వరుస కరువులతో అల్లాడిపోతున్న తమను వరుణ దేవుడు ఈ సారైనా ఆదుకుంటాడని ఆంధ్రా ప్రజలు పెట్టుకున్న ఆశలను సూర్య భగవానుడు ఆవిరి చేస్తున్నాడు. రుతుపవనాలు ఈ దఫా చాలా చురుకుగా ఉన్నాయని, కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం, సముద్ర వాతావరణ పరిశోధన సంస్థ ఇన్‌కాయిస్ అంచనా వేశాయి.
అందుకు అనుగుణంగానే రుతుపవనాలు గతం కంటే కాస్త ముందుగానే జూన్ రెండో వారంలో రాష్ట్రంలో ప్రవేశించి పలు చోట్ల ఒక మాదిరి వర్షాలు కురిపించాయి. కానీ వారం తిరక్కుండానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ముందస్తు వానతో ఊరించిన వరుణుడు ఉన్నపళంగా ముఖం చాటేశాడు.
సూర్య భగవానుడు తిరిగి ప్రతాపం చూపుతున్నాడు. కోస్తా అంతటా ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు వీస్తున్నాయి. ఈనెలాఖరు వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావారణ విభాగం తాజాగా ప్రకటింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాస్తవానికి దేశవ్యాప్తంగా ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావారణ విభాగం ఊహించింది. అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. చురుకుగా కదిలి కర్ణాటక, ఆంధ్రాలో తొలకరి జల్లులు కురిపించాయి.
తొలకరి చూసి మురిసిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు ఏరువాక కార్యక్రమం పేరిట హడావుడి చేశారు. ఈనెల 9న అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఉడెగోళం గ్రామంలో సీఎం స్వయంగా ఏరువాక సాగారు.
ప్రతి జిల్లా, నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఏరువాక కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నాయకులను, వ్యవసాయ అధికారులను పురమాయించారు. కానీ రెండు వానలైన కురవక ముందే రుతుపవనాలు బలహీనమయ్యాయి. భానుడు తిరిగి ఉగ్రరూపం దాల్చాడు.
కోస్తా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నెలాఖరు వరకూ ఆశాజనకమైన వాతావరణం నెలకొనే పరిస్థితి లేదు. దీంతో ఏరు వాక కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. క్రిష్ణా డెల్టాలో నాట్లు వేసేందుకు పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు తరలిస్తున్న ప్రభుత్వం సీమ, ఇతర కోస్తా జిల్లాల్లో వరినాట్లకు నీరు అందించలేకపోతోంది.