ్త్‌కి సరిపోయే ప్లాట్‌ని సినిమా స్క్రిప్ట్‌గా సాగదీస్తే దాని నిడివి రెండు గంటలే వున్నా కానీ చాలా లెంగ్త్ వుందనే భావన కలుగుతుంది. ముఖ్యంగా ద్వితియార్ధం మొదలైన దగ్గర్నుంచీ సూర్యకాంతం అక్కడక్కడే తిరుగుతూ వుంటుంది తప్ప ఎంతకీ ముగింపుకి చేరుకోదు. ప్రథమార్ధంలో వున్న వినోదం పాళ్లు తరగిపోయి ఆ స్థానంలో మెలోడ్రామా చేరుకోవడంతో స్క్రీన్‌పై గ్లిజరిన్ ఏరులై పారుతుంది. పోనీ ఈ ఎమోషన్ ప్రేక్షకుల మనసులని తాకుతుందా అంటే అదీ లేదు. బలవంతపు ఎమోషన్స్ కావడం వల్ల సూర్యకాంతం బాధ మనసుని తాకడం మాట అటుంచి… త్వరగా ముగించేస్తే ఈ బాధ తప్పుతుందన్న భావన కలుగుతుంది.
నిహారిక రెగ్యులర్‌గా వెబ్ సిరీస్‌లలో చేసే తరహా సరదా పాత్రనే చేసింది. అక్కడక్కడా శృతి మించినా కానీ ఎమోషనల్ సీన్స్‌లో బాగానే పర్‌ఫార్మ్ చేసింది. రాహుల్ విజయ్ ఫర్వాలేదు. పెర్లీన్ కూడా తనవంతు బాగానే చేసింది. సత్య కామెడీ ఓకే అనిపిస్తుంది. తెర వెనుక పనితీరులో ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. తక్కువ బడ్జెట్‌లో తీసినా కానీ వనరుల పరంగా వున్న లోటుని అటు ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఇటు సినిమాటోగ్రాఫర్ కానీ తెలియనివ్వలేదు. ఇలాంటి చిత్రాలకి సంగీతం పెద్ద అస్సెట్ అవ్వాలి. కానీ సూర్యకాంతం పాటల్లో ఏదీ మళ్లీ వినాలనిపించేలా లేదు. ఎట్‌లీస్ట్ మొదటిసారి విన్నప్పుడు ఆకట్టుకునేలా లేదు. దర్శకుడే రాసిన సంభాషణలు ట్రెండీగా వున్నాయి కానీ ఒక్కోసారి శృతిమించాయి.
దర్శకుడి చేతిలో ఈ తరానికి నచ్చే తరహా పాత్రలయితే వున్నాయి కానీ ఆ పాత్రలతో చెప్పిన కథే అస్తవ్యస్తంగా మారింది. రొటీన్ పోకడలకి పోకుండా కొత్తగా, వినోదాత్మకంగా వున్నట్టయితే ఈ సూర్యకాంతం కనీసం మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని అయినా మెప్పించి వుండేది. సెకండ్ హాఫ్‌ని ఎలా ముందుకి తీసుకెళ్లాలి, ఎలా ముగించాలి అనే కన్‌ఫ్యూజన్‌లో పడి సూర్యకాంతం టోటల్‌గా ట్రాక్ తప్పేసింది. తొలి విజయం కోసం చూస్తోన్న నిహారికకి మరికొన్నాళ్ల పాటు నిరీక్షణ తప్పదు మరి.
బాటమ్ లైన్: రొటీన్ కాంతం!
– గణేష్ రావూరి