సినిమా రివ్యూ: ఊహలు గుసగుసలాడే

రివ్యూ: ఊహలు గుసగుసలాడే రేటింగ్‌: 3/5 బ్యానర్‌: వారాహి చలనచిత్రం తారాగణం: నాగ శౌర్య, రాశి ఖన్నా, శ్రీనివాస్‌ అవసరాల, పోసాని కృష్ణమురళి, రావు రమేష్‌, హరీష్‌ తదితరులు సంగీతం: కళ్యాణి కోడూరి ఛాయాగ్రహణం:…

రివ్యూ: ఊహలు గుసగుసలాడే
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
వారాహి చలనచిత్రం
తారాగణం: నాగ శౌర్య, రాశి ఖన్నా, శ్రీనివాస్‌ అవసరాల, పోసాని కృష్ణమురళి, రావు రమేష్‌, హరీష్‌ తదితరులు
సంగీతం: కళ్యాణి కోడూరి
ఛాయాగ్రహణం: వెంకట్‌ సి. దిలీప్‌
నిర్మాత: రజని కొర్రపాటి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: శ్రీని అవసరాల
విడుదల తేదీ: జూన్‌ 20, 2014

నటుడిగా తనదైన శైలిలో మెప్పిస్తున్న శ్రీనివాస్‌ అవసరాల ఇప్పుడు దర్శకుడిగా తనకున్న ప్రతిభని చాటుకునే ప్రయత్నం చేసాడు. ‘ఊహలు గుసగుసలాడే’ అనే ఆహ్లాదకరమైన టైటిల్‌తో అతను తీసిన ఈ చిత్రం టైటిల్‌కి తగ్గట్టే హాయిగా సాగిపోతుంది. సాగర తీరంలో సంధ్యా సమీరంలా అనిపించే ఈ రొమాంటిక్‌ కామెడీ ఈ జోనర్‌ సినిమాల్ని ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుంది. శ్రీనివాస్‌ అవసరాలకి ‘దర్శకత్వం అవసరమా?’ అనుకున్న వాళ్లు ఇలాంటి వాళ్లు తెలుగు సినిమాకి అవసరమే అన్నట్టుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.  

కథేంటి?

టీవీ న్యూస్‌ రీడర్‌గా సెటిల్‌ అవ్వాలని ఆశ పడే వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకీ (నాగశౌర్య) టెలీ మార్కెటింగ్‌ యాడ్స్‌కి మోడలింగ్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తన బాస్‌ ఉదయ్‌ని (అవసరాల శ్రీనివాస్‌) ఎంత బతిమాలుకున్నా కానీ వెంకటేశ్వరరావు కోరిక తీరదు. అలాంటి టైమ్‌లో తను పెళ్లి చూపులు చూసిన శిరీషని (రాశి ఖన్నా) ఎలాగైనా ఇంప్రెస్‌ చేసి పెళ్లాడాలని అనుకుంటాడు ఉదయ్‌. దీనికోసం వెంకీని సహాయం కోరతాడు. తను అనుకున్నది సాధించుకోవచ్చని ఉదయ్‌ అడిగిన దానికి వెంకీ కూడా అంగీకరిస్తాడు. అయితే ఉదయ్‌ పెళ్లి చూపులు చూసింది మరెవరో కాదని… తాను ప్రేమించిన ప్రభావతే ఈ శిరీష అని వెంకీ తెలుసుకుంటాడు. బాస్‌కీ, తన ఎక్స్‌కీ మధ్య ఇరుక్కున్న వెంకటేశ్వరరావు ఈ ఇరకాటం నుంచి ఎలా బయటపడతాడు? తన కెరీర్‌లో ఎలా సెటిల్‌ అవుతాడు? తన లవర్‌తో ఉన్న సమస్యలు ఎలా సాల్వ్‌ చేసుకుంటాడు?

కళాకారుల పనితీరు:

సగటు ‘పక్కింటి అబ్బాయి’ పాత్రకి నాగశౌర్య సూట్‌ అయిపోయాడు. నటుడిగా కూడా తన పాత్రకి తగిన న్యాయం చేసాడు. రాశి ఖన్నా కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలో కీలకమైన పాత్రని తనే చేసిన అవసరాల శ్రీనివాస్‌ డైరెక్టర్‌గా లీడ్‌ పెయిర్‌ని పర్‌ఫెక్ట్‌గా సెలక్ట్‌ చేసుకోవడంలోను సక్సెస్‌ అయ్యాడు. తనకి నచ్చిన అమ్మాయిని ఎలాగైనా ఇంప్రెస్‌ చేసి, ఆమెని పెళ్లి చేసుకుని తీరాలన్న డెస్పరేట్‌ పెళ్లికాని ప్రసాద్‌ పాత్రలో అవసరాల నవ్వులు పంచాడు. ద్వితీయార్థంలో చాలా సీన్స్‌కి అతనే హైలైట్‌గా నిలిచాడు. హరీష్‌ చేసిన కామెడీ ట్రాక్‌ పెద్దగా పండలేదు. అలాగే పోసాని కృష్ణమురళి సీన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇతర నటీనటులు పాత్రలకి తగినట్టు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

