ఒకప్పుడు చిరంజీవితో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ఎగబడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి వుందా.. అన్నది అనుమానమే. ఆరేళ్ళపాటు సినీ పరిశ్రమకు దూరమయ్యారు చిరంజీవి. మునుపటిలా చిరంజీవి డాన్సులు, ఫైట్లు చేస్తారా.? అన్నది అనుమానమే. రాజకీయాల్లోకి వెళ్ళాక చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌లో చాలా తేడాలు వచ్చేసి వుంటాయనీ, అవి తెరపై నటన విషయంలో చాలా ప్రభావం చూపుతాయనీ సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
చిరంజీవి అంటే కామెడీ.. చిరంజీవి అంటే డాన్సులు.. చిరంజీవి అంటే ఇంకోటేదో.. అని అభిమానులు ఒకప్పుడు భావించేవారు. మరి ఇప్పుడో.? పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినీ సమీకరణాలూ మారిపోయాయి. ఎలాంటి సినిమా చేయాలో చిరంజీవికే అర్థం కాని పరిస్థితి. దాంతో ఎవరితో సినిమా చేయాలి.? ఎలాంటి సినిమా చేయాలి.? అన్నదానిపై కిందా మీదా పడ్తున్నారే తప్ప, ఫలానా సినిమా చేస్తున్నా.. అని ధైర్యంగా చిరంజీవి ప్రకటించలేకపోతున్నారు.
ఎప్పటినుంచో చిరంజీవితో సినిమాకి రెడీగా వున్నాడు వినాయక్. ‘ఠాగూర్’ సినిమా వచ్చింది వీరిద్దరి కాంబినేషన్లో. పరుచూరి బ్రదర్స్ అప్పట్లో ఓ కథను రెడీ చేశారు కూడా. కానీ, ఆ సినిమా ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. ‘నాన్న నటించే 150వ సినిమాకి నేనే నిర్మాతని..’ అని చరణ్ ఎప్పుడో చెప్పేశాడు. బహుశా చిరంజీవి సినిమా చేయడమంటూ జరిగితే చరణ్ నిర్మాతగా, వినాయక్ డైరెక్షన్లోనే వుండొచ్చు.
ఇక్కడ చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత.? అన్న చర్చకన్నా, దర్శకుడికి, కథకి చిరంజీవి ఎంత ఇస్తారు.? అన్న చర్చే ఎక్కువ జరుగుతోంది. కారణం చిరంజీవికి ఇప్పుడు సినిమా అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకున్నా, చిరంజీవి మ్యాజిక్ పనిచేయలేదు. దాంతో చిరంజీవి ఇమేజ్ పూర్తిగా పడిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దశలో సినిమాల్లో సత్తా చాటుకోవాలని చిరంజీవి భావిస్తున్నారు.
సో.. ఇప్పుడు చిరంజీవికి మంచి కథ అవసరం.. మంచి సినిమా అవసరం. ఆ సినిమా సూపర్ హిట్ అవడం అంతకన్నా అవసరం. కాబట్టి, ఎలా చిరంజీవి సూపర్ హిట్ కథ సినిమాని సొంతం చేసుకుంటారన్నదే ఇక్కడ కీలకం. ఇంతకీ చిరంజీవి సినిమా చేయడం నిజమేనా.? ఏమో మరి.. చిరంజీవికే తెలియాలి.