ఆ ముగ్గురితో మై ‘త్రీ’

మైత్రీ మూవీస్ కు ముగ్గురు నిర్మాతలు. దానికి తగ్గట్లే ఆ సంస్థ ముగ్గురు పెద్ద హీరోలతో మాంచి బంధం ఏర్పాటు చేసుకుంటోంది. ఇప్పటకే మహేష్ బాబు-నమ్రతలతో మైత్రీ మూవీస్ అపూర్వ అనుబంధం వుంది. మహేష్-నమ్రతల…

మైత్రీ మూవీస్ కు ముగ్గురు నిర్మాతలు. దానికి తగ్గట్లే ఆ సంస్థ ముగ్గురు పెద్ద హీరోలతో మాంచి బంధం ఏర్పాటు చేసుకుంటోంది. ఇప్పటకే మహేష్ బాబు-నమ్రతలతో మైత్రీ మూవీస్ అపూర్వ అనుబంధం వుంది. మహేష్-నమ్రతల అనేకానేక లావాదేవీలు మైత్రీ మూవీస్ నిర్మాతలే చక్కబెడతారని ఇండస్ట్రీ టాక్. 

ఇక ఎన్టీఆర్ తో సినిమా చేసి ఆయనకు దగ్గరయ్యారు. ఎనీ టైమ్ వాళ్లతో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ రెడీ. ఇప్పుడు మెగా క్యాంప్ లో కూడా కాలు పెట్టేసారు మైత్రీ వారు. రామ్ చరణ్ కు అమెరికాలో నభూతో నభవిష్యతి అనే స్వాగత సత్కారాలు, టూర్ ఏర్పాట్లు చేసింది మైత్రీ నిర్మాత నవీన్ నే. త్వరలో ఈ సంస్థ సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా నిర్మించబోతోంది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా ధృవ కోసం అమెరికా పర్యటన అంతా మైత్రీ కనుసన్నలలోనే నడిచింది. చార్టర్ ఫ్లయిట్ లు, విలాసవంతమైన సూట్లు ఇలా చల్ది కన్నా ఊరగాయ ఘనం అన్నట్లు భారీ ఏర్పాట్లు చేసారు. మైత్రీ నిర్మాతలు చాలా కాలుక్యులేటెడ్ గా వుంటారని, వారు ఊరికనే ఏదీ చేయరనీ ఇండస్ట్రీ జనాల నమ్మకం. ఇప్పుడు రామ్ చరణ్ ధృవకు యుఎస్ లో మాంచి హైప్ తీసుకురావడం ద్వారా, తమ తరువాతి సినిమాకు ఇప్పటి నుంచే మాంచి మార్కెటింగ్ లైనప్ ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు. 

వాళ్లు స్వంతగా పంపిణీ చేసుకున్నా, అమ్మేసుకున్నా, ఓవర్ సీస్ లో ఆ సినిమాకు భారీ రేటే పలుకుతుంది. ఎందుకంటే సుకుమార్ సినిమా అంటే ఓవర్ సీస్ లో మాంచి క్రేజ్ వుంది కదా?  నాన్నకు ప్రేమతో తెలుగునాట కన్నా, ఓవర్ సీస్ లో మాంచి పేరు తెచ్చుకుంది కదా? సో ఇప్పుడు రామ్ చరణ్ స్టామినా కూడా పెంచితే, అదీ ఇదీ కలిపి, తమ సినిమాకు మాంచి బజ్ వస్తుందనన్నది మైత్రీ ప్లాన్ అంట. ఇక త్వరలో పవన్-త్రివిక్రమ్ లకు కూడా దగ్గరయిపోతే, టాలీవుడ్ లో మైత్రీకి తిరుగుండదు.