కళ్యాణి కోడూరి స్వరపరిచిన బాణీలు బాగున్నాయి. కొన్ని అతని పాత బాణీలని పోలినట్టుగా అనిపించినా కానీ పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా చిత్రానికి దోహదపడిరది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని అవసరం లేని సన్నివేశాల్ని, అక్కడక్కడా ఉన్న ల్యాగ్‌ని ఎడిట్‌ చేసి ఉండాల్సింది. సంభాషణల రచయితగా శ్రీనివాస్‌ అవసరాల రాణించాడు. పంచ్‌ డైలాగులతో పబ్బం గడిపేస్తున్న రచయితలు ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో చక్కని తెలుగుతో, తెలివైన హాస్యంతో అవసరాల రచయితగా మెప్పించాడు. దర్శకుడిగా అక్కడక్కడా తడబడినా కానీ మొదటి సినిమాకి దర్శకుడిగా చాలా బాగా చేసినట్టే. ఇలాంటి కథల్ని మెప్పించేలా తెరకెక్కించడం కష్టం. శ్రీనివాస్‌ అవసరాల తను అనుకున్నది తెరకెక్కించడంలో ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు సాధించాడు. 

హైలైట్స్‌:

  • శ్రీనివాస్‌ అవసరాల ఆల్‌రౌండ్‌ పర్‌ఫార్మెన్స్‌
  • సంగీతం
  • ఎంటర్‌టైన్‌మెంట్‌

డ్రాబ్యాక్స్‌:

  • నత్త నడకన సాగే కథనం 
  • హరీష్‌ కామెడీ ట్రాక్‌ ఎఫెక్టివ్‌గా లేదు

విశ్లేషణ:

శ్రీనివాస్‌ అవసరాల హాస్య చతురతకి ఇదో ఉదాహరణ… ఒక సీన్‌లో హీరో హీరోయిన్లు మాట్లాడుకుంటూ ఉంటే, వెనుక ‘యానీ హాల్‌’ అనే సినిమా తెలుగు అనువాదం పోస్టర్‌ ఒకటి ఉంటుంది. తెలుగులో ‘అన్నీ హాల్లోనే’ అనే డబ్బింగ్‌ టైటిల్‌తో ఆ సినిమా రిలీజ్‌ అయినట్టు అవసరాల చమత్కరించాడు. ఇలాంటి క్లెవర్‌ ఫన్‌ మూమెంట్స్‌ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. యానీ హాల్‌ సినిమా తీసిన దర్శకుడు ఊడీ ఎలెన్‌కి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. శ్రీనివాస్‌ అవసరాల అతని అభిమానో ఏమో కానీ… ఈ చిత్రం ఊడీ సినిమాల తరహాలోనే సాగింది. 

ఈ చిత్రంలోని హాస్యం, మందకొడిగా సాగే కథాగమనం అందరు ప్రేక్షకులకి రుచించకపోవచ్చు. ఈ తరహా స్లో పేస్డ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ని, ఇంటిల్లిజెంట్‌ కామెడీని ఎంజాయ్‌ చేసే వారిని ‘ఊహలు గుసగుసలాడే’ ఆకట్టుకుంటుంది. సినిమా లెంగ్త్‌ కాస్త తగ్గించుకుని ఉంటే మరింత బాగుండేది. అలాగే మెయిన్‌ క్యారెక్టర్స్‌ మీదే ఫోకస్‌ ఎక్కువై ఇతర పాత్రలపై అంతగా దృష్టి పెట్టినట్టు అనిపించలేదు. అవి అనుకున్న రీతిలో తెర మీదకి రాకపోవడంతో సినిమాకి అవసరం లేని తంతులా అనిపిస్తాయి. 

ఆకట్టుకునే లీడ్‌ పెయిర్‌, అవసరాల శ్రీనివాస్‌ పర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయి. హీరో హీరోయిన్ల నడుమ లవ్‌ ట్రాక్‌ని కూడా శ్రీనివాస్‌ బాగా హ్యాండిల్‌ చేసాడు. తనకి కామెడీపైనే కాకుండా ఇతర ఎమోషన్స్‌ని పండిరచే సత్తా కూడా ఉందని చాటుకున్నాడు. కాకపోతే చిన్న చిన్న గ్యాప్స్‌ని ఫిల్‌ చేయడంలో.. చివర్లో ఫీల్‌ని క్యారీ చేయడంలో దర్శకుడిగా పొరపాట్లు చేసాడు. వాటిని కూడా కవర్‌ చేసుకున్నట్టయితే దర్శకుడిగా అతని తొలి ప్రయత్నం మరిన్ని ప్రశంసలు అందుకుని ఉండేది. అక్కడక్కడా కాస్త ల్యాగ్‌ ఉంది కానీ.. ఓవరాల్‌గా క్లాస్‌ అప్పీల్‌ ఉన్న రొమాంటిక్‌ కామెడీలు ఇష్టపడే ప్రేక్షకులకి ‘ఊహలు గుసగుసలాడే’ నచ్చుతుంది. 

బోటమ్‌ లైన్‌: ఊహల గుసగుసలు… అలరించే ప్రేమ పదనిసలు!

-జి.కె.