కాస్త విషయం వున్న డైరక్టర్ కనిపించడం ఆలస్యం. అడ్వాన్స్ చేతిలో పెట్టేస్తున్నారు నిర్మాతలు, హీరోలు. సరైన డైరక్టర్, సరైన సబ్జెక్ట్ వుంటేనే తమ చరిష్మా రాణిస్తుంది లేదూ అంటే జనం సినిమాలు చూడడం లేదని హీరోలకు తెలిసిపోయింది. అందుకే డైరక్టర్లను వెదుకుతున్నారు.
విషయానికి వస్తే, టైగర్ సినిమాతో ఓకె అనిపించుకుని, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తనేంటూ చూపించాడు దర్శకుడు విఐ ఆనంద్. ఆ వెంటనే పిలిచి, అల్లు శిరీష్ ను చేతిలో వుంచారు అల్లు అరవింద్.
నిర్మాత వేరే అయినా, తమ జనాల సినిమా అంటే ఓ కన్నేసి వుంచుతారు అరవింద్. ఇప్పుడు దాదాపు సగం పూర్తయిన సినిమా రష్ చూసి, వెంటనే ఓ డెసిషన్ తీసేసుకున్నారని వినికిడి.
ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎంత టైమ్ కావాలంటే అంత టైమ్ తీసుకుని, బన్నీకి ఓ మాంచి కథ రెడీ చేయమని చెప్పి, అడ్వాన్స్ చేతిలో పెట్టేసారట. ఇంకేముంది. ఇదే అవకాశం ఆనంద్ కు. శిరీష్ తో చేస్తున్న సైన్స్ థ్రిల్లర్ కనుక సూపర్ అనిపించుకుంటే, బన్నీ ని డైరక్ట్ చేసే అవకాశం వచ్చేస్తుంది.