ఈ ముక్క బహిరంగంగా అన్నందుకు కేరళ కాంగ్రెసు నాయకుణ్ని తీసేశారు. ఇంకో రాజస్థాన్ కాంగ్రెసు నాయకుడు '..జోకరే కాదు, చుట్టూ వున్న జోకర్ల బృందానికి లీడరు' అని వివరణ యిచ్చి సేమ్ సత్కారానికి గురయ్యాడు. చిన్నపుడు ఓ కథ విన్నాను. ఓ విదూషకుడు రాజుగారికి బాగా చనువుట. రాజుగారి మీదే జోకులేసేవాడట. 'రాజుగారు నరమాంస భక్షసుడు. ప్రభుత్వంలో పనిచేయని ఉద్యోగులను కాల్చుకు తింటాడు.' అన్నాట్ట. రాజుగారు పగలబడి నవ్వాడు. 'రాజుగారు గుడ్లగూబ కంటె ఘోరమైన ప్రాణి. అది పగలైనా పడుక్కుంటుంది. ఈయన అహోరాత్రాలు మేలుకొని వుండి రాజ్యంపై ఎవరూ దాడి చేయకుండా చూస్తూ వుంటాడు.' అన్నాడు. రాజుగారు మెచ్చుకుని ఓ హారం బహుమతిగా యిచ్చాడు. 'రాజుగారు ఎప్పుడు బూడిద అవుతాడో అని నా భయం. మన్మథుడంత అందంగా వుంటే ఏమౌతుంది మరి' అన్నాడు విదూషకుడు. ఈ సారి హారానికి తోడుగా అగ్రహారం దక్కింది. ఇలా జోకులు వేసి, వేసి చివరకు 'రాజుగారికి బట్టతల' అన్నాడు విదూషకుడు. వెంటనే రాజుగారు ఉగ్రుడై పోయి, 'వీడి తల తీసేయండి' అన్నాడు. అందరూ బిత్తరపోయారు. అసలు సంగతేమిటంటే – అప్పటిదాకా విదూషకుడు పలికినవి అసత్యాలు, అతిశయోక్తులు. రాజుగారు ఎంజాయ్ చేశాడు. చివర్లో అన్నది కటికసత్యం. రాజుగారికి బట్టతల. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన నిరంతరం కిరీటం ధరిస్తూ, భరిస్తూ వుంటాడు. ఈ విదూషకుడి కారణంగా తన రహస్యం అందరికీ తెలిసిపోయిందేనని రాజుకి కోపం వచ్చి మరణదండన విధించాడు. ఇప్పటి రాజులకు తలతీసే అధికారం లేదు కాబట్టి బహిష్కరణతో సరిపెట్టారు.
ఈ కథ చెప్పడం ద్వారా రాహుల్ జోకరే అని నేను సర్టిఫై చేస్తున్నానని అనుకోవద్దు. రాహుల్‌కు కూడా తన గురించి అలాటి అనుమానం వచ్చి అలా రియాక్టు అయి వుండవచ్చనే అనుమానంతో కథ చెప్పాను కానీ నా దృష్టిలో అతను జోకర్ కానే కాదు. జోకరెప్పుడూ నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఈయన చేయలేదు. మనల్ని, ముఖ్యంగా తెలుగువారిని ఏడిపించాడు. ఎవరెవరినో సలహాదారులుగా పెట్టుకుని, వాళ్లు చెప్పినట్లు ఆడి, మనల్ని ఏడిపించి, ఎన్నికల తర్వాత తనే ఏడ్చాడు. కొప్పున్నామె సిగ ఎలా చుట్టినా అందమే అంటారు కానీ కొప్పు యింటిపేరులో వున్న రాజుగారు తన చెడు సలహాలతో తెలుగు సిగను పాయలు పాయలు చేయించి రాహుల్ పాలిట రాహువయ్యారు. దాని సిగదరగ, కాంగ్రెసు రాష్ట్రాన్ని రెండుగా తరిగి ఒక చోట అమావాస్య చంద్రుడిగా, మరో చోట తదియ చంద్రుడిగా మారింది. రాహుల్ తను చాలా సీరియస్‌గా వ్యవస్థను మార్చేస్తున్నానని నమ్మాడు. పదేళ్లగా అధికారంలో వున్న పార్టీకి ఉపాధ్యకక్షుడిగా వుండి వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు యిస్తే ఎవరు నమ్ముతారు? అని అతనికి తట్టలేదు. వ్యవస్థ అంటే మన్‌మోహన్ అనీ, యువతరం ప్రతినిథిగా తను ఆ ముసలిరాజును ధిక్కరిస్తున్నానని ప్రజలు అనుకుంటారనుకున్నాడు. మన్‌మోహన్ రాజుగారని దేశం ఎన్నడూ అనుకోలేదని రాహుల్‌కు తెలియదు పాపం. క్రిమినల్స్ బిల్లు ముసాయిదా చింపేసి, హంగు చేయబోయాడు. అది ఆ స్టేజికి వచ్చేదాకా ఏ గుడ్డి గుఱ్ఱానికి పళ్లు తోముతున్నావ్ బాబూ అని అందరూ నవ్వారు. కానీ మనల్ని నవ్వించడం అతని ఉద్దేశం కానే కాదు. అది అనుకోకుండా పుట్టిన హాస్యం.
రాహుల్ జోకర్ కాకపోతే విలనా? ఆ మాట అనడానికి నాకు నోరు రాదు. తల్లిని అడ్డుపెట్టుకుని సంజయ్ గాంధీని చేసిన అకృత్యాలు చూశా, రాజీవ్ గాంధీ తల్లిచాటు నుండి ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని, ఎన్టీయార్ ప్రభుత్వాన్ని కూలదోసిన వైనం చూశా. వారితో పోలిస్తే రాహుల్‌కి అలాటి లక్షణాలు ఏమీ లేవు. పాపం ఎప్పుడూ పొగరుగా మాట్లాడలేదు. తన కాళ్లమీద పడేవాళ్లను సైతం ఎవర్నీ గట్టిగా బహిరంగంగా తిట్టలేదు. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చాలని కుట్రలు పన్నలేదు. తన పార్టీ వున్నచోట అసమ్మతిని ప్రోత్సహించడానికి గ్రూపులను చేరదీయలేదు. పగ బట్టలేదు. ఆశపోతు కాదు. మన్‌మోహన్‌ని దింపేయాలని చూడలేదు. అధికారం వున్నా మరీ ఆర్భాటం చేయలేదు. జోకర్ కాదు, విలన్ కాదు, హీరో ముందే కాదు.. మరేమిటి అని మీరడగవచ్చు. అతను లిస్ట్‌లెస్ పెర్‌ఫార్మర్. అంటే మొహమాటానికి అతిథి పాత్ర ఒప్పుకున్న నటుణ్ని చూడండి, నిరాసక్తంగా వచ్చి, నాలుగు డైలాగులు అప్పచెప్పి, వెళ్లి వింగ్స్‌లో కూర్చుంటాడు, అలాటివాడన్నమాట. అతనికి యీ దేశాన్ని పాలించాలన్న యావ ఏ కోశానా వున్నట్టు కనబడదు. ఆ కుటుంబంలో పుట్టిన పాపానికి, అనుచరుల గోల భరించలేక, అమ్మ ఏడ్చిపోతుందని, అలా అలా మనకు అప్పుడప్పుడు కనబడి, మళ్లీ హైబర్నేషన్‌కు వెళ్లిపోయేవాడు. ఫలానా చోట ప్యారడైజ్ బిర్యానీ తిన్నాడు, ఫలానా చోట టీ తాగాడు అని పేపర్లో వార్తలు వస్తే అవి అమ్మకు చూపించి ఆవిణ్ని తృప్తి పరచేవాడు. పెళ్లి ఎలాగూ చేసుకోలేదు, ఏదో ఒకటి చేస్తున్నాడు కదాని ఆవిడ నిట్టూర్చేది.
రాహుల్ పెళ్లి అతని సొంత విషయమే కానీ, చాలామంది దానిపై జోకులు వేశారు పాపం. అతను ఎవరైనా భారతీయురాలిని చేసుకుంటానంటే సోనియా ఒప్పుకునేదేమో. కానీ అతని ఫ్రెండ్సందరూ విదేశీ వనితలే. రాజకీయంగా దెబ్బ తింటామన్న భయంతో కాస్త ఆగరా బాబూ అని తల్లి చెప్పి వుంటుంది. ''ఇప్పుడు ఎలాగూ ఓడిపోయాం కాబట్టి, పెళ్లి చేసేసుకుంటానే'' అని రాహుల్ పేచీ పెట్టవచ్చు. ఆవిడ సరేనంటే, 'కత్తి పోయె డాలు వచ్చె ఢాంఢాంఢాం, పవరు పోయె పెళ్లం వచ్చె ఢాంఢాంఢాం' అని ఝామ్మని పాటలు పాడుకుంటూ దేశవిదేశాలు షికార్లు కొడతాడేమో! అతన్ని చూసి జాలిపడనక్కరలేదు, నవ్వనక్కరలేదు. అతనేదో గొప్పవాడై పోతాడనుకుని చుట్టూ తిరిగిన భజనబృందం వుంది చూడండి, అప్పుడు వాళ్ల గతి ఏమైవుతుందో చూసి తలచుకుని నవ్వుకోవాలి. నవ్వుతున్నాం కదాని వాళ్లను జోకర్లు అనకూడదు – వాళ్లు కూడా కావాలని మనల్ని నవ్వించటం లేదు కాబట్టి!
– ఎమ్బీయస్ ప్రసాద్