కాస్త వైవిధ్యంగా వుంటుందని దర్ళకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన లేటెస్ట్ సినిమాకు తమిళ యువ సంగీత సంచలన అనిరుధ్ ను తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అదే సమస్యగా మారిందని వినికిడి. హారిక హాసిని సంస్థ పతాకంపై నితిన్, సమంత తదితరులతో త్రివిక్రమ్ ఓ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసింది.
ఇప్పుడు ఆ సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ఆల్ మోస్ట్ అయిపోయినట్లే. కానీ సినిమా పాటలవ్యవహారం మాత్రం వుండిపోయిందని తెలుస్తోంది. పాటలు చిత్రీకరించాలంటే, సాంగ్స్ కావాలి. కానీ అవి ఇంకా రికార్డింగ్ కాలేదని టాక్. అసలు ఇంతవరకు ఆ సినిమా సంగీతానికి సంబంధించిన వర్క్ ప్రారంభం కాలేదని, దానికి కారణం సంగీత దర్శకుడు అనిరుధ్ ఫుల్ బిజీ కావడమే అని తెలుస్తోంది.
పైగా ఇప్పుడు అనిరుథ్ తమిళనాట వివాదంలో కూడా చిక్కుకున్నాడు. మరి ఎప్పుడు ట్యూన్స్ ఇస్తాడో? ఎప్పుడు సాంగ్స్ రికార్డ్ చేస్తారో? ఎప్పుడు పాటల చిత్రీకరణ ప్రారంభిస్తారో? దీన్ని బట్టి ఈ సినిమా కూడా ఏప్రిల్ కు చేరిపోయేలా కనిపిస్తోంది